STOCKS

News


 అర్ధరాత్రి... హలో పిల్లల డాక్టర్‌!!

Friday 4th August 2017
startups_main1501869508.png-6510

  •  ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ సేవలందిస్తున్న డాక్స్‌ యాప్‌
  •  40 శాతం కన్సల్టేషన్స్‌ తృతీయ శ్రేణి పట్టణాల నుంచే
  •  15 విభాగాల్లో.. 1,500 మంది వైద్యులు నమోదు
  •  నెలకు 50 వేల కన్సల్టేషన్స్‌; 22–25 శాతం ఆదాయ వృద్ధి
  •  ‘స్టార్టప్‌ డైరీ’తో సంస్థ సీఈఓ అండ్‌ కో–ఫౌండర్‌ సతీష్‌ కన్నన్‌ 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  చిన్న పిల్లలు అర్ధరాత్రి ఏడిస్తే...? ఎందుకు ఏడుస్తున్నారన్నది తల్లిదండ్రులకు అర్థంకాదు! ఓదార్చడానికి ప్రయత్నించినా విఫలమవుతుంటారు. పోనీ, పిల్లల డాక్టర్‌ను సంప్రదిద్దామంటే అర్ధరాత్రి డాక్టర్లెవరూ అందుబాటులో ఉండరు. దీనికి పరిష్కారం చూపిస్తోంది డాక్స్‌యాప్‌. దేశంలోనే తొలిసారిగా రాత్రిపూట పీడియాట్రిషన్‌ సేవలందిస్తోంది. 10 నిమిషాల్లోపే వైద్యులతో మాట్లాడే వీలు కల్పిస్తోందీ సంస్థ. మరిన్ని వివరాలు డాక్స్‌యాప్‌ కో–ఫౌండర్‌ అండ్‌ సీఈఓ సతీష్‌ కన్నన్‌ మాటల్లోనే...
ఐఐటీ మద్రాస్‌ నుంచి ఇంజనీరింగ్‌ పూర్తి చేశాక ఫిలిప్స్‌ హెల్త్‌కేర్‌ విభాగంలో, స్నేహితుడు ఎన్బశేఖర్‌ దీనదయాళ్‌ మరో హెల్త్‌కేర్‌లో జాబ్స్‌లో చేరాం. ఆ సమయంలో మేం గమనించిందేంటంటే.. స్పెషలిస్ట్‌ వైద్యులు మెట్రో నగరాలకే పరిమితమవుతున్నారు. దీంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని పేషెంట్లకు మెరుగైన చికిత్స అందట్లేదని! వీరు కూడా స్పెషలిస్ట్‌ వైద్యుల చికిత్సను పొందాలంటే ఇంటర్నెట్‌ను వేదికగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. స్పెషలిస్ట్‌ వైద్యులు, పేషెంట్లను ఒకే వేదిక మీదికి తీసుకొస్తే పరిష్కారం దొరికినట్టేనని నిర్ణయించుకున్నాం. అలా 2015లో ఇద్దరం కలిసి డాక్స్‌యాప్‌కు శ్రీకారం చుట్టాం. డాక్స్‌యాప్‌ అనేది చాట్‌ లేదా కాల్‌ ఆధారిత ఆరోగ్య వేదిక. ఎవరైనా సరే దేశంలోని ఏ డాక్టర్‌నైనా 30 నిమిషాల్లోపే సంప్రతించవచ్చు. మాకొస్తున్న కాల్స్‌లో 35–40 శాతం కాల్స్‌ పిల్లల గురించే ఉంటున్నాయి. అవి కూడా రాత్రి 10–12 మధ్యే ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే ఇటీవలే రాత్రి సమయాల్లో పీడియాట్రిషన్‌ సేవలందించాలని నిర్ణయించాం.  
15 విభాగాల్లో.. 1,500 మంది వైద్యులు..
గైనకాలజీ, సైక్రియాట్రిక్‌, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కార్డియాలజీ, అంకాలజీ, న్యూరాలజీ, ఇన్ఫెర్టిలిటీ, పీడియాట్రిషన్, డెర్మటాలజీ, జనరల్‌ మెడిసిన్, ఆర్థోపెడిక్, న్యూరోసర్జరీ వంటి 15 విభాగాల్లో 1,500 మంది వైద్యులున్నారు. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 150 మంది డాక్టర్లు నమోదయ్యారు. ప్రస్తుతం 10 లక్షల మంది యూజర్లున్నారు. 
డాక్టర్‌ కన్సల్టేషన్‌ నుంచి మందుల డెలివరీ వరకూ..
డాక్స్‌యాప్‌ ప్రధానంగా 3 రకాల సేవలందిస్తుంది. కన్సల్టేషన్, మందుల డెలివరీ, ఇంటి వద్దనే ల్యాబ్‌ టెస్ట్‌లు. ఆయా విభాగంలో సేవల రకాన్ని బట్టి 20–30 శాతం వరకు కమీషన్‌ తీసుకుంటాం. ప్రస్తుతం నెలకు 50 వేల మంది పేషెంట్లు డాక్టర్‌ కన్సల్టేషన్‌ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇందులో ఏపీ, తెలంగాణ వాటా 10 శాతముంటుంది. మెడిసిన్‌ డెలివరీ, ల్యాబ్‌ టెస్ట్‌ సేవలను నెలకు 10 వేల వరకు వినియోగించుకుంటున్నారు. ఇందులో 15 శాతం వాటా రెండు తెలుగు రాష్ట్రాలది ఉంటుంది. కాకినాడ, భువనగిరి, బాన్స్‌వాడ వంటి పట్టణాల నుంచి పేషెంట్లు  హైదరాబాద్, ముంబై, ఢిల్లీలోని వైద్యులతో మాట్లాడుతున్నారు.
రూ.14 కోట్ల నిధుల సమీకరణ..
ఇప్పటివరకు రూ.14 కోట్ల నిధులను సమీకరించాం. మరో 7 నెలల్లో మరో రౌండ్‌ నిధులను సమీకరించాలని నిర్ణయించాం. ఫేస్‌బుక్‌లో ఏంజిల్‌ ఇన్వెస్టరైన ఆనంద్‌ రాజమన్, వెంకీ హరినారాయణన్, జపన్‌కు చెందిన రీబ్రైట్‌ పార్టనర్స్, పేటీఎం సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ, షాదీ.కామ్‌ సీఈఓ అనుపమ్‌ మిట్టల్‌లు ఈ పెట్టుబడులు పెట్టారు. ‘‘మా సంస్థలో 70 మంది ఉద్యోగులున్నారు. వచ్చే 6 నెలల్లో వీరిని రెట్టింపు చేస్తాం. నెలకు 3 లక్షల కన్సల్టేషన్లను అందించాలని లక్ష్యించాం. ప్రతి నెలా 22–25 శాతం ఆదాయ వృద్ధిని సాధిస్తున్నాం. పీడియాట్రిషన్‌ సేవల్లాగే గైనకాలజీ వంటి ఇతరత్రా స్త్రీ ఆరోగ్య సేవలనూ అర్ధరాత్రి సమయాల్లో అందించాలని నిర్ణయించాం. మరో 3 నెలల్లో ప్రారంభిస్తాం... అని సతీష్‌ వివరించారు.
 
