STOCKS

News


13 కోట్ల చ.అ. 310 గ్రీన్‌ బిల్డింగ్స్‌!

Saturday 27th October 2018
personal-finance_main1540611404.png-21525

సాధ్యమైనంత వరకూ సహజ సిద్ధమైన ఇంధన వనరులను వినియోగిస్తూ.. జీవ వైవిద్యాన్ని కాపాడే నిర్మాణాలకు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) హరిత భవనాలుగా గుర్తిస్తుంది. నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం, జీవన కాల పరిమితిని పెంచడమే గ్రీన్‌ బిల్డింగ్స్‌ ప్రధాన ఉద్దేశం. ఐజీబీసీ రేటింగ్స్‌ ప్లాటినం, గోల్డ్, సిల్వర్‌తో పాటూ బేసిక్‌ సర్టిఫికేషన్‌ కూడా ఉంటుంది. ఆయా భవనాల్లో విద్యుత్, నీటి వినియోగం, నిర్మాణ సామగ్రి ఎంపిక, ల్యాండ్‌ స్కేపింగ్‌ మీద ఆధారపడి రేటింగ్స్‌ ఉంటాయి.
విద్యుత్, నీటి వినియోగంలో తేడా..
అందుబాటు గృహాలతో పోలిస్తే ప్లాటినం, గోల్డ్‌ రేటింగ్‌ గ్రీన్‌ బిల్డింగ్స్‌ నిర్మాణ వ్యయం 2 శాతం ఎక్కువవుతుంది కానీ, హరిత భవనాల్లో ఇంధన వనరుల వినియోగం మాత్రం గణనీయంగా తగ్గుతుంది. సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్‌ బిల్డింగ్స్‌లో విద్యుత్‌ వినియోగం 40 శాతం, నీటి వినియోగం 30 శాతం వరకు తక్కువగా ఉంటుంది. పర్యావరణం పరంగా చూస్తే.. 10 లక్షల చ.అ. గ్రీన్‌ బిల్డింగ్స్‌తో 15 వేల మెగావాట్ల (ఎండబ్ల్యూహెచ్‌) విద్యుత్, 45 వేల కిలో లీటర్ల (కేఎల్‌) నీటి వినియోగం, 12 వేల టన్నుల కార్పన్‌ డయాక్సైడ్, 450 టన్నుల నిర్మాణ వ్యర్థాలు విడుదల తగ్గుతుంది. 
17 ఐజీబీసీ మెట్రో స్టేషన్లు..
ప్రస్తుతం మన దేశంలో 633 కోట్ల చ.అ.ల్లో 4,794 హరిత భవనాలున్నాయి. 2022 నాటికి వెయ్యి కోట్ల చ.అ.లకు చేర్చాలన్నది లక్ష్యం. విభాగాల వారీగా పరిశీలిస్తే.. 12.50 లక్షల నివాస భవనాలు, 250 ఫ్యాక్టరీలు, 1,600 కార్యాలయాలు, 45 టౌన్‌షిప్స్, 335 ట్రాన్సిట్స్, 13 గ్రామాలు, 8 నగరాలు గ్రీన్‌ బిల్డింగ్స్‌గా గుర్తింపు పొందాయి. తెలంగాణలో హరిత భవనాల గణాంకాలను పరిశీలిస్తే.. 13 కోట్ల చ.అ.ల్లో 310 ఐజీబీసీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. అసెండస్‌ వీఐటీ పార్క్, హెచ్‌ఎంఆర్‌ఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్, ఆర్‌బీఐ సీనియర్‌ ఆఫీసర్స్‌ క్వాటర్స్‌ వంటివి వీటిల్లో కొన్ని. ఇటీవలే ట్రాన్సిట్‌ విభాగంలో 17 హైదరాబాద్‌ మెట్రో స్టేషన్లు గ్రీన్‌ బిల్డింగ్‌ సర్టిఫికేషన్‌ పొందాయి.
300 బిలియన్‌ డాలర్లకు పరిశ్రమ..
ఫ్లయాష్‌ బ్రిక్స్, వాల్‌ అండ్‌ రూఫ్‌ ఇన్సులేషన్, లో వీఓసీ పెయింట్స్, సీఆర్‌ఐ సర్టిఫైడ్‌ కార్పెట్స్, ఎఫ్‌ఎస్‌సీ సర్టిఫైడ్‌ వుడ్, గ్లాస్‌ వంటివి హరిత భవనాల నిర్మాణ సామగ్రి. వాటర్‌లెస్‌ యూరినల్స్, సీఓ2 సెన్సార్, విండ్‌ టవర్స్‌ వంటివి గృహ ఉత్పత్తుల కిందికి వస్తాయి. 90 శాతం హరిత భవనాల నిర్మాణ సామగ్రి మన దేశంలోనే లభ్యమవుతున్నాయి. 2025 నాటికి దేశంలో హరిత భవనాల నిర్మాణ సామగ్రి పరిశ్రమ 300 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని పరిశ్రమ వర్గాల అంచనా.
ఇతర రాష్ట్రాల్లో రాయితీలు..
దేశంలోని చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు హరిత భవనాలకు రాయితీలను అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఐజీబీసీ గుర్తింపు పొందిన భవనాలకు పర్మిట్‌ ఫీజులో 20 శాతం, స్టాంప్‌ డ్యూటీ సర్‌చార్జీలో 20 శాతం తగ్గుదల ఉంది. అలాగే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), భారీ పరిశ్రమలకు మూలధన పెట్టుబడి మీద 25 శాతం సబ్సిడీ కూడా ఉంది. ఇతర రాష్ట్రాల్లో గమనిస్తే.. రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌ 5 శాతం అదనపు ఫ్లోర్‌ ఏరియా రేషియో (ఎఫ్‌ఏఆర్‌), మహారాష్ట్ర, జార్ఖండ్‌లో 3–7 శాతం, హర్యానాలో 9–15 శాతం, హిమాచల్‌ ప్రదేశ్, వెస్ట్‌ బెంగాల్‌లో 10 శాతం ఎఫ్‌ఏఆర్‌ ఉంది.
– కేంద్ర ప్రోత్సాహకాలు గమనిస్తే.. ఐజీబీసీ గుర్తింపు పొందిన ఎంఎస్‌ఎంఈలకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ ప్రమోషన్‌ (డీఐపీపీ), కేంద్ర పరిశ్రమ శాఖ నుంచి రూ.2 లక్షల వరకు నగదు ప్రోత్సాహకం ఉంది. అలాగే సిడ్బీ బ్యాంక్‌ నుంచి వడ్డీ రేట్లలో మినహాయింపు కూడా ఉంది.
– గ్రీన్‌ బిల్డింగ్‌ సర్టిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు త్వరగా వస్తాయి.
తెలంగాణలో ప్రోత్సాహాకాలెన్నడో?
తెలంగాణలోనూ ఐజీబీసీ గుర్తింపు పొందిన భవనాలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలని ఐజీబీసీ హైదరాబాద్‌ చాప్టర్‌ కోరుతోంది. పలు రాయితీలతో కూడిన విన్నపాన్ని ప్రభుత్వానికి అందించామని ఐజీబీసీ హైదరాబాద్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌ సీ శేఖర్‌ రెడ్డి తెలిపారు. అందులో కొన్ని..
– డెవలపర్లు హరిత నిర్మాణాల వైపు మొగ్గు చూపేలా పర్మిట్‌ ఫీజులో 20 శాతం, ఇంపాక్ట్‌ ఫీజులో 20 శాతం తగ్గించాలి.
– రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలి. ఇప్పటికే ఉన్న భవనాల మీద రూఫ్‌టాప్‌ ఏర్పాటు చేసుకునేలా అదనపు అంతస్తు నిర్మించుకుంటే ఆయా భవనాలను క్రమబద్దీకరించాలి. ఒకవేళ కొత్త భవనాల మీద రూఫ్‌టాప్‌ ఏర్పాటు చేసుకుంటే సెట్‌బ్యాక్‌ విషయంలో రాయితీలివ్వాలి.
– ఐజీబీసీ గుర్తింపు పొందిన ప్రాజెక్ట్‌లకు మూడేళ్ల పాటు వాటర్‌ అండ్‌ సీవరేజ్‌ టారిఫ్‌ను 10 శాతం తగ్గించాలి. 
– ఐజీబీసీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రాజెక్ట్‌లకు నిర్మాణ అనుమతులు, నీరు, విద్యుత్‌ కనెక్షన్లను త్వరితగతిన మంజూరు చేయాలి.
నవంబర్‌ 1 నుంచి గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌..
ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నవంబర్‌ 1– 3 తేదీల్లో మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో 16వ గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌–2018 జరగనుంది. ఈ కార్యక్రమంలో 2 వేల మంది దేశ, విదేశీ ప్రతినిధులు పాల్గొంటారు. 125 మంది వక్తలు ప్రసంగిస్తారు. ప్రపంచ దేశాల నుంచి 25 మంది స్పీకర్స్‌ ఉంటారు. ముఖ్య అతిథిగా పట్టణ, గృహ మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ పాల్గొననున్నారు.
––
ఏ నగరాన్ని ఎన్ని ఐజీబీసీ ప్రాజెక్ట్‌లంటే?
నగరం             గ్రీన్‌ బిల్డింగ్స్‌
తెలంగాణ        310
ఆంధ్రప్రదేశ్‌        73
మహారాష్ట్ర        1,362
ఉత్తర్‌ ప్రదేశ్‌        468
కర్నాటక        414
చెన్నై            412
వెస్ట్‌ బెంగాల్‌        308


