STOCKS

News


ఇడ్లీ దోశ వడ!

Friday 6th July 2018
startups_main1530899628.png-18101

  •  రెడీ టు కుక్‌లో అతివేగంగా ఎదిగిన ఐడీ ఫ్రెష్‌
  •  రూ.150 కోట్లు ఇన్వెస్ట్‌ చేసిన అజీమ్‌ ప్రేమ్‌జీ
  •  ఏటా రూ.275 కోట్ల వ్యాపారం; ఐదేళ్లలో వెయ్యి కోట్ల లక్ష్యం
  •  దేశంలో 20 వేల స్టోర్లు; హైదరాబాద్‌లో 2,200
  •  త్వరలోనే ఒమన్, సౌదీలో.. ఆ తర్వాత శ్రీలంక, సింగపూర్‌కు
  •  ‘స్టార్టప్‌ డైరీ’తో ఐడీ ఫ్రెష్‌ ఫౌండర్‌ పీసీ ముస్తఫా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్టార్టప్స్‌కు నిధులను సమీకరించడం పెద్ద సవాలే. వినూత్న ఆలోచన, భవిష్యత్తు మార్కెట్‌ అవకాశాలుంటే తప్ప అంత త్వరగా పెట్టుబడులు రావు. అలాంటిది ఇడ్లీ, దోశ, వడ పిండిలను విక్రయించే సంస్థలో దిగ్గజ పారిశ్రామికవేత్త, విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌ జీ పెట్టుబడి పెట్టడమంటే మాములు మాట కాదు. రెడీ టు కుక్‌ రంగంలో తనదైన ముద్రవేసిన బెంగళూరు కంపెనీ ‘ఐడీ ఫ్రెష్‌ ఫుడ్స్‌’ మన దేశంలోనే కాదు! విదేశాల్లోనూ ఇడ్లీ, దోశ ఉత్పత్తులను విక్రయిస్తోంది. రోజుకు రూ.20 కోట్ల వ్యాపారం చేస్తున్న ఐడీ ఫ్రెష్‌ ఫుడ్స్‌ వ్యవస్థాపక సీఈఓ పీసీ ముస్తఫా ఓ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ‘స్టార్టప్‌ డైరీ’తో మాట్లాడారు. ఆయనేమంటారంటే..
‘‘మాది కేరళలోని చెన్నాలోడె అనే మారుమూల గ్రామం. నిరుపేద కుటుంబం కావటంతో మూడు పూట్లా తిండే కష్టం. ఇక పొద్దున్నే టిఫిన్స్‌ అంటే లగ్జరీనే. చదువే దారి చూపిస్తుందని కష్టపడి కోల్‌కతాలోని ఆర్‌ఈసీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేశా. ఆ తర్వాత మోటరోలా, సిటీ బ్యాంక్, ఇంటెల్‌ సంస్థల్లో ఇండియాతో పాటు యూరప్, మధ్యప్రాచ్య దేశాల్లో పనిచేశా. తర్వాత ఐఐఎం బెంగళూర్లో ఎంబీఏ కూడా పూర్తి చేశా. ఓసారి బెంగళూరులోని మా కజిన్‌ వాళ్లింటికి వెళ్లా. వాళ్లకు ఇంద్రానగర్‌లో ఓ చిన్న కిరాణా షాపుంది. రోజూ అక్కడ లోకల్‌ బ్రాండ్‌ ఇడ్లీ, దోశ ప్యాకెట్స్‌ బోలెడన్ని అమ్మకాలుండేవి. ఓసారి షాపులో కూర్చన్న నాకు.. ఇది ఆశ్యర్యం కలిగించింది. నాణ్యత, దినుసుల ఎంపిక వంటివేవీ పట్టించుకోకుండా ప్యాకేజ్డ్‌ ఫుడ్‌కు ఇంత మార్కెట్‌ ఉందా అని! దీన్నే తాజాగా, అందుబాటు ధరల్లో అందిస్తే ఎలా ఉంటుందనుకున్నా!! మా కజిన్‌తో కలిసి రూ.50 వేల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా ఐడీ ఫ్రెష్‌ ఫుడ్‌ను ప్రారంభించాం. వండుకునేందుకు సిద్ధమైన రెడీ టు కుక్‌ ప్యాకెట్స్‌.. అది కూడా ప్రతి రోజూ తాజా ఉత్పత్తులు, వినూత్న ప్యాకేజింగ్, అందుబాటు ధర ఇదీ ఐడీ ఫ్రెష్‌ ఫుడ్స్‌ ప్రత్యేకత.
ఐడీ ఫ్రెష్‌ నుంచి 8 ఉత్పత్తులు..
ప్రస్తుతం ఐడీ ఫ్రెష్‌ నుంచి ఇడ్లీ, దోశ, వడ, రాగి ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, మలబార్‌ పరాఠా, గోధుమ పరాఠా, పన్నీర్‌ పిండి 8 రకాల ఉత్పత్తులున్నాయి. త్వరలోనే ఫిల్టర్‌ కాఫీ డికాక్షన్, టమోట, కొబ్బరి చట్నీలను తెస్తున్నాం. వచ్చే రెండేళ్లలో 15 ఉత్పత్తులను విపణిలోకి తీసుకురావాలన్నది మా లక్ష్యం. ప్రస్తుతం బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్, దుబాయ్‌లో 6 తయారీ కేంద్రాలున్నాయి. ఆయా ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 15 లక్షల ఇడ్లీలు. త్వరలోనే బెంగళూరులో మరో భారీ ప్లాంట్‌ను నిర్మించనున్నాం. ఉత్పత్తి ప్రారంభమయ్యాక దీని సామర్థ్యం రోజుకు కోటి ఇడ్లీలకు చేరుతుంది. పిండి రుబ్బడానికి అమెరికాకు చెందిన ఓ సంస్థతో కలిసి సొంతంగా మిషన్లను అభివృద్ధి చేశాం. ఈ మిషన్‌ గంటకు 1,500 కిలోల పిండి రుబ్బుతుంది.
20 వేల స్టోర్లు; రోజుకు రూ.20 కోట్ల వ్యాపారం..
మన దేశంతో పాటూ దుబాయ్‌లోనూ ఐడీ ఫ్రెష్‌ ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. మొత్తం 20 వేల స్టోర్లున్నాయి. హైదరాబాద్‌లో 2,200, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుల్లో 1,200 స్టోర్లున్నాయి. వచ్చే ఏడాది కాలంలో హైదరాబాద్‌లో 3 వేల స్టోర్లతో పాటు వరంగల్, కర్నూల్‌ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించాలని లక్ష్యించాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు రూ.20 కోట్ల వ్యాపారం చేస్తున్నాం. హైదరాబాద్‌లో రోజుకు రూ.2 కోట్లు, ఏపీలో రూ.80 లక్షల వ్యాపారం ఉంది. మా మొత్తం ఆదాయంలో బెంగళూరు నుంచి 40 శాతం, హైదరాబాద్‌ నుంచి 16 శాతం వాటా వస్తోంది.
ఐదేళ్లలో వెయ్యి కోట్లు లక్ష్యం..
ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో రూ.275 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. గత ఆర్ధిక సంవత్సంలో ఇది రూ.182 కోట్లు.  వచ్చే ఐదేళ్లలో వెయ్యి కోట్ల టర్నోవర్‌ను లక్ష్యించాం. త్వరలోనే ఒమన్, సౌదీ దేశాలకు ఆ తర్వాత సింగపూర్, శ్రీలంక, అమెరికా వంటి దేశాలకు విస్తరించనున్నాం. ప్రస్తుతం కంపెనీలో 1,600 మంది ఉద్యోగులున్నారు. త్వరలో ఈ సంఖ్యను 2 వేలకు చేరుస్తాం. ఇప్పటివరకు రెండు రౌండ్లలో రూ.185 కోట్ల నిధులను సమీకరించాం. హీలియన్‌ వెంచర్‌ పార్టనర్స్‌ రూ.35 కోట్లు, అజీజ్‌ ప్రేమ్‌ జీ రూ.150 కోట్లు పెట్టుబడులు పెట్టారు... అని ముస్తఫా వివరించారు.
 You may be interested

