News


వీఆర్‌ఎస్‌ సొమ్ములు ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి

Monday 31st December 2018
personal-finance_main1546232340.png-23326

ప్ర:   నా కూతురు ఇప్పుడు రెండో తరగతి చదువుతోంది. నా కూతుర్ని డాక్టర్‌ చేయాలనేది నా కల. ఇటీవలే ఊళ్లో పొలం అమ్మగా రూ.40 లక్షలు వచ్చాయి. ఈ మొత్తాన్ని నా కూతురి చదువు కోసం వినియోగించుకోవాలనుకుంటున్నాను. పదేళ్లలో ఈ 40 లక్షలు రూ. కోటి అయితే నా కూతుర్ని డాక్టర్‌ చేయాలన్న నా కల నెరవేరుతుంది. దీని కోసం ఈ మొత్తాన్ని ఎలా ఇన్వెస్ట్‌ చేయాలి ?
-రాజశేఖర్‌, ఖమ్మం
జ: రాబడులు గరిష్టంగా సాధించేలా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉండాలి. ఇలాంటి పెద్ద మొత్తా‍న్ని ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన ముఖ్యమైన విషయం...ఈ మొత్తం డబ్బులను ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయకూడదు. ఇక ఇన్వెస్ట్‌ చేయడానికి ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్‌ను లేదా అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌ను పరిశీలించవచ్చు.  మీ దగ్గరున్న రూ.40 లక్షల మొత్తాన్ని 24 సమాన భాగాలుగా చేసి, రెండేళ్ల పాటు నెలకొక భాగాన్ని ఈ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయండి. నష్టభయం ఏమాత్రం భరించలేకపోతే, ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. కొద్దిగా రిస్క్‌ తీసుకోదల్చుకుంటే అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. పిల్లల పెద్ద చదువుల అవసరాల కోసం ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ద్రవ్యోల్బణం, ఒకవేళ విదేశాల్లో  చదివించదలుచుకుంటే, అక్కడ చదువుకు, ఉండటానికి అవసరమయ్యే ఖర్చులు, తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. ఆ ప్రకారం రాబడులు వచ్చేలా ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణయాలు తీసుకోవాలి.

ప్ర: నా ప్రజాభవిష్యనిధి (పీపీఎఫ్‌-పబ్లిక్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌) ఖాతా మరో మూడేళ్లలో మెచ్యూర్‌ అవుతోంది. డెట్‌ మ్యూచువల్‌ఫండ్స్‌తో పోల్చితే పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సురక్షితం కదా ?
-జాహ్నవి, హైదరాబాద్‌

జ: డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌తో పోల్చితే పీపీఎఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సురక్షితమైనవేనని చెప్పవచ్చు. ఏ ఇన్వెస్టరైనా తన పోర్ట్‌ఫోలియోలో స్థిరాదాయ సాధనాల్లో కొంత వరకూ ఇన్వెస్ట్‌ చేయడం మంచిది.  మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కనీసం మూడో వంతు వరకూ స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడం  సమంజసంగా ఉంటుంది. ఇక స్థిరాదాయ సాధనాల్లో ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌) ఖాతా మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనమని చెప్పవచ్చు. ఇది పూర్తి సురక్షితం. పీపీఎఫ్‌ రాబడులపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పని లేదు. అయితే భద్రత బాగా ఉంటుందనే ఉద్దేశంతో మీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఎక్కువ మొత్తాన్ని పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మంచి నిర్ణయం కాదు. పీపీఎఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై 8-8.5 శాతం రేంజ్‌లో రాబడులు వస్తాయి. కానీ ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను పీపీఎఫ్‌ ఇవ్వలేదు. అందుకని ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లయితే, పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ తక్కువగానే ఉండేలా చూసుకోవడం మంచిది.

ప్ర: వీఆర్‌ఎస్‌(వాలంటరీ రిటైర్మెంట్‌ సర్వీస్‌) కింద రూ.16 లక్షలు వచ్చాయి. ఈ మొత్తాన్ని మూడు నుంచి ఐదేళ్ల కాలానికి డెట్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. నా పెట్టుబడికి ఢోకా లేకుండా కనీసం 8 నుంచి 9 శాతం రాబడులు వచ్చేలా ఇన్వెస్ట్‌చేయాలనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి.
-రమేశ్‌, విజయవాడ
జ: మీ ఇన్వెస్ట్‌మెంట్‌ అవసరాల కోసం మీరు ఫిక్స్‌డ్‌ మెచ్యురిటీ ప్లాన్‌(ఎఫ్‌ఎమ్‌పీ)లను పరిశీలించవచ్చు. ఇవి దాదాపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలాగానే(ఎఫ్‌డీ) ఉంటాయి. ఎఫ్‌ఎమ్‌పీల కాలపరిమితి మూడేళ్లకు మించి ఉంటుంది. వీటిపై రాబడులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే రాబడుల కంటే కొంచెం అధికంగానే ఉంటాయి. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌, ఎఫ్‌ఎమ్‌పీల్లో ఇన్వెస్ట్‌ చేస్తే.. ఒకింత పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఇండేక్సేషన్‌ ప్రయోజనాలు లభిస్తాయి. ఎఫ్‌ఎమ్‌పీలతో పాటు ఆల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ బాండ్‌ ఫండ్‌, షార్ట్‌ డ్యురేషన్‌ బాండ్‌ ఫండ్స్‌ను కూడా పరిశీలించవచ్చు.

