STOCKS

News


గ్రామాల్లో ‘నయాగాడీ’

Saturday 11th August 2018
startups_main1533958169.png-19167

  •  వాహనాల డీలర్‌షిప్‌కు ప్రత్యామ్నాయం
  •  బైక్, కారు, ఆటో, ట్రాక్టర్‌ ఏదైనా కొనే వీలు
  •  వాహన రుణం, బీమా, నిర్వహణ సేవలు కూడా
  •  త్వరలో రూ.5 కోట్ల నిధుల సమీకరణ పూర్తి
  •  ‘స్టార్టప్‌ డైరీ’తో నయాగాడీ ఫౌండర్‌ బాలాజీ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టూవీలరైతే ఓకే!! కానీ ట్రాక్టర్ల వంటి భారీ వాహనాల షోరూమ్‌లు ప్రతి గ్రామంలోనూ ఉండాలంటే కష్టమే. స్థలం... పెట్టుబడి... మార్జిన్లు... ఇలాంటివన్నీ దీనిపై ప్రభావం చూపిస్తాయి. ఇదిగో... ఇలాంటి సమస్యలకు చిత్తూరు జిల్లా నగరి కుర్రాడు బాలాజీ చూపించిన పరిష్కారమే... ‘నయాగాడీ’!
కైశెట్టి బాలాజీది రైతు కుటుంబం. వ్యవసాయం కోసం ట్రాక్టర్‌ కొందామనుకున్నాడు. అడ్వాన్సు పట్టుకుని బయలుదేరాడు. అప్పుడు తెలిసింది.. వాళ్ల ఊళ్లో ట్రాక్టర్‌ షోరూమ్‌ లేదని! చిత్తూరుకు వెళ్లి కొనాలి. కంపెనీ రేటొకటైతే స్థానిక డీలర్‌ చెప్పేది మరొకటి!!. అవసరం మనది కనక చేసేదేమీ ఉండదు. డీలర్లే కాదు! వాహన రుణాలిచ్చే బ్యాంక్‌లు, బీమా కంపెనీలు, నిర్వహణ కేంద్రాలు అన్నింటికీ సమస్యే. దీనికి టెక్నాలజీతో బాలాజీ చెప్పిన సమాధానమే ‘‘నయాగాడీ’’ ఆవిష్కరించింది. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..
చిత్తూరులో డిప్లొమా పూర్తయ్యాక.. బెంగళూరులోని ఆటోమొబైల్‌ డిజైన్, సప్లయి కంపెనీ ఆస్పెక్ట్‌లో చేరా. అక్కడి నుంచి విప్రో, హెచ్‌పీ, ఐబీఎం వంటి కంపెనీల్లోనూ పనిచేశా. బహుళ జాతి ఆటో మొబైల్‌ కంపెనీల్లో 10 ఏళ్ల అనుభవం ఉంది. దీంతో 2015 సెప్టెంబర్‌లో రూ.25 లక్షల పెట్టుబడితో బెంగళూర్లో ‘నయాగాడీ.కామ్‌’ను ప్రారంభించా. స్థానికంగా ఉండే అన్ని రకాల వాహన డీలర్లతో ఒప్పందం చేసుకొని గ్రామాల్లో నయాగాడీ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాలు, ఏజెంట్లను ఏర్పాటు చేసి వాహనాలను విక్రయించడమే మా ప్రత్యేకత.
రూ.4 కోట్లు; 80 వాహనాలు..
నయాగాడీలో బైక్‌లు, ఆటోలు, కార్లు, జీపులు, ట్రాక్టర్ల వంటి అన్ని రకాల వాహనాలతో పాటూ ఎలక్ట్రిక్‌ వాహనాలనూ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం బెంగళూరు, ఒరిస్సా నగరాల్లో సేవలందిస్తున్నాం. 120 మంది వాహన డీలర్లతో ఒప్పందం చేసుకున్నాం. రుణాల కోసం క్యాపిటల్‌ ఫస్ట్, కొటక్, బీమా కోసం పాలసీబజార్, రెన్యూ, గోడిజిట్‌ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. నయాగాడీ మల్టీ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లలో వాహనాలకు సంబంధించిన బ్రోచర్లు, ఫొటోలు, ధరలు, రుణం, బీమా వంటి అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇప్పటివరకు నయాగాడీ వేదికగా రూ.4 కోట్ల విలువ చేసే 80 వాహనాలను విక్రయించాం. డీలర్‌ ధర కంటే నయాగాడీలో రూ.1,000–10,000 వరకు ధర తక్కువే ఉంటుంది. పైగా విడిభాగాలు, ఇతరత్రా ఉపకరణాలపై 20 శాతం కమీషన్‌ కూడా ఉంటుంది.
నెల రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి...
నెల రోజుల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖ, గుంటూరు ప్రాంతాల్లో నయాగాడీ కేంద్రాలను ప్రారంభించనున్నాం. ఆయా ప్రాంతాల్లో 100 మంది డీలర్లతో ఒప్పందం చేసుకున్నాం. ఏడాదిలో చెన్నై, కోచి, భువనేశ్వర్, కటక్‌ ప్రాంతాల్లో నయాగాడీ సెంటర్లను ప్రారంభిస్తాం. ఏడాదిన్నరలో దేశంలోని 30 ప్రాంతాలకు విస్తరించాలన్నది మా లక్ష్యం.
రూ.3 కోట్ల ఆర్డర్‌ బుక్‌..
ప్రతి వాహనం విక్రయంపై డీలర్‌ నుంచి 1 శాతం, బ్యాంక్‌ రుణం పొందితే బ్యాంక్‌ నుంచి 1–1.50 శాతం, బీమా కంపెనీ నుంచి 10–20 శాతం వరకు కమీషన్‌ వస్తుంది. ప్రస్తుతం రూ.3 కోట్ల ఆర్డర్‌ బుక్‌ చేతిలో ఉంది. 3 నెలల్లో టీవీఎస్, నిస్సాన్, రెనాల్ట్, మహీంద్రా వాహన సంస్థలతో ఒప్పందాలు పూర్తవుతాయి. దీంతో డీలర్లతో పాటూ నేరుగా నయాగాడీలోనూ విక్రయాలుంటాయి.
రూ.5 కోట్ల నిధుల సమీకరణ..
గతేడాది కర్నాటక ప్రభుత్వ ఎలైట్‌ 100 పోటీలో విజేతగా నిలిచాం. దీంతో రూ.10 లక్షలు గ్రాంట్‌గా లభించింది. ప్రస్తుతం మా కంపెనీలో 11 మంది ఉద్యోగులున్నారు. త్వరలో ఈ సంఖ్యను 25కి చేర్చనున్నాం. గతేడాది రూ.2.5 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. వచ్చే ఏడాది కాలంలో రూ.50 కోట్ల టర్నోవర్‌ను చేరుకోవాలి లక్ష్యించాం. పలువురు హెచ్‌ఎన్‌ఐలు, ఏంజిల్‌ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే రూ.5 కోట్ల నిధులను సమీకరిస్తాం.
 
