STOCKS

News


ఆఫీసుకొచ్చారా.. సెల్ఫీ ఇవ్వండి!

Friday 2nd February 2018
startups_main1517594987.png-13657

  •  సెల్ఫీతోనే హాజరు సేవలందిస్తున రెగ్యులర్‌.లి
  •  60 కంపెనీలు; 10 వేల ఉద్యోగులు నమోదు
  •  మన దేశంతో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో సేవలు
  •  ఏడాదిలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలకు విస్తరణ
  •  రూ.6 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి
  •  ‘స్టార్టప్‌ డైరీ’తో సంస్థ ఫౌండర్‌ అవిజిత్‌ సర్కార్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘సెల్ఫీ’.. సెల్‌ఫోన్‌ వినియోగదారులకు పరిచయం చేయాల్సిన పనిలేదేమో! సెల్ఫీ ఫొటోలు, వీడియోలతో ప్రచారం చేసే వాళ్లను చూశాం. ప్రమాదాలు కోరితెచ్చుకున్న వాళ్లనూ చూశాం. కానీ, అదే సెల్ఫీతో వ్యాపారం చేసేవాళ్లూ పెరుగుతున్నారు. రెగ్యులర్‌.లి... ఆ కోవలోదే. ఇది సెల్ఫీతో హెచ్‌ఆర్‌ సేవలందిస్తోంది. పూర్తి వివరాలు వ్యవస్థాపకుడు అవిజిత్‌ సర్కార్‌ మాటల్లోనే...
‘‘గతంలో ఉద్యోగులు, విద్యార్థులు, మార్కెటింగ్‌ వారు ఎవరైనా సరే.. హాజరైనట్టుగా రిజిస్టర్‌లో సంతకం చేసేవారు. తర్వాత బయోమెట్రిక్స్‌.. ఇకిప్పుడు ఐరిస్‌, ఫేసియల్‌ స్కానర్లు వచ్చేశాయి. వీటిలో దేనికైనా నిర్వహణ వ్యయం కాసింత ఎక్కువ. కానీ, సెల్ఫీ ఫొటోనే అటెండెన్స్‌ రిజిస్టర్‌లా మార్చేస్తే ఈ వ్యయం ఉండదుగా అనే ఆలోచన వచ్చింది. ఇంకేముంది మాతృసంస్థ అయిన అవీఫా ఇన్ఫోటెక్‌ బృందంతో కలిసి రెగ్యులర్‌.లి పేరిట క్లౌడ్‌ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేశాం. రూ.4 లక్షలతో గతేడాది ఆగస్టులో కోల్‌కతా కేంద్రంగా ప్రారంభించాం.
ఎలా పనిచేస్తుందంటే?
ఇది క్లౌడ్‌ టెక్నాలజీతో పనిచేస్తుంది. రెగ్యులర్‌ యాప్‌లో ఒప్పంద కంపెనీకి ప్రత్యేక ఖాతా తెరిచి అందులో వారి ఉద్యోగులను నమోదు చేయాలి. ఉద్యోగి ఆఫీసు పరిసరాల్లోకి చేరగానే ఆటోమెటిక్‌గా యాప్‌కు అనుసంధానమై పోతాడు. అందులో ఉన్న చెకిన్‌ బటన్‌ను నొక్కగానే సెల్ఫీతో కూడిన హాజరు నమోదవుతుంది. ఇది నేరుగా యాజమాన్యానికి చేరిపోతుంది. అంతే!! స్మార్ట్‌ఫోన్‌ లేని ఉద్యోగులు ఆఫీసులోని లాప్‌ట్యాప్‌ లేదా డెస్క్‌టాప్‌ ద్వారా చెకిన్‌ కావచ్చు. ఇందులో క్యూఆర్‌ లేదా బార్‌ కోడ్‌ ఉంటుంది. దాన్ని ఫొటో ఐడీతో స్కాన్‌ చేయగానే సెల్ఫీతో కూడా చెకిన్‌ అవుతుంది. జీపీఎస్, వైఫై ఎస్‌ఎస్‌ఐడీ ఆధారంగా ఔట్‌డోర్‌ ఉద్యోగుల ఫీల్డ్‌ ట్రాకింగ్‌ కూడా చేస్తుంది. యాజమాన్యానికి ఉద్యోగి లొకేషన్‌ మ్యాప్స్‌ ద్వారా కనిపిస్తుంటుంది.
జీతభత్యాలు; ప్రదర్శన సేవలు కూడా..
హాజరు నమోదొక్కటే కాదు. సమయ పాలన, పనితీరు నివేదికలు, సెలవుల నిర్వహణ సేవలూ ఈ యాప్‌తోనే నిర్వహించుకునే వీలుంది. ఒప్పందం కంపెనీల హెచ్‌ఆర్‌ విభాగం పనిభారాన్ని తగ్గించేందుకు వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నాటికి జీతభత్యాల నిర్వహణ సేవలను కూడా అందిస్తాం. కంపెనీలతో పాటూ విద్యా సంస్థలు, సంఘాలు, గ్రూప్‌లు, మార్కెటింగ్‌ బృందాలు మా సేవలను వినియోగించుకోవచ్చు. జీపీఎస్, వైఫైలకు లాకింగ్స్‌ ఉంటాయి. కాబట్టి భద్రత విషయంలోనూ అనుమానాలవసరం లేదు.
60 కంపెనీలు; 10 వేల ఉద్యోగులు..
ప్రస్తుతం ఇండియాతో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో సేవలందిస్తున్నాం. లెన్స్‌కార్ట్, వెస్ట్‌విండ్, సరల్‌ డయాగ్నస్టిక్స్‌, నానో ఐడీ, గ్రాబ్‌ ట్యాక్సీ వంటి 60కి పైగా సంస్థలు మా కస్టమర్లుగా ఉన్నాయి. వీటిలో 10 వేలకు పైగా ఉద్యోగుల అటెండెన్స్‌ను మేం నిర్వహిస్తున్నాం. చార్జీలు నెలకు ఒక యూజర్‌కు 1 డాలర్‌. ఈ ఏడాది చివరి నాటికి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలకు విస్తరించనున్నాం.
రూ.6 కోట్ల నిధుల సమీకరణ..
జులై నాటికి బ్రేక్‌ఈవెన్‌కొస్తాం. ఈ ఏడాది ముగిసే నాటికి 200 మంది కస్టమర్లను చేరుకోవాలని లక్ష్యించాం. ప్రస్తుతం మా సంస్థలో ఐదుగురు ఉద్యోగులున్నారు. తొలిసారిగా నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. పలువురు వీసీ ఇన్వెస్టర్లు రూ.6 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నారు. కానీ విస్తరణ తర్వాతే సమీకరిస్తాం’’‘ అని అవిజిత్‌ వివరించారు.
 
