STOCKS

News


రుణానికి కొత్త రూటు.. పీ2పీ

Monday 21st January 2019
personal-finance_main1548049313.png-23689

  • సులభంగా రుణాలు పొందే చోటు
  • మరొకరికి రుణాలను ఆఫర్‌ చేయడానికీ ఇదే మార్గం
  • ఒకరికి అవసరం.. మరొకరికి రాబడి

పీర్‌ టు పీర్‌ (పీటూపీ) లెండింగ్‌కు 2018 మంచి ప్రోత్సాహకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. పీటూపీ సంస్థలను ఎన్‌బీఎఫ్‌సీలుగా ఆర్‌బీఐ గుర్తించి, లైసెన్స్‌లను మంజూరు చేసింది గతేడాదే. దీంతో క్రౌడ్‌ ఫండింగ్‌ వేదికలకు అధికారిక గుర్తింపు లభించింది. దేశంలో 2016 నాటికి 30కి పైగా పీటూపీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, వీటిలో 11 సంస్థలకు గతేడాది ఎన్‌బీఎఫ్‌సీ-పీటూపీ లైసెన్స్‌లు ఆర్‌బీఐ నుంచి లభించాయి. వీటిల్లో తొలి లైసెన్స్‌ను పొందిన సంస్థగా ఫెయిర్‌సెంట్‌ గుర్తుండిపోతుంది. మార్కెట్లో పెద్ద సంస్థ కూడా ఇదే. ఓఎంఎల్‌పీటూపీ, క్యాష్‌కుమార్‌, మానెక్సో, ఐటూఐ ఫండింగ్‌, ఫించీ, పీర్‌లాండ్‌, లెండెన్‌క్లబ్‌, పైసాదుకాణ్‌ తదితర సంస్థలు లైసెన్స్‌లు పొందిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. 2018 ఈ రంగానికి పునాది వేసిన సంవత్సరం అయితే, 2019 ప్రోత్సాహకరంగా ఉంటుందని... ఈ ఏడాది పీటూపీ సంస్థలు రూ.1,000-1,5000 కోట్ల వరకు రుణాలు మంజూరు చేయవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ఎటువంటి క్రెడిట్ స్కోర్‌ లేకపోయినా రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్న... పీటూపీ సంస్థలపై సమగ్ర కథనమే ఇది.

