News


పీఎస్‌యూ బ్యాంకులు.. నష్టాలతో కుదేలు..

Wednesday 16th May 2018
news_main1526490970.png-16534

  •  ఎనిమిది బ్యాంకుల నష్టాలు రూ. 39,803 కోట్లు
  •  ప్రభుత్వమిచ్చిన మూలధనంలో సగానికి సమానం
  •  ఈసారి మరో రూ. 1 లక్ష కోట్లు సమకూర్చాల్సిన పరిస్థితి

ముంబై: మొండిబాకీలు, స్కాములతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటిదాకా ఫలితాలు ప్రకటించిన పది బ్యాంకుల్లో రెండింటిని మినహాయిస్తే.. మిగతావాటన్నింటి పరిస్థితీ ఇదే. మొత్తం ఎనిమిది నష్టాలు ఏకంగా రూ. 39,803 కోట్ల మేర ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను నిధుల కొరత నుంచి గట్టెక్కించడానికి కేంద్రం గత ఆర్థిక సంవత్సరం ఆఖర్లో అందించిన రూ. 80 వేల కోట్ల అదనపు మూలధనంలో ఇది సగానికి సమానం కావడం గమనార్హం. ఈ గణాంకాలు కేవలం ఎనిమిది బ్యాంకులవి మాత్రమే... ఇంకా పలు బ్యాంకులు ఆర్థిక ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 12,282 కోట్లు, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ రూ. 5,871 కోట్ల మేర నష్టాలు ప్రకటించాయి. విజయా బ్యాంక్‌ (రూ. 727 కోట్లు), ఇండియన్‌ బ్యాంకు (రూ. 1,258 కోట్లు) మాత్రమే వార్షిక లాభాలు నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకులు సజావుగా కార్యకలాపాలు సాగించేందుకు కేంద్రం కనీసం రూ. 1 లక్ష కోట్లయినా సమకూర్చాల్సి రావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

బ్యాంకులకు పీసీఏ చిక్కులు ..
ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మొదలైనవి ఇంకా ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. ఈ బ్యాంకులు ప్రస్తుతం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాల మేరకు సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) అమలు చేస్తున్నాయి. ఇప్పటికే పీసీఏ అమలు చేస్తున్న బ్యాంకులు.. మొండిబాకీల ప్రొవిజనింగ్‌పై ఆర్‌బీఐ కొత్త నిబంధనలతో మరిన్ని నష్టాలు ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకుల అంచనా. దీంతో కేంద్రం సమకూర్చిన అదనపు మూలధనంలో ఏకంగా 75–85 శాతం వాటా హరించుకుపోవచ్చని వారు చెబుతున్నారు. ప్రస్తుతం 11 పీఎస్‌యూ బ్యాంకులు పీసీఏ కింద ఉన్నాయి. వరుసగా రెండేళ్ల పాటు నష్టాలు ప్రకటించి, మొత్తం మొండిబాకీలు పది శాతం దాటేసిన పక్షంలో రిజర్వ్‌ బ్యాంక్‌ పీసీఏ అమలు చేయాలని ఆదేశిస్తుంది. పీసీఏ విధించిన పక్షంలో ఆయా బ్యాంకులు కొత్తగా మరిన్ని శాఖలు తెరవడంపైనా, సిబ్బందిని తీసుకోవడంపైనా, రిస్కు ఎక్కువగా ఉండే రుణగ్రహీతలకు రుణాలివ్వడంపైనా ఆంక్షలు అమల్లోకి వస్తాయి. 

ద్వితీయార్ధంలో మెరుగ్గా పరిస్థితులు..
ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితులు మరో రెండు త్రైమాసికాలకు మాత్రమే పరిమితం కావొచ్చని, ఆ తర్వాత నుంచి మెరుగుపడొచ్చని బ్యాంకర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు. బినాని సిమెంట్, ఎస్సార్‌ స్టీల్, భూషణ్‌ స్టీల్‌ మొదలైన వాటి దివాలా ప్రక్రియలు మొదటి లేదా రెండో త్రైమాసికాల్లో పూర్తయిపోవచ్చని బ్యాంకర్లు చెబుతున్నారు. వీటి నుంచి రావాల్సినది ఎంతో కొంత వచ్చినా... ఆదాయాలు మెరుగుపడటానికి ఉపయోగపడొచ్చని వారంటున్నారు. 

 నష్టాల కుప్పలు..
                                నికర నష్టం
బ్యాంకు                    క్యూ4        2017-18

పీఎన్‌బీ                    13,417        12,283
ఓరియంటల్                 1,650        5,872
యూనియన్ బ్యాంక్            2,583        5,247
అలహాబాద్‌ బ్యాంక్            3,509        4,674
యూకో                    2,134        4,436
కెనరా                    4,859        4,222
దేనా                     1,225        1,923
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర            114        1,146

----------------------------------------------------------------------------------
మొత్తం                    29,493        39,803
----------------------------------------------------------------------------------

రూ. కోట్లలో
 You may be interested

112 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌

Thursday 17th May 2018

ఒక శాతం నష్టాల్లో నిఫ్టీ మెటల్‌ ముంబై: స్టాక్‌ సూచీలు గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 10,771 వద్ద మొదలయ్యింది. సెన్సెక్స్‌ 112 పాయింట్లు లాభపడి 35,500 వద్ద మొదలయ్యింది. నిఫ్టీ ఇండీసెస్‌లో మెటల్‌ అత్యధికంగా ఒక శాతం నష్టాల్లో ఉండగా.. రియల్టీ 0.23 శాతం, ఫార్మా 0.20 శాతం నష్టాల్లో ఉన్నాయి. లాభపడుతున్న రంగాలలో ఐటీ అత్యధికంగా 0.32

‘సౌండ్‌’తో పేమెంట్‌

Wednesday 16th May 2018

పరీక్షల దశలో కొత్త చెల్లింపుల విధానం పలు సంస్థలతో కలసి ఎన్‌పీసీఐ ప్రయత్నాలు డిజిటల్‌ చెల్లింపులను పెంచడంపై దృష్టి న్యూఢిల్లీ: కొత్త చెల్లింపుల విధానం త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తు‍న్నాయి. డిజిటల్‌ చెల్లింపులను పెంచే లక్ష్యంలో భాగంగా శబ్ధం ఆధారిత చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ప్రయత్నాలు మొదలు పెట్టింది. శబ్ధం ఆధారిత చెల్లింపుల విధానాన్ని పరీక్షించేందుకు ఫోన్‌పే, టోన్‌ట్యాగ్‌, అల్ట్రా క్యాష్‌ అనే మూడు సంస్థలతో

Most from this category