STOCKS

News


పట్టాలెక్కిన రియల్టీ!

Friday 13th July 2018
personal-finance_main1531504242.png-18306

 సాక్షి, హైదరాబాద్‌: దేశంలో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి మళ్లీ మంచి రోజులొచ్చాయి. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)లతో రియల్టీలో పారదర్శకతతో పాటూ సానుకూల వాతావరణం నెలకొంది. కొత్త గృహాల ప్రారంభాలు, అమ్మకాల్లోనే కాదు.. పాత ప్రాజెక్ట్‌లోని ఇన్వెంటరీ కూడా క్రమంగా తగ్గుతుందని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది.
దేశంలోని ఏడు ప్రధాన నగరాలైన ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణె, కోల్‌కతా, హైదరాబాద్‌ల్లో ఈ ఏడాది రెండో త్రైమాసికం (క్యూ2)లో కొత్త గృహాల ప్రారంభాలు 50 శాతం, అమ్మకాల్లో 24 శాతం వృద్ధి నమోదైంది. ఆకర్షణీయమైన పథకాలు, రాయితీలతో కొన్నేళ్లుగా అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ కూడా తగ్గుతుంది. ఈ ఏడాది క్యూ1లో 7.11 లక్షల ఇన్వెంటరీ ఉండగా.. క్యూ2 నాటికి 2 శాతం తగ్గుదలతో 7 లక్షలకు చేరాయి. 
50,100 కొత్త గృహాలు ప్రారంభం..
ఏడు ప్రధాన నగరాల్లో క్యూ2లో 50,100 కొత్త యూనిట్లు ప్రారంభమయ్యాయి. క్యూ1లో ఇవి 33,400 యూనిట్లుగా ఉన్నాయి. క్యూ2లో ప్రారంభమైన కొత్త యూనిట్లులో 75 శాతం గృహాలు ముంబై, ఎన్‌సీఆర్, బెంగళూరు, పుణె నగరాల్లోనే ఉన్నాయి. నగరాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే.. పుణెలో క్యూ1లో 214 యూనిట్లు ప్రారంభం కాగా.. క్యూ2లో 6,900 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఎన్‌సీఆర్‌లో క్యూ1లో 4,500 యూనిట్ల నుంచి క్యూ2లో 8,500 యూనిట్లు, ముంబైలో 8,600 గృహాల నుంచి 13,600 గృహాలు, బెంగళూరులో 6,850 యూనిట్ల నుంచి 8,800 యూనిట్లు, చెన్నైలో 2,100 యూనిట్ల నుంచి 4,200 యూనిట్లు ప్రారంభమాయ్యయి. కోల్‌కతాలో మాత్రం క్యూ1లో 6,500 యూనిట్లు ప్రారంభం కాగా.. క్యూ2లో 61 శాతం తగ్గుదలతో కేవలం 2,550 యూనిట్లకు పరిమితమయ్యాయి.
60,800 గృహాల విక్రయం..
నిజమైన గృహ కొనుగోలుదారులు మార్కెట్‌ వైపు అడుగులు పెడతున్నారని, పెట్టుబడిదారులు సరైన ప్రాంతం కోసం అన్వేషణ సాగిస్తుండటంతో అమ్మకాలు జోరందుకున్నాయి. ఏడ ప్రధాన నగరాల్లో క్యూ1లో 49 వేల యూనిట్లు అమ్ముడుపోగా.. క్యూ2 నాటికివి 24 శాతం వృద్ధితో 60,800 యూనిట్లు అమ్ముడుపోయాయి. మొత్తం విక్రయాల్లో 81 శాతం ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, పుణె నగరాల్లోనే జరిగాయి. నగరాల వారీగా విక్రయ గణాంకాలను పరిశీలిస్తే.. ఎన్‌సీఆర్‌లో క్యూ1లో 9,100 యూనిట్లు విక్రయం కాగా క్యూ2లో 11,150 అయ్యాయి. ముంబైలో 12,050 నుంచి 15,200, బెంగళూరులో 11,500 నుంచి 14,600, పుణెలో 6,800 నుంచి 8,400, చెన్నైలో 2,320 నుంచి 2,700, కోల్‌కతాలో క్యూ1లో 3,420 యూనిట్లు అమ్ముడుపోగా క్యూ2లో 4 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి.
 
