News


మిగిలేవి పదో.. పన్నెండో..

Tuesday 18th July 2017
news_main1500320403.png-5528

  •  ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మరిన్ని విలీనాలు
  •  3-4 అంతర్జాతీయ స్థాయి బ్యాంకులను తీర్చిదిద్దే ప్రయత్నాలు
  •  ఆంధ్రా బ్యాంకు స్వతంత్రంగానే కొనసాగే అవకాశాలు

న్యూఢిల్లీ: మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల ద్వారా మొత్తం మీద 3-4 అంతర్జాతీయ స్థాయి బ్యాంకులను తీర్చిదిద్దడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) 21 ఉండగా.. విలీనాలతో ఈ సంఖ్య 10-12కి తగ్గనుంది. ఎస్‌బీఐ స్థాయిలో మరో 3-4 బ్యాంకులను తయారు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రాంతీయ కార్యకలాపాలపై ప్రధానంగా దృష్టి పెట్టే ఆంధ్రా బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుతో పాటు మరికొన్ని మధ్యస్థాయి బ్యాంకులు స్వతంత్రంగానే కొనసాగే అవకాశముందని వివరించాయి. ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనంతో ఊపు మీద ఉన్న కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి మొండి బకాయిలు అదుపులోకి వస్తే మరో విలీన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయాలని యోచిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సాలిడేషన్‌పై మరింతగా కసరత్తు జరుగుతోందంటూ ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. అటు రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ సైతం వ్యవస్థలో కొన్ని పెద్ద బ్యాంకులు, కొన్ని చిన్నవి, ఇంకొన్ని స్థానిక బ్యాంకులు మొదలైనవి ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎస్‌బీహెచ్‌ సహా అయిదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకును ఈ ఏడాది ఏప్రిల్ 1న విలీనం చేశారు. దీంతో ఎస్‌బీఐ ప్రపంచంలోనే టాప్ 50 బ్యాంకుల జాబితాలో చేరింది. ఈ విలీనంతో ఎస్‌బీఐ ఖాతాదారుల సంఖ్య 37 కోట్లకు, శాఖలు 24,000కు, ఏటీఎంల సంఖ్య 59,000కు చేరింది. 
పీఎన్‌బీ తదితర బ్యాంకుల్లో విలీన అవకాశాలు..
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్‌, బ్యాం‍క్ ఆఫ్ ఇండియా వంటి పెద్ద పీఎస్‌బీల్లో కొన్ని చిన్న బ్యాంకులను విలీనం చేసేందుకు ఆస్కారముందని మరో అధికారి తెలిపారు. ప్రాంతీయంగా సమతుల్యత, భౌగోళికంగా విస్తరణ, ఆర్థిక భారం, సులభతరమైన మానవ వనరుల బదలాయింపు ప్రక్రియ మొదలైన అంశాలన్నీ విలీనాలపై తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరీ బలహీనమైన బ్యాంకును పటిష్టమైన బ్యాంకులో విలీనం చేస్తే పెద్ద బ్యాంకు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి.. అటువంటి ప్రతిపాదనలేమీ ఉండబోవని అధికారి పేర్కొన్నారు.







You may be interested

రూ.999లకే నోకియా ఫీచర్‌ ఫోన్‌

Tuesday 18th July 2017

న్యూఢిల్లీ: నోకియా బ్రాండ్‌ అధికారాలు చేజిక్కించుకున్న ‘హెచ్‌ఎండీ గ్లోబల్‌’ తాజాగా ‘నోకియా-105’ మోడల్‌లో కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.999. ఇందులో 1.8 అంగుళాల కలర్‌ స్క్రీన్‌, ఎల్‌ఈడీ టార్చ్‌లైట్‌, కొత్త డిజైన్‌, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్‌ వంటి పలు ప్రత్యకతలున్నాయని కంపెనీ పేర్కొంది. ఫీచర్‌ ఫోన్‌ మార్కెటే ప్రధాన లక్ష్యంగా కంపెనీ ఈ మోడల్‌ను తీసుకువస్తోంది. ఇక డ్యూయెల్‌ సిమ్‌ వెర్షన్‌ ఫోన్‌ ధర రూ.1,149గా

అప్పుడు నా సహచరుల మాట వినాల్సింది

Tuesday 18th July 2017

ఇన్ఫీ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి న్యూఢిల్లీ: దేశీ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ‘ఇన్ఫోసిస్‌’ చైర్మన్‌ పదవి నుంచి వైదొలగడంపై ఆ కంపెనీ సహవ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌.ఆర్‌.నారాయణ మూర్తి ఇప్పుడు విచారం వ్యక్తంచేశారు. అప్పుడు కంపెనీ ఇతర సహవ్యవస్థాపకులు తనను పదవిలో కొనసాగాల్సిందిగా కోరారని, వారి మాట విని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కాగా ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ పదవి నుంచి మూర్తి 2014లో తప్పుకున్నారు. ‘నా రాజీనామా నిర్ణయాన్ని కంపెనీ ఇతర సహ

Most from this category