News


ఇన్‌వాయిస్‌లపై రుణాలు!

Friday 20th April 2018
startups_main1524245143.png-15726

  •  ఎస్‌ఎంఈలకు కలిసొస్తున్న ఇన్‌డిఫై సేవలు
  •  తనఖా లేకుండానే రూ.50 లక్షల వరకూ లోన్స్‌
  •  కస్టమర్లుగా హోటల్స్, ట్రావెల్, కిరాణా, ఈ-కామర్స్‌ సంస్థలు
  •  వడ్డీ నెలకు 1.5–2 శాతం; ఇప్పటివరకు రూ.300 కోట్ల రుణాలు
  •  ‘స్టార్టప్‌ డైరీ’తో ఇన్‌డిఫై కో–ఫౌండర్‌ సిద్దార్థ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్‌ఎంఈ) ఎదుర్కొనే ప్రధాన సమస్య ‘నిధులు’. ఇవి చాలవన్నట్లు ప్రభుత్వ,  ప్రైవేట్‌ సంస్థలు ఎస్‌ఎంఈలకు అందించే ఇన్‌వాయిస్‌ బిల్లులు సమయానికి క్లియర్‌ కాక మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒక్క ఇన్‌వాయిస్‌ క్లియర్‌ కావాలంటే కనీసం 60–90 రోజుల సమయం పడుతుంది. ఎస్‌ఎంఈల ఇన్‌వాయిస్‌ సమస్యలకూ చెక్‌ చెప్పేస్తోంది ఇన్‌డిఫై టెక్నాలజీస్‌. ఇన్‌వాయిస్‌లను తనఖాగా పెట్టుకొని రూ.15–50 లక్షల వరకూ రుణాలివ్వటమే దీని ప్రత్యేకత. బిల్‌ క్లియర్‌ కాగానే వెంటనే రుణం తీర్చేయాలి సుమీ! ఇందుకు నెలకు 1.5 శాతం వడ్డీ. ఇప్పటివరకు ఇన్‌వాయిస్‌ల మీద 100 మందికి రూ.20 కోట్ల రుణాలందించామని ఇన్‌డిఫై కో–ఫౌండర్‌ సిద్ధార్థ్‌ మహనోత్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో చెప్పారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..
ఐఐటీ ఘజియాబాద్‌ నుంచి ఎంబీఏ పూర్తయ్యాక.. ఐసీఐసీఐ, సిటీ, ఇండియాబుల్స్, ఎడిల్‌వైజ్‌ వంటి సంస్థల్లో పనిచేశా. రెండు దశాబ్ధాల బ్యాంకింగ్‌ రంగ అనుభవంలో ఎంతో మంది కస్టమర్లు లోన్‌ కోసం రావటం ఒట్టి చేతులతో వెనక్కి వెళ్లడం గమనించాం. వీరందరి సమస్యకు పరిష్కారం చూపించాలని నిర్ణయించుకొని.. ఇంటర్నేషనల్‌ వీసీ ఫండ్స్‌ నుంచి రూ.32 కోట్ల నిధుల సమీకరణతో 2015 మేలో ఇన్‌డిఫై టెక్నాలజీస్‌ను ప్రారంభించాం. కిరాణా స్టోర్లు, చిన్న చిన్న హోటళ్లు, రెస్టారెంట్లకు రుణాలు అందటం చాలా కష్టం. తనఖా పెట్టందే బ్యాంకులు రుణాలివ్వవు. ప్రైవేట్‌ రుణాలు తీసుకుందామంటే వడ్డీ వాయింపు. నిజం చెప్పాలంటే కార్పొరేట్లకు రుణాలిచ్చి చేతులు కాల్చుకునే బదులు తిరిగి చెల్లించే సామర్థ్యం, వ్యాపార విధానం బాగుండే ఇలాంటి చిన్న వ్యాపారస్తులకు ఇవ్వటమే బెటర్‌.
10కిపైగా బ్యాంకులతో ఒప్పందం..
మేక్‌మై ట్రిప్, ఫుడ్‌పాండా, స్విగ్గీ, పేటీఎం, ట్రావెల్‌ బొటిక్యూ, ఓలా క్యాబ్స్, షాప్‌క్లూజ్, టీబో గ్రూప్, గోఐబిబో, రియా, యాత్రా, పిన్‌ల్యాబ్స్, ఆఫ్‌బిజినెస్‌ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఆయా సంస్థలతో వ్యాపారం నిర్వహిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్‌ ఏజెన్సీలు, రిటైల్, ఈ–కామర్స్‌ సంస్థలకు, వ్యక్తిగత వ్యాపారస్తులకూ ఇన్‌డిఫై రుణాలందిస్తుంది. లోన్ల కోసం యెస్‌ బ్యాంక్, ఆర్‌బీఎల్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లతో, ఎడిల్‌వైజ్, ఇండియాఇన్‌ఫోలైన్, క్యాపిటల్‌ ఫస్ట్, ఆదిత్య బిర్లా, ఇన్‌క్రెడ్, లెండింగ్‌కార్ట్‌ వంటి 10కి పైగా బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం.
రూ.50 లక్షల వరకూ రుణం..
సిబిల్‌ స్కోర్, బ్యాంక్‌ స్టేట్‌మెంట్స్, బిజినెస్‌ డాటా, సోషల్‌ మీడియా యాక్టివిటీ వంటి మాధ్యమాల ద్వారా రుణ గ్రహీత డేటాను సేకరించి.. మా వ్యక్తిగత బృందం స్వయంగా తనిఖీ చేసిన  తర్వాత రుణాన్ని మంజూరు చేస్తాం. ఇప్పటివరకు 5 వేల మంది రుణ గ్రహీతలకు సుమారు రూ.300 కోట్ల రుణాలను అందించాం. హైదరాబాద్‌ నుంచి 5 శాతం రుణ గ్రహీతలుంటారు. వడ్డీ నెలకు 1.5 నుంచి 2 శాతంగా ఉంటుంది. రూ.50 వేల నుంచి రూ.50 లక్షల వరకు రుణాలందిస్తాం. ప్రతినెలా 100 శాతం వృద్ధిని నమోదు చేశాం.
రూ.300 కోట్ల నిధుల సమీకరణ..
ప్రస్తుతం 300 పట్టణాల్లో సేవలందిస్తున్నాం. వచ్చే ఏడాది కాలంలో 500 పట్టణాలకు, రుణగ్రహీతల సంఖ్యను 8 వేలకు చేర్చాలని లక్ష్యించాం. ప్రస్తుతం మా సంస్థలో 130 మంది ఉద్యోగులున్నారు. వ్యాపార విస్తరణలో భాగంగా నెలకు 4 గురిని కొత్తవాళ్లను తీసుకుంటున్నాం. ఇప్పటివరకు రూ.100 కోట్ల నిధులను సమీకరించాం. యాక్సెల్‌ పార్టనర్స్, ఎలివార్‌ ఈక్విటీ, ఒమిడ్యార్‌ నెట్‌వర్క్‌లతో పాటూ ఒకరిద్దరు వ్యక్తిగత ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడులు పెట్టారు. ఇదే రంగంలో వినూత్న వ్యాపార విధానమున్న స్టార్టప్స్‌ ముందుకొస్తే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సిద్ధార్థ్‌ తెలిపారు.
 You may be interested

