News


30 శాతం వృద్ధి లక్ష్యం

Friday 20th April 2018
news_main1524246192.png-15729

  •  పాలసీల జారీలో టెక్నాలజీకి పెద్ద పీట
  •  ఐడీబీఐ ఫెడరల్‌ లైఫ్‌ సీఎంవో కార్తీక్‌ రామన్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 30 శాతం ఆదాయ వృద్ధి అంచనా వేస్తున్నట్లు జీవిత బీమా సంస్థ ఐడీబీఐ ఫెడరల్‌ లైఫ్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ కార్తీక్‌ రామన్‌ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం స్థూల ప్రీమియం పరిమాణం .. పదహారు శాతం పెరిగి రూ. 1,783 కోట్లకు చేరిందని ఆయన వివరించారు.  కొత్త ప్రీమియంలో 15 శాతం, రెన్యువల్‌లో 25 శాతం వృద్ధి సాధించామని సాక్షి బిజినెస్‌ బ్యూరోకి తెలిపారు. నిర్వహణలో ఉన్న అసెట్స్‌ విలువ 23 శాతం పెరిగి రూ. 7,503 కోట్లకు చేరిందని,  క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ నిష్పత్తి సుమారు 91 శాతం మేర ఉంటోందని వివరించారు. డీమానిటేజేషన్‌ అనంతరం భారీగా నిధులు బీమా సాధనంలోకి వచ్చాయని, దీంతో 2016–17 క్యూ4లో పాలసీ విక్రయాలు గణనీయంగా జరిగాయని రామన్‌ తెలిపారు. అయితే, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలోనూ .. అంతక్రితం క్యూ4 కన్నా మెరుగైన పనితీరే సాధించగలిగినట్లు పేర్కొన్నారు.
సరళతరమైన పాలసీలపై దృష్టి..
సులభంగా అర్ధమయ్యే రీతిలో సరళమైన పాలసీలను అందుబాటులోకి తేవడంపై దృష్టి సారిస్తున్నామని రామన్‌ చెప్పారు. అంతేగాకుండా టెక్నాలజీ తోడ్పాటుతో పాలసీ జారీ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నామన్నారు. కస్టమర్‌ నుంచి సేకరించిన వివరాలు మొదలైనవి ట్యాబ్లెట్‌ ద్వారా అప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేసి .. కొన్ని సార్లు గంటల వ్యవధిలోనే జారీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని రామన్‌ తెలిపారు. టెక్నాలజీ వినియోగం కారణంగా సంస్థ వ్యయాలు తగ్గి.. ఆ మేరకు వచ్చే ప్రయోజనాలు పాలసీదారులకు బదలాయించడానికి వీలవుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 20 పైగా రకాల పాలసీలను విక్రయిస్తున్నామని, యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు (యులిప్‌), చైల్డ్‌ ప్లాన్స్‌ అత్యధికంగా విక్రయించే వాటిల్లో ఉన్నాయని చెప్పారు.
మరింతమంది ఏజెంట్ల నియామకం..
3 వేల పైచిలుకు ఫెడరల్, ఐడీబీఐ బ్యాంకుల శాఖల్లో  పాలసీలు విక్రయిస్తున్నామని రామన్‌ పేర్కొన్నారు. అలాగే తమకు సొంతంగా 63 పైగా ఏజెన్సీ బ్రాంచీలు ఉండగా, నాలుగు శాఖలు  ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం 10వేల పైచిలుకు ఏజెంట్లు ఉండగా వీరి సంఖ్యను క్రమంగా పెంచుకుంటున్నామని, ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 12,000–12,500 స్థాయికి పెంచుకోవాలని భావిస్తున్నామని ఆయన వివరించారు. మరోవైపు, జీవిత బీమాపై అవగాహన పెంచే దిశగా మారథాన్స్‌ మొదలైన వాటిని నిర్వహించడం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నామని రామన్‌ పేర్కొన్నారు. అలాగే, క్రీడలకు కూడా ప్రోత్సాహమిస్తూ.. యువ టాలెంట్‌ను గుర్తించి, తోడ్పాటు అందించేందుకు పుల్లెల గోపీచంద్‌ అకాడమీతో చేతులు కలిపినట్లు ఆయన వివరించారు. టాలెంట్ హంట్‌కి సంబంధించి దేశవ్యాప్తంగా వేల కొద్దీ దరఖాస్తులు రాగా 26 మందిని షార్ట్ లిస్ట్ చేసినట్లు, వీరిలో ఆరుగురు తెలంగాణ నుంచి ఉన్నట్లు రామన్ చెప్పారు.You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం 21 శాతం అప్‌..?

Saturday 21st April 2018

ముంబై: దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మరికాసేపట్లోనే గత ఆర్థిక సంవత్సరానికి చెందిన నాలుగో త్రైమాసిక (2017–18, క్యూ4) ఫలితాలను ప్రకటించనుంది. ఏడాది ప్రాతిపదికన బ్యాంక్‌ నికర లాభం 21 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. బ్యాంక్‌ రూ.4,832 కోట్లుగా ఉండవచ్చని పోల్‌లోని అత్యధిక సభ్యులు వెల్లడించినట్లు రాయిటర్స్‌ తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,990

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ లాభం రూ.1,030 కోట్లు

Friday 20th April 2018

23 శాతం వృద్ధి ముంబై: ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,030 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.840 కోట్లు)తో పోల్చితే 23 శాతం వృద్ధి సాధించామని ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. రుణ వృద్ధి మెరుగుపడడం, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడం, ఫీజు ఆదాయం పెరగడం వల్ల లాభం ఈ

Most from this category