News


ఎగసిన వాణిజ్య లోటు

Thursday 16th May 2019
news_main1557991322.png-25767

  • 5 నెలల గరిష్టానికి చేరిక
  •  ఏప్రిల్‌లో వృద్ధి 4 నెలల కనిష్ఠం
  • గణనీయంగా తగ్గిన ఎగుమతులు
  • 4.5 శాతం పెరిగిన దిగుమతులు
  • భారీగా చమురు, పసిడి దిగుమతులు

న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ ఉత్పత్తులు, వజ్రాభరణాలు, లెదర్ ఉత్పత్తులు మొదలైన వాటి ఎగుమతులు గత నెల గణనీయంగా తగ్గాయి. దీంతో ఏప్రిల్‌లో ఎగుమతుల వృద్ధి 0.64 శాతానికి పరిమితమైంది. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. చివరిసారిగా 2018 డిసెంబర్‌లో ఎగుమతుల వృద్ధి అత్యల్పంగా 0.34 శాతంగా నమోదైంది. ఫలితంగా వాణిజ్య లోటు అయిదు నెలల గరిష్టానికి ఎగిసింది. బుధవారం విడుదలైన వాణిజ్య గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మరోవైపు దిగుమతులు 4.5 శాతం పెరిగాయి. ఇది గత ఆరు నెలల్లో అత్యధికం. క్రూడాయిల్‌, బంగారం దిగుమతులు గత నెలలో ఎగియడమే ఇందుకు కారణం. వ్యాపార ఉత్పత్తుల ఎగుమతులు ఏప్రిల్‌లో 26 బిలియన్లుగా ఉండగా.. దిగుమతుల పరిమాణం 41.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దీంతో వాణిజ్య లోటు 15.33 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2018 నవంబర్ తర్వాత వాణిజ్య లోటు ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. 
కీలక రంగాల తగ్గుదల...
ఇంజినీరింగ్‌, వజ్రాభరణాలు, లెదర్‌, కార్పెట్‌, ప్లాస్టిక్, మెరైన్ ఉత్పత్తులు, ధాన్యం, కాఫీ తదితర విభాగాల్లో ప్రతికూల వృద్ధి నమోదైంది. దీంతో వ్యాపార ఉత్పత్తుల ఎగుమతులు ఏప్రిల్‌లో తగ్గాయి.  చమురు దిగుమతులు 9.26 శాతం పెరిగి 11.38 బిలియన్ డాలర్లకు చేరాయి. చమురుయేతర దిగుమతులు 2.78 శాతం పెరిగాయి. బంగారం దిగుమతులు 54 శాతం ఎగిసి 3.97 బిలియన్ డాలర్లకు చేరాయి. ‍అయితే, తాజాగా పెట్రోలియం, చేతివృత్తులు, రెడీమేడ్ దుస్తులు, ఫార్మా రంగాల ఎగుమతులు మాత‍్రం సానుకూల వృద్ధి నమోదు చేశాయి. 
నిరాశపర్చే గణాంకాలు...
ఏప్రిల్‌లో ఎగుమతుల వృద్ధి అంత ఆశావహంగా లేదని వాణిజ్య ప్రోత్సాహక మండలి (టీపీసీఐ) చైర్మన్ మోహిత్ సింగ్లా చెప్పారు. అయితే, సానుకూల ధోరణి కొనసాగించగలిగామని ఆయన పేర్కొన్నారు. టీ, సుగంధ ద్రవ్యాలు, ఫలాలు, కూరగాయలు వంటి వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల్లో సానుకూలత కనిపించినట్లు చెప్పారు. కార్మిక శక్తి అత్యధికంగా ఉండే అన్ని రంగాలు ప్రతికూల పరిస్థితుల్లోనే ఉండటంతో ఎగుమతుల గణాంకాలు నిరాశపర్చేవిగా ఉన్నాయని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) ప్రెసిడెంట్ గణేష్ కుమార్ గుప్తా చెప్పారు. "నిధుల కొరతతో పాటు అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలు, రక్షణాత్మక ధోరణులు, ప్రపంచవ్యాప్తంగా బలహీన వ్యాపార పరిస్థితులు, దేశీయంగా అనేక పరిమితులు తదితర అంశాల కారణంగా ఈ రంగాలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి" అని ఆయన పేర్కొన్నారు. ఒక వైపు చమురు ధరలు పెరుగుతుండటం, మరోవైపు ఇరాన్ నుంచి దిగుమతులపై ఆంక్షల నేపథ్యంలో పసిడి, చమురు దిగుమతుల భారం ఎగుస్తుండటంతో వాణిజ్య లోటు మరింత పెరుగుతుండటంపై గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధాల భయాలతో అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితులు మరింతగా దిగజారవచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో రాబోయే రోజుల్లో భారత ఎగుమతులపై మరింత ఒత్తిడి పెరగవచ్చన్నారు. 



You may be interested

అమ్మకానికి తొలి యాపిల్ కంప్యూటర్‌

Thursday 16th May 2019

మే 16న ఆన్‌లైన్‌లో వేలం ప్రారంభం ధర రూ.2.81- 4.56 కోట్ల దాకా అంచనా న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ తొలినాళ్లలో తయారు చేసిన కంప్యూటరు అమ్మకానికి వస్తోంది. మే 16 నుంచి 24 దాకా ఆన్‌లైన్‌లో నిర్వహించే వేలంలో క్రిస్టీస్‌ సంస్థ దీన్ని విక్రయిస్తోంది. దీని ధర 4,00,000- 6,50,000 డాలర్ల దాకా (సుమారు రూ. 2.81 కోట్ల నుంచి రూ. 4.56 కోట్ల దాకా) పలకవచ్చని అంచనా వేస్తున్నారు. 1976లో

1300డాలర్ల దిగువనే పసిడి

Thursday 16th May 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1300డాలర్ల దిగువను స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి అరశాతం స్వల్పనష్టంతో 1,297.45డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా వాణిజ్య యుద్ధంలో భాగంగా చైనా టెలికాం దిగ్గజం హువాయి కంపెనీపై సుంకాన్ని విధించింది. దీంతో అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు ఆశలు సన్నగిల్లాయి. ఈక్విటీ మార్కెట్లో అంతర్లీనంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులు పసిడి ర్యాలీకి సహకరిస్తాయి. స్వల్పకాలంలో

Most from this category