STOCKS

News


బైక్‌ రైడ్‌ కావాలా? అయితే ‘రాపిడో’..!!

Saturday 6th October 2018
startups_main1538802692.png-20915

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మెట్రో నగరాల్లో ఒక చోటు నుంచి ఇంకో చోటుకు ప్రయాణించాలంటే? బస్సు, క్యాబ్‌ లేదా ఆటో తప్పనిసరి. వీటి చార్జీలూ కాస్త ఎక్కువే.. పైగా ట్రాఫిక్‌ సమస్య! అందుబాటు ధరలో.. సులువైన, సురక్షితమైన ప్రయాణం చేయాలంటే? బైక్‌ కరెక్ట్‌!! అలా అని సొంతంగా బైక్‌లను కొని అద్దెకివ్వాలంటే.. పెద్ద మొత్తంలోనే పెట్టుబడి కావాలి. అందుకే కాస్త డిఫరెంట్‌గా ఆలోచించారు ఐఐటీ భువనేశ్వర్‌ పూర్వ విద్యార్థుల త్రయం. ఓలా, ఉబర్‌లా మాదిరి బైక్‌ షేరింగ్‌ సేవలను ప్రారంభించారు. మరిన్ని వివరాలు రాపిడో కో–ఫౌండర్‌ అరవింద్‌ సంక ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.
మాది విజయవాడ దగ్గర్లోని తిరువూరు. ఐఐటీ భువనేశ్వర్‌లో ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక.. ఫ్లిప్‌కార్ట్‌లో చేరా. సొంతగా కంపెనీ ప్రారంభించాలన్న ఆలోచనతో ఐఐటీలో స్నేహితులైన పవన్‌ గుంటుపల్లి, రిషికేష్‌ ఎస్‌ఆర్‌లతో కలిసి 2015 నవంబర్‌లో బెంగళూరు కేంద్రంగా రాపిడోను ప్రారంభించాం. కస్టమర్ల రిజిస్ట్రేషన్‌ కోసం ట్రూ కాలర్‌తో ఒప్పందం చేసుకున్నాం. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేశాక.. రిజిస్టర్‌ విత్‌ ట్రూకాలర్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే చాలు. మొబైల్‌ నంబర్, ప్రొఫైల్, ఓటీపీ ఏవీ అవసరం లేకుండా రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. రైడర్స్‌కు బీమా సౌకర్యం ఉంటుంది. కస్టమర్‌ యాప్‌లో లాగిన్‌ అయి.. చేరాల్సిన గమ్యాన్ని ఎంట్రీ చేయగానే.. దగ్గర్లో అందుబాటులో ఉన్న బైక్‌లు కనిపిస్తాయి. డ్రైవర్‌ ప్రొఫైల్, ధర వస్తుంది. ఒకే చేయగానే రైడర్‌ రెండు హెల్మెట్లతో మీ దగ్గరికొస్తాడు. గమ్యస్థానాన్ని చేరుకున్నాక నగదు గానీ వ్యాలెట్‌ ద్వారా గానీ చెల్లింపులు చేయాలి. అంధులు, మానసిక వికలాంగుల కోసం రీడీమ్‌ ఫీచర్‌ను జోడించాం. గమ్యస్థానాన్ని వాయిస్‌ రూపంలో పలికితే అది టెక్ట్స్‌గా మారుతుంది. దీంతో పాటూ బ్యాంక్‌ ఖాతా అనుసంధానంతో వాలెట్‌ ద్వారా చెల్లింపులు పూర్తవుతాయి. 
ఏపీ, తెలంగాణల్లో 15 లక్షల రైడ్స్‌..
ప్రస్తుతం 15 లక్షల మంది కస్టమర్లున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 4 లక్షల మంది. రోజుకు 40 వేల రైడ్స్‌. తెలుగు రాష్ట్రాల నుంచి 8 వేల వరకూ ఉంటాయి. నెలవారీ బైక్‌ పాస్‌ కూడా ఉంటుంది. నెలకు 50 ట్రిప్పులకు రూ.1,500 చార్జీ. కి.మీ.కు రూ.3 చార్జీ ఉంటుంది. ప్రతి రైడ్‌పై 15–20 శాతం డ్రైవర్‌ నుంచి కమిషన్‌ తీసుకుంటాం. ప్రతి నెలా ఆదాయం 30 శాతం వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలతో పాటూ బెంగళూరు, గుర్గావ్, మైసూర్, భోపాల్, భువనేశ్వర్, పాట్నా, మధురై, కోయంబత్తూర్, ఇండోర్‌ వంటి 15 నగరాల్లో సేవలందిస్తున్నాం. త్వరలోనే సూరత్, జైపూర్‌ నగరాలకు విస్తరించనున్నాం. ఫిబ్రవరి నాటికి గుంటూరు, రాజమండ్రి, వరంగల్‌ల్లో సేవలను ప్రారంభిస్తాం. మొత్తంగా ఏడాది కాలంలో 50 నగరాలకు విస్తరించాలన్నది మా లక్ష్యం.
త్వరలోనే మెట్రోతో ఒప్పందం..
ప్రయాణికుల రైడ్స్‌తో పాటూ ఈ–కామర్స్‌ డెలివరీ సంస్థలతోనూ ఒప్పందాలున్నాయి. ఫుడ్, ఫార్మా డెలివరీ కోసం.. స్విగ్గీ, కేర్, అపోలో హోమ్‌ హెల్త్‌ సంస్థలతో భాగస్వాములమయ్యాం. త్వరలోనే మెట్రో స్టేషన్లతో రాపిడోను అనుసంధానిస్తాం. దీంతో మెట్రో రైల్‌లో దిగిన కస్టమర్లు రైడ్‌ను బుక్‌ చేసుకునే వీలుంటుంది. మెట్రో కార్డుతో చెల్లింపులు చేసుకునేందుకు వీలుగా హైదరాబాద్‌ మెట్రో రైల్‌తో ఒప్పందం చేసుకోనున్నాం.
జనవరి నాటికి రూ.10 కోట్ల నిధులు..
ప్రస్తుతం 200 మంది ఉద్యోగులున్నారు. ప్రీ సిరీస్‌ ఏ రౌండ్‌లో హీరో మోటోకార్ప్‌ చైర్మన్‌ పవన్‌ ముంజాల్, గూగుల్‌ ఇండియా ఎండీ రాజన్‌ ఆనందన్‌ సహా పలువురు ఇన్వెస్టర్లు రూ.15 కోట్ల పెట్టుబడి పెట్టారు. జనవరి నాటికి రూ.10 కోట్ల నిధులను సమీకరించనున్నాం. ఇందులో పాత ఇన్వెస్టర్లతో పాటూ పలువురు వీసీలూ పాల్గొంటారు’’ అని అరవింద్‌ వివరించారు.
 