 



You may be interested

అపోలో లాభం రూ.60 కోట్లు

Saturday 11th August 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అపోలో ఆసుపత్రి ప్రస్తుతం ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.60 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్ధిక సంవత్సరం క్యూ1లో ఇది రూ.35 కోట్లు మాత్రమే. వార్షికంగా చూస్తే 71 శాతం వృద్ధి సాధించినట్లు కంపెనీ తెలియజేసింది. ఇక, గతేడాది క్యూ1లో మొత్తం ఆదాయం రూ.1,650 కోట్లుగా ఉండగా... ప్రస్తుతం క్యూ1లో ఇది 16 శాతం వృద్ధితో రూ.1,910 కోట్లకు

ఇక రుణదాతలుగా గృహ కొనుగోలుదారులు

Saturday 11th August 2018

న్యూఢిల్లీ: గృహ కొనుగోలుదారులు ఇకపై సంబంధిత ప్రాజెక్టుకు సంబంధించి రుణ దాతల హోదా పొందనున్నారు. ఈ మేరకు పార్లమెంటు శుక్రవారం ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్ట్సీ కోడ్‌ (ఐబీసీ) 2016కు సవరణను ఆమోదించింది. గృహ ప్రాజెక్టులకు సంబంధించి ప్రస్తుతం బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకే రుణ దాత హోదా ఉంది. ఈ బిల్లుకు లోక్‌సభ జూలై 31వ తేదీనే ఆమోదముద్ర వేసింది. తాజాగా రాజ్యసభ కూడా ఓకే చెప్పడంతో  సవరణ బిల్లుకు  పార్లమెంటు

Most from this category