STOCKS

News


సెల్లార్‌లో బండరాళ్లొస్తే?

Friday 13th July 2018
personal-finance_main1531504641.png-18307

 
సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ నివాస ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. సెల్లార్‌ తవ్వే క్రమంలో పెద్ద బండరాళ్లు వచ్చాయి. దాన్ని తొలగించేందుకు ఓ కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ పనిని మరో సబ్‌–కాంట్రాక్టర్‌కు అప్పజెప్పారు మొదటి కాంట్రాక్టర్‌. పనిముట్లు, కూలీలతో తొలగించలేమని భావించిన సబ్‌–కాంట్రాక్టర్‌ బ్లాస్టింగ్‌ చేయాలని నిర్ణయించుకొని పేలుడు పదార్థాలను కొనుగోలు చేసి నిర్మాణ స్థలానికి తీసుకొచ్చాడు. అంతే! సమాచారం ఎవరందించారో తెలియదు గానీ క్షణాల్లో టాస్క్‌ఫోర్స్‌ చేరుకోవటం, సబ్‌–కాంట్రాక్టర్‌ను నిలదీయడంతో అతను నిర్మాణ సంస్థ యజమాని పేరు చెప్పడం,  పోలీసులు యజమాని మీద కేసు నమోదు చేయడం అంతా క్షణాల్లో జరిగిపోయాయి. వాస్తవానికి ఈ సంఘటనతో డెవలపర్‌కు ఎలాంటి సంబంధం లేదు. బ్లాస్టింగ్‌ చేయమని గానీ లేదా తవ్వకం పనిని సబ్‌–కాంట్రాక్ట్‌కు ఇవ్వమని గానీ ఒప్పందమేమీ చేసుకోలేదు. కానీ, అంతిమంగా కేసుంటూ కోర్టు చుట్టూ తిరుగుతుంది మాత్రం డెవలపరే!
... పై సంఘటన నగరంలోని చాలా మంది డెవలపర్లకు అనుభవమే. డెవలపర్, కేసు, సబ్‌–కాంట్రాక్టర్‌ విషయాలను పక్కన పెడితే.. అసలు చర్చించాల్సిన అంశం.. ‘‘సెల్లార్‌ తవ్వకంలో అడ్డువచ్చే బండరాళ్లను తొలగించే క్రమంలో పేలుడు జరపాల్సి వచ్చినప్పుడు వాటి అనుమతులు ఎవరిస్తారనే దాని గురించి!’’
సాధారణంగా నివాస లేదా వాణిజ్య సముదాయాలను నిర్మించేటప్పుడు సెల్లార్‌ తవ్వకం కోసం బ్లాస్టింగ్‌ చేయాల్సి వస్తుంది. భూమి లోపల 10 అడుగుల లోతు కంటే ఎక్కువ సెల్లార్‌ తవ్వే క్రమంలో పెద్ద బండరాళ్లు వస్తుంటాయి. వీటిని తొలగించే పనిని డెవలపర్లు కాంట్రాక్టర్‌కు అప్పచెబుతుంటారు. సాధ్యమైనంత వరకు సంబంధిత కాంట్రాక్టర్లు వీటిని కూలీలు, పనిముట్ల సహాయంతో తొలగిస్తుంటారు. పెద్ద పెద్ద బండరాళ్లు, కఠినమైన రాళ్లు వచ్చిన సందర్భాల్లో మాత్రం పేలుళ్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇదే డెవలపర్లకు నరకంగా మారింది. ఎందుకంటే బ్లాస్టింగ్‌ అనుమతులు ఏ ప్రభుత్వ విభాగం ఇస్తుంది? ఎన్ని రోజుల్లో అనుమతులొస్తాయి? అసలు ఫీజు ఎంత? ఎలాంటి పత్రాలను జత చేయాలి? వంటి విధివిధానాలేవీ లేవని ఓ డెవలపర్‌ ‘సాక్షి రియల్టీ’తో వాపోయారు.
చేతులు తడిపితేనే అనుమతులు..
బ్లాస్టింగ్‌ అనుమతుల కోసం కాళ్ల చెప్పులరిగేలా తిరిగితే తప్ప రాని పరిస్థితి. పైగా చేతి చమురూ వదులుకోవాల్సిందే. స్థానిక పోలీసులు, అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పి పని చేసుకోవాల్సి వస్తుందని.. దీంతో అనవసరంగా అవినీతి పెరుగుతుందని డెవలపర్లు చెబుతున్నారు. ఒక్క ప్రాజెక్ట్‌కు బ్లాస్టింగ్‌ అనుమతుల కోసం ఆరేడు నెలల దాకా వేచి ఉండాల్సి వస్తుందని దీంతో ప్రాజెక్ట్‌ వ్యయం పెరుగుతుందన్నారు. మున్సిపల్‌ శాఖ నుంచి వచ్చే నిర్మాణ అనుమతుల కంటే కష్టతరమైనవి బ్లాస్టింగ్‌ అనుమతులు రావటమని వాపోయారు.
విధివిధానాలుండాల్సిందే..
– పేలుళ్లకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ కోసం ప్రత్యేకంగా విభాగం, అధికారులు ఉండాలి. పేలుళ్లు జరిపే క్రమంలో పర్యవేక్షణ జరపాలి.
– దరఖాస్తు ప్రక్రియ, జత చేయాల్సిన పత్రాలతో కూడిన విధివిధానాలుండాలి.
– స్థానిక మున్సిపాలిటీలోనే నిర్మాణ అనుమతులతోనే పేలుడుకు సంబంధించిన అనుమతులు ఇస్తే బాగుంటుంది. 
– అన్ని సందర్భాల్లోనే పేలుడు పదార్థాలను వినియోగించకుండా సాధ్యమైతే రసాయనాలను వినియోగించే వీలుండాలి.
– స్థానికంగా ఉన్న ఇతర భవనాలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రక్షణ ఏర్పాట్లు తీసుకోని డెవలపర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.
 
