STOCKS

News


కార్పోరేట్‌ బ్రీఫ్‌

Wednesday 13th February 2019
news_main1550040243.png-24173

  • లోక్‌సభ ముందుకు పోంజీ స్కీముల నిషేధం బిల్లు

న్యూఢిల్లీ: సామాన్య ఇన్వెస్టర్లు బోగస్ పొదుపు పథకాలతో (పోంజీ స్కీములు) మోసపోకుండా చూసేందుకు ఉద్దేశించిన బిల్లును మంగళవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ ప్రవేశపెట్టారు. అనియంత్రిత డిపాజిట్ పథకాల నిషేధం బిల్లుపై లోక్‌సభ బుధవారం చర్చించి, ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. బడ్జెట్‌ చివరి రోజు కావడంతో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి పూర్తి సమయాన్ని దీనికే కేటాయించాలని, దీంతో సత్వరం రాజ్యసభ ఆమోదానికి కూడా పంపేందుకు వీలుంటుందని అధికార, విపక్ష సభ్యులు స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ను కోరారు. ఇలాంటి స్కీముల్లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన డిపాజిటర్లకు పరిహారం చెల్లించే వ్యవస్థను ఏర్పాటు చేసేలా బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి. దీన్ని 2018 జూలై 18న పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థికాంశాలపై స్థాయీ సంఘం పరిశీలనకు పంపారు. కేంద్ర క్యాబినెట్ గత వారం ఆమోదముద్ర వేశాక తాజాగా లోక్‌సభ ముందు ఉంచారు. 

  • అనుమతులేకుండా రూ.1,157 కోట్లు వాడేశారు

2017-18 పరిస్థితిపై ఆర్థికశాఖపై కాగ్‌ అక్షింతలు
న్యూఢిల్లీ: పార్లమెంటు ముందస్తు అనుమతి పొందకుండా, 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మంత్రిత్వశాఖ వివిధ పద్దులపై రూ.1,157 కోట్లు ఖర్చు చేసిందని కాగ్‌ (కంపో​‍్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) పేర్కొంది. ఈ మేరకు ‘ఫైనాన్షియల్‌ ఆడిట్‌’ నివేదికను మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఫైనాన్షియల్‌ క్రమశిక్షణ విధానాల విషయంలో ఆర్థికశాఖ తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలు కూడా ఇందుకు తగిన సమర్థవంతమైన యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఇచ్చిన సిఫారసులకు అనుగుణంగా ఆర్థికశాఖ నడుచుకోలేదని, ఈ ఫలితమే 13 గ్రాంట్లకు సంబంధించి పార్లమెంటు ఆమోదంలేని అదనపు వ్యయాలు జరిగాయని పేర్కొంది. 

  • లోహియా గ్రూప్ చేతికి ఇజ్రాయెల్ సంస్థ

న్యూఢిల్లీ: దేశీ వ్యాపార దిగ్గజం లోహియా గ్రూప్ తాజాగా ఇజ్రాయెల్‌కు చెందిన లైట్ అండ్ స్ట్రాంగ్ సంస్థను కొనుగోలు చేసింది. ఇది ఏరోస్పేస్‌, మిలిటరీ కార్బన్ ఫైబర్‌ ఉత్పత్తులను తయారు చేస్తుంది. డీల్ విలువ ఎంతన్నది మాత్రం వెల్లడి కాలేదు. అంతర్జాతీయంగా ఏరోస్పేస్‌, డిఫెన్స్ రంగంలో కార్యకలాపాలు విస్తరించేందుకు ఈ కొనుగోలు ఉపయోగపడగలదని లోహియా గ్రూప్ డైరెక్టర్ అనురాగ్ లోహియా చెప్పారు. అమెరికా, యూరప్‌ మార్కెట్లలో కస్టమర్లకు ఎగుమతులు చేసేందుకు ఇజ్రాయెల్‌ తమకు వ్యూహాత్మక హబ్‌గా ఉండగలదని పేర్కొన్నారు. లోహియా గ్రూప్ సంస్థలకు ప్రస్తుతం 85 దేశాల్లో కార్యకలాపాలు ఉండగా, 5,000 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారు. 

