STOCKS

News


మెట్రో స్టేషన్ల వద్ద మొబిసీ సైకిల్స్‌!

Friday 29th December 2017
startups_main1514570380.png-12653

  •  ఓలా, ఉబర్‌లానే సైకిల్‌ షేరింగ్‌ కోసం యాప్‌
  •  జనవరి నుంచి హైదరాబాద్‌లో మొబిసీ సేవలు
  •  ఐఐటీ హైదరాబాద్ సహా పలు ఐటీ కంపెనీలతో డీల్‌
  •  6 నెలల్లో రూ.65 కోట్ల నిధుల సమీకరణ పూర్తి
  •  ‘స్టార్టప్‌ డైరీ’తో మొబిసీ ఫౌండర్‌ ఆకాష్‌ గుప్తా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: 2018 కొత్త సంవత్సరం నుంచి ఓలా, ఉబర్‌ తరహాలోనే సైకిళ్లనూ అద్దెకు తీసుకోవచ్చు. సైకిలే కదా అని తేలిగ్గా తీసేయలేం. ఎందుకంటే దేశంలోనే తొలిసారిగా వస్తున్న డాక్‌లెస్‌ సైకిల్‌ షేరింగ్‌ యాప్‌ ఇదే. సాధారణంగా సైకిల్‌ అద్దెలు ఎలా ఉంటాయంటే.. నిర్ధేశించిన ప్రాంతం నుంచే సైకిల్‌ను అద్దెకు తీసుకోవాలి. అలాగే కేటాయించిన ప్రాంతాల్లోనే పార్కింగ్‌ చేయాలి. కానీ, మొబిసీలో అలా కాదు.. సైకిల్‌ను ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. వినియోగించాక ఎక్కడైనా పార్కింగ్‌ చేసేయొచ్చు. ఇదే దీని ప్రత్యేకత. జనవరి చివరికల్లా హైదరాబాద్‌ మెట్రో స్టేషన్లు, ఐఐటీ హైదరాబాద్, పలు ఐటీ కంపెనీల్లో మొబిసీ సైకిల్స్‌ అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని వివరాలను సంస్థ ఫౌండర్‌ ఆకాష్‌ గుప్తా ‘స్టార్టప్‌ౖ డైరీ’కి వివరించారు.
ఎలా వినియోగించాలంటే?
ముందుగా మొబిసీ యాప్‌లో లాగిన్‌ కావాలి. పేరు, ఫోన్‌ నంబరుతో పాటూ ఆధార్‌ నంబరును నమోదు చేయాలి. సెక్యూరిటీ డిపాజిట్‌ను జమ చేశాక... ఫోన్‌ స్క్రీన్‌ మీద దగ్గర్లో ఉన్న సైకిల్స్‌ కనిపిస్తుంటాయి. సైకిల్‌ను ఎంపిక చేసి సైకిల్‌ మీదున్న క్యూఆర్‌ కోడ్‌ను యాప్‌తో స్కాన్‌ చేయగానే సైకిల్‌కు ఉన్న తాళం తెరుచుకుంటుంది. రైడ్‌ పూర్తయ్యాక ముందుగా చెల్లించిన సెక్యూరిటీ డిపాజిట్‌లో నుంచి చార్జీని మినహాయించి మిగిలిన మొత్తం కస్టమర్‌ పేటీఎం వ్యాలెట్‌లో జమ అవుతుంది. వెంటనే కస్టమర్‌ మొబైల్‌కు ఎంత దూరం ప్రయాణించాం? ఎంత సమయం పట్టింది? ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి? ఎంత కార్బన్‌ను ఆదా చేశాం? వంటి సమాచారమంతా వస్తుంది.
సైకిల్‌ను ఎక్కడ పార్కింగ్‌ చేయాలి?
మొబిసీ పార్కింగ్‌ రెండు రకాలుగా ఉంటుంది. స్థానికంగా ప్రభుత్వం కేటాయించిన నిర్ధేశిత ప్రాంతాల్లోనే పార్కింగ్‌ చేయవచ్చు. లేదా కంపెనీ నిర్ణయించిన ప్రాంతాల్లో అంటే కళాశాలలు, మెట్రో స్టేషన్లు, ప్రధాన మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్, ఆఫీసులు, జిమ్, పార్క్‌ల వంటి జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మొబిసీ సైకిళ్లను అద్దెకు తీసుకోవచ్చు. పార్కింగ్‌ చేయనూ వచ్చు.
చార్జీ ఎంత?
ప్రతి రైడ్‌కు అరగంటకు రూ.10 చార్జీ ఉంటుంది. నెలవారి సబ్‌స్క్రిప్షన్‌కైతే రూ.99. ఇందులో రోజుకు 2 రైడ్లు చేసుకోవచ్చు. సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.999 చెల్లించాలి. రైడ్‌ పూర్తయ్యాక దీన్ని రీఫండ్‌ చేస్తారు. విద్యార్థులకైతే రూ.499 డిపాజిట్‌. ప్రస్తుతం మొబిసీకి 10 వేల మంది యూజర్లున్నారు. రోజుకు 1,000 రైడ్స్‌ జరుగుతున్నాయి.
జనవరి నుంచి హైదరాబాద్‌లో..
‘‘ప్రస్తుతం గుర్గావ్, నోయిడా, ఫరీదాబాద్‌ ప్రాంతాల్లో సేవలందిస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో 500 సైకిళ్లున్నాయి. మరో 10 రోజుల్లో చండీగఢ్‌, కోల్‌కత్తా, పుణెల్లో ఒక్కో నగరంలో 150 సైకిళ్లతో సేవలను ప్రారంభిస్తున్నాం. జనవరి చివరికల్లా హైదరాబాద్‌లో మొబిసీ సైకిళ్లను అందుబాటులోకి తెస్తాం. తొలిదశలో 300 సైకిళ్లను అందుబాటులోకి తీసుకొస్తాం. ఐఐటీ–హైదరాబాద్, ఎస్‌టీపీఐ, మెట్రో రైల్‌ సంస్థలతో చర్చలు జరిపాం. మొత్తంగా మార్చి నాటికి 5 వేల సైకిళ్లకు చేరాలని లక్ష్యించాం.
6 నెలల్లో రూ.65 కోట్ల సమీకరణ..
గుర్గావ్‌లో కంపెనీ ప్రారంభించే సమయంలో రూ.25 లక్షల పెట్టుబడి పెట్టాం. ఇటీవలే అమెరికాకు చెందిన ఈక్విటీ ఇన్వెస్టర్‌ రూ.3.25 కోట్ల పెట్టుబడులు పెట్టారు. మరో 6 నెలల్లో రూ.65 కోట్ల నిధులను సమీకరించనున్నాం. ఒకరిద్దరు ఈక్విటీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మా సంస్థలో 25 మంది ఉద్యోగులున్నారు. హైదరాబాద్‌లో సేవలకు కొత్తగా మరో 8 మందిని తీసుకుంటున్నాం’’ అని గుప్తా వివరించారు.
 