మా పరిధి కాదంటే మాది కాదు..
‘‘బ్లాస్టింగ్‌ అనుమతుల కోసం ముందుగా తహశీల్దార్‌కు దరఖాస్తు పెట్టుకున్నాం. ఇవి మా పరిధిలోకి రావని.. కలెక్టరేట్‌కు వెళ్లాలని సూచించడంతో సంబంధిత డాక్యుమెంట్లను జత చేసి కలెక్టర్‌లో దరఖాస్తు చేసుకున్నాం. ఈ రోజు రేపని 10 రోజులు ఆఫీసు చుట్టూ తిప్పించుకొని తీరా బ్లాస్టింగ్‌ అనుమతులు మా పరిధిలోకి రావని సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనరేట్‌కు వెళ్లాలని సూచించారు. ఇక్కడ మరో రకం సినిమా. ప్రాపర్టీ డాక్యుమెంట్లు, ప్రాజెక్ట్‌ అనుమతి పత్రాలు, ఎక్కడి నుంచైతే పేలుడు పదార్థాలు కొనుగోలు చేస్తున్నారో అవి విక్రయించే విక్రయదారుని లైసెన్స్‌ వంటి చాంతడంతా పత్రాలెన్నో సమర్పించమన్నారు. అన్నీ ముట్టజెప్పినా అనుమతులు రాకపోవటం కొసమెరుపు. కారణం పత్రాలతో పాటూ ఎంతోకొంత చేతిలో పెట్టలేదని’’ ఇదీ ఓ డెలపర్‌కు ఎదురైన చేదు అనుభవం.
 You may be interested

5 నెలలు.. 30-80 శాతం రాబడి..

Saturday 14th July 2018

ఈ ఏడాది జనవరి 29న బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇన్‌ట్రాడేలో 36,443 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ట్రేడర్లు ప్రాఫిట్‌ బుక్‌ చేసుకోవడంతో అమ్మకాల ఒత్తిడి కారణంగా గత ఐదు నెలలుగా పడుతూ లేస్తూ  వచ్చిన సెన్సెక్స్‌ ఇన్‌ట్రాడేలో గత వారం జూలై 13 శుక్రవారం రోజున మళ్లీ జీవిత కాల గరిష్ట స్థాయి 36,740 పాయింట్లని తాకింది. అంటే జనవరి 29 నుంచి జూలై 12 వరకు చూసుకుంటే సెన్సెక్స్‌లో

పట్టాలెక్కిన రియల్టీ!

Friday 13th July 2018

 సాక్షి, హైదరాబాద్‌: దేశంలో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి మళ్లీ మంచి రోజులొచ్చాయి. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)లతో రియల్టీలో పారదర్శకతతో పాటూ సానుకూల వాతావరణం నెలకొంది. కొత్త గృహాల ప్రారంభాలు, అమ్మకాల్లోనే కాదు.. పాత ప్రాజెక్ట్‌లోని ఇన్వెంటరీ కూడా క్రమంగా తగ్గుతుందని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలైన ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణె, కోల్‌కతా, హైదరాబాద్‌ల్లో ఈ ఏడాది

Most from this category