పీర్‌ టు పీర్‌ లెండింగ్‌ అంటే?
పీర్‌ టు పీర్‌ లెండింగ్‌ను పీటూపీ లెండింగ్‌గా కూడా పిలుస్తారు. ఇది క్రౌడ్‌ ఫండింగ్‌ తరహాలో ఉంటుంది. ఎవరైనా కానీ, రుణాలు ఆశించే వారు, రుణాలు ఇవ్వాలనుకునే వారు ఎవరి సాయం అవసరం లేకుండా ఈ పీటూపీ లెండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నేరుగా లావాదేవీలు చేసుకోవచ్చు. సంప్రదాయ విధానంలో రుణాలిచ్చే సంస్థల వద్ద అప్పు పుట్టని వారికి పీటూపీ వేదికలు అనువుగా ఉంటాయి. అధిక వడ్డీ రాబడి ఆశించే వారు పీటూపీ ద్వారా రుణాలు ఇచ్చుకోవచ్చు. పీటూపీ ప్లాట్‌ఫామ్‌లపై రుణాలు కావాలనుకునే వారు, రుణాలు ఇవ్వాలనుకునే వారు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికంటే ముందు అన్ని నియమ, నిబంధనలు, రిస్క్‌ వివరాలను తెలుసుకుని జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అన్ని పీటూపీ ప్లాట్‌ఫామ్‌లను ఆర్‌బీఐ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలుగా ప్రస్తుతం పరిగణిస్తోంది. కనుక వీటిపై ఆర్‌బీఐ నియంత్రణ ఉంటుంది.
రుణదాతలు అయితే...
పీటుపీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా రుణాలు ఇచ్చి మంచి ఆదాయం గడిద్దామనుకునే వారు ముందు చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. గుర్తింపు పొందిన పీటుపీ ప్లాట్‌ఫామ్‌లు కచ్చితమైన మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. సమాచార భద్రత, సమాచార వెల్లడి, రుణ గ్రహీత సమాచారాన్ని క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరోలకు ఇవ్వడం, అలాగే, పలు అంశాలకు సంబంధించి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఆన్‌లైన్‌ ప్రపంచంలో ఎన్నో ప్లాట్‌ఫామ్‌లు పీటూపీ సేవలను ఆఫర్‌ చేస్తుంటే, వీటిలో ఎన్‌బీఎఫ్‌సీ-పీటూపీగా ఆర్‌బీఐ వద్ద పేర్లను నమోదు చేసుకున్నవి కొన్నే. ‘‘సంబంధింత ప్లాట్‌ఫామ్‌పై రుణాల పరిమాణం ఎంత?, ఎంత మంది రుణ గ్రహీతలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు, రుణాలు మంజూరు వంటివి కంపెనీ ప్రణాళికలు. వ్యాల్యూమ్‌ తక్కువగా ఉంటే, దీర్ఘకాలం పాటు రుణ గ్రహీత లభించకపోవచ్చు. పీటూపీ లెండింగ్‌ కంపెనీ నుంచి ఈ వివరాలే తెలుసుకోవాలి’’ అని ఐటూఐ ఫండింగ్‌ సహ వ్యవస్థాపకుడు రాఘవేంద్ర ప్రతాప్‌ సింగ్‌ తెలిపారు. రుణ ఎగవేతల శాతం ఏ విధంగా ఉందని, తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో జాప్యం జరిగితే, లేదా ఎగవేస్తే ఏంటి పరిస్థితి? అన్న వాటిపైనా దృష్టి సారించాలి. ప్రతీ పీటూపీ సంస్థ పారదర్శకతలో భాగంగా పోర్ట్‌ఫోలియో పనితీరు సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. అయితే, చాలా సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌పై రుణ ఎగవేతలు ఏ స్థాయిలో ఉన్నదన్న దానిపై సమగ్ర వివరాలను బహిర్గతం చేయడం లేదు. అయితే, సంబంధిత ప్లాట్‌ఫామ్‌ ద్వారా రుణాలు ఇవ్వాలనుకునే వారు ఈ వివరాలను అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యతను విస్తరించొద్దు. రుణ చెల్లింపుల్లో జాప్యం, ఎగవేతల పట్ల సంబంధిత పోర్టల్‌ ఏ విధమైన చర్యలు తీసుకుంటది, ఎలా రికవరీ చేస్తుందనేది కీలకం. అలాగే చట్టపరమైన ప్రక్రియల గురించి కూడా తెలుసుకోవాలి.
రాబడులు ఏ మేర...
రుణాలు తీసుకునే వారి అర్హతలపై రుణాలిచ్చే వారి రాబడులు ఆధారపడి ఉంటాయి. భిన్న రిస్క్‌ కేటగిరీల గురించి ముందు తెలుసుకోవాలి. అప్పుడు రాబడులపై స్పష్టత వస్తుంది. అధిక సగటు రాబడులు వస్తున్నాయంటే అదే స్థాయిలో రిస్క్‌ కూడా ఉంటుందని తెలుసుకోవాలి. కనుక భిన్న విభాగాల్లో రుణాలు ఇవ్వడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. రుణ గ్రహీత పేరు, ఇతర సమాచారాన్ని పీటూపీ ప్లాట్‌ఫామ్‌ వెల్లడించకపోవచ్చు. అయితే, రుణం ఇచ్చేవారిగా తీసుకునే వారి వివరాలను అడిగి తెలుసుకునే హక్కు ఉంటుంది. అందుకని వెబ్‌సైట్‌లో వెల్లడించకపోయినా అడిగి తెలుసుకోవాలి.
రుణ గ్రహీతలు అయితే...
ఇతర మార్గాలలో రుణాలు లభించని వారు సహజంగానే పీటూపీ ప్లాట్‌ఫామ్‌లవైపు చూడొచ్చు. ఈ తరహా వ్యక్తులు పీటూపీ ప్లాట్‌ఫామ్‌ వేదికలపై తమ పేర్లు, ఇతర వివరాలతో నమోదు చేసుకుని, రుణాలు తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ముందుగా మీరు పేరు నమోదు చేసుకుంటున్న సంస్థకు ఆర్‌బీఐ అనుమతి ఉందా? అని. చాలా సంస్థలు వేగంగా రుణ సదుపాయం కల్పిస్తున్నప్పటికీ ఆర్‌బీఐ వద్ద తమ పేర్లను నమోదు ఎన్‌బీఎఫ్‌సీ-పీటూపీ రిజిస్ట్రేషన్‌ పొంది వ్యాపారం చేస్తున్నవి కొన్నే. ఆర్‌బీఐ గుర్తింపు ఉన్నవి మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ సంస్థల ద్వారా లావాదేవీలు నిర్వహించడం ఒకింత నయం. అదనపు ఫీజులు, కనిపించని చార్జీల గురించి కూడా వాకబు చేయాలి. మొత్తం వడ్డీకి అదనంగా ఏవైనా చార్జీలు వసూలు చేసేదీ, లేదా తాము పొందే రుణంలో ఏమైనా కత్తిరింపు ఉందా అని విచారించాలి. రిజిస్ట్రేషన్‌ ఫీజు, ప్రాసెసింగ్‌ ఫీజులు సహజంగానే ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. తీసుకున్న రుణాన్ని ముందుగానే తీర్చేద్దామనుకుంటే చార్జీల విధింపు ఉందా అని చూడాలి. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం ఒక ఈఎంఐని 90 రోజుల్లోపు చెల్లించడంలో విఫలమైతే అది చెల్లింపుల వైఫ్యలంగా పరిగణించడం జరుగుతుంది. ఈ గడువు కొన్ని ప్లాట్‌ఫామ్‌లలో భిన్నంగా ఉంది. సకాలంలో రుణం లభించడం ఎంతో అవసరం. అప్పుడే అవసరాలకు ఉపయోగపడుతుంది. అందుకే మీరు ఆశ్రయించే ప్లాట్‌ఫామ్‌పై ఎంత వేగంగా రుణాల మంజూరు ఉందనేది తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే ఒక్కో కంపెనీని బట్టి ఇది వేర్వేరుగా ఉంటుంది.