 You may be interested

10 నుంచి అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్’

Saturday 6th October 2018

న్యూఢిల్లీ: దసరా సందర్భంగా ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌... ‘గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్’ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈనెల 10 నుంచి 15 వరకు జరిగే సేల్‌లో 4 లక్షల మంది అమ్మకందారులు తమ ఉత్పత్తులను అందించనున్నారని వెల్లడించింది. ప్రైమ్ మెంబర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ... వీరికి ప్రత్యేకంగా 9న మధ్యాహ్నం 12 గంటలకు సేల్‌ ప్రారంభం కానుంది. ప్రైమ్‌ సభ్యులు కానివారికి మాత్రం 10వ తేదీన సేల్‌ ఆరంభమవుతుంది.

భారత ఆహ్వానం అందుకున్న హువావే

Saturday 6th October 2018

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ సంస్థ 'హువావే'కు భారత ప్రభుత్వ ఆహ్వానం అందింది. ప్రస్తుతం భారత్‌లో కొనసాగుతున్న 5జీ ట్రయల్స్‌లో భాగస్వామి కావాలని కోరుతూ టెలికం శాఖ సెప్టెంబరు 27న తమకు అధికారికంగా ఆహ్వానం ఇచ్చిందని సంస్థ ఇండియా సీఈఓ జే చెన్ వెల్లడించారు. ‘ట్రయల్స్‌ కోసం ప్రాంతాల ఎంపికకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని, 5జీ ట్రయల్స్‌కు 100 మెగాహెడ్జ్‌ స్పెక్ట్రం కేటాయించాలని భావిస్తున్నామని

Most from this category