STOCKS

News


గ్రామీణ బ్యాంకులపై ప్రై‘వేటు’!

Tuesday 13th March 2018
news_main1520961618.png-14643

  •  ప్రైవేటీకరణ దిశగా కేంద్రం సన్నాహాలు...
  •  ప్రైవేటు సంస్థలకు నేరుగా వాటా విక్రయం..!
  •  వాటాకు అనుగుణంగా బోర్డ్‌ మెంబర్లలో సభ్యత్వం కూడా..
  •  పబ్లిక్‌ ఇష్యూలకు సైతం సన్నాహాలు...
  •  వాటాలను పూర్తిగా కోల్పోనున్న రాష్ట్ర ప్రభుత్వాలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం చకచకా పావులు కదుపుతోంది. ఈ ప్రక్రియను ముందుగా గ్రామీణ బ్యాంకులతో మొదలుపెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల్లో 49 శాతం వరకూ వాటాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. అంతేకాకుండా 3-4 నెలల్లో ప్రారంభ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ) ద్వారా స్టాక్‌ మార్కెట్ల నుంచి నిధులను సమీకరించనున్నామని.. దీనికి సిద్ధంగా ఉండాలని గ్రామీణ బ్యాంకులకు నాబార్డ్‌ ఉత్తర్వులను కూడా జారీచేయడం గమనార్హం. అయితే, ఈ ప్రైవేటీకరణపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ చర్యలతో గ్రామీణ బ్యాంకుల ఏర్పాటు ఉద్దేశం, లక్ష్యం నీరుగారడం ఖాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిన్న, సన్నకారు రైతులు, చేతివృత్తులు, దారిద్ర రేఖకు దిగువనున్న ప్రజలకు బ్యాంక్‌ సేవలు అందించడమే లక్ష్యంగా గ్రామీణ బ్యాంక్‌లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ (ఏపీజీవీబీ), తెలంగాణ (టీజీబీ), ఆంధ్ర ప్రగతి (ఏపీజీబీ), చైతన్య గోదావరి (సీజీజీబీ), సప్తగిరి (ఎస్‌జీబీ) గ్రామీణ బ్యాంక్‌లున్నాయి. వీటికి 2,160 బ్రాంచీలున్నాయి. ఇందులో తెలంగాణలో 960 శాఖలు, మిగిలినవి ఏపీలో ఉంటాయి. ఏపీజీవీబీ, టీజీబీలకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), ఏపీజీబీకి సిండికేట్‌ బ్యాంక్, సీజీజీబీకి ఆంధ్రా బ్యాంక్, ఎస్‌జీబీకి ఇండియన్‌ బ్యాంక్‌లు స్పాన్సర్‌ బ్యాంక్‌లుగా వ్యవహరిస్తున్నాయి. గ్రామీణ బ్యాంక్‌ల్లో కేంద్రం 50 శాతం, స్పాన్సర్‌ బ్యాంక్‌లు 35 శాతం, ఆయా రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం వాటాలు కలిగి ఉంటాయి.
రాష్ట్ర ప్రభుత్వాల వాటా గోవిందా..
దారిద్ర్య రేఖకు దిగువనున్న వారికి కూడా బ్యాంకింగ్‌ సేవలందాలన్న లక్ష్యాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరిట నీరుగారుస్తుందని తెలంగాణ రీజినల్‌ రూరల్‌ బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఏపీఆర్‌ఆర్‌బీఈఏ) జనరల్‌ సెక్రటరీ ఎస్‌.వెంకటేశ్వర్‌ రెడ్డి ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’కు తెలిపారు. 49 శాతం వరకు వాటాను ప్రైవేట్‌ వ్యక్తులు లేదా సంస్థలు కొనుగోలు చేసే వీలు కల్పిస్తూ చట్ట సవరణ కూడా చేశారు. పైగా వాటా విక్రయం తర్వాత కేంద్రం, స్పాన్సర్‌ బ్యాంక్‌ల వాటా 51 శాతానికి తగ్గకూడదనే నిబంధనను పెట్టారు. అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడున్న 15 శాతం వాటా చేజారుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండే ఏకైక వాణిజ్య బ్యాంక్‌లు గ్రామీణ బ్యాంక్‌లే. కానీ, ఈ ప్రైవేటీకరణతో రాష్ట్రాలకు ప్రాతినిథ్యం లేకుండా పోతుందని బ్యాంకింగ్‌ వర్గాలు హెచ్చరిస్తున్నారు.
రుణ, పొదుపు నిష్పత్తి ఇక్కడే సరిసమానం..
ఏపీ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ల్లో 8,600 మంది ఉద్యోగులున్నారు. వీళ్లే కాకుండా 2,400 దినసరి కూలీలు పనిచేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో  గ్రామీణ బ్యాంక్‌ల్లో 1.1 కోట్ల మంది ఖాతాదారులుంటారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలతో పోల్చినా గ్రామీణ బ్యాంక్‌ల రుణ, పొదుపు నిష్పత్తి దక్షిణాది రాష్ట్రాల్లో సరిసమానంగా, ఉత్తరాదిలో 40–45 శాతం వరకుంటుందని వెంకటేశ్వర్‌ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డిపాజిట్లు, రుణం రెండూ సమానంగానే ఉంటాయి. ఏపీ, తెలంగాణల్లో రూ.33 వేల కోట్ల డిపాజిట్లుంటే రుణాలు రూ.33–34 వేల కోట్లుగా ఉన్నట్లు ఆయన వివరించారు.
 