 You may be interested

నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ప్రయోజనం!

Friday 2nd February 2018

 స్టాండెర్డ్‌ డిడక‌్షన్‌పై  హస్‌ముఖ్‌ ఆదియా న్యూఢిల్లీ: తాజా బడ్జెట్‌లో ప్రతిపాదిన రూ.40,000 స్టాండెర్డ్‌ డిడక‌్షన్‌ నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ప్రయోజనం కలిగిస్తుందని ఆర్థిక శాఖ కార్యదర్శి హస్‌ముఖ్‌ ఆదియా పేర్కొన్నారు. పన్ను రహిత ఆదాయాన్ని ఉద్యోగ వర్గాలు, పెన్షనర్లు రూ.2.9 లక్షల వరకూ పెంచుకునే వెలుసుబాటు దీనివల్ల కలుగుతోందన్నారు. నిజాయితీగా పన్ను చెల్లించే వేతన వర్గం ప్రధాన లక్ష్యంగా ఆర్థికమంత్రి ఈ ప్రయోజనాన్ని బడ్జెట్‌లో పొందిపరిచారని అన్నారు. కాగా స్టాండెర్డ్‌

దక్షిణాదిపై దృష్టిసారించిన ఎవరెస్ట్‌

Friday 2nd February 2018

దక్షిణాదిపై దృష్టిపెట్టిన ఎవరెస్ట్‌  నిర్మాణ సామగ్రి ప్లాంట్ల ఏర్పాటు యోచన హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రూఫింగ్, సీలింగ్, వాల్, ఫ్లోరింగ్‌ వంటి ప్రీ ఇంజనీరింగ్‌ బిల్డింగ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ ఎవరెస్ట్‌ ఇండస్ట్రీస్‌ దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిసారించింది. నిర్మాణ సామగ్రి ప్లాంట్ల ఏర్పాటు యోచనలో ఉన్నామని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చిస్తున్నామని ఇందికా కొలిక్కి రాలేదని ఎవరెస్ట్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ మనీష్‌ సంఘీ తెలిపారు. శుక్రవారమిక్కడ ఎవరెస్ట్‌ ఇండస్ట్రీస్‌ విభాగమైన స్టీల్‌ బిల్డింగ్‌ సొల్యూషన్స్‌ ప్రెసిడెంట్‌

Most from this category