 



You may be interested

భవిష్యత్తు రియల్టీకి 2017 భరోసా!

Friday 29th December 2017

 పెద్ద నోట్ల రద్దు, రెరా, జీఎస్‌టీలతో పారదర్శకత, విశ్వసనీయత  మౌలిక రంగ హోదాతో పెరిగిన నిధుల లభ్యత; తగ్గిన వడ్డీ రేట్లు  ఏడాదిలో 3 కోట్ల చ.అ. ఆఫీస్‌ స్పేస్, 1.60 లక్షల ఫ్లాట్ల విక్రయాలు  కో–వర్కింగ్‌ స్పేస్, అఫడబుల్‌ హౌజింగ్‌లకు డిమాండ్‌ సాక్షి, హైదరాబాద్‌: ‘భవిష్యత్తు రియల్టీ’ అనే సొంతింటికి 2017లో పునాది పడింది. స్థిరాస్తి రంగంలో పారదర్శకత, విశ్వసనీయతే లక్ష్యంగా మొదలైన ఇంటి నిర్మాణానికి పెద్ద నోట్ల రద్దుతో తొలి అడుగు పడింది. స్థిరాస్తి

ఐఫోన్‌ కస్టమర్లకు యాపిల్‌ సారీ!

Friday 29th December 2017

ఫోన్ల పనితీరు మందగించడంపై వివరణ బ్యాటరీల ధర తగ్గింపు; రిప్లేస్‌మెంట్‌లో రూ.2,000కే.. న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘యాపిల్‌’ తాజాగా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ వల్ల పాత ఐఫోన్ల పనితీరు మందగించడంపై స్పందించింది. కస్టమర్లకు క్షమాపణలు తెలియజేసింది. ‘పాత బ్యాటరీలు కలిగిన ఐఫోన్లు అనుకోకుండా షట్‌డౌన్‌ అవుతున్నాయని గతంలో ఫిర్యాదులు అందాయి. ఈ సమస్య పరిష్కారం కోసం అప్‌డేట్‌ తీసుకువచ్చాం. ఇది ఫోన్ల పనితీరుపై ప్రభావం చూపింది. అంతేకానీ ఉద్దేశపూర్వకంగా ప్రొడక్టుల జీవిత కాలాన్ని

Most from this category