STOCKS

News


రండి.. నడకను దానం చేద్దాం!

Friday 8th December 2017
startups_main1512749493.png-12074

  •  పాత షూలను చెప్పులుగా మారుస్తున్న గ్రీన్‌సోల్‌
  •  గతేడాది లక్ష జతల సేకరణ, 62 వేల జతల విరాళం
  •  జనవరిలో విపణిలోకి గ్రీన్‌సోల్‌ పాదరక్షలు
  •  స్థానిక రిటైల్‌ సంస్థలు, హోల్‌సెల్లర్స్‌తో ఒప్పందం
  •  ఫిబ్రవరిలో జంషెడ్‌పూర్, ఢిల్లీల్లో గిడ్డంగులు
  •  ‘స్టార్టప్‌ డైరీ’తో గ్రీన్‌సోల్‌ సీఈఓ శ్రేయాన్స్‌ భండారీ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రక్త దానం, నేత్ర దానం.. ఆఖరికి అవయవ దానం గురించి కూడా తెలుసు. కానీ, చెప్పుల దానం, బూట్ల దానం గురించి ఎప్పుడైనా విన్నారా? జోక్‌ అని నవ్వి వదిలేయకండి.. ఎందుకంటే.. ఇది నిజం! మనం వాడి పడేసే బూట్లు, చెప్పులు, సోల్, లేస్‌ల వంటివి సేకరించి తిరిగి వాడుకునేందుకు వీలుగా మరమ్మతు చేసి విరాళంగా అందిస్తోంది గ్రీన్‌సోల్‌ సంస్థ! సామాజిక భాధ్యతగా ప్రారంభమైన ఈ సంస్థ వ్యాపార రూపం దాల్చుకుంది. రతన్‌ టాటా, బరాక్‌ ఒబామాల ప్రశంసలూ అందుకుంది. దీనిపై సంస్థ సీఈఓ శ్రేయాన్స్‌... ‘సాక్షి’ స్టార్టప్‌ డైరీతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...
నేను, నా స్నేహితుడు రమేష్‌ ధామి ఇద్దరం మారథాన్‌ రన్నర్లమే. ప్రాక్టీస్‌లో, పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనే వాళ్లం. కాకపోతే నెలకు రెండు మూడు జతల బూట్లు పాడైపోయేవి. ఖరీదైన బూట్లను అలా ఊరికే బయట పారేసే బదులు ఎవరైనా కాస్త రీ ఫర్నిష్‌ చేసి తిరిగి వాడుకుంటే బాగుంటుంది కదా అనిపించేది. ఈ ఆలోచనే గ్రీన్‌సోల్‌కు బీజం వేసింది. 2014లో రూ.10 లక్షల పెట్టుబడితో ముంబయి కేంద్రంగా గ్రీన్‌సోల్‌ సంస్థను ప్రారంభించాం. జనం వాడి పడేసే బూట్లను సేకరించి మరమ్మతు చేసి విరాళంగా అందించడం, ఇంకాస్త ఫ్యాషన్‌గా తయారు చేసి విక్రయించటం మా పని.
కార్పొరేట్స్, వ్యక్తిగత విరాళాలు..
వ్యక్తులు లేదా కార్పొరేట్‌ సంస్థలు ఎవరైనా సరే... పాత బూట్లు, చెప్పులు, సోల్, లేసులను విరాళంగా అందించవచ్చు. షూ మరమ్మతు కోసం అయ్యే ఖర్చు కూడా దాతే ఇవ్వాలి. ఒక్కో జతకు రూ.199 అందించాల్సి ఉంటుంది. బూట్ల సేకరణ కోసం దేశంలో 4 వేల కేంద్రాలున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 15 పాయింట్లున్నాయి. గతేడాది లక్ష జతల బూట్లను, రూ.20 కోట్లను విరాళంగా సమీకరించాం. టాటా, రోల్స్‌ రాయిస్, ల్యాండ్‌ రోవర్, ఎల్‌ అండ్‌ టీ, వివంత, నాప్‌టోల్, జస్ట్‌ డయల్, యాక్సిస్‌ బ్యాంక్, సిగ్నా టీటీకే, మేక్‌ మై ట్రిప్‌ వంటి వందలాది కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందం కూడా చేసుకున్నాం.
గ్రీన్‌సోల్‌ చెప్పులు విరాళం, విక్రయం కూడా..
సేకరించిన బూట్లను ముంబయిలోని రీఫర్బిష్‌ కేంద్రంలో మరమ్మతు చేస్తాం. ఒక్క జత తయారు చేసేందుకు అరగంట సమయం పడుతుంది. మరమ్మతు చేసిన చెప్పులను నెలకొకసారి ఒక్కో ప్రాంతంలో చెప్పులులేని ప్రజలకు, గ్రామాల్లోని పాఠశాలలకు అందజేస్తుంటాం. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 62 వేల జతల చెప్పులను దానం చేశాం. ఏప్రిల్‌లో ఏపీ, తెలంగాణల్లో 4 వేల జతల బూట్లను విద్యార్థులకు అందజేశాం. వీటిని అడిడాస్‌ కంపెనీ స్పాన్సర్‌ చేసింది. వచ్చే వారం ఒరిస్సాలో 4,500 జతల చెప్పులను విరాళంగా అందించనున్నాం.
ఆన్‌లైన్‌లో కొనుగోలు కూడా..
గ్రీన్‌సోల్‌ కంపెనీ నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు తదితర ఖర్చుల కోసం కొన్ని రకాల ఫ్యాషన్‌ చెప్పులను కూడా తయారు చేస్తాం. వీటి విక్రయాల ద్వారా వచ్చే సొమ్మును నిర్వహణ ఖర్చులుగా వినియోగిస్తుంటాం. ప్రస్తుతానికైతే ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే అమ్మకాలు చేపడుతున్నాం. డిజైన్‌ను బట్టి వీటి ధర రూ.600–1,200గా ఉంటుంది. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.10 లక్షల వ్యాపారాన్ని చేశాం. ఈ ఏడాది రూ.20 లక్షల టర్నోవర్‌ను లక్ష్యించాం.
జనవరి నుంచి విపణిలోకి గ్రీన్‌సోల్‌ చెప్పులు..
జనవరి నుంచి రిటైల్, హోల్‌సేల్‌లోనూ గ్రీన్‌సోల్‌ పాదరక్షలను విక్రయించాలని నిర్ణయించాం. ఇందుకోసం స్థానిక రిటైల్‌ స్టోర్లతో చర్చలు జరుపుతున్నాం. ప్రస్తుతం ముంౖబయిలో గిడ్డంగి ఉంది. ఫిబ్రవరిలో టాటా సహకారంతో జంషెడ్‌పూర్, ఢిల్లీల్లో 1,400 చ.అ.లో రెండు గిడ్డంగులను ప్రారంభించనున్నాం. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో రూ.10 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పలువురు పీఈ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నాం.
 



