అన్ని ఫండ్లూ లాభాలివ్వవు
By Sakshi

మ్యూచ్‌వల్ ఫండ్లలో వైవిధ్యత లేకుంటే రిస్కే
- ఒకోసారి లాభాల మాట అటుంచి పెట్టుబడికీ ఇబ్బందే
- మార్కెట్ పతనాల్లో నష్టాలు మరింత పెరగొచ్చు
- అనుకున్న లక్ష్యాల సాధనలో వెనుకడుగు
- మల్టీక్యాప్ ఫండ్స్ వైవిధ్య పరంగా అనువైనవి
- లార్జ్, మిడ్‌క్యాప్, సెక్టార్ ఫండ్స్ ఎంచుకోవచ్చు
- ఫండ్స్ ఎక్కువ ఉంటే ప్రతికూలం కావచ్చు
(సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం)
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే చాలు... చక్కని రాబడులు వచ్చేస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ అది కరెక్టు కాదు. ఎందుకంటే అన్ని ఫండ్లూ... అన్ని వేళల్లో లాభాలివ్వవు. మీరు ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఏ కేటగిరీలోకి వస్తాయి? వాటి పోర్ట్‌ఫోలియో రిస్క్ ఏ మేరకు? అనేది చూశాకే ఇన్వెస్ట్ చేయాలి. ముఖ్యంగా ఫండ్స్‌లో వైవిధ్యం ఉండేలా పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఇన్వెస్టర్లపైనే ఉంటుంది. ఇందుకోసం ఏం చేయాలనేదానికి నిపుణులిచ్చిన సూచనల ఆధారంగా అందిస్తున్న కథనమిది...
వైవిధ్యత ఎలా?
మార్కెట్ ఆధారిత పెట్టుబడులు అయితే, స్టాక్ మార్కెట్లలో తరచుగా జరిగే మార్పులు, ఆర్థిక రంగ పరిస్థితులు ఫండ్ విలువలపై ప్రభావం చూపిస్తుంటాయి. ఒక్కోసారి ఈ ఒడిదుడుకులు తీవ్ర స్థాయికి చేరితే ఫండ్స్‌లో పెట్టుబడుల విలువ దారుణంగా పడిపోతుంది. స్టాక్ మార్కెట్లు పడిపోయినప్పుడు పోర్ట్‌ఫోలియో విలువ ప్రతికూల స్థితిలోకి కూడా వెళ్లిపోవచ్చు. ఇది నష్టాలను కలిగిస్తుంది. కానీ, పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని ఆఫర్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఈ తరహా పరిస్థితులను అధిగమించేలా ఉంటాయి. భిన్న ఆస్తుల విలువ వేర్వేరు సమయాల్లో పెరుగుతూ, తరుగుతూ ఉండడం సహజం. దీనివల్ల ఒక సాధనంలో పెట్టుబడుల విలువ పడిపోతే, మరో సాధనంలో పెరిగిన పెట్టుబడుల విలువ ఆదుకుంటుంది. దీంతో మొత్తం మీద పోర్ట్‌ఫోలియో రాబడులు అంచనాలకు అనుగుణంగానే ఉండడం ద్వారా సంపద సృష్టి సాధ్యపడుతుంది. ఈక్విటీ ఫండ్స్ విషయానికొస్తే... వైవిధ్యం అంటే భిన్న రంగాలకు చెందిన స్టాక్స్, భిన్న మార్కెట్ విలువ కలిగిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడంగా చెప్పుకోవచ్చు. అదే డెట్ ఫండ్స్ అయితే... భిన్న కాలాల్లో గడువు తీరే సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడాన్ని వైవిధ్యంగా పేర్కొంటారు. దీని ద్వారా అస్తులు-అప్పుల మధ్య అంతరం కారణంగా డిఫాల్ట్ కాకుండా నిరోధించేందుకు ఉపయోగపడుతుంది. వడ్డీ రేట్ల పరంగా తక్కువ ఆటుపోట్లకు అవకాశం ఉండే అధిక రేటింగ్ సెక్యూరిటీలను ఫండ్ మేనేజర్ ఎంచుకోవచ్చు.
ఎక్కువ ఫండ్స్ వద్దు
మీ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయంటే... దాన్ని వైవిధ్యంగా భావించొద్దు. చూడ్డానికి ఇది వైవిధ్యంగానే అనిపించినా నిజానికి దానికి వ్యతిరేకమే అవుతుంది. ప్రతీ ఈక్విటీ ఫండ్ పథకంలో కొన్ని స్టాక్స్ ఉంటాయి. కనుక మీ దగ్గరున్న ఈక్విటీ పథకాల్లో ఒకే తరహా స్టాక్ హోల్డింగ్స్ ఉండే అవకాశం లేకపోలేదు. ఉదాహరణకు ఒక ఈక్విటీ పథకం సుమారు 30-70 వరకు స్టాక్స్‌ను నిర్వహిస్తుంటుంది. కనుక మీ దగ్గరున్న పథకాల్లోని పోర్ట్‌ఫోలియోలో ఒకే కంపెనీ ఉండే అవకాశం లేకపోలేదు. కనుక ఇది డూప్లికేషన్ అవుతుంది. ఇది వైవిధ్యతకు ప్రతికూలమే. కనుక మహా అయితే 7-9 పథకాలకు మించకుండా చూసుకోవడం మంచిది.
