News


హమ్మో! ఐపీఓ మాయ..

Monday 17th July 2017
Markets_main1500286454.png-5516

కుదేలవుతున్న చిన్న మదుపరి
పబ్లిక్‌ ఆఫర్‌ అంటే ఇన్వెస్టర్లకు ఎంతో మోజు. భారీ ప్రీమియంతో లిస్టయి తమకు మంచి లాభాలనందిస్తాయన్న ఆశలతో పలువురు చిన్నాచితకా ఇన్వెస్టర్లు ఐపిఒల వైపు ఆబగా చూస్తుంటారు. పైసాపైసా కూడబెట్టి ఐపిఒలో షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవడం ఒకఎత్తయితే, దరఖాస్తు చేసుకున్నన్ని షేర్లు మంజూరవుతాయో లేదో? అన్న టెన్షన్‌ మరోఎత్తు. ఇంతాచేసేది లిస్టింగ్‌ రోజు  లాభాల కోసమే. అయితే కొందరు ఆపరేటర్లు ఇలాంటి చిన్న మదుపరులను ఆశల ఎండమావులవైపు నడిపించి ఒక్కసారిగా ఉసూరనిపిస్తున్నారని,  చట్టబద్ధమైన మార్గాల్లోనే అనైతిక ట్రేడ్స్‌ ద్వారా ఇన్వెస్టర్లను బలిచేస్తున్నారని మార్కెట్‌ నిపుణులు నిప్పులు చెరుగుతున్నారు.

ఇటీవల లిస్టింగ్‌కు వచ్చిన హడ్కో, సిడిఎస్‌ఎల్‌, ఎయు స్మాల్‌ఫైనాన్స్‌ బ్యాంక్‌ షేర్లను ఉదాహరణగా చూపుతూ చిన్న ఇన్వెస్టర్లను ఆపరేటర్లు ఎలా తప్పుదోవ పట్టించి నాశనం చేస్తున్నారో మార్కెట్‌ పండితుడు ఎస్‌పి తుల్శాన్‌ వివరిస్తున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..


