STOCKS

News


ఆర్థికంగా వెలిగిపోదాం...

Monday 22nd April 2019
personal-finance_main1555916733.png-25265

ప్రారంభంలోనే ప్రణాళిక రూపకల్పన 
ఏప్రిల్‌ నుంచే ఆచరణలోకి
ఏడాది చివర్లో ఆదుర్దా ఉండదు
పన్ను ఆదాకు ఈఎల్‌ఎస్‌ఎస్‌లో సిప్‌ 
విశ్రాంత జీవనం కోసం ఎన్‌పీఎస్‌
వీపీఎఫ్‌ ద్వారా పన్ను లేని రాబడులు

నూతన ఆర్థిక సంవత్సరం 2019-20లోకి ప్రవేశించి రెండు వారాలు గడిచిపోయింది. ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ, వ్యయాలకు తోడు పన్ను బాధ్యతలు ఎదురవుతుంటాయి. ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఓ ప్రణాళిక రూపొందించుకుని దానిని ఆచరణలో పెడితే ఒడిదుడుకులు లేకుండా సాఫీగా జీవనం కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను ఏడాదికి ఒకసారి అయినా తప్పకుండా సమీక్షించాలని, అందుకు ఏప్రిల్‌ మాసం సరైనదిగా నిపుణుల అభిప్రాయం. ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి తమ పెట్టుబడులకు సంబంధించి అనుసరించ తగిన మార్గాలపై నిపుణుల సూచనలు ఇలా ఉన్నాయి. 

ఈఎల్‌ఎస్‌ఎస్‌లో సిప్‌
ఏప్రిల్‌ నుంచే పన్ను ఆదాకు ఉపయోగపడే ఈక్విటీ లిం‍క్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పథకాల్లో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా ప్రతీ నెలా పెట్టుబడుల ప్రణాళికను ఆరంభించాలి. దీంతో ఆర్థిక సంవత్సరం చివర్లో పన్ను ఆదా పెట్టుబడుల గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి రాదని తమన్నావర్మ అనే ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ సూచించారు. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఉండే రిస్క్‌లే ఈఎల్‌ఎస్‌ఎస్‌కు వర్తిస్తాయి. కనుక ప్రతీ నెలా క్రమం తప్పకుండా సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఆటుపోట్లను అధిగమించి మెరుగైన రాబడులను అందుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ స్వల్పకాలిక పనితీరు చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ‘‘ఒక్కసారి ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మూడేళ్లు లాకిన్‌ అయినట్టే. అయితే, ఇది మెరుగైన రాబడులకు వీలు కల్పిస్తుంది’’ అని వ్యాల్యూ రీసెర్చ్‌ సంస్థ సీఈవో ధీరేంద్ర కుమార్‌ సూచించారు. 

వాలంటరీ పీఎఫ్‌ (వీపీఎఫ్‌)
ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌) పథకం పరిధిలో ఉన్న వారికి అందుబాటులో ఉన్న చక్కని సాధనం వీపీఎఫ్‌. ఈపీఎఫ్‌కు అనుబంధంగా సభ్యులు చేసే స్వచ్చంద కంట్రిబ్యూషన్‌. ఈపీఎఫ్‌కు వర్తించే పన్ను మినహాయింపులు వీపీఎఫ్‌కూ వర్తిస్తాయి. సెక్షన్‌ 80సీ కింద 1.5 లక్షల వరకు పెట్టబడులకు వీపీఎఫ్‌ చందాలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. అలాగే, రాబడులు, ఉపసంహరణలపైనా పన్ను ఉండదు. కనుక మూడు రకాల పన్ను ఆదా ప్రయోజనాలు వీపీఎఫ్‌తో పొందొచ్చు. ఈపీఎఫ్‌ చందాలకు అమలయ్యే వడ్డీ రేటే వీపీఎఫ్‌కూ చెల్లుబాటు అవుతుంది. పీపీఎఫ్‌లోనూ ఇదే మాదిరి పన్ను ఆదా ప్రయోజనాలున్నప్పటికీ ఈపీఎఫ్‌తో పోలిస్తే వడ్డీ రేటు తక్కువ. డెట్‌లో పెట్టుబడులకు వీపీఎఫ్‌ మెరుగైన మార్గమని ఆల్ఫా క్యాపిటల్‌ అసోసియేట్‌ పార్ట్‌నర్‌ దీప్తి గోయల్‌ పేర్కొన్నారు. వేతనం మీ బ్యాంకు ఖాతాలో జమ కావడానికి ముందే వీపీఎఫ్‌ చందాను ఉద్యోగ సంస్థ మినహాయిస్తుంది కనుక చెల్లింపుల గురించి ఆందోళన కూడా అవసరం ఉండదు. 