టాప్‌ డౌన్‌ లేదా బాటమ్‌ అప్‌... ఏది అనుసరణీయం?

Saturday 7th July 2018

స్టాక్‌ మార్కెట్‌ అప్‌ట్రెండ్‌లో ఉన్న సమయంలో ‘బాటమ్‌ అప్‌’ విధానం స్టాక్స్‌ ఎంపికకు మంచిగా పనిచేస్తుంది. అదే బలహీన మార్కెట్‌లో ‘టాప్‌ డౌన్‌’ విధానం అక్కరకొస్తుంది. వీటి ఆధారంగానే విదేశీ బ్రోకరేజీ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ 1,600 మంది భారత ఫండ్‌ పథకాలను పరిశీలించి గణాంకాలను రూపొందించింది. ఆ వివరాలే ఇవి...   రెండింటి మధ్య వైవిధ్యం బాటమ్‌ అప్‌ విధానంలో ఇన్వెస్టర్లు ఆర్థిక రంగం లేదా ఓ కంపెనీ ఉన్న

దశలవారీగా జీఎస్‌టీలోకి పెట్రోలియం ఉత్పత్తులు

Friday 6th July 2018

న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులను కూడా వస్తు, సేవల పన్నుల విధానం పరిధిలోకి తెచ్చే అంశాన్ని జీఎస్‌టీ కౌన్సిల్ పరిశీలిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి హస్‌ముఖ్ అధియా తెలిపారు. వీటిని జీఎస్‌టీలోకి చేర్చడం దశలవారీగా జరగవచ్చని పేర్కొన్నారు. జీఎస్‌టీని సమగ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, అయితే  మరింత మెరుగుపర్చేందుకు చేయాల్సినది ఇంకా చాలా ఉందని అధియా తెలిపారు. మొత్తం రీఫండ్ ప్రక్రియ అంతా కూడా ఆటోమేటిక్‌గా జరిగిపోయేలా

Most from this category