గురువారం సిరులు కురిపించిన షేరు శుక్రవారం చుక్కలు చూపిస్తుందని ఎవరయినా ఊహిస్తారా? అందునా లిస్టింగ్‌ రోజు నుంచి అడ్డులేకుండా దూసుకుపోతూ, అసంబద్ధ ప్రీమియంలతో చెలరేగుతున్న షేర్లు ఒక్కసారిగా బూడిద మిగులుస్తాయని కలగంటారా? తాజాగా లిస్టయిన కంపెనీల షేర్లతో ఇదే పరిస్థితి ఎదురయింది. మాయపొరలు కమ్మించి శుక్రవారం ఒక్కరోజులో సామాన్య మదుపరికి చెందిన దాదాపు 200 కోట్ల రూపాయలు ఆవిరయ్యేలా చేశారు కొందరు ఆపరేటర్లు.  మూలాలు బలంగా లేని స్టాకుల్లో గతంలో ఇలాంటి మాయలు, కుతంత్రాలు జరుగుతుండేవి. ఇప్పుడు ఐపిఒ లిస్టింగుల్లో ఇలాంటి మాయలు చోటుచేసుకోవడం విచారంతో కూడిన విభ్రాంతి కలిగించే అంశం. ఇలాంటి గారడీలకు మూల కేంద్రం గ్రే మార్కెట్‌ ఆపరేటర్లు. గ్రేమార్కెట్‌ఆపరేటర్లు ఎక్కువగా ముంబై, అహ్మదాబాద్‌, వదోదర, కోల్‌కతాల్లో ఉంటారు.
ఎలా చేస్తున్నారు?
ఒక కంపెనీ ఐపిఒకు వస్తుందనడానికి పక్షం రోజుల ముందు గ్రేమార్కెట్లో ఆ షేరుకు సదరు ఆపరేటర్లు అసాధారణ ధరలను కోట్‌ చేస్తారు. ఉదాహరణకు ఎయు స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ విషయంలో ఇష్యూ ధర 358 రూపాయలు కాగా, గ్రేమార్కెట్‌ప్రీమియం 90 రూపాయలుంది. ఈప్రీమియంతో ఒక ఆపరేటరు వీలయినన్ని షేర్లను 448 రూపాయలకు గ్రేమార్కెట్లో కొనుగోలు చేస్తాడు. ఈ ప్రీమియం కారణంగా లిస్టింగ్‌ రోజు ఓపెన్‌ మార్కెట్లో కూడా సదరు షేరు సుమారు అదే ధరకు ట్రేడవుతుంటుంది. సాధారణంగా లిస్టింగ్‌ లాభాలకు అప్లైచేసిన రిటైల్‌ఇన్వెస్టర్లు అదే రోజు మంచి ప్రీమియం లభించిందని సంబరపడి తన షేర్లను విక్రయించుకుంటారు. దీంతో సదరు ఆపరేటర్‌ లిస్టింగ్‌ రోజున ఓపెన్‌మార్కెట్లో పెద్ద ఎత్తున మరికొన్ని షేర్లను కొనుగోలు చేస్తాడు. దీనికితోడు లిస్టింగ్‌రోజున ఎన్‌ఎస్‌ఇ కొంత సమయం పనిచేయకపోవడం కూడా వీరికి కలిసివచ్చింది. దీంతో లిస్టింగ్‌ రోజున ఇలాంటి ఆపరేటర్లు దాదాపు కోటి షేర్ల వరకు సుమారు 475 రూపాయల వద్ద పోగు చేయడం జరిగింది. లిస్టింగ్‌రోజు ఇంత మంచి ఓపెనింగ్‌ చూసి అయ్యో! ఛాన్స్‌ మిస్సయ్యామని భావించే చిన్నా చితక ఇన్వెస్టర్లు ఆ మరుసటి రోజు నుంచి ఎడాపెడా కొనుగోలు చేస్తూ షేరు ధర పెరిగేందుకు దోహదమయ్యారు. కోటి షేర్లు ఆపరేటర్ల వద్దే ఇరుక్కుపోవడంతో అమ్మేవారు లేక షేరు ధర బాగా పెరిగింది. దీంతో అదను చూసి శుక్రవారం ఆపరేటర్లు దాదాపు 40 లక్షల షేర్లను( ఆరోజు ట్రేడింగ్‌ వాల్యూం 50 లక్షలు కాగా ఆపరేటర్లు అమ్మిన వాల్యూంలు 40 లక్షలు)దాదాపు 675 రూపాయల వద్ద వదిలించుకొని రిటైలర్లకు అంటగట్టారు. దీంతో ఒక్కో షేరుపై ఆపరేటర్‌కు దాదాపు 200 రూపాయల లాభం వచ్చినట్లయింది. కానీ చిన్నమదుపరి మాత్రం 358 రూపాయల షేరును 675 రూపాయల వద్ద కొని ఇరుక్కపోయినట్లయింది.
దొంగ నిపుణులు
ఇదే విధంగా సిడిఎస్‌ఎల్‌, హడ్కో షేర్ల విషయంలో ఈ ఆపరేటర్లు  లిస్టింగ్‌ రోజు వీలయినన్ని షేర్లను గుప్పిట పట్టి, కృత్తిమ డిమాండ్‌కు కారణమయ్యారు. దీంతో 7- 10 రోజుల్లో సదరు షేరు ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఇందుకు ‘‘టెక్నికల్‌ నిపుణులు’’ అని చెప్పుకునే మిథ్యావాదులు కూడా కారణమయ్యారు. టెక్నికల్‌విశ్లేషణ ఏమీ లేకుండా, స్వల్పవ్యవధిలో ధర భారీగా ఎందుకు పెరిగిందన్న ఆలోచన లేకుండా ఇలాంటి పండితులు ఇచ్చే సలహాలు సాధారణ ఇన్వెస్టర్లకు శిరోధార్యాలు. ఇలాంటి దొంగ నిపుణుల వల్ల ఆపరేటర్లకు పంటపండుతోంది. ఈ తరహా నిపుణుల సలహాలు ‘‘లాభాలు వస్తే నా ప్రభావం.. నష్టం వస్తే నీ ఖర్మం.. ’’ అన్న రీతిన ఉంటాయి. వీరి సిఫార్సులతో చిన్న మదుపరులు ఎగబడి కొత్తగా లిస్టయిన ఈ షేర్లను భారీ ధరలకు కొని ఇరుక్కుపోతున్నారు. ఇలాంటి కుహనా ఎక్స్‌పర్ట్స్‌ కారణంగా ఇప్పుడిప్పుడే మార్కెట్‌వైపు చూస్తున్న చిన్న మదుపరులు మళ్లీ ముడుచుకుపోయే ప్రమాదం ఉంది. ఇకనైనా సెబి ఈ కృత్తిమ ఆపరేటర్ల మాయలపై కన్నేసి ఐపిఒల్లో మోసాలకు అడ్డుకట్ట వేయాలి. ఇలాంటి ఆపరేటర్ల ట్రేడింగ్‌చరిత్రలను తవ్వితీసి కఠిన చర్యలు తీసుకోకుంటే మరోమారు 2008లాగా సాధారణ మదుపరులు మార్కెట్‌కు దూరం జరిగే ప్రమాదం ఉంది. తస్మాత్‌ జాగ్రత్త...You may be interested

9900 పైన నిఫ్టీ ముగింపు

Monday 17th July 2017

మరోమారు రికార్డుల మోత సోమవారం స్టాక్‌ మార్కెట్‌ ‍స్వల్ప లాభాల్లో ముగిసింది. అయినా స్టాక్‌ సూచీలు ఇంట్రాడేలోనూ, ముగింపులో కూడా కొత్త రికార్డ్‌లను సృష్టించాయి. ఇంట్రాడేలో  జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకిన స్టాక్‌ సూచీలు ట్రేడింగ్‌ అంతా  పరిమిత శ్రేణిలోనే కదలాడాయి.  చైనా జీడీపీ అంచనాలను మించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 54 పాయింట్ల లాభంతో 32,075 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో

ఏడాది గరిష్టస్థాయికి ఇంద్రప్రస్థ గ్యాస్

Monday 17th July 2017

ముంబై:- ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ షేరు సోమవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో4శాతానికి పైగా లాభపడి యేడాది గరిష్టస్థాయిని తాకింది. హర్యానాలోని గురుగ్రాం పట్టణంలో గ్యాస్‌ పంపిణీకి ఆరాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. ఈ వార్తల నేపథ్యంలో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ షేరు ఇంట్రాడేలో 3శాతం లాభంతో రూ.1164ల యేడాది గరిష్టస్థాయిని తాకింది. ప్రస్తుతం గం.3:15ని.లకు నిన్నటి ముగింపు ధర(రూ.1122)తో పోలిస్తే 3శాతం లాభపడి రూ.1147ల వద్ద ట్రేడవుతోంది. కాగా, షేరు

Most from this category