STOCKS

News


బ్యాంక్‌లకు భలే అవకాశం

Friday 9th November 2018
news_main1541740941.png-21812

ముంబై: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) తాజా సంక్షోభం బ్యాంక్‌లకు మంచి అవకాశంగా మారనున్నట్లు సింగపూర్‌కు చెందిన డీబీఎస్‌ అంచనా వేసింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం రుణాల్లో 12-15 శాతం వాటా ఎన్‌బీఎఫ్‌సీలదేనని డీబీఎస్‌ ఆర్థిక వేత్త రాధిక రావు పేర్కొన్నారు. ‘‘ఇప్పుడు ఎన్‌బీఎఫ్‌సీలకు లిక్విడిటీ సమస్యలు తలెత్తడంతో ఈ వాటా రుణాలు బ్యాంక్‌లకు దక్కనున్నాయి. కాకపోతే ఈ రుణ డిమాండ్‌ను తట్టుకునే పరిస్థితుల్లో బ్యాంక్‌లు లేవు. మొండి బకాయిలు భారీగా పెరిగిపోవడంతో పలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లపై ఆర్‌బీఐ కఠిన చర్యల చట్రాన్ని బిగిస్తోంది. ఫలితంగా తాజా రుణాలను బ్యాంక్‌లు జారీ చేయలేవు’’ అని రాధిక వివరించారు. సూక్ష్మ, గృహ, వాహన గ్రామీణ రుణాలిచ్చే ఎన్‌బీఎఫ్‌సీలు బాగా విస్తరించాయని, భౌగోళికంగా బ్యాంక్‌లు ఈ స్థాయిలో చొచ్చుకుపోలేదని తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీల తాజా సంక్షోభం కారణంగా జీడీపీ అంచనాలను డీబీఎస్‌ తగ్గించే అవకాశాలున్నాయని కూడా చెప్పారామె. జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతంగా ఉండొచ్చని డీబీఎస్‌ అంచనా వేస్తోంది. ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభంపై  ఆమె ఇంకా ఏం చెప్పారంటే...
♦ ఈ సంక్షోభం కారణంగా ఎన్‌బీఎఫ్‌సీల ఆర్థిక స్థితిగతులు కుదేలయ్యాయి. ఫలితంగా ఈ షాడో బ్యాంక్‌ల రుణ వితరణ మందగిస్తుంది. 
♦  తాజా పరిస్థితుల కారణంగా ఎన్‌బీఎఫ్‌సీలపై  నియంత్రణలు మరింత కట్టుదిట్టమవుతాయి. 
♦  నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల నిర్వహణ పనితీరు కఠినంగా మారనున్నది. 
♦  ఫలితంగా ఎన్‌బీఎఫ్‌సీల రుణ వితరణ తగ్గుతుంది. దీంతో వాటి జోరుకు అడ్డుకట్ట పడటమే కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థలో రుణ వితరణ మందగిస్తుంది. ఇది ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపనుంది.
♦  రుణ వృద్ధి మందగమనం కారణంగా రుణ నాణ్యతపై ఆందోళన తగ్గుముఖం పడుతుంది. నష్ట భయం అధికంగా ఉన్న రుణాలు తగ్గి నాణ్యత గల రుణాలు పెరుగుతాయి. 
♦  సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలకు రెండేళ్ల క్రితం ఎన్‌బీఎఫ్‌సీల రుణాలు 8.4 శాతంగా ఉండగా, ఈ ఏడాది ఇది 11.3 శాతానికి పెరిగింది. ఈ వాణిజ్య సంస్థలకు బ్యాంక్‌లిచ్చిన రుణాలు 60 శాతం నుంచి 51 శాతానికి పడిపోయాయి. 
♦  ఈ ఏడాది సెప్టెంబర్‌లో 12.5 శాతంగా ఉన్న బ్యాంక్‌ రుణ వితరణ ఈ అక్టోబర్‌లో 14.4 శాతానికి పెరిగింది. ఎన్‌బీఎఫ్‌సీలు క్యాపిటల్‌/మనీ మార్కెట్ల నుంచి కాకుండా బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసుకోవడం పెరగడమే దీనికి ప్రధాన కారణం. 
♦  మార్కెట్‌ ఆధారిత రుణాలపై వడ్డీ వ్యయాలు పెరగడంతో పలు ఎన్‌బీఎఫ్‌సీలు బ్యాంక్‌ రుణాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. 
♦  పెద్ద ఎన్‌బీఎఫ్‌సీలు పబ్లిక్‌ ఇష్యూ‍ల ద్వారా నిధుల సమీకరించి, వ్యయాలను నియంత్రణలో ఉంచుకోగలవు. కానీ చిన్న  ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రత్యామ్నాయ మార్గాల్లో నిధులు సమీకరించడం కొంచెం కష్టంతో కూడుకున్న వ్యవహారమే. 



You may be interested

మరింతగా డిజిటల్‌ జోరు

Friday 9th November 2018

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగంపై డిజిటల్‌ ప్రభావం మరింత జోరుగా ఉండనున్నది. మొబైల్‌, ఆన్‌లైన్‌ వంటి డిజిటల్‌ చానెళ్ల ద్వారా జోరు మీదున్న బ్యాంకింగ్‌  రంగంపై  2022 నాటికి డిజిటల్‌ పరంగా మరింత జోరు కనిపించనున్నదని ఇన్ఫోసిస్‌ ఫినాకిల్‌, ఎఫ్మాల తాజా నివేదిక పేర్కొంది. ఇన్ఫోసిస్‌ అనుబంధ సం‍స్థ, ఎడ్జ్‌వెర్వ్‌ సిస్టమ్స్‌కు చెందిన ఇన్ఫోసిస్‌ ఫినాకిల్‌, అంతర్జాతీయ స్వచ్ఛంద సం‍స్థ, ఎఫ్మాలు పదవ ‘బ్యాంకింగ్‌ రంగంలో నవకల్పనలు’ పేరిట నివేదికను రూపాందించాయి.

ఆర్‌బీఐ, ప్రభుత్వం విభేదాలు పరిష్కరించుకోవాలి

Friday 9th November 2018

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య పలు అంశాల్లో విభేదాలు పొడచూపిన నేపథ్యంలో జాతి ప్రయోజనాల కోసం ఇరువురు కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ పనగరియా చెప్పారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ రెండూ రాజీ ధోరణితో విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. ‘‘అమెరికాలోని ఫెడరల్‌ రిజర్వ్‌తో పోలిస్తే భారత్‌లో ఆర్‌బీఐకి చట్టపరంగా తక్కువ స్వతంత్రత ఉంది. కానీ, ఆచరణలో ఫెడ్‌కు సమానమైన స్వతంత్రతను ఆర్‌బీఐ అనుభవిస్తోంది’’

Most from this category