STOCKS

News


నష్టాలు వచ్చాయా...? పన్ను ఆదా చేసుకోవచ్చు

Monday 18th February 2019
personal-finance_main1550473415.png-24243

నష్టాలు వచ్చాయా...? పన్ను ఆదా చేసుకోవచ్చు...
నష్టాల్లో ఎన్నో రకాలు
ఇల్లు, వృత్తి లేదా వ్యాపారం, ఆదాయం, స్పెక్యులేషన్‌
ముందుగా ఆయా విభాగంలోనే సర్దుబాటు
ఆ తర్వాత మిగిలిన విభాగాల్లో
నష్టాలు ఇంకా మిగిలితే తర్వాతి సంవత్సరాలకు బదిలీ
సకాలంలో రిటర్నులు వేయడం తప్పనిసరి

ఆర్థిక సంవత్సరం చివర్లో ఆదాయపన్ను ఆదా కోసం వివిధ పెట్టుబడి సాధనాల గురించి అన్వేషించడం ఎక్కువ మంది చేసే పని. అయితే, పన్ను ఆదాకు ఇదొక్కటే మార్గం కాదు. పరిశీలిస్తే ప్రత్యామ్నయాలూ కనిపిస్తాయి. కనుక  ప్రతి ఒక్కరూ తమ వ్యాపారంలో నష్టాలనూ గుర్తు చేసుకోక తప్పుదు. వ్యాపారం లేదా స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడిపై నష్టాలు అయినా కావచ్చు. ఈ నష్టాలు ఆదాయపన్ను భారాన్ని తగ్గిస్తాయి. ఈ నష్టాలను ఒకే ఆర్థిక సంవత్సరంలో ఆదాయం నుంచి పూర్తిగా మినహాయించి చూపించుకోలేని పరిస్థితుల్లో తర్వాతి సంవత్సరాలకు బదలాయించుకోవచ్చు. తద్వారా రానున్న ఆర్థిక సంవత్సరాల్లోనూ పన్ను భారం తగ్గించుకునే మార్గం ఉంది.వచ్చిన ఆదాయం నుంచి నష్టాలను మినహాయించి చూపించుకోవడం ద్వారా మొత్తం మీద చెల్లించే పన్ను తగ్గిపోతుంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్లు 7-74 వరకు ఈ ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. అయితే, ఈ ప్రయోజనాలకు సంబంధించి పరిమితులు కూడా ఉన్నాయి. అవేంటన్నది తెలియజేసే కథనమే ఇది. 

ఎన్ని రకాలు
ఆదాయపన్ను చట్టం ప్రకారం ఐదు రకాల ఆదాయ వర్గాలు ఉ‍న్నాయి. వేతనం, ఇంటి అద్దె, వ్యాపారం లేదా వృత్తి, మూలధన లాభాల పన్ను (క్యాపిటల్‌ గెయిన్స్‌), ఇతర వనరులు. వేతనంలో నష్టాలనేవి ఉండవు. ఇతర ఆదాయాలపై నష్టాలకు అవకాశం ఉంటుంది. ఇక ఒకే కేటగిరీలో ఒక దానిపై లాభం, మరో దానిపై నష్టానికి కూడా వీలుంటుంది. దీంతో నికరంగా నష్టానికి దారితీయవచ్చు. ఉదాహరణకు ప్రాపర్టీ కేటగిరీలో ఒక ఇంటి పై మూలధన లాభాల పన్ను వస్తే, మరో ఇంటిపై మూలధన నష్టం ఎదురుకావచ్చు. అలాగే, ఒక కంపెనీ షేరులో పెట్టుబడిపై లాభాలు, మరో కంపెనీ షేరుపై నష్టాలు ఎదురుకావచ్చు. ఏదేనీ ఒక మార్గంలో వచ్చే ఆదాయానికి ఆదాయ పన్ను మినహాయింపు ఉంటే, ఆ విభాగంలో నష్టాలపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు వ్యవసాయ ఆదాయంపై పన్ను ఉండదని తెలిసిందే. కనుక వ్యవసాయంపై వచ్చే ఆదాయానికి పన్ను లేనప్పుడు... వ్యవసాయంలో వచ్చే నష్టాలను పన్ను మినహాయింపు ప్రయోజనానికీ అవకాశం ఉండదు. 