శిఖా శర్మ వారసత్వ ఎంపిక పక్రియలోయాక్సిస్‌

Friday 20th April 2018

ముంబై: మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ శిఖా శర్మ స్థానంలో కొత్త సారధి ఎంపిక ప్రక్రియను ప్రైవేటు రంగ బ్యాంక్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రారంభించింది. స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు బ్యాంక్‌ ఒక ఫైలింగ్‌ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది.  డిసెంబర్‌లో శిఖా శర్మ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ బాధ్యతల నుంచి వైదొలుగుతున్న సంగతి తెలిసిందే.  నిజానికి జూన్‌ 1 నుంచీ శిఖాశర్మ పదవీకాలన్ని మరో మూడేళ్లు పొడిగిస్తూ, బ్యాంక్‌ బోర్డ్‌ నిర్ణయం తీసుకుంది.

వంద బిలియన్‌ డాలర్ల కంపెనీగా టీసీఎస్‌ !

Friday 20th April 2018

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) కంపెనీ వంద బిలియన్‌ డాలర్ల కంపెనీ దిశగా శరవేగంగా కదులుతోంది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించాయి. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరం ఫలితాలు కూడా బాగా ఉన్నాయి. దీంతో శుక్రవారం స్టాక్‌ సూచీలు నష్టపోయినా, టీసీఎస్‌ మాత్రం రికార్డ్‌ స్థాయిలను తాకింది. అంతేకాకుండా కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ వంద బిలయన్‌ డాలర్లకు చేరువయింది.  ఆర్థిక ఫలితాలు అదరహో... గత ఆర్థిక

Most from this category