 You may be interested

29 శాతం పెరిగిన ఆంధ్రాబ్యాంకు లాభం

Friday 4th August 2017

6.21 నుంచి 8.09 శాతానికి చేరిన ఎన్‌పీఏలు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: బ్యాంకింగ్‌ రంగంలో ఉన్న ఆంధ్రాబ్యాంకు జూన్‌ త్రైమాసికంలో ఉత్తమ ఫలితాలను నమోదు చేసింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో నికరలాభం 29 శాతం అధికమై రూ.40 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.4,855 కోట్ల నుంచి రూ.5,155 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 13.55 శాతం పెరిగి రూ.1,441 కోట్లకు చేరుకుంది. మొత్తం డిపాజిట్లు 5.61

రికార్డు స్థాయికి ఫారెక్స్‌ నిల్వలు

Friday 4th August 2017

జూలై 28 నాటికి 392.86 బిలియన్‌ డాలర్లకు అప్‌... ముంబై: భారత్‌ విదేశీ మారకద్రవ్య (పారెక్స్‌) నిల్వలు జూలై 28వ తేదీతో ముగిసిన వారంలో రికార్డు స్థాయిని నమోదుచేసుకున్నాయి. ఈ వారంలో నిల్వలు 1.536 బిలియన్లు పెరిగి గరిష్ట స్థాయి 392.867 బిలియన్‌ డాలర్లకు చేరాయి. నిల్వల పరిస్థితి వేర్వేరుగా చూస్తే...   మొత్తం నిల్వల్లో డాలర్ల విలువలో పేర్కొనే ‘ఎఫ్‌సీఏ’ (ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌) నిల్వలు 1.609 బిలియన్‌ డాలర్లు పెరిగి, 368.759

Most from this category