STOCKS

News


రుణం ఇవ్వొచ్చు.. తీసుకోవచ్చు!

Saturday 13th October 2018
startups_main1539410825.png-21124

సాక్షి, హైదరాబాద్‌: ‘‘శ్రీనివాస్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగి. నెలాఖర్లో వాళ్ల అమ్మాయి మొదటి పుట్టిన రోజొచ్చింది. పార్టీ ఏర్పాట్లకు చేతిలో డబ్బు లేదు. తెలిసిన వాళ్లని అప్పు అడగటానికి మనసొప్పలేదు. పోనీ, బ్యాంక్‌ లోన్‌ కోసం వెళదామా అంటే... అదో పెద్ద ప్రక్రియ. సిబిల్‌ స్కోరు... వగైరాలు చూసి మంజూరు చేయటానికి బోలెడంత సమయం పట్టేస్తుంది. మరేం చేయాలి?’’
‘‘వెంకటేశ్‌ ఓ ప్రభుత్వ ఉద్యోగి. కొంత కాలం నుంచి పొదుపు చేసిన సొమ్ము రూ.3 లక్షల వరకు చేతిలో ఉంది. బ్యాంక్‌లో వేద్దామంటే వడ్డీ రేటు తక్కువ. పోనీ, తెలిసిన వాళ్లకెవరికైనా అప్పుగా ఇద్దామంటే తిరిగి వసూలు చేయడం కొంత రిస్కే’’
.. పై రెండు సందర్భాలు వేర్వేరు. ఒకరికేమో డబ్బు అవసరం, మరొకరికేమో అదే డబ్బుపై రాబడి కావాలి. వీళ్లద్దరి అవసరాలను ఒకే వేదికగా తీరుస్తోంది లెన్‌డెన్‌క్లబ్‌! సింపుల్‌గా చెప్పాలంటే? రుణదాతలు, గ్రహీతలను కలిపే ‘పీర్‌ టు పీర్‌’ లెండింగ్‌ వేదికన్న మాట. ఇన్నాళ్లూ ఉద్యోగులకే రుణాలిచ్చిన లెన్‌డెన్‌క్లబ్‌.. త్వరలో దుకాణదారులకూ రుణాలిచ్చేందుకు సిద్ధమైంది. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్, సీఈఓ భవీన్‌ పాటిల్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.
‘‘2015లో రూ.80 లక్షల పెట్టుబడితో గుర్గావ్‌ కేంద్రంగా లెన్‌డెన్‌క్లబ్‌ను ప్రారంభించాం. ప్రస్తుతం లెన్‌డెన్‌క్లబ్‌లో 40,880 మంది రుణ గ్రహీతలు, 9,982 మంది రుణదాతలు నమోదయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులకు మాత్రమే రుణాలిస్తున్నాం. కేవైసీ పూర్తి చేసిన 3 గంటల్లో రుణాన్నిస్తాం. రూ.40 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. వార్షిక వడ్డీ రేటు 12.5 నుంచి 35 శాతం వరకుంటుంది. రుణ వాయిదాలను 18–36 నెలల్లో తిరిగి చెల్లించేయాలి. రూ.5 లక్షల కేటగిరీలో 5 శాతం కస్టమర్లుంటారు.
తెలంగాణలో నెలకు 150 మందికి..
ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో సేవలందిస్తున్నాం. ఇప్పటివరకు 60 వేల మందికి రూ.40 కోట్ల రుణాలిచ్చాం. ప్రస్తుతం నెలకు వెయ్యి మందికి రూ.4 కోట్ల వరకు రుణాలందిస్తున్నాం. తెలంగాణ నుంచి నెలకు 150 రుణ గ్రహీతలకు రూ.70 లక్షల వరకు రుణాలిస్తున్నాం. డిసెంబర్‌ నాటికి నెలకు వెయ్యి మందికి రుణాలను అందించాలని లక్ష్యించాం. వచ్చే 6 నెలల్లో కొత్తగా మరో 3 నగరాలకు విస్తరించనున్నాం. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో సేవలను ప్రారంభిస్తాం.
రూ.2.5 కోట్ల ఆదాయం లక్ష్యం..
రుణ గ్రహీతలు చెల్లించే నెలసరి వాయిదా నేరుగా రుణదాతల బ్యాంక్‌ ఖాతాలో జమవుతాయి. లెన్‌డెన్‌క్లబ్‌ రుణదాత నుంచి 1.5 శాతం, రుణగ్రహీత నుంచి 4 శాతం నిర్వహణ రుసుము కింద వసూలు చేస్తుంది. గతేడాది రూ.55 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది రూ.2.5 కోట్ల ఆదాయాన్ని లక్ష్యించాం. ప్రస్తుతం ఎన్‌పీఏ 3.92 శాతంగా ఉంది. త్వరలోనే దుకాణదారులకు అర్హతలను బట్టి రూ.20 వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణాలను అందించనున్నాం. కాల వ్యవధి 6 నెలలు. వార్షిక వడ్డీ రేటు 15 నుంచి 22 శాతం ఉంటుంది. 
రూ.10 కోట్ల నిధుల సమీకరణ..
ప్రస్తుతం కంపెనీలో 45 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే హోమ్‌ రెనోవేషన్, ఫ్యామిలీ ఫంక్షన్స్‌ వంటి వాటికి రుణాలిచ్చేందుకు ప్రణాళిక చేస్తున్నాం. ఇటీవలే వెంచర్‌ క్యాటలిస్ట్, అనిరు«ద్‌ దమానీ, ఇండియన్‌ వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ నుంచి రూ.5 కోట్ల నిధులను సమీకరించాం. వచ్చే 3 నెలల్లో రూ.10 కోట్ల వరకు నిధులను సమీకరించనున్నాం. పాత ఇన్వెస్టర్లతో పాటూ ఒకటిరెండు వీసీ సంస్థలతో చర్చలు జరుగుతున్నాం’’ అని భవీన్‌ వివరించారు.
 
