STOCKS

News


రెరా ఫలాలు 2020 తర్వాతే!

Saturday 10th November 2018
personal-finance_main1541830318.png-21860

సాక్షి, హైదరాబాద్‌: మొక్క నాటగానే రాత్రికి రాత్రే చెట్టుగా పెరిగి.. ఫలాలను ఇవ్వదు. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కూడా అంతే! ప్రస్తుతం దేశంలో రెరా శైశవ దశలో ఉంది. దాని ప్రయోజనాలు పొందాలంటే రెండేళ్ల వరకూ వేచి ఉండాల్సి వస్తుంది. నిర్మాణంలో నాణ్యతతో మొదలుకుంటే గడువులోగా ప్రాజెక్ట్‌ల పూర్తి, లావాదేవీల్లో పారదర్శకత, వాస్తవ వసతుల అభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడులు.. వంటివి రెరాతో సులభమవుతాయి. 2020 తొలి త్రైమాసికం నుంచి దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది.
ఏ పరిశ్రమకైనా నియంత్రణ వ్యవస్థ అనేది అత్యవసరం. బ్యాంక్‌లకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), మార్కెట్లకు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్చ్సేంజ్‌ బోర్డ్‌ (సెబీ), బీమా పరిశ్రమకు ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ (ఐఆర్‌డీఏ).. ఎలాగో! రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమకు రెరా కూడా అంతే!! రెరా కారణంగా 2–3 ఏళ్ల వరకూ కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభాలు, భారీ ప్రాజెక్ట్‌లు సప్లయి తక్కువగా ఉంటుంది. నిర్మాణ రంగం ఎదుర్కొనే చాలా సమస్యలకు శాశ్వత పరిష్కారం రెరాతో లభిస్తుందని కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) నేషనల్‌ ప్రెసిడెంట్‌ జక్సే షా తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన సందర్భగా జక్సే షా ‘సాక్షి రియల్టీ’తో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
గృహాలపై ఎన్నికల ప్రభావం ఉండదు..
సాధారణంగా ఎన్నికల సమయంలో 3 నెలల పాటు ప్రతికూల వాతావరణం ఉండటం సహజం. అయితే ఇది కేవలం ఆఫీస్, రిటైల్‌ విభాగాలకే పరిమితమవుతుంది. ఎందుకంటే నివాస విభాగంలో ఇన్వెస్టర్ల కంటే వాస్తవ గృహ కొనుగోలుదారులే ఎక్కువగా ఉంటారు. వీరికి ఎన్నికలు, ఇతరత్రా రాజకీయాంశాలతో సంబంధం ఉండదు. నిజం చెప్పాలంటే ఇలాంటి సమయంలోనే గృహ కొనుగోళ్లు ఎక్కువగా జరుపుతుంటారు. ఎందుకంటే? నగదు రాయితీలు, ఇతరత్రా ప్రోత్సాహకాలతో కొనుగోలుదారులను ఆకర్షిస్తుంటారు కాబట్టి! అదే ఆఫీస్, రిటైల్‌ విభాగాలు ఇన్వెస్టర్లతో అనుసంధానమై ఉంటాయి. కొత్త ప్రభుత్వ ఏర్పడితే నిబంధనలు, నిర్ణయాలు ఎలా ఉంటాయోనని ఎన్నికల సమయంలో వేచి చూసే ధోరణిలో ఉంటారు.
50 శాతం ల్యాండ్‌ అబాండ్‌మెంట్‌..
మెట్రో నగరాల్లో ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయంలో భూమి ధరే 50 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ల్యాండ్‌ అబాండ్‌మెంట్‌ 33 శాతం మాత్రమే ఇవ్వటం సరైంది కాదు. దీన్ని 50 శాతానికి పెంచాలి. లేకపోతే ఇతర నగరాల్లోని కొనుగోలుదారులతో పోలిస్తే మెట్రో నగరాల్లోని కొనుగోలుదారులు 3–4 శాతం జీఎస్‌టీ ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వ్యయం, స్థలాల ధరలను నియంత్రించడం మినహా తగ్గించలేం. ఇందుకోసం స్థల, పన్ను సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటూ నెలవారీ చెల్లింపులు (ఈఎంఐ) కాలపరిమితిని పెంచాల్సిన అవసరముంది.
తెలంగాణలో 1,94,602; ఏపీలో 9,21,877 గృహాలు
మనిషి అత్యవసరాల్లో ఒకటి సొంతిల్లు. కానీ, ఆశించిన స్థాయిలో దేశంలో ఎకనామికల్లీ వీకర్స్‌ సెక్షన్‌ (ఈడబ్ల్యూఎస్‌), లో ఇన్‌కం గ్రూప్‌ (ఎల్‌ఐజీ), మిడిల్‌ ఇన్‌కం గ్రూప్‌ (ఎంఐజీ) గృహాల సరఫరా లేదు. అందుకే ప్రధాన్‌మంతి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) పథకంలో క్రెడాయ్‌ భాగస్వామ్యమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి 60,36,220 పీఎంఏవై గృహాలు మంజూరు కాగా.. ఇందులో 9,66,236 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 31,79,440 యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని గణాంకాలను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 9,21,877 గృహాలు మంజూరయ్యాయి. 1,08,643 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా.. 6,21,475 గృహాలు నిర్మాణంలో ఉన్నాయి. తెలంగాణలో 1,94,602 మంజూరయ్యాయి. 15,170 యూనిట్ల నిర్మాణం పూర్తి కాగా.. 1,50,865 గృహాలు నిర్మాణంలో ఉన్నాయి.
భవిష్యత్తు కో–వర్కింగ్, వేర్‌హౌస్‌లదే..
దేశంలో ఐటీ, ఐటీఈఎస్, బ్యాంకింగ్‌ రంగ కంపెనీల్లో టెక్నాలజీ వినియోగం పెరిగింది. చాలా వరకు సంస్థలు తక్కువ స్పేస్‌లో ఆఫీసులను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో సాధారణ ఆఫీసు స్పేస్‌ గిరాకీ తగ్గింది. స్టార్టప్స్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రవేశంతో కో–వర్కింగ్‌ స్పేస్, ఈ–కామర్స్‌ కంపెనీలతో గిడ్డంగులకు డిమాండ్‌ బాగా పెరిగింది. రానున్న రోజుల్లో కో–వర్కింగ్, గిడ్డంగి విభాగాలకు మంచి భవిష్యత్తు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల కార్మికుల్లో నైపుణ్యం కొరత..
ప్రస్తుతం క్రెడాయ్‌కు 28 రాష్ట్రాల్లో 204 చాప్టర్లున్నాయి. 12 వేల మంది సభ్యులున్నారు. ఏప్రిల్‌ నాటికి 300 చాప్టర్లకు విస్తరించాలని లక్ష్యించాం. గుజరాత్, కేరళ, మహారాష్ట్రలతో పోలిస్తే ఏపీ, తెలంగాణల్లోని నిర్మాణ కార్మికుల్లో నైపుణ్యం తక్కువగా ఉంది. త్వరలోనే ఆయా రాష్ట్రాల్లోని క్రెడాయ్‌ సంఘాలతో కలిసి లేబర్లకు నైపుణ్య శిక్షణ శిబిరాలను ప్రారంభించనున్నాం. క్రెడాయ్‌ ఆధ్వర్యంలో రెరా కన్జ్యూమర్‌ రిడ్రెసల్‌ ఫోరంను కూడా ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 98 వేల రెరా కేసులను పరిష్కరించాం.
హైదరాబాద్‌ రియల్టీలోకి సావీ..
అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్టీ సంస్థ సావీ గ్రూప్‌ హైదరాబాద్‌ రియల్టీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఏడాది కాలంలో నగరానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి గోల్ఫ్‌ కోర్ట్‌ లేదా టౌన్‌షిప్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తామని సావీ గ్రూప్‌ ఎండీ జక్సే షా ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. స్థానిక ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలు, ప్రోత్సాహాలతో దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్‌ మార్కెట్‌కు మంచి అవకాశాలున్నాయని.. అందుకే భాగ్యనగరంలో ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. సావీ గ్రూప్‌ డైరెక్టర్లలో ఒకరే జక్సే షా.
– సావీ గ్రూప్‌ అహ్మదాబాద్‌లోని రాజ్‌పత్‌ క్లబ్‌ సమీపంలో 900 ఎకరాల్లో కెన్స్‌విల్లీ పేరిట గోల్ఫ్‌ కోర్ట్‌ను అభివృద్ధి చేసింది. దేశంలోనే అతిపెద్ద గోల్ఫ్‌ ప్రాజెక్ట్‌ ఇది. ఇందులో గోల్ఫ్‌ కోర్స్‌ పాటూ గోల్ఫ్‌ లివింగ్, గోల్ఫ్‌ అకాడమీ వంటివన్నీ ఉంటాయి. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో 25 లక్షల చ.అ.ల్లో పలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తోంది. గిఫ్ట్‌ సిటీలో ప్రాగ్యా, ఎస్‌జీ రోడ్‌లో స్ట్రాటా, సంస్కార్, స్వరాజ్‌ నిర్మాణాలు రానున్నాయి. ముంబైలో 60 ఎకరాల్లో టౌన్‌షిప్‌ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించనుంది.