ఏపీజీవీబీ ఐపీఓకు ఎస్‌బీఐ సన్నాహాలు..
లాభాల్లో ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో వాటాలను కొనుగోలు చేసేందుకు సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్‌ఐ), బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. కేరళ గ్రామీణ బ్యాంక్‌లో ముత్తూట్‌ ఫైనాన్స్‌ కొంత వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (ఏపీజీవీబీ) ఐపీఓ ద్వారా సుమారు రూ.800 కోట్ల సమీకరించేందుకు ఎస్‌బీఐ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
వాటాలను బట్టి బోర్డు మెంబర్ల సంఖ్య..
ప్రస్తుతం గ్రామీణ బ్యాంక్‌ల్లో 9 మంది చొప్పున బోర్డ్‌ మెంబర్లు ఉన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇద్దరేసి, స్పాన్సర్‌ బ్యాంక్‌ల నుంచి ముగ్గురు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), నాబార్డ్‌ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉంటారు. అయితే నిధుల సమీకరణలో 10 శాతం వాటాను కొనుగోలు చేసిన ప్రైవేటు కంపెనీలకు నుంచి బోర్డ్‌ మెంబర్లలో ఒకరికి, 10–25 శాతం వరకు కొనుగోలు చేస్తే ఇద్దరు, 25 శాతం పైనైతే ముగ్గురు సభ్యులు బోర్డ్‌ మెంబర్లలో చేరే వీలు కల్పించారు.
 
50 బ్యాంక్‌లూ లాభాల్లోనే..
దేశంలో ఉన్న మొత్తం 56 గ్రామీణ బ్యాంక్‌లకు గాను 50 బ్యాంక్‌లు లాభాల్లోనే ఉన్నాయి. కశ్మీర్‌లోని ఇలాఖీ దెహతీ (ఈడీ), నాగాలాండ్, మణిపూర్‌ గ్రామీణ బ్యాంక్‌లు, బెంగాల్‌లోని భంగియ గ్రామీణ వికాస్‌ (బీజీవీబీ), మధ్యప్రదేశ్‌లోని మధ్యాంచల్‌ గ్రామీణ బ్యాంక్, ఒడిశాలోని ఉత్కల్‌ గ్రామీణ బ్యాంక్‌లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. 50 బ్యాంక్‌లు కలిపి రూ.4,096 కోట్ల స్థూల లాభాలు చూపించాయి. రూ.2,573 కోట్ల నికర లాభాలను ఆర్జించాయి. వివిధ పన్నుల రూపంలో రూ.1,414 కోట్లు చెల్లించాయి.
 
దేశంలో గ్రామీణ బ్యాంక్‌ల ముఖ చిత్రమిది:
♦ మొత్తం బ్యాంక్‌లు: 56
♦ బ్రాంచీలు: 21,398
♦ ఖాతాలు: 23 కోట్లు
♦ డిపాజిట్లు: రూ.3.72 లక్షల కోట్లు
♦ రుణాలు: 2.28 లక్షల కోట్లు
♦ రిజర్వ్‌ నిధులు: రూ.23 వేల కోట్లు
♦ నికర ఎన్‌పీఏ: 4.41 శాతం
♦ మొత్తం ఉద్యోగులు: 86,555
 You may be interested

టీసీఎస్‌ షేర్లు విక్రయించిన టాటా సన్స్‌

Tuesday 13th March 2018

3.12 కోట్ల షేర్ల అమ్మకం విక్రయ విలువ రూ.9,000 కోట్లు !  న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌)లో 1.63 శాతానికి సమానమైన షేర్లను ప్రమోటర్‌ సంస్థ టాటా సన్స్‌ విక్రయించింది. బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఈ షేర్ల విక్రయం జరిగింది.  ఈ షేర్ల విక్రయ విలువ దాదాపు రూ.9,000 కోట్లు. ఎన్‌ఎస్‌ఈ బల్క్‌డీల్‌ డేటా ప్రకారం 2.06 కోట్ల షేర్లను రూ.2,876 ధరకు, 1.06 కోట్ల షేర్లను రూ.2,872 ధరకు విక్రయించారు. మొత్తం

2018లో రేటు పెరుగుదల లేనట్లే!

Tuesday 13th March 2018

 విశ్లేషకుల అభిప్రాయం ముంబై: ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, 2018లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు- రెపో (ప్రస్తుతం 6 శాతం)ను తగ్గించే అవకాశాలు కనిపించడం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు.  ♦ బడ్జెట్‌లో ఆహార ధాన్యాలకు కనీస మద్దతు ధర పెంపు (ఎంఎస్‌పీ)- ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2018-19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే అవకాశం ఉందని జపాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ- నొమురా అభిప్రాయపడింది.  ♦ పారిశ్రామిక వృద్ధి రేటు

Most from this category