వరుసక్రమం
నష్టాలను ఆదాయం నుంచి మినహాయించి చూపించుకోవడానికి, తర్వాతి సంవత్సరాలకు బదిలీ చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు వాటి విషయంలో వరుసక్రమాన్ని పాటించాలి. ముందుగా ఒక విభాగంలో వచ్చిన నష్టాలను ఆ విభాగంలోని నష్టాలతోనే సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీన్నే అంతర్గత సర్దుబాటు (ఇంట్రాహెడ్‌) అంటారు. అంటే వ్యాపార విభాగంలో ఒక వ్యాపారంపై ఆదాయం, మరో వ్యాపారంపై నష్టాలు వచ్చినప్పుడు వీటి మధ్య సర్దుబాటు చేసుకోవడం. ఇలా ఒక విభాగంలో సర్దుబాటు తర్వాత నికర నష్టాలు ఉంటే, అప్పుడు వాటిని ఇతర విభాగాల్లోని ఆదాయంలో సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని రెండు విభాగాల మధ్య సర్దుబాటు (ఇంటర్‌ హెడ్‌)గా చెబుతారు. ఉదాహరణకు ఇంటిపై వచ్చే మూలధన నష్టాన్ని వేతనం నుంచి మినహాయింపు కోరవచ్చు. ఒకవేళ ఇతర విభాగంలోని ఆదాయంతో సర్దుబాటు చేసుకున్న తర్వాత కూడా ఇంకా నష్టాలు మిగిలి ఉంటే చట్ట ప్రకారం వాటిని తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో సర్దుబాటు చేసుకునేందుకు గాను బదిలీ చేసుకోవచ్చు. 

నియంత్రణలు
మూలధన నష్టాలన్నవి కేవలం మూలధన లాభాలతోనే సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. స్వల్పకాల మూలధన నష్టాలను స్వల్పకాల మూలధన లాభాలతోపాటు దీర్ఘకాలిక మూలధన లాభాలతోనూ సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ, దీర్ఘకాల మూలధన నష్టాలు మాత్రం కేవలం దీర్ఘకాలిక మూలధన లాభాలతోనే సర్దుబాటు చేసుకునేందుకు చట్టం అనుమతిస్తోంది. అలాగే, జూదం, గుర్రం పందేలు, పేకాట, లాటరీలు తదితర వాటిపై వచ్చే నష్టాన్ని అదే తరహా కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంతోనే సర్దుబాటు చేసుకునేందుకు వీలుంటుంది. స్పెక్యులేటివ్‌ కార్యకలాపాలపై వచ్చే నష్టాలను కూడా అదే ఆదాయంతోనే సర్దుబాటు చేసుకోవడానికే అవకాశం ఉటుంది. ఇతర వ్యాపారం, వృత్తి ద్వారా వచ్చే నష్టాన్ని వేతనంలో సర్దుబాటు చేసుకునేందుకు లేదు. ఇక ఇంటిపై వచ్చే నష్టానికి మాత్రం ఎన్నో విధాల వెసులుబాటు ఉంటుంది. ఇంటిపై రుణానికి చెల్లించే వడ్డీ కారణంగా ఎదురయ్యే నష్టాలను... పేకాట, పందేలు, లాటరీలు మినహా ఇతర ఏ ఆదాయంలో అయినా మినహాయింపు చూపించుకోవచ్చు. అయితే, రూ.2 లక్షల వరకే ఇందుకు పరిమితి విధించారు. ఇంతకు మించి నష్టాలు ఉంటే తర్వాతి సంవత్సరానికి బదలాయించుకోవచ్చు. గతేడాది మార్చి వరకు దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నుకు మినహాయింపు ఉంది. దీంతో దీర్ఘకాలిక మూలధన నష్టాలు వస్తే సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం ఉండేది కాదు. కానీ, 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.లక్ష మించి ఉంటే 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో దీర్ఘకాలిక మూలధన నష్టాలు వస్తే లాభాల నుంచి మినహాయించుకునేందుకు అవకాశం లభించింది. 