You may be interested

బుల్‌ మార్కెట్‌కు ఇది ముగింపు కాదు: దమానీ

Saturday 10th November 2018

ప్రస్తుత కరెక్షన్‌లో మార్కెట్‌ తీరును గమనిస్తే... ఇది బుల్‌ మార్కెట్లో వచ్చిన విరామమే కానీ, బుల్‌ మార్కెట్‌కు ముగింపు కాదని తాను భావిస్తున్నట్టు ప్రముఖ ఇన్వెస్టర్‌ రమేష్‌ ధమానీ తెలిపారు. మార్కెట్‌ ప్రతికూల వార్తలను పట్టించుకోవడం లేదన్నారు. ఇండిగో చాలా దారుణమైన ఫలితాలను ప్రకటించినా గానీ స్టాక్‌ 25 శాతం పెరిగినట్టు దమానీ తెలిపారు. ఇది బుల్‌ మార్కెట్లోనే సాధ్యమంటూ ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.   మార్కెట్‌

ఒక్క యాప్‌ 18 రకాల సేవలు!

Saturday 10th November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫుడ్‌ ఆర్డర్‌ కోసం ఒక యాప్‌! బిల్‌ పేమెంట్స్‌ కోసం ఇంకొకటి.. ట్రావెల్, సినిమా టికెట్లకు మరొకటి.. ఇలా ప్రతి దానికో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే బదులు అన్ని రకాల సేవలకూ ఒకే యాప్‌ ఉంటే? ఇదే ఆలోచన వరంగల్‌కు చెందిన ఓ కుర్రాడికి వచ్చింది. అంతే! చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ‘పబ్బాస్‌’ పేరిట ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యాప్‌ను అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం ఏటా 18 లక్షల

Most from this category