పేలవ పనితీరు
ఇక మీ దగ్గరున్న ఫండ్స్ పథకాలు మీ ఆర్థిక లక్ష్యాలకు ఉపయోగపడే విధంగానే ఉండాలి. కానీ, నాసిరకం ఫండ్స్‌ను ఎంచుకుంటే ఇది సాధ్యం అవుతుందా? అదే పనిగా బలహీన పనితీరు చూపించే మ్యూచువల్ పండ్ పథకం మార్కెట్ పతనాల్లో మరింత నష్టాలను తెచ్చిపెడుతుంది. ఇటువంటి పథకాలను వైవిధ్యం కోసమని మీ పోర్ట్‌ఫోలియోకి యాడ్ చేసుకోవడం వల్ల నష్టమే కలుగుతుంది. అందుకే మీరు పెట్టుబడి పెట్టిన, పెడుతున్న పథకాల పనితీరును క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలి. మీ అంచనాలకు అనుగుణంగా పనితీరు లేకపోతే వాటి నుంచి వైదొలగడమే మంచిది.
ఒకే చోటు ఎక్కువ పెట్టుబడులు
ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోకు కాన్సెన్ట్రేషన్ రిస్క్ కూడా పొంచి ఉంటుంది. అందుకే దీని గురించి తెలుసుకోవాలి. అంటే ఓ ఫండ్ ఎక్కువగా ఒకే రంగంలో ఇన్వెస్ట్ చేయడం. లేదా ఒకే తరహా సెక్యూరిటీల్లో పెట్టుబడులు ఎక్కువగా కుమ్మరించడం. ఉదాహరణకు ఒకరి పోర్ట్‌ఫోలియోలో... ఒక లార్జ్‌క్యాప్, ఒక మిడ్‌క్యాప్, రెండు స్మా్ల్క్యాప్, రెండు టెక్నాలజీ ఫండ్స్, రెండు బ్యాంకింగ్, ఒక ఫార్మా ఫండ్ ఉన్నాయనుకోండి. ఇది వైవిధ్యంగానే భావించొచ్చు... కానీ, ఈ పోర్ట్‌ఫోలియోలో మిడ్, స్మాల్ క్యాప్‌నకు 33 శాతం, రంగాల వారీ కేటాయింపులు 55 శాతం ఉన్నాయి. ఇది అధిక రిస్క్‌తో కూడినది. రిస్క్ తక్కువగా ఉండాలంటే రంగాల వారీ పెట్టుబడులు పరిమితంగా ఉండేలా చూసుకోవడమే సరైనది. కనుక లార్జ్‌క్యాప్‌నకు 60 శాతం, మిడ్, స్మా్ల్ క్యాప్‌నకు కలిపి 30-35 శాతం, రంగాల వారీ ఫండ్స్‌కు 5 శాతం పెట్టుబడులు కేటాయించుకోవాలి. అందుకే పోర్ట్‌ఫోలియో విషయంలో మీ రిస్క్, రాబడుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని, అందుకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం కరెక్ట్.
విదేశీ ఫండ్స్
భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం మరో విధానం. ఇందుకోసం మల్టీక్యాప్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. ఇందులో ఫండ్ మేనేజర్ పోర్ట్‌ఫోలియో స్థిరత్వం, రాబడుల కోసం భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన స్టాక్స్‌లో పెట్టుబడులు పెడతారు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అయితే అధిక రాబడులతోపాటు పన్ను ఆదాకు కూడా అవకాశం కల్పిస్తాయి. ఇక, విదేశీ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారానూ వైవిధ్యం ఉండేలా చూసుకోవచ్చు. విదేశీ స్టాక్ ఎక్సేంజీల్లో లిపస్ట్ అయిన ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి.
You may be interested
ప్రణాళికతో పెళ్లి... భవిష్యత్తుకు భరోసా
Monday 3rd December 2018వివాహం చేసుకోవడానికి ముందు నుంచే భవిష్యత్తు ఆర్థిక ప్రణాళిక గురించి ఆలోచించడం భరోసానిస్తుంది. వచ్చే జీవిత భాగస్వామి డబ్బు నిర్వహణ ఎలా చేస్తారో తెలుసుకోవడం ముఖ్యమైనది. ఆదాయం, వారి ఖర్చులు, అలవాట్లు అన్నీ తెలుసుకోవాలి. పిల్లలకు ఇతర భారీ లక్ష్యాలకు పొదుపు చేయడాన్ని ప్రారంభించాలి’’అని మనీవర్క్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్‌కు చెందిన సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ నిస్రీన్ మామాజి తెలిపారు. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆర్థిక నిపుణుడిని సంప్రదించి
ఫండ్‌కు రెండు స్కీమ్స్... దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి
Monday 3rd December 2018ప్ర: నేను వ్యాపారం చేస్తున్నాను. ఎన్పీఎస్(నేషనల్ పెన్షన్ సిస్టమ్)లో నేను రూ. లక్షన్నర వరకూ ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఎన్పీఎస్ లో ఇన్వెస్ట్ చేస్తే గరిష్టంగా వచ్చే పన్ను ప్రయోజనం రూ.50,000 మాత్రమేనని మిత్రులు చెబుతున్నారు. అందుకని ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు రూ.50,000 వరకే పరిమితం చేసి, మిగిలిన మొత్తాన్ని ఇతర పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తే నాకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత