STOCKS

News


పుంజుకున్న ప్యాసింజర్‌ వెహికల్స్‌ అమ్మకాలు

Saturday 10th November 2018
auto-mobiles_main1541829085.png-21852

న్యూఢిల్లీ: దేశీయంగా ప్రయాణికుల వాహన (ప్యాసింజర్‌ వెహికల్స్‌/కార్లు, జీపులు) విక్రయాలు అక్టోబర్‌ నెలలో ఫర్వాలేదనిపించాయి. వరుసగా మూడు నెలల క్షీణత తర్వాత అక్టోబర్‌లో అమ్మకాలు పుంజుకున్నాయి. 1.55 శాతం మేర వృద్ధి నమోదైనట్టు ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) తెలిపింది. సియామ్‌ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే... అక్టోబర్‌లో ప్యాసింజర్‌ వెహికల్స్‌ విక్రయాలు 2,84,224 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే మాసంలో అమ్ముడైనవి 2,79,877 కావడం గమనార్హం. ఈ ఏడాది జూలైలో అమ్మకాలు 2.71 శాతం, ఆగస్ట్‌లో 2.46 శాతం, సెప్టెంబర్‌లో ఏకంగా 5.61 శాతం చొప్పున తగ్గిపోయాయి. అక్టోబర్‌లో విక్రయాలు పుంజుకోవడంతో వాహన కంపెనీలు ఊపిరిపీల్చుకున్నాయి. అన్ని విభాగాల్లోనూ అమ్మకాలను కలిపి చూస్తే అ‍క్టోబర్‌లో 15.33 శాతం వృద్ధితో 24,94,426 యూనిట్లకు చేరాయి. క్రితం ఏడాది అక్టోబర్‌లో అమ్మకాలు 21,62,869 యూనిట్లే కావడం గమనార్హం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-అక్టోబర్‌ వరకు చూసుకుంటే ప్యాసింజర్‌ వెహికల్స్‌ విక్రయాలు 6.10 శాతం పెరిగాయి. 20,28,529 లక్షల వాహనాలు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్ముడైనవి 19,11,883గానే ఉన్నాయి. 
కనిపించని పండుగ కళ 
బలహీన మార్కెట్‌ సెంటిమెంట్‌ పండుగల సీజన్‌ డిమాండ్‌పై ప్రభావం చూపించినట్టు సియామ్‌ తెలిపింది. అక్టోబర్‌లో నమోదైన వృద్ధి చాలా ఆశాజనకమైనదిగా సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణుమాథుర్‌ పేర్కొన్నారు. ఆటోమొబైల్‌ పరిశ్రమలో సానుకూలత నెలకొందన్నారు. ప్యాసింజర్‌ వెహికల్స్‌ అమ్మకాల్లో వృద్ధి నామమాత్రంగా ఉండడంపై విష్ణుమాథుర్‌ స్పందిస్తూ...  బీమా వ్యయం పెరగడం, చమురు ధరల పెరుగుదల, స్టాక్‌ మార్కెట్‌ క్షీణత సెంటిమెంట్‌పై ప్రభావం చూపించినట్టు  చెప్పారు. దీపావళి నవంబర్‌లో ఉండడంతో పండుగల అమ్మకాల ప్రభావం వచ్చే నెలలోనే తెలుస్తుందన్నారు. అక్టోబర్‌ చివరి వరకు అయితే విక్రయాలు నిదానంగానే ఉన్నాయని, పండుగల సీజన్‌లా లేదన్నారు. అయితే, ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని సియామ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ సుగతో సేన్‌ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో విక్రయాలు మెరుగుపడతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు.
ప్యాసింజర్‌ వెహికల్స్‌ 
♦ అక్టోబర్‌లో మార్కెట్‌ లీడర్‌ మారుతిసుజుకి ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు 0.61 శాతం పెరిగి 1,35,948 యూనిట్లుగా ఉన్నాయి. 
♦ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా అమ్మకాల్లో మాత్రం 4.87 శాతం వృద్ధి నెలకొంది. ఈ సంస్థ విక్రయించిన వాహనాలు 52,001 యూనిట్లుగా ఉన్నాయి.
♦ మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 2.75 శాతం పెరిగి 24,056 యూనిట్లుగా నమోదయ్యాయి. 
♦ అక్టోబర్లో కార్ల విక్రయాల వరకు చూస్తే కేవలం 0.38 శాతమే పెరిగి 1,85,400 యూనిట్లుగా ఉన్నాయి. 
♦ వాణిజ్య వాహన విక్రయాలు అక్టోబర్‌లో 25 శాతం పెరిగాయి. మొత్తం 87,147 వాహనాలు అమ్ముడయ్యాయి.
ద్విచక్ర వాహన అమ్మకాలు
♦ ద్విచక్ర వాహన విక్రయాలు అక్టోబర్లో 17.23 శాతం పెరిగాయి. 20,53,497 వాహనాలు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే మాసంలో అమ్మకాలు 17,51,608 యూనిట్లు కావడం గమనార్హం. ముఖ్యంగా బైక్‌ల అమ్మకాలు వృద్ధికి దోహదపడ్డాయి. బైక్‌ల విక్రయాలు 20 శాతం వృద్ధితో 13,27,758 యూనిట్లుగా ఉంటే, స్కూటర్ల విక్రయాలు 12 శాతం పెరిగి 6,43,382 యూనిట్లుగా ఉన్నాయి.
♦ హీరో మోటోకార్ప్‌ బైక్‌ల అమ్మకాల్లో 18.33 శాతం వృద్ధి నమోదైంది. ఈ సంస్థ 6,42,374 మోటారుసైకిళ్లను విక్రయించింది.
♦ బజాజ్‌ ఆటో బైక్‌ల అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. 33.1 శాతం వృద్ధితో 2,81,582 యూనిట్లు అమ్ముడుపోయాయి.
♦ హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా బైక్‌ల విక్రయాలు 16.33 శాతం వృద్ధితో 1,68,020 యూనిట్లుగా ఉన్నాయి.
♦ హోండా స్కూటర్ల అమ్మకాలు 9.89 శాతం పెరిగి 3,22,115 యూనిట్లుగా నమోదయ్యాయి. 
♦ టీవీఎస్‌ మోటార్‌ స్కూటర్ల అమ్మకాలు 41 శాతం పెరిగాయి. ఈ సంస్థ 1,45,737 స్కూటర్లను విక్రయించింది. 
♦ హీరో మోటోకార్ప్‌ స్కూటర్ల అమ్మకాలు 8.5 శాతం వృద్ధితో 73,685 యూనిట్లుగా ఉన్నాయి. 

