STOCKS

News


రియల్టీపై ఎన్నికల ప్రభావం ఉంటుందా?

Saturday 15th September 2018
news_main1536988948.png-20284

సాక్షి, హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ, రెరా.. ఒకదాని వెంట మరొకటి రియల్టీ రంగాన్ని కుదిపేసింది. స్థానిక ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతో కాస్త తేలుకుంటున్న తరుణంలో ఈసారి ముందస్తు ఎన్నికల ప్రకటనతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఎన్నికల ప్రభావం రియల్టీ రంగం మీద ఏమాత్రం ఉంటుంది? కొత్త ప్రభుత్వ ఏర్పాటయ్యే వరకూ స్థిరాస్తి ధరలు తగ్గుతాయా? అసలు ఎన్నికల సమయంలో రియల్టీ పెట్టుబడులు సరైందేనా? వంటి సందేహాలకు సమాధానమే ఈవారం ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనం!
ఎన్నికలు అనేవి రియల్టీ మార్కెట్‌ మీద కంటే స్థిరాస్తి కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ మీద ప్రభావం చూపిస్తాయి. క్లారిటీగా చెప్పాలంటే.. ఎలక్షన్స్‌ కొనుగోలుదారుల మీద, డెవలపర్ల మీద వేర్వేరు రకాలుగా ప్రభావం చూపిస్తుంది. కొనుగోలుదారుల వైపు నుంచి చూస్తే.. ఎన్నికలకు 2 నెలల ముందు నుంచి, ఎన్నికలయ్యాక 2 నెలల వరకూ నిజమైన గృహ కొనుగోలుదారులు వేచిచూసే ధోరణిలోనే ఉంటారు. ఎందుకంటే కొత్త ప్రభుత్వంపై అంచనాలుంటాయి కాబట్టి! కొత్త పథకాలు, రాయితీలు, పాలసీలు తమ పెట్టుబడుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని కొనుగోలుదారులు వేచిచూస్తుంటారు. ఇక, డెవలపర్ల వైపు నుంచి చూస్తే.. ఆయా రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చాల్సి ఉంటుంది. కొంతమంది డెవలపర్లకు స్థానిక రాజకీయ నాయకులతో ఉన్న వ్యక్తిగత సత్సంబంధాల కారణంగానూ నిధులను ఏర్పాటు చేస్తుంటారు. దీంతో ఆయా డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభించడం కంటే చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లను విక్రయించడం మీదే దృష్టిసారిస్తుంటారు. ‘‘సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. స్థానిక వ్యాపారస్తులు, రియల్టర్లు ఒకసారి పార్టీ ఫండ్‌ను ఏర్పాటు చేస్తే సరిపోయేది. కానీ, ఈసారి తెలంగాణలో 6 నెలల వ్యవధిలో రెండుసార్లు ఎన్నికలుంటాయి. అసెంబ్లీ, ఎంపీ ఎలక్షన్స్‌ వేర్వేరుగా జరుగుతాయి. కాబట్టి ఫండ్‌ను కూడా వేర్వేరుగా ఏర్పాటు చేయాల్సి వస్తుందని ఇది డెవలపర్లకు కొంత భారమేనని’’ ఓ డెవలపర్‌ వివరించారు.
ఎన్నికల సమయంలో జాగ్రత్త..
ఎన్నికలకు 2–3 నెలల ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లు, ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్ట్‌లు ఉన్న ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఎన్నికల సమయంలో స్తబ్దుగా మారుతుంది. ఎందుకంటే పాత ప్రభుత్వం చేపట్టిన ఆయా ప్రాజెక్ట్‌లను కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మధ్యలోనే నిలిపివేయవచ్చు. లేదా నిర్మాణ పనులను నెమ్మదించవచ్చు. అందుకే 2–3 నెలల ముందు ప్రకటించిన ప్రాజెక్ట్‌ ప్రాంతాల్లో క్రయవిక్రయాలకు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు.. 2001లో నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌)లో రెండో విమానాశ్రయం (జేవర్‌ ఎయిర్‌పోర్‌)ను ప్రకటించారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా స్థల లావాదేవీలు జరిగాయి. కానీ, ఆ తర్వాత రాష్ట్రం, కేంద్రం రెండు చోట్ల ప్రభుత్వం మారడంతో స్థల సమీకరణ, నిధుల అన్నింటికీ ఇబ్బందులయ్యాయి. దీంతో నేటికీ విమానాశ్రయం అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయా ప్రాంతంలోని రియల్‌ రంగం చతికిలపడిపోయింది. తెలంగాణ విషయానికొస్తే.. జిల్లాల విభజనతో పాటూ వరంగల్, కరీంనగర్‌ల్లో ఐటీ పార్క్‌లు, ఇంక్యుబేషన్‌ సెంటర్ల ఏర్పాటుతో రియల్‌ ఊపు వచ్చింది. వరంగల్‌లో టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ప్రకటనతో రాత్రికి రాత్రే ధరలు పెరిగాయి.
రియల్టీ అనేది ఒక్క రోజు ప్రక్రియ కాదు..
రియల్టీ లావాదేవీలు అనేవి ఒక్క రోజులో జరిగే ప్రక్రియ కాదు. బుకింగ్‌ చేసినప్పటి నుంచి రిజిస్ట్రేషన్‌ అయ్యే వరకూ తీసుకుంటే.. అపార్ట్‌మెంట్లయితే రెండేళ్లు, ఓపెన్‌ ప్లాట్లయితే 3 నెలల పాటు జరిగే ప్రక్రియ. 8 నెలల క్రితం ప్రారంభమైన ప్రాజెక్ట్‌లల్లో ఇప్పుడు సేల్‌డీడ్, రిజిస్ట్రేషన్స్‌ జరుగుతుంటాయి. కాబట్టి రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయానికి పెద్దగా ఇబ్బంది ఉండదని ఉప్పల్‌కు చెందిన ఓ డెవలపర్‌ అభిప్రాయపడ్డారు. ‘‘అస్థిరమైన రాజకీయ పరిస్థితులు, రకరకాల సమీకరణాలు, పార్టీలుంటే రియల్‌ ఎస్టేట్‌ మీద ప్రభావం ఉంటుంది. సమైక్యాంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో అంచనా వేయడం కష్టంగా ఉండేది కాబట్టి దాని ప్రభావం స్థిరాస్తి రంగం మీద పడేది. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అస్థిర రాజకీయ పరిస్థితులకు తావే లేదు. కాబట్టి మళ్లీ స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందని వచ్చే పదేళ్ల వరకూ మార్కెట్‌ బాగుంటుందని’’ ఆయన చెప్పారు.