ఇంక్రిమెంట్‌ కూడా... 
ఏటా ఏప్రిల్‌ నెలలో ఇంక్రిమెంట్లు పడుతుంటాయి. అంటే ఆదాయం పెరిగినట్టే. పెరిగిన వేతనానికి తగ్గట్టే పెట్టుబడుల మొత్తాన్ని పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది ఎప్పటి మాదిరే మ్యూచువల్‌ ఫండ్స్‌ సిప్‌ కొనసాగిస్తుంటారని, పెరిగిన వేతనం మేరకు పెట్టుబడులను పెంచుకునే వారు తక్కువేనంటున్నారు. కనుక ఈ విధమైన పొరపాట్లకు తావివ్వకుండా ఏప్రిల్‌ నుంచే సిప్‌ మొత్తాలను పెంచుకోవాలని సూచిస్తున్నారు. పెరిగిన ఇంక్రిమెంట్‌లో కనీసం 20 శాతాన్ని అయినా పెట్టుబడుల వైపు మళ్లించాలన్నది వారి సూచన.

రిటైర్మెంట్‌ కోసం ఎన్‌పీఎస్‌
నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌)కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. దేశంలో ఎవరైనా సరే ఈ పథకంలో చేరి 60 ఏళ్ల వరకు చందాలు చెల్లిస్తూ వెళ్లొచ్చు. విశ్రాంత జీవన అవసరాల కోసం ఉద్దేశించినది ఈ పథకం. గడువు తీరిన తర్వాత 60 శాతం మొత్తాన్ని ఏ మాత్రం పన్ను లేకుండా వెనక్కి తీసేసుకోవచ్చు. మిగిలిన 40 శాతంతో పెన్షన్‌ యాన్యుటీ ప్లాన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మొత్తంపై అప్పటి రేటు ప్రకారం పెన్షన్‌ అందుతుంది. ఈ పథకంలో గరిష్టంగా ఈక్విటీలకు 75 శాతం కేటాయింపులు చేసుకోవచ్చు. ఇప్పటికీ ఎన్‌పీఎస్‌ ఖాతా తెరవని వారు, ప్రారంభించేందుకు ఏప్రిల్‌ మాసం అనువైనది. నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయం ఉండి, కేవైసీ నిబంధలను ఇప్పటికే పూర్తి చేసిన వారు అయితే ఆన్‌లైన్‌లోనే సులభంగా ఎన్‌పీఎస్‌ ఖాతాను తెరవొచ్చు. ఎన్‌పీఎస్‌ పోర్టల్‌కు వెళ్లి అక్కడి సూచనలను అనుసరిస్తే సరిపోతుంది.