  • మార్కెట్లోకి భారతీ ఆక్సా కొత్త ప్లాన్‌

హైదరాబాద్‌: జీవిత బీమా కంపెనీ భారతీ ఆక్సా తాజాగా మార్కెట్లోకి సరికొత్త చైల్డ్‌ ప్లాన్‌ను విడుదల చేసింది. భారతీ ఆక్సా లైఫ్‌ షైనింగ్‌ స్టార్స్‌ పేరెంట్స్, పిల్లల జీవిత బీమాను అందిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పిల్లల అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా తల్లిదండ్రులకు మెచ్యూరిటీ పే అవుట్‌ అప్షన్‌ను ఎంచుకునే వీలుంటుందని తెలిపింది. ఒకవేళ పాలసీదారు మరణిస్తే.. తదుపరి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేకుండానే పాలసీ కొనసాగుతుందని, మెచ్యురిటీ ప్రయోజనం మెచ్యురిటీ సమయం వరకూ కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్లాన్‌ ఎంపికకు కనీస వయస్సు 18, గరిష్టం 60 ఏళ్లు.

  • ప్రకటనల వ్యయాల్లో 14 శాతం వృద్ధి

- ఈ ఏడాది రూ. 80వేల కోట్ల అంచనా
- అంతర్జాతీయ మీడియా ఏజెన్సీ గ్రూప్ఎం నివేదిక

ముంబై: దేశీ అడ్వర్టైజింగ్ మార్కెట్ ఈ ఏడటాది 14 శాతం వృద్ధి చెంది రూ. 80,678 కోట్ల స్థాయికి చేరనుంది. స్థూలఆర్థిక అంశాలు, సార్వత్రిక ఎన్నికలు, 2019 క్రికెట్ వరల్డ్ కప్ మొదలైనవి ఇందుకు తోడ్పడనున్నాయి. 2019లో జీడీపీ వృద్ధి (7.5 శాతం) అంచనాల కన్నా ప్రకటనల వ్యయాల వృద్ధి దాదాపు రెట్టింపుగా ఉండనుంది. అంతర్జాతీయ మీడియా ఏజెన్సీ గ్రూప్‌ఎం ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. ప్రకటనల వ్యయాల్లో భారత్ పదో అతి పెద్ద మార్కెట్‌గా నిలవనుందని, వృద్ధిపరంగా చూస్తే చైనా, అమెరికా తర్వాత మూడో స్థానంలో ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది ప్రకటనల వ్యయాల్లో మూడింట రెండొంతుల వాటా ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్‌, రిటైల్‌, ఈ-కామర్స్‌, టెక్నాలజీ/టెలికం రంగాలదే ఉంటుందని గ్రూప్ఎం దక్షిణాసియా విభాగం సీఈవో శామ్‌ సింగ్ చెప్పారు. వ్యయాల వృద్ధిలో ఎన్నికలు, క్రీడల వాటా కలిపి సుమారు 3 శాతంగా ఉండవచ్చని ఆయన తెలిపారు. "ప్రపంచవ్యాప్తంగా అడ్వర్టైజింగ్ వ్యయాలు 3.6 శాతం వృద్ధి చెందితే, భారత్‌లో అత్యధికంగా 14 శాతం వృద్ధితో రూ. 80,578 కోట్ల స్థాయికి చేరొచ్చని అంచనా వేస్తున్నాం" అని సింగ్ తెలిపారు. 2018లో అడ్వర్టైజింగ్ వ్యయాలు 15 శాతం వృద్ధితో రూ. 70,602 కోట్లకి చేరినట్లు అంచనాలు ఉన్నాయి. 

టీవీ మాధ్యమం 15శాతం.. 
ప్రకటనల వ్యయాల విషయంలో టీవీ మాధ్యమం 15 శాతం వృద్ధి చెంది రూ. 38,612 కోట్లకు, మొత్తం వ్యయాల్లో 48 శాతం వాటా దక్కించుకోవచ్చని గ్రూప్‌ఎం అంచనా. ప్రింట్ మీడియా వ్యయాల వృద్ధి 2.2 శాతంగాను (రూ. 18,368 కోట్లు) , మొత్తం వ్యయాల్లో వాటా 23 శాతంగాను ఉండనుంది. అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ వ్యయాలు రూ. 3,202 కోట్ల నుంచి రూ. 3,536 కోట్లకు పెరగనున్నాయి. 

  • చమురు ధరలు, ఇన్‌ఫ్రాతోనే సమస్య
     

ఏవియేషన్ రంగ సవాళ్లపై స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: చమురు ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం, ఆదాయం స్థిరంగా లేకపోవడం, విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల కొరత వంటి మూడు అంశాలు.. దేశీ విమానయాన రంగానికి ప్రధాన సవాళ్లుగా ఉంటున్నాయని ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ చెప్పారు. "ఎయిర్‌లైన్స్‌కి చమురు ధరలే పెద్ద రిస్కు. దీంతో సాధ్యమైనంత ఎక్కువగా ఇంధనాన్ని ఆదా చేసే విమానాలనే సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాం" అని ఆయన తెలిపారు. చమురు ధర ఇటీవల 86 డాలర్లకు ఎగిసినప్పుడు విమానయాన సంస్థలు తమ వ్యాపార వ్యూహాలను మార్చుకోవాల్సి వచ్చిందని, పొదుపుపై మరింతగా దృష్టి పెట్టాల్సి వచ్చిందని సింగ్ తెలిపారు. ఇ‍ప్పటికే అధిక సంఖ్యలో ఫ్లయిట్స్ నడిచే రూట్లలోనే కొత్తగా మరిన్ని వచ్చి చేరుతుండటం వల్ల అందరి లాభదాయకత దెబ్బతింటోందన్నారు. అయితే, ఈ రిస్కు క్రమంగా తగ్గుతోందని, వచ్చే ఏడాది.. రెండేళ్ల వ్యవధిలో భారత మార్కెట్ చాలా మెరుగ్గా ఉండగలదని ఆయన చెప్పారు. అటు మెట్రో నగరాల్లోని విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల (స్లాట్స్‌) కొరత ఎక్కువగా ఉంటోందన్నారు. మరోవైపు, రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో కన్నా తక్కువగా ఉండే ప్రాంతీయ రూట్లపై దృష్టి సారిస్తున్నామని సింగ్ చెప్పారు. ఒకటి రెండు రూట్లు తప్పితే ఉడాన్ (చిన్న పట్టణాలకు విమాన సేవల పథకం) కింద తీసుకున్న మిగతా రూట్లన్నీ మెరుగ్గానే ఉన్నాయని వివరించారు. You may be interested

కొన్ని ప్రధాన కంపెనీ క్యూ3 ఫలితాలు

Wednesday 13th February 2019

నాట్కో మధ్యంతర డివిడెండు రూ.3.50 హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ రంగ కంపెనీ నాట్కో ఫార్మా 2018-19 సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రెండవ మధ్యంతర డివిడెండుగా రూ.3.50 చెల్లించనుంది. ఈ నిర్ణయాన్ని బోర్డు మంగళవారం ఆమోదించింది. డిసెంబరు త్రైమాసికంలో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 26.7 శాతం తగ్గి రూ.159 కోట్లుగా నమోదయింది. యూఎస్‌ఏ మార్కెట్లో ఓసెల్టామివిర్‌ మార్జిన్‌ తగ్గడం వల్లే లాభం

మార్చి దాకా పొడిగింపు..

Wednesday 13th February 2019

టీవీ చానెల్స్‌ను ఎంచుకునేందుకు గడువు పెంచిన ట్రాయ్‌ ఇంకా ఎంపిక చేసుకోని వారికోసం 'బెస్ట్ ఫిట్ ప్లాన్' అమలు న్యూఢిల్లీ: కొత్త బ్రాడ్‌కాస్టింగ్‌, కేబుల్ సేవల విధానం కింద టీవీ వీక్షకులు తమకు కావాల్సిన చానల్స్‌ను ఎంచుకునేందుకు నిర్దేశించిన గడువును టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా మార్చి 31 దాకా పొడిగించింది. ఒకవేళ కస్టమర్లు నిర్దిష్టంగా చానల్స్‌ను ఎంచుకోని పక్షంలో సముచితమైన ప్లాన్‌ను (బెస్ట్ ఫిట్ ప్లాన్‌) వారికి అందించాలని

Most from this category