ప్రముఖ పీటూపీ సంస్థలు
మార్కెట్లో ఎన్నో పీటూపీ సంస్థలు ఉన్నాయి. అయితే, వీటిల్లో కొన్ని ప్రముఖమైన పోర్టళ్లు, వాటికి సంబంధించి ముఖ్యమైన అంశాలను గమనించినట్టయితే...
ఫెయిర్‌సెంట్‌
రూ.750 అప్పు కూడా ఈ సంస్థ నుంచి సాధ్యమే. ఉదాహరణకు ఏ అనే ఒక రుణ గ్రహీత రూ.లక్ష రుణాన్ని కోరుకుంటుంటే... రుణం ఇవ్వాలనకునే వ్యక్తి అయితే ఇందులో 20 శాతం అంటే రూ.20,000 వరకే రుణాన్ని ఇవ్వడానికి అవకాశం. అదే అధిక నెట్‌వర్త్‌ కలిగిన వారు 50 శాతం వరకు, ఇనిస్టిట్యూషన్స్‌ అయితే 100 శాతం వరకు రుణాన్ని మంజూరు చేయవచ్చు. తిరిగి రాని, ఏకకాల రిజిస్ట్రేషన్‌ చార్జీ కింద రూ.1,000 సమర్పించుకోవాలి. రుణ కాల వ్యవధి ఆరు నెలల నుంచి 36 నెలల వరకు ఉంటుంది. తమకు అనువైన కాల వ్యవధి పరిధిలో ఉన్న రుణ గ్రహీతలను ఎంచుకుని రుణాలు ఇచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. వడ్డీ రేట్లు 12 నుంచి 28 శాతం మధ్య ఉన్నాయి.
లెండెన్‌ క్లబ్‌
కనీసం రూ.2,000 నుంచి రూ.15,000 వరకు ఒక్కొకరికి రుణాన్ని ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ చార్జీ 500. వడ్డీ రావడం ప్రారంభమైన దగ్గర్నుంచి ఫెసిలిటేషన్‌ ఫీజు వసూలు చేస్తుంది. కమీషన్‌ అన్నది పెట్టుబడిపై వచ్చే రాబడిపై 1 శాతం నుంచి 25 శాతం వరకు ఉండొచ్చు. 26-35 శాతం మధ్య రాబడుల రేటు ఉంటే 1.5 శాతం, అంతుకుమించితే 3 శాతం కమీసన్‌ తీసుకుంటుంది. మూడు నెలల నుంచి 24 నెలల కాలానికి రుణాలు ఇచ్చుకోవచ్చు. రుణాలిచ్చే వారికి సగటు రాబడులు 25.5 శాతంగా ఉన్నాయి.
ఐటూఐ ఫండింగ్‌
రూ.5,000 మొత్తం నుంచి ఈ ప్లాట్‌ఫామ్‌పై అప్పిచ్చు వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. రుణ కాల వ్యవధి నెల నుంచి 36 నెలల మధ్య ఉంటుంది. అన్ని పీటూపీ ప్లాట్‌ఫామ్‌ల్లోనూ కలిపి గరిష్టంగా రూ.10 లక్షల వరకే ఒకరు రుణాలు ఇచ్చుకోవడానికి పరిమితి ఉంది. 3, 6, 9, 12, 24, 36 నెలల రుణ కాల వ్యవధులు ఉన్నాయి. ఒక్కసారి రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.500 వసూలు చేసుకోవచ్చు. ఒక శాతం ప్రాసెసింగ్‌ ఫీజు కూడా రుణం మంజూరుపై ఉంటుంది. రాబడుల రేటు 27.99 శాతం వరకూ ఉంది.
లెండ్‌బాక్స్‌
రుణ దాతలు కనీసం రూ.10,000 నుంచి గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. రుణ గ్రహీతలు రూ.25,000 నుంచి రూ.5 లక్షల వరకు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
క్యాష్‌ మేకర్‌
రూ.20,000 నుంచి రూ.1.5 లక్షల వరకు రుణాలు మంజూరు చేసుకోవచ్చు. రుణ కాల వ్యవధి 3 నుంచి 12 నెలలు. మూడు ఈఎంఐలు చెల్లించిన తర్వాత ఎప్పుడైనా సరే ముందస్తుగా రుణం తీర్చివేసే అవకాశం రుణగ్రహీతలకు ఉంటుంది. రుణదాతల నుంచి రూ.1,000ను రిజిస్ట్రేషన్‌ ఫీజుగా వసూలు చేస్తోంది.