బల్క్‌ ల్యాండ్స్‌ మీద ప్రభావం..
రాజకీయ పార్టీలకు నిధుల సమీకరణ కోసం, అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరం ఉంటుంది కాబట్టి ధర పలికే స్థలాలు, శివారు ప్రాంతాల్లో ఉన్న పెద్ద బల్క్‌ ల్యాండ్స్‌ క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. పెద్ద సైజ్‌ స్థలాల లావాదేవీలు హైదరాబాద్‌తో పాటూ రాష్ట్రమంతటా జరుగుతుంటాయని, అపార్ట్‌మెంట్లు, లే అవుట్‌ ప్రాజెక్ట్‌ల మీద పెద్దగా ప్రభావం ఉండదని ఓ డెవలపర్‌ చెప్పారు. వచ్చే 6 నెలల వరకూ ప్రభుత్వం నుంచి విధానపరమైన నిర్ణయాలు ఉండవు కాబట్టి స్థిరాస్తి ధరలు స్థిరంగా ఉంటాయన్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా దసరాను లక్ష్యంగా చేసుకొని నగరంలో చాలా మంది డెవలపర్లు కొత్త అపార్ట్‌మెంట్లు, వెంచర్లకు ప్రణాళికలు చేస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల వాతావరణం నెలకొనడంతో దసరాకి భూమి పూజ, నిర్మాణ పనులను చేస్తారు. ఈ సమయంలో వీఐపీలు, మంత్రులు బిజీగా ఉండి రాలేరు కాబట్టి.. ఎన్నికలు పూర్తయ్యాక లాచింగ్స్‌ కార్యక్రమాలుంటాయని వెంకట్‌ రెడ్డి తెలిపారు. ఈస్ట్‌ జోన్‌లో దసరాకి సుమారు 15 అపార్ట్‌మెంట్, లే అవుట్‌ ప్రాజెక్ట్‌లు ప్రారంభంకానున్నాయని ఆయన చెప్పారు. మా కంపెనీ నుంచి (ఏవీ కన్‌స్ట్రక్షన్స్‌) మేడిపల్లిలో 2 లక్షల చ.అ.ల్లో మాల్‌ అండ్‌ మల్టిప్లెక్స్, పోచారంలో 20 ఎకరాల్లో 200 ప్రీమియం విల్లా ప్రాజెక్ట్, పర్వతాపురంలో 21 ఎకరాల్లో భారీ లే అవుట్‌ను ప్రారంభించనున్నామని తెలిపారు.
–––––
ఎన్నికల సమయంలో ఎక్కడ కొంటే బెటర్‌?
338 కి.మీ. ఆర్‌ఆర్‌ఆర్‌ కరెక్ట్‌
– సీ శేఖర్‌ రెడ్డి, క్రెడాయ్‌ మాజీ జాతీయ అధ్యక్షుడు
హైదరాబాద్‌ చుట్టూ 153 కి.మీ. మేర విస్తరించి ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) చుట్టూ రానున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) రియల్టీ పెట్టుబడులకు సరైన ప్రాంతం. హైదరాబాద్‌ మీద ఒత్తిడి తగ్గాలన్నా, సమాంతర అభివృద్ధి జరగాలన్నా ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం తప్పనిసరి. గత ప్రభుత్వం పునరావృతమైనా లేక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం చేయాల్సిందే. ఓఆర్‌ఆర్‌ మీదుగా 338 కి.మీ. మేర రీజినల్‌ రింగ్‌ రోడ్డు విస్తరించి ఉంటుంది. ఇది సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, శంకర్‌పల్లి, కంది వంటి అర్బన్‌ క్లస్టర్లను అనుసంధానిస్తుంది. ఇప్పటికే షాబాద్, చేవెళ్ల మీదుగా రానున్న ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాంతాల్లోని భూములకు గిరాకీ పెరిగింది. ఆయా ప్రాంతాల్లో ఎకరం రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకుంది. రీజినల్‌ రింగ్‌ రోడ్డును కేంద్రంగా చేసుకొని తయారీ కంపెనీలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లు వస్తాయి. ఆయా ప్రాంతాల్లో వాక్‌ టు వర్క్‌ ప్రాజెక్ట్‌లు, శాటిలైట్‌ టౌన్‌షిప్‌లకు సరైన ప్రాంతంగా నిలుస్తాయి.
––––
ఈస్ట్‌ జోన్‌లో అభివృద్ధి పక్కా!
–  జే వెంకట్‌ రెడ్డి, తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ
తెలంగాణ ప్రభుత్వం ఈస్ట్‌ జోన్‌ అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్‌ చేసింది. హైటెక్‌ సిటీ తర్వాత ఉప్పల్‌ను ఐటీ హబ్‌గా చేయాలని లక్ష్యించింది. ఇందుకోసం లుక్‌ ఈస్ట్‌ పాలసీను రూపొందిస్తుంది. మెట్రో రైలు పరుగులు మొదలయ్యాక అందరి దృష్టి ఈస్ట్‌ జోన్‌ పైనే పడింది. హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారి పారిశ్రామిక కారిడార్‌గా ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో స్థల సమీకరణతో పరిశ్రమలకు కేటాయించనుంది. వరంగల్‌ హైవేను 6 లైన్ల రహదారిగా విస్తరించనున్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి కూడా. ఎంఎంటీఎస్‌ రైల్‌ను ఘట్‌కేసర్‌ వరకు పొడిగించారు. రైల్వే లైన్‌ నిర్మాణం పూర్తయింది. త్వరలోనే రైల్‌ పట్టాలెక్కనుంది. దీన్ని యాదాద్రి వరకూ పొడించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.బీబీనగర్‌లోని నిమ్స్‌ భవనంలోనే ఏయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఉప్పల్‌లోని ట్రాఫిక్‌ను అధిగమించేందుకు ఉప్పల్‌– నారాపల్లి మధ్య ఎక్స్‌ప్రెస్‌ వేను నిర్మించనున్నారు. ఇక, తిరుపతి తరహాలో యాదాద్రిని అభివృద్ధి చేస్తున్నారు. ఆలయ నిర్మాణం తుది దశకు చేరుకుంది. దీంతో ఈ ప్రాంతమంతా టెంపుల్‌ టూరిజంగా అభివృద్ధి చెందనుంది. యాదాద్రితో పాటూ తూర్పు ప్రాంతంలో పాండవుల గుట్ట, భోగత జలపాతం, కుంటాల, రామప్ప, లక్నవరం, జన్నారం అడవులు, కొలన్‌పాకలోని జైన్‌ మందిరం ఇలా తూర్పు ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందటం ఖాయం.
 