You may be interested

ప్రభుత్వం చేతికి యూనిటెక్‌ పగ్గాలు

Friday 8th December 2017

 కంపెనీ డైరెక్టర్లను సస్పెండ్ చేసిన ఎన్‌సీఎల్‌టీ 10 మంది డైరెక్టర్లను నామినేట్ చేయాలని ఎంసీఏకి ఆదేశాలు   ఈ నెల 20న తదుపరి విచారణ న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో ఇరుక్కుపోయిన రియల్టీ దిగ్గజం యూనిటెక్‌కి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) గట్టి షాకిచ్చింది. నిధుల స్వాహా, నిర్వహణ లోపాల అభియోగాలపై యూనిటెక్ బోర్డులోని మొత్తం ఎనిమిది మంది డైరెక్టర్లను సస్పెండ్ చేసింది. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం కొత్తగా పది మంది డైరెక్టర్లను నామినేట్

సెన్సెక్స్‌ మరో ‘‘ట్రిపుల్‌’’ ధమాకా..!

Friday 8th December 2017

నిఫ్టీ 10250 పాయింట్ల పైకి..! ముంబై:- వరుసగా రెండో రోజు మార్కెట్‌ భారీ లాభాలతో ముగిసింది. శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభం నుం‍చి ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావం తోడు అవ్వడంతో ట్రేడింగ్‌ ఆద్యంతమూ సూచీలు పటిష్ట లాభాలతో కదలాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి కీలక సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 301 పాయింట్లు లాభపడి 33,250.30 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 98.95 పాయింట్లు లాభపడి 10,265.65

Most from this category