STOCKS

News


హెచ్‌సీఎల్‌ చేతికి ఐబీఎం ఉత్పత్తులు!

Saturday 8th December 2018
news_main1544240603.png-22749

న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్... తాజాగా ఐటీ ఉత్పత్తుల దిగ్గజం ఐబీఎంకి చెందిన ఏడు సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం సుమారు 1.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.12,700 కోట్లు) వెచ్చించనుంది. పూర్తిగా నగదు రూపంలో ఉండే ఈ డీల్‌... నియంత్రణ సంస్థల అనుమతులన్నీ లభించాక...  2019 మధ్య నాటికి పూర్తి కాగలదని భావిస్తున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒప్పందం ప్రకారం సెక్యూరిటీ, మార్కెటింగ్‌ వంటి విభాగాలకు సంబంధించిన ఏడు సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను ఐబీఎం నుంచి హెచ్‌సీఎల్ కొనుగోలు చేస్తోంది. వీటి మార్కెట్ దాదాపు 50 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని హెచ్‌సీఎల్‌ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. "ఐబీఎంకి చెందిన నిర్దిష్ట సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను 1.8 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాం" అని పేర్కొంది. ఈ డీల్‌తో వివిధ దేశాల మార్కెట్లలోని పలు పరిశ్రమలకు సంబంధించి సుమారు 5,000 పైచిలుకు క్లయింట్స్‌ తమకు దఖలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఒప్పందంలో భాగంగా కొందరు ఐబీఎం ఉద్యోగులు కూడా తమ సంస్థకు బదిలీ అవుతారని హెచ్‌సీఎల్‌ టెక్ సీఎఫ్‌వో ప్రతీక్ అగర్వాల్ చెప్పారు. అయితే, సంఖ్య మాత్రం వెల్లడించలేదు. కొనుగోలుకు అవసరమైన నిధుల్లో సింహభాగాన్ని అంతర్గతంగా సమకూర్చుకుంటామని, 300 మిలియన్ డాలర్ల మేర రుణం తీసుకుంటామని వెల్లడించారు.
హెచ్‌సీఎల్‌కు భారీ కొనుగోలు..
హెచ్‌సీఎల్‌ టెక్ ఇప్పటిదాకా చేసిన కొనుగోళ్లలో ఇదే అతి పెద్ద డీల్‌ కానుంది. సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల వ్యాపారంలో విస్తరించాలన్న హెచ్‌సీఎల్‌ వ్యూహానికి ఇది తోడ్పడనుంది. "సెక్యూరిటీ, మార్కెటింగ్‌, కామర్స్ వంటి వ్యూహాత్మక విభాగాలకు సంబంధించిన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాం. వీటిలో పలు ఉత్పత్తులు ఆయా విభాగాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి" అని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో సి. విజయకుమార్ తెలియజేశారు. ఆయా ఉత్పత్తులు హెచ్‌సీఎల్ వ్యూహానికి అనుగుణంగా ఉంటాయని, వ్యాపార అభివృద్ధికి దోహదపడగలవని ఐబీఎం సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్ జాన్ కెల్లీ వివరించారు. 
ఉత్పత్తులు ఇవీ..
హెచ్‌సీఎల్ టెక్ కొనుగోలు చేస్తున్న ఉత్పత్తుల్లో సురక్షితమైన యాప్‌ను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడే 'యాప్‌ స్కాన్‌', డివైజ్ నిర్వహణకు సంబంధించిన 'బిగ్‌ ఫిక్స్‌', మార్కెటింగ్ విభాగం ఆటోమేషన్‌కి ఉపయోగించే 'యూనికా', ఈ- కామర్స్ సంబంధిత 'కామర్స్‌' వంటి ఉత్పత్తులు ఉన్నాయి. మిగతా వాటిలో 'కనెక్షన్స్‌', డిజిటల్ మాధ్యమానికి సంబంధించిన 'పోర్టల్‌', ఈ మెయిల్స్ సంబంధిత 'నోట్స్‌ అండ్ డొమినో' ఉన్నాయి.
 



You may be interested

ఎయిరిండియా ముంబై భవంతిపై ఎల్‌ఐసీ ఆసక్తి

Saturday 8th December 2018

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎయిరిండియాకు దక్షిణ ముంబైలో ఉన్న 23 అంతస్తుల భవంతిపై పలు ప్రభుత్వ రంగ సంస్థలు కన్నేశాయి. ఈ ప్రాపర్టీని విక్రయించాలా వద్దా అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ అంతకన్నా ముందే ఎల్‌ఐసీ, జీఐసీ వంటి ప్రభుత్వ రంగ బీమా దిగ్గజాలు దీనిపై ఆసక్తి వ్యక్తం చేసినట్లు ఎయిర్‌లైన్‌ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దక్షిణ ముంబైలోని కీలక వ్యాపార కేంద్రం నారిమన్ పాయింట్‌లో

200 విమానాలతో ఇండిగో రికార్డు

Saturday 8th December 2018

ముంబై: బడ్జెట్‌ ధరల ఎయిర్‌లైన్స్‌ ఇండిగో దేశీయంగా అధిక సంఖ్యలో విమానాలు కలిగిన సంస్థగా రికార్డు నమోదు చేసింది. దేశీయంగా 200 విమానాలను కలిగి ఉన్న తొలి సంస్థ ఇదే. రెండు ఎయిర్‌బస్‌ ఏ320(సియో), రెండు ఎయిర్‌బస్‌ ఏ320 నియో విమానాలు తాజాగా వచ్చి చేరడంతో సంస్థ విమానాల సంఖ్య 200కు చేరుకుంది. దేశీయ మార్కెట్లో ఇండిగో 40 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. 2015 డిసెంబర్‌ 24న ఈ

Most from this category