భవిష్యత్‌ ఆర్థిక సంవత్సరాలకు నష్టాలను క్యారీ ఫార్వార్డ్‌ చేసుకునేందుకు రెండు ప్రధాన పరిమితులు ఉన్నాయి. ఒక విభాగంలో వచ్చిన నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో అదే విభాగంలో లాభాలు వస్తేనే సర్దుబాటు చేసుకునేందుకు వీలుంటుంది. ఉదాహరణకు ఓ ఇంటిపై నష్టాలు వచ్చాయనుకుంటే... తర్వాతి ఆర్థిక సంవత్సరంలో ఇంటిపై ఆదాయంలోనే సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఒక ఆర్థిక సంవత్సరంలో మిగిలిపోయిన నష్టాలు తదుపరి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల వరకు క్యారీ ఫార్వార్డ్‌ చేసుకోవచ్చు. ఇంటిపై నష్టాలు, మూలధన నష్టాలు, స్పెక్యులేటివ్‌ మినహా ఇతర నష్టాలకే ఈ అవకాశం పరిమితం. అయితే, నష్టాలను ఆదాయం, లాభాల నుంచి సర్దుబాటు చేసుకుని పన్ను భారం దింపుకోవాలంటే కచ్చితంగా నిర్ణీత సమయానికి ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడం తప్పనిసరి. మూలధన నష్టాలు, వ్యాపారం లేదా వృత్తిపై వచ్చే నష్టాలను బదలాయించుకోవాలంటే నిర్ణీత గడువు దాటిపోకుండా రిటర్నులు వేసి అందులో చూపించుకోవాలి. ఒక్క ఇంటిపై నష్టాలను మాత్రం ఆలస్యంగా రిటర్నులు వేసినా కానీ తదుపరి ఆర్థిక సంవత్సరాలకు వాటిని క్యారీ ఫార్వార్డ్‌ చేసుకోవచ్చు. 



You may be interested

దీర్ఘకాలంలో బంపర్‌ రాబడులు!

Monday 18th February 2019

ఎల్‌అండ్‌టీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ దీర్ఘకాలంలో అద్భుతమైన రాబడులతో ఎల్‌అండ్‌టీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ ఈ విభాగంలోనే మేటి పథకంగా ఉంది. దీర్ఘకాలానికి తక్కువ రిస్క్‌, అధిక రాబడులు ఆశించే వారు ఈ పథకంలో పెట్టుబడులను పరిశీలించొచ్చు. దీర్ఘకాలంలో మంచి పనితీరును చూపడమే కాకుండా మార్కెట్‌ కరెక్షన్లలో నష్టాలను పరిమితం చేయడాన్ని ఈ పథకంలో గమనించొచ్చు. పోర్ట్‌ఫోలియో నిర్మాణంలో రిస్క్‌ను తగ్గించే చర్యలను ఈ పథకం అనుసరిస్తోంది.  రాబడులు ఈ పథకంలో దీర్ఘకాలిక రాబడులు చాలా మెరుగ్గా

స్లాబ్‌ మారకుండా పన్ను ఊరట ఎలా ?

Monday 18th February 2019

 ప్ర: నేను గత ఏడేళ్ల నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఇక ఇప్పటి నుంచి నేరుగా షేర్లలోనే ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. షేర్లలో నేరుగా ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జ: నేరుగా షేర్లలో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు మూడు ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది. మీరు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న కంపెనీ గురించి సమాచారం తెలుసుకోవాలి. రెండోది మ్యూచువల్‌ ఫండ్స్‌తో పోల్చితే షేర్లపై స్టాక్‌ మార్కెట్‌

Most from this category