 



You may be interested

ఇండియా సిమెంట్స్‌ ఆదాయం రూ.1,391 కోట్లు

Saturday 10th November 2018

న్యూఢిల్లీ: ఇండియా సిమెంట్స్‌ కంపెనీ నికర లాభం  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 94 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.24 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1 కోటికి తగ్గిందని ఇండియా సిమెంట్స్‌ తెలిపింది. అమ్మకాల పరిమాణం పెరిగినా, ధర తక్కువగా ఉండటం, ఇంధన వ్యయాలు పెరగడం వల్ల నికర లాభం తగ్గిందని కంపెనీ ఎమ్‌డీ, వైస్‌ చైర్మన్‌ ఎన్‌. శ్రీనివాసన్‌ వివరించారు.

రూ.3,000 కోట్లను సమీకరించిన ఆర్‌ఐఎల్‌

Saturday 10th November 2018

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) నాన్‌ కన్వర్టబుల్‌ రెడీమబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.3,000 కోట్లను సమీకరించినట్టు ప్రకటించింది. 10 ఏళ్ల కాలానికి గడువు తీరే అన్‌ సెక్యూర్డ్‌, నాన్‌ కన్వర్టబుల్‌ రెడీమబుల్‌ డిబెంచర్లపై 8.95 శాతం వడ్డీని ఆఫర్‌ చేసినట్టు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు ఆర్‌ఐఎల్‌ తెలిపింది. 2028 నవంబర్‌ 9న ఇవి గడువు తీరతాయని పేర్కొంది. ఇంధనం, పెట్రోకెమికల్‌, రిటైల్‌, టెలికం విభాగాల్లో గడిచిన ఐదేళ్ల కాలంలో

Most from this category