పీటూపీ చార్జీలు
పీటూపీ ప్లాట్‌ఫామ్‌లు ఎన్నో రకాల చార్జీలు వసూలు చేస్తుంటాయి. వాటిని పరిశీలిస్తే...
రిజిస్ట్రేషన్‌ ఫీజు:- చాలా వరకు సంస్థలు రిజిస్ట్రేషన్‌ చార్జీ కింద రూ.100 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నాయి.
లోన్‌ ప్రాసెసింగ్‌ చార్జీ: మంజూరు అయిన రుణం మొత్తంలో 1-10 శాతం మధ్య ఉంటుంది. రిస్క్‌ గ్రేడ్‌పై ఈ చార్జీ ఆధారపడి ఉంటుంది. అయితే, పలు పీటూపీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ చార్జీ సగటున 2-4 శాతం మధ్య ఉంటుంది.
వడ్డీ రేట్లు:- వడ్డీ రేట్లను రుణదాత, రుణగ్రహీత నిర్ణయిస్తారు. వీరిరువురు చర్చించుకోవడం ద్వారా ఓ రేటును ఖరారు చేసుకోవచ్చు. 14-36 శాతం మధ్య ఇది ఉంటుంది. రుణ కాల వ్యవధి, రుణ గ్రహీత ఆర్థిక, సామాజిక పరిస్థితులపైనా ఆధారపడి ఉంటుంది.
ముందస్తు చెల్లింపులపై చార్జీలు:- మూడు నెలల తర్వాత రుణాన్ని ముందుగా తీర్చివేసినా గానీ చార్జీలు ఉండవు. మూడు నెలల్లోపు రుణం మొత్తాన్ని చెల్లించేస్తానంటే చార్జీలు భరించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మూడు నెలల వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది.
లేట్‌ పేమెంట్‌ ఫీజు:- రుణ ఈఎంఐ చెల్లింపులో జాప్యం జరిగితే చార్జీలు ఉంటాయి. లీగల్‌ నోటీసు పంపిస్తే రూ.500 వరకు చార్జీ చెల్లించాల్సి వస్తుంది.
చెక్‌బౌన్స్‌ చార్జీలు:- రూ.250 వరకు చార్జీ ఉంటుంది.
స్టాంప్‌ డ్యూటీ:- స్టాంప్‌ డ్యూటీ చార్జీలను రుణ గ్రహీతే భరించాల్సి ఉంటుంది.
ఇతర చార్జీలు:- బ్యాంకు ఖాతా వివరాల్లో మార్పులు చోటు చేసుకుంటే కొన్ని సంస్థలు చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈఎంఐ బకాయి ఉన్నా చార్జీ వసూలు చేసేవీ ఉన్నాయి. రూ.200-1,000 వరకు వీటి రూపంలో వసూలు చేస్తున్నాయి.

