STOCKS

News


ఫలితాలు, ప్రపంచ సంకేతాలతోనే..

Monday 16th April 2018
Markets_main1523859311.png-15528

  • ఈ వారం మార్కెట్‌పై నిపుణులు
  • సమీప భవిష్యత్తులో సిరియా ఉద్రిక్తతల ప్రభావం 
  • ఈ వారమే టీసీఎస్, ఇండస్‌ఇండ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఏసీసీ ఫలితాలు 
  • నేడు టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు, కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాలు, ఆర్థిక వ్యవస్థ గణాంకాలు ఈ వారం భారత్‌ మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ దేశాల కూటమి...గత శనివారం తెల్లవారుజామున సిరియాపై దాడులు జరిపిన ప్రభావం సమీప భవిష్యత్తులో మార్కెట్‌పై పడుతుందని, ఈ పరిణామంతో భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగాయని వారన్నారు. అమెరికా, చైనాల మధ్య తలెత్తిన వాణిజ్య యుద్ధం చల్లబడిన ప్రభావంతో గత వారం మార్కెట్‌ సెంటిమెంట్‌ గణనీయంగా మెరుగుపడిందని అరిహంత్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ డైరెక్టర్‌ అనితా గాంధీ అన్నారు. అయితే క్రూడ్‌ ధర ఒక్కసారిగా పెరగడంతో భారత్‌ మార్కెట్లో ఏర్పడిన ఆందోళన కొనసాగుతూనే వున్నదని గాంధీ చెప్పారు. మధ్యప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలతో క్రూడ్‌ ధర పెరగడం, దేశీయ బాండ్ల మార్కెట్‌ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావడం మార్కెట్‌కు ఆందోళనకారకమని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. అయితే సూక్ష్మ ఆర్థిక గణాంకాలు ప్రస్తుతం సానుకూలంగా వున్నాయని, రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు, పారిశ్రామికోత్పత్తి నిలకడగా వున్నట్లు తాజా గణాంకాలు వెలువడటం అనుకూలాంశమని ఆయన వివరించారు. మార్చి నెలకు టోకు ద్రవ్యోల్బణం డేటా సోమవారం 16న వెలువడుతుంది. అంతర్జాతీయ సంకేతాల కారణంగా మార్కెట్‌ ఒడుదుడుకులకు లోనైనా, సానుకూల ఆర్థిక గణాంకాలు, కార్పొరేట్ల ఫలితాలు బావుంటే...మార్కెట్‌ స్థిరపడుతుందని విశ్లేషకులు చెప్పారు.  

ఫలితాలపై కన్ను...: గత శుక్రవారం ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌...మార్చి క్వార్టర్‌కు ఫలితాల్ని ప్రకటించడం ద్వారా సీజన్‌ను ప్రారంభించింది. ఆ రోజు మార్కెట్‌ ముగిసిన తర్వాత ఇన్ఫోసిస్‌ ఫలితాలు వెల్లడైనందున..మార్కెట్‌ స్పందనతో ఈ సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభమవుతుంది. శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 7.75% పతనమైంది. ఇక ఈ వారం మరో ఐటీ దిగ్గజం టీసీఎస్, బ్యాంకింగ్‌ కంపెనీలైన ఇండస్‌ఇండ్‌బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు ఫలితాల్ని ప్రకటించనున్నాయి. బీమా కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్, సిమెంట్‌ కంపెనీ ఏసీసీ, ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ, రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఫలితాలు సైతం ఈ వారమే వెల్లడవుతాయి. కార్పొరేట్‌  లాభాలు అర్థవంతంగా కోలుకుంటున్న సంకేతాలు కనపడితే... భారత్‌ మార్కెట్‌ క్రమేపీ రికవరీ అవుతుందని వినోద్‌ నాయర్‌ చెప్పారు. గత రెండేళ్లుగా మార్కెట్‌ పదేపదే కొత్త గరిష్టస్థాయిల్ని తాకినప్పటికీ, కార్పొరేట్‌ లాభాలు పెద్దగా వృద్ధిచెందలేదని, అయితే జీడీపీ వృద్ధి అంచనాల్ని మించడం, జీఎస్‌టీ ఇబ్బందులు క్రమేపీ తొలగడంతో కార్పొరేట్‌ లాభాలు పుంజుకుంటాయన్న ఆశాభావం కలుగుతున్నదని ఆయన వివరించారు.   

డెట్‌లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు 3935 కోట్లు 
ప్రస్తుత నెల ప్రథమార్ధంలో దేశీయ డెట్‌ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ. 3,935 కోట్ల మేర నికర పెట్టుబడులు చేశారు. పశ్చిమ దేశాల్లో వడ్డీ రేట్లు పెరగడం, క్రూడ్‌ ధరలు, ద్రవ్యలోటు పెరుగుదల కారణంగా రూపాయి బాగా క్షీణిస్తుందన్న అంచనాలతో ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎఫ్‌పీఐలు.. డెట్‌ మార్కెట్‌ నుంచి రూ. 12,750 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కు తీసుకున్నారు. అయితే రూపాయి స్థిరంగా వుండటం, బాండ్‌ ఈల్డ్స్‌ ఆకర్షణీయంగా వుండటంతో డెట్‌ మార్కెట్లో తిరిగి పెట్టుబడులకు ఉపక్రమించారని విశ్లేషకులు తెలిపారు. ఈక్విటీ మార్కెట్ల నుంచి మాత్రం ఈ నెల ప్రథమార్ధంలో రూ. 1,085 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.You may be interested

భారీ ఎగుమతులు, పెట్టుబడులతోనే 8శాతం వృద్ధి సాధ్యం

Monday 16th April 2018

భారత్‌పై ఏడీబీ అభిప్రాయం.. న్యూఢిల్లీ: పెట్టుబడులకు పునరుత్తేజం, ఎగుమతులు భారీగా పెంచుకోగలిగితేనే భారత్‌ నిలకడగా 8 శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించగలుగుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్‌(ఏడీబీ) పేర్కొంది. ‘ప్రస్తుతం పెట్టుబడులు, ఎగుమతులు ఇంకా పూర్తిస్థాయిలో పట్టాలెక్కలేదు. ఈ రెండు చోదకాలు గనుక జోరందుకుంటే 8 శాతం వృద్ధి సాధ్యమే. వ్యవసాయ మార్కెటింగ్‌ను గాడిలోపెట్టడం, సరఫరాపరమైన అడ్డంకులను తొలగించడం వంటివి కూడా చాలా కీలకం. ఈ రెండు అంశాల్లో మరిన్ని సంస్కరణలకు

హెచ్చుతగ్గుల్లో పసిడి..!

Monday 16th April 2018

ముంబై:- ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్న నేపథ్యంలో సోమవారం అంతర్జాతీయంగా పసిడి ధరలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోంటున్నాయి. వాణిజ్యయుద్ధ భయాలు, అమెరికా సిరియాపై దాడులకు దిగడంతో గత వారం చివరిరోజైన శుక్రవారం (ఏప్రిల్‌ 13న) 10 డాలర్లు పెరిగి 1347.90 డాలర్ల వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమ ప్రారంభంతో  ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌(31 గ్రాములు) 1,349.80 డాలర్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 1342.80-1351.50 డాలర్ల మధ్య శ్రేణిలో

Most from this category