46 శాతం అందుబాటు గృహాలే..
కొత్త గృహాల ప్రారంభాల్లోనైనా. అమ్మకాల్లోనైనా సరే అఫడబుల్, మిడ్‌ రేంజ్‌ గృహాల ఆధిపత్యమే ఎక్కువగా ఉంది. క్యూ2లో 50,100 కొత్త గృహాలు ప్రారంభం కాగా.. ఇందులో 38,600 గృహాలు ఈ కేటగిరీలోనివే. ఇందులోనూ రూ.40 లక్షల లోపు ధర ఉన్న గృహాలు 46 శాతం వరకున్నాయి. అఫడబుల్‌ హౌస్‌ విభాగానికి మౌలిక రంగ హోదాతో ఆయా గృహాల ప్రారంభానికి డెవలపర్లు ఆసక్తి చూపిస్తుంటే.. ఎంఐజీ–1, ఎంఐజీ–2 తరగతులకు వడ్డీ రాయితీలతో అమ్మకాలూ బాగున్నాయి.
– అనూజ్‌ పురీ, చైర్మర్, అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్స్‌
 
నగరంలో జోరు..
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో హైదరాబాద్‌లో కొత్త గృహాల ప్రారంభాలు, అమ్మకాలు రెండింట్లోనూ వృద్ధి నమోదైంది. క్యూ1లో 2,650 కొత్త గృహాలు ప్రారంభం కాగా.. క్యూ2లో 109 శాతం వృద్ధి రేటుతో 5,550 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఇక, అమ్మకాల్లో క్యూ1లో 3,800 యూనిట్లు అమ్ముడుపోగా.. క్యూ2లో 25 శాతం వృద్ధితో 4,750 యూనిట్లు విక్రమయ్యాయి. నగరంలో గిడ్డంగి, వాణిజ్య, కార్యాలయాల మార్కెట్లు జోరందుకోవటంతో నివాస సముదాయాలకు గిరాకీ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. మెట్రో రైల్‌ అందుబాటులోకి రావటంతో నగరం నలువైపులా గృహా కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో క్యూ1 నుంచి క్యూ2 నాటికి చెన్నై, కోల్‌కతాల్లో మినహా ఇతర అన్ని నగరాల్లోనూ ధరలు 1 శాతం మేర పెరిగాయి.

 



You may be interested

సెల్లార్‌లో బండరాళ్లొస్తే?

Friday 13th July 2018

  సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ నివాస ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. సెల్లార్‌ తవ్వే క్రమంలో పెద్ద బండరాళ్లు వచ్చాయి. దాన్ని తొలగించేందుకు ఓ కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ పనిని మరో సబ్‌–కాంట్రాక్టర్‌కు అప్పజెప్పారు మొదటి కాంట్రాక్టర్‌. పనిముట్లు, కూలీలతో తొలగించలేమని భావించిన సబ్‌–కాంట్రాక్టర్‌ బ్లాస్టింగ్‌ చేయాలని నిర్ణయించుకొని పేలుడు పదార్థాలను కొనుగోలు చేసి నిర్మాణ స్థలానికి తీసుకొచ్చాడు. అంతే! సమాచారం ఎవరందించారో తెలియదు

జీఎస్‌టీలో స్పష్టత ఏదీ?

Friday 13th July 2018

 సాక్షి, హైదరాబాద్‌: దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లోకి వచ్చి ఏడాది దాటింది. ఇతర రంగాల్లో ఏమో కానీ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మాత్రం జీఎస్‌టీ అమలులో స్పష్టత లోపించిందని నిపుణులు చెబుతున్నారు. స్పష్టత కొరవడిన అంశాలేంటంటే.. ఫ్లాట్లను రద్దు చేసుకుంటే: జీఎస్‌టీ అమలు కంటే ముందు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లో ఫ్లాట్‌ను కొనుగోలు చేసిన కొనుగోలుదారునికి జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక ఆ ఫ్లాట్‌ను రద్దు చేస్తే గనక సదరు కస్టమర్‌కు జీఎస్‌టీ

Most from this category