You may be interested

పసిడి పడింది..

Saturday 15th September 2018

పసిడి ధరకు అమెరికా పారిశ్రామికోత్పత్తి గణాంకాల పోటు తగిలింది. ఫలితంగా శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో 10 డాలర్లు నష్టపోయింది. ఆటోమొబైల్‌, ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ రంగాల మెరుగైన పనితీరు కారణంగా అమెరికాలో ఆగస్ట్‌లో పారిశ్రామికోత్పత్తి 0.4 శాతం వృద్ధిని సాధించింది. దీంతో మార్కెట్‌ వర్గాలకు మరోసారి ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపుపై అంచనాలు పెరిగాయి. దీంతో డాలర్‌ ఇండెక్స్‌ శుక్రవారం ఇంట్రాడేలో 95.00 కీలక స్థాయిని తాకింది. అయితే చివరకి అరశాతం లాభంతో

హోల్‌సేల్‌ బట్టల దుకాణం ‘టెక్స్‌ఫై’

Saturday 15th September 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: శ్రీనివాస్‌కు వరంగల్‌లో ఒక బట్టల దుకాణం ఉంది. చీరలు, డ్రెస్‌ల కోసం సూరత్, అహ్మదాబాద్, కోల్‌కతా వంటి ప్రాంతాలకు వెళ్లి హోల్‌సేల్‌గా కొంటుంటాడు. వెళ్లడం నుంచి ఉత్పత్తుల ఎంపిక, లాజిస్టిక్, లావాదేవీలు.. ప్రతిదీ ఇబ్బందే! కానీ, ఇప్పుడు శ్రీనివాస్‌.. జస్ట్‌ తన షాపులో కూర్చొని వేరే రాష్ట్రాల్లోని ఉత్పత్తులను కొంటున్నాడు. అదే... టెక్స్‌ఫై.కామ్‌ ప్రత్యేకత. టెక్స్‌ఫైలో వివిధ రాష్ట్రాలకు చెందిన 300కు పైగా గార్మెంట్స్‌ తయారీ

Most from this category