తీసుకున్న వారు ఎగ్గొడితే...?
పీటూపీ లెండింగ్‌ సంస్థల ద్వారా ఎవరైనా రుణాలను ఇతరులకు ఆఫర్‌ చేయడం ద్వారా వడ్డీ ఆదాయం అందుకోవచ్చు. రెండంకెల రాబడులంటే సహజంగానే ఆసక్తి ఉంటుంది. మరి రుణం తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించడంలో విఫలమైతే ఏంటి పరిస్థితి? వీరి విషయంలో పీటూపీ సంస్థలు ఏ విధంగా వ్యవహరిస్తాయి? అన్న సందేహాలు ఉంటుంటాయి. అయితే, ఈ విషయంలో పీటూపీ సంస్థలు ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల మాదిరే చురుగ్గానే వ్యవహరిస్తున్నాయి. రుణాలు తీసుకునే వారికి సంబంధించిన సమాచారాన్ని భిన్న మార్గాల్లో సేకరిస్తుంటాయి. ‘‘నిజమైన కస్టమర్లకే రుణాలు అందించాలి. కస్టమర్‌ ఉద్దేశ్యాన్ని తెలుసుకుని, దరఖాస్తులను ప్రాసెస్‌ చేసే విషయంలో ప్రత్యామ్నాయ సమాచారం ఉపయోగపడుతుంది’’ అని క్యాష్‌కుమార్‌ సహ వ్యవస్థాపకుడు ధీరేన్‌ మఖిజియా తెలిపారు. మా దగ్గర నమోదు చేసుకునే ప్రతీ కస్టమర్‌ డేటా, క్రెడిట్‌ సమాచారం, రిస్క్‌ను ఆటేమేటెడ్‌ ఆల్గోరిథమ్‌ టూల్స్‌ ద్వారా తనిఖీ చేయబడుతుంది. ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత స్థాయిలో 400 పాయింట్లను పరిశీలించడం జరుగుతుంది. ఎన్నో చర్యల్ని తీసుకోవడం ద్వారా రుణ ఎగవేతల రేటును పరిమిత స్థాయిలోనే ఉండేలా చూస్తాం’’ అని ఫెయిర్‌సెంట్‌ వ్యవస్థాపకుడు వినయ్‌ మాథ్యూస్‌ తెలిపారు.You may be interested

బాండ్‌ ఫండ్స్‌లో మెరుగైన పనితీరు

Monday 21st January 2019

బాండ్‌ ఫండ్స్‌లో మెరుగైన పనితీరు...(ఫండ్‌ రివ్యూ) ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఆల్‌ సీజన్స్‌బాండ్‌ ఫండ్‌ గత ఏడాది బాండ్‌ మార్కెట్‌ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. ఈ ఏడాది మాత్రం బాండ్‌ మార్కెట్‌ జోరుగానే ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం దిగివస్తోంది. మరోవైపు రేట్ల నిర్ణయం విషయంలో విధానాల మార్పు కారణంగా ఆర్‌బీఐ పాలసీ సరళంగానే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే కాకుండా బహిరంగ మార్కెట్‌ కార్యకలాపాల జోరును పెంచుతోంది. బహిరంగ

నిఫ్టీ తదుపరి టార్గెట్‌ 11200!

Monday 21st January 2019

నార్నోలియా అంచనా గతవారం మొత్తం కన్సాలిడేషన్‌ చూపిన సూచీలు సోమవారం మరోమారు గతకొద్ది నెలల రేంజ్‌ పైఅవధిని చేరాయి. నాలుగు రోజులుగా హయ్యర్‌హై, హయ్యర్‌ లో ఏర్పాటుచేస్తున్న నిఫ్టీ సోమవారం గత కొన్ని నెలల టాపింగ్‌ స్థాయి 10980 పాయింట్లను చేరింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ బ్రేకవుట్‌ సాధిస్తే తదుపరి 11200 పాయింట్ల వరకు ర్యాలీ జరపవచ్చని నార్నోలియా బ్రోకింగ్‌ అంచనా వేస్తోంది. ప్రస్తుతం నిఫ్టీ తన 20, 100, 200

Most from this category