పెట్టుబడులకూ ఓ లెక్క...
ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక మొత్తాన్ని ఏప్రిల్‌ నెలలోనే అమలు చేసేయాలని, లేదా మార్చిలో చేయాలనుకోవడం కూడా సరికాదు. ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది కనుక, ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ రానుంది. అందులో ఏవైనా మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆ మార్పులకు అనుగుణంగా ప్రణాళికను కూడా మార్చుకోవాల్సి రావచ్చు. కనుక ఒకేసారి పెట్టుబడులకు దూరంగా ఉండాలి. క్రమానుగత పెట్టుబడులే ఉత్తమం. ఏడాది పొడవునా పెట్టుబడులను కొనసాగించడం వల్ల మార్పు, చేర్పులకు అవకాశం ఉంటుందని పీక్‌ ఆల్ఫా ఇన్వెస్ట్‌మెంట్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ ప్రియా సుందర్‌ పేర్కొన్నారు. దీనివల్ల మరింత ప్రయోజనం ఉండే పన్ను ఆదా పథకాలను ఎంచుకునేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు.

టీడీఎస్‌...
బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పోస్టాఫీసు డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఏడాదిలో రూ.10,000 మించితే టీడీఎస్‌ను గతంలో అమలు చేసే వారు. దీన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి రూ.40,000కు పెంచుతున్నట్టు ఇటీవలే కేంద్రం ప్రకటించింది. అదే 60 ఏళ్లు దాటిన వారికి 50,000 వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ ఉండదు. ఒకవేళ వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో 40,000-50,000 మించినట్టయితే, అదే సమయంలో పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ.2.5 లక్షలు మించని వారు టీడీఎస్‌ లేకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం ఫామ్‌ 15హెచ్‌/15జీ ఇస్తే సరిపోతుంది. 

అత్యవసర నిధి
ప్రతీ కుటుంబానికీ అత్యవసర నిధి ఎంతో అవసరం. కనీసం 4-6 నెలల కుటుంబ అవసరాలకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధి కింద  సమకూర్చి పెట్టుకోవాలని నిపుణుల సూచన. ఒకవేళ అత్యవసర నిధి ఇప్పటికీ సమకూర్చుకోని వారు ఆలస్యం చేయకుండా వెంటనే లిక్విడ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను ఆరంభించుకోవాలి.You may be interested

రెండు పొదుపు ఖాతాలు చాలు

Monday 22nd April 2019

 లేదంటే ముచ్చటగా మూడు ఉండొచ్చు - వేతనం; ఖర్చులు; పొదుపు కోసం విడివిడిగా - అంతకు మించిన ఖాతాలుంటే అనవసర ఛార్జీలు - కనీస బ్యాలన్స్‌ రూపంలో ఎక్కువ మొత్తం ఉంచాలి - వీటిపై రాబడులు ద్రవ్యోల్బణాన్ని తట్టుకోలేవు (సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం) మనలో చాలా మందికి ఒకటికి మించిన బ్యాంకు ఖాతాలుండడం ఇపుడు సహజమైపోయింది. అయితే, ఇలా ఎక్కువ ఖాతాలుండటం లాభదాయకమేనా? ఇది ‍ప్రతి ఒక్కరూ ఓ సారి ఆలోచించుకోవాల్సిన అంశం. ఎందుకంటే ప్రతి ఖాతాలో

పోస్టాఫీసుల ఆధునీకరణ పూర్తి

Monday 22nd April 2019

- ఐటీ దిగ్గజం టీసీఎస్ వెల్లడి న్యూఢిల్లీ: మరిన్ని సేవలు, మరింత మెరుగ్గా అందించేలా దేశవ్యాప్తంగా ఉన్న 1.5 లక్షల పైచిలుకు పోస్టాఫీసుల ఆధునీకరణ ప్రక్రియ పూర్తయినట్లు ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) వెల్లడించింది. ఇండియా పోస్ట్ నుంచి 2013లో దక్కించుకున్న కాంట్రాక్టులో భాగంగా దీన్ని పూర్తి చేసినట్లు పేర్కొంది. ఈ డీల్‌ విలువ రూ. 1,100 కోట్లు. కాంట్రాక్టు ప్రకారం.. మానవ వనరులు, ఫైనాన్స్‌, అకౌంటింగ్‌

Most from this category