 You may be interested

ఆఫ్‌షోర్‌లో రూపీ అప్‌

Saturday 27th October 2018

ఆఫ్‌షోర్‌ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం రాత్రి బలపడింది. 73.17 స్థాయికి లాభపడింది. ఒకానొక సమయంలో 73.08 స్థాయికి కూడా పెరిగింది. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే సోమవారం రూపాయి పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది. కాగా రూపాయి శుక్రవారం ఇండియన్‌ మార్కెట్‌లో 20 పైసలు క్షీణించి 73.47 వద్ద ముగిసింది. డాలర్‌ బలపడటం, విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు తరలి వెళ్లిపోవడం వంటి అంశాలు

మిట్టల్‌ చేతికి ఎస్సార్‌ స్టీల్‌

Saturday 27th October 2018

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో వేలానికి వచ్చిన ఎస్సార్ స్టీల్‌ను ఎట్టకేలకు ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌ మిట్టల్ దక్కించుకుంది. దీంతో భారత మార్కెట్లో అడుగుపెట్టడానికి ఆర్సెలర్‌ మిట్టల్‌కు ‍అవకాశం లభించినట్లయింది. ఈ డీల్‌కు సంబంధించి తాము దాఖలు చేసిన రూ.42,000 కోట్ల బిడ్‌కు ఎస్సార్‌ స్టీల్ రుణదాతల కమిటీ (సీవోసీ) ఆమోదముద్ర వేసినట్లు ఆర్సెలర్‌ మిట్టల్ శుక్రవారం వెల్లడించింది. బ్యాంకర్లకు సమర్పించిన పరిష్కార ప్రణాళిక ప్రకారం.. కంపెనీ రుణభారం సెటిల్మెంట్ కోసం

Most from this category