STOCKS

News


ఫెడ్‌ రేట్లు యథాతథం..!

Friday 9th November 2018
Markets_main1541739185.png-21804

  • గురువారం ముగిసిన ఫెడ్‌ రెండు రోజుల సమావేశం
  • బెంచ్‌ మార్క్‌ వడ్డీ రేట్లు యథాతథం
  • డిసెంబర్‌లో పెంపు దిశగా నిర్ణయాలు..

కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు లేకుండా అమెరికా ఫెడ్‌ రెండు రోజుల సమవేశాన్ని ముగించింది. ఫెడరల్‌ ఫండ్స్‌ రేటును 2-2.25 శాతం శ్రేణిలో యథాతథంగా కొనసాగించేందుకు ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) ఏకగ్రీవ అంగీకారం తెలిపింది. అయితే డిసెంబర్‌ సమావేశంలో పావుశాతం పెంపు వుండవచ్చన్న సంకేతాలు ఇచ్చింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉన్న నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తమ అంచనాలకు అనుగుణంగానే వ్యవస్థ వృద్ధిరేటను నమోదుచేస్తున్నట్లు గురువారంతో ముగిసిన సమావేశంలో వ్యాఖ్యానించింది. యూఎస్‌ ఆర్థిక వ్యవస్థ 3.5 శాతం చొప్పున వృద్ధిరేటు సాధించాలని నిర్థేశించిన ఎఫ్‌ఓఎంసీ.. ఈ లక్ష్యాన్ని ‘స్ట్రాంగ్‌ రేట్‌’ అని వ్యవహరిస్తోంది. మూడవ త్రైమాసికంలో లక్ష్యానికి అనుగుణంగా వృద్ధి రేటు నమోదైందని వివరించింది. అక్టోబర్‌లో 250,000 మందికి ఉద్యోగాలు రావడం ద్వారా నిరుద్యోగుల రేటు 3.7 శాతానికి తగ్గినట్లు వివరించింది. ఎకానమీ బలంగా ఉన్న నేపథ్యంలో బెంచ్‌ మార్క్‌ వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మధ్యకాలంలో వడ్డీ రేట్లను క్రమంగా పెంచుతూ వస్తున్న ఫెడ్‌.. ఈసారి ఎటువంటి మార్పులు చేయకపోవడం పట్ల ఇన్వెస్టర్లలో ఆశ్చర్యం నెలకొంది. ఊహించని విధంగా తీసుకున్న నిర్ణయానికి అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా స్పందించాయి. 

ట్రంప్‌ ప్రభావం..
వేగంగా వడ్డీ రేట్లను పెంచడం పట్ల అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఫెడ్‌పై పదేపదే దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. సెంట్రల్‌ బ్యాంక్‌ను ‘క్రేజీ, లోకో, గోయింగ్‌ వైల్డ్‌, అవుట్‌ ఆఫ్‌  కంట్రోల్‌’ అని దాడిచేస్తుండడం కూడా వడ్డీ రేట్లు ఈసారికి యథాతథంగా కొనసాగడానికి మరో ప్రధాన కారణమని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. అధిక వడ్డీ రేట్లు ఉండడం వల్ల ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి పోతుందని ఆయన ఇది వరకే వ్యాఖ్యానించారు. ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల బలం పెరగడం కూడా ఇందుకు మరోకారణంగా విశ్లేషిస్తున్నారు.

డిసెంబర్‌లో వడ్డీ రేట్ల పెంపు..!
ఈసారికి వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు లేకపోయిన్పపటికీ.. వచ్చే నెలలోనే పెంపు నిర్ణయం వెలువడే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. డిసెంబర్‌ 18, 19 తేదీల్లో ఎఫ్‌ఓఎంసీ సమావేశం ఉండగా.. ఈ సమావేశంలో బెంచ్‌ మార్క్‌ వడ్డీ రేట్లను మూడు శాతానికి చేర్చే దిశగా నిర్ణయాలు తీసుకుంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. 



You may be interested

రూపీ అప్‌..

Friday 9th November 2018

క్రూడ్‌ ధరలు తగ్గడం, లిక్విడిటీకి మద్దతునిచ్చేందుకు ఆర్‌బీఐ ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా బాండ్లను కొనుగోలు చేయడం, బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గడం వంటి అంశాల కారణంగా రూపాయి శుక్రవారం బలపడింది. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.67 వద్ద ట్రేడవుతోంది. రూపాయి మంగళవారం ముగింపు స్థాయి 73.01తో పోలిస్తే 0.46 శాతం లాభపడింది. ఇక రూపాయి శుక్రవారం 72.71 వద్ద ప్రారంభమైంది. భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.767 శాతంగా

లాభాల్లోంచి వెంటనే నష్టాల్లోకి..

Friday 9th November 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,598 పాయింట్లతో పోలిస్తే 16 పాయింట్ల లాభంతో 10,614 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,237 పాయింట్లతో పోలిస్తే 21 పాయింట్ల లాభంతో 35,258 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు వెంటనే నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9:21 సమయంలో సెన్సెక్స్‌ 149 పాయింట్ల నష్టంతో 35,088 వద్ద,

Most from this category