 



You may be interested

శ్రీశైలం రహదారిలో బూమ్‌ ఖాయమని పదిహేనేళ్ల క్రితమే ఊహించాం!

Saturday 13th October 2018

సాక్షి, హైదరాబాద్‌: నివాస సముదాయం, ఓపెన్‌ ప్లాట్‌! ఏదైనా సరే ప్రాజెక్ట్‌ ప్రారంభించాలంటే? ఏ నిర్మాణ సంస్థ అయినా సరే చూసేది.. కాస్తా కూస్తో అభివృద్ధి చెందాలి. మౌలిక వసతుల ఏర్పాట్లతో అమ్మకాలకు ఇబ్బంది ఉండదని భావిస్తేనే! కానీ, రాళ్లు రప్పలతో కూడిన నిర్మానుష్య ప్రాంతాన్ని 3,600 ఎకరాల భారీ ప్రాజెక్ట్‌కు ఎంపిక చేసింది ఫార్చ్యూన్‌ బటర్‌ఫ్లై సిటి. అదీ పదిహేనేళ్ల క్రితం శ్రీశైలం రహదారిలోని కడ్తాల్‌లో. కారణం.. భవిష్యత్తు అభివృద్ధిని ముందుగానే

హైదరాబాద్‌లో కొటక్‌ మొబైల్‌ మెడికల్‌ వ్యాన్లు

Saturday 13th October 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కార్పొరేట్ల సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యక్రమంలో భాగంగా కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ హైదరాబాద్‌లో మొబైల్‌ మెడికల్‌ వ్యాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి నిర్వహణ కోసం వోకార్డ్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ జాయింట్‌ ఎండీ దీపక్‌ గుప్తా శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 6 మొబైల్‌ వ్యాన్లు అందుబాటులో ఉంటాయని... స్థానిక నివాసితులకు వైద్య సేవలను అందిస్తుందని తెలిపారు.

Most from this category