ప్ర: నేను ఇటీవలే ఉద్యోగంలో చేరాను. ఆస్తులు పెద్దగా ఏమీ లేవు. రిటైర్మెంట్‌ నిధి కోసం ఇప్పటి నుంచే 30 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఈ 30 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్‌ చేయడానికి... మ్యూచువల్‌ ఫండ్స్‌, ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌), ఇండెక్స్‌ ఫండ్స్‌.. ఈ మూడింటిల్లో వేటిల్లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిది?
-జాన్సన్‌, విశాఖపట్టణం
జ: ఈటీఎఫ్‌, ఇండెక్స్‌ ఫండ్‌లు.. దాదాపు ఒకేలాగ ఉంటాయి. ఈటీఎఫ్‌లు మార్కెట్లో ​ట్రేడవుతాయి. ఇండెక్స్‌ ఫండ్స్‌ ఓపెన్‌-ఎండ్‌ ఫండ్స్‌లాగా కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ఇక మ్యూచువల్‌ ఫండ్స్‌ విషయానికొస్తే, వీటిల్లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ కీలకం. రాబడులు అధికంగా రావాలంటే మ్యూచువల్‌ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేయడం ఉత్తమం. వీటిల్లోనూ స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌, మల్టీ క్యాప్‌ ఫండ్స్‌ల్లో కొంత కొంత చొప్పున ఇన్వెస్ట్‌ చేయాలి. మీ పోర్ట్‌ ఫోలియోలో కనీసం మూడు నుంచి నాలుగు ఫండ్స్‌ ఉండేలా చూసుకోవాలి. ఈ ఫండ్స్‌ల్లో నెలకు కొంత మొత్తం చొప్పున సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయండి. మీకు ఇంక్రిమెంట్‌ వచ్చినప్పుడల్లా, లేదా ఏడాదికి కనీసం 5- 10 శాతం సిప్‌ మొత్తాలను పెంచండి. సాధారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు అధికంగానే ఉంటాయి. 30 సంవత్సరాల ఇన్వెస్ట్‌మెంట్‌ కాలం అంటే... కనీసం రెండు, మూడు మార్కెట్‌ సైకిల్స్‌ను మీరు చూస్తారు. మార్కెట్‌ పతన బాటలో ఉన్నప్పుడు అధైర్యపడకుండా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తే మ్యూచువల్‌ ఫండ్స్‌ మంచి రాబడులను ఇస్తాయి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకోగలిగే రాబడులు మీరు పొందుతారు.You may be interested

హ్యాపీ న్యూయర్‌ షేర్లవి..!

Monday 31st December 2018

- 2019కి బ్రోకరేజీ సంస్థల సిఫారసులు - ఒడిదుడుకులు కొనసాగుతాయని అంచనా - సార్వత్రిక ఎన్నికలు, ముడి చమురు ధరలే కీలకం - ఫెడ్‌ రేట్లు పెరగనుండటమూ ప్రభావం చూపిస్తుంది - వినియోగ, వ్యవసాయ, ఐటీ షేర్లు బాగుంటాయి - బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ షేర్లు పెరిగే అవకాశాలు - ఆటో రంగం మాత్రం అంతగా పెరగకపోవచ్చు నిఫ్టీ     జనవరి 1- 2018 : 10,435        జనవరి 1-2019:  10,859   - 424    సెన్సెక్స్‌     జనవరి 1- 2018

తక్షణ నిరోధం 36,480

Monday 31st December 2018

నాటకీయంగా గతవారం ద్వితీయార్థంలో అమెరికాతో పాటు జపాన్‌, యూరప్‌ తదితర ధనిక మార్కెట్లు కుదుటపడిన నేపథ్యంలో తీవ్ర పతనం నుంచి భారత్‌ సూచీలు సైతం కోలుకున్నాయి. అయితే అమెరికా మార్కెట్ల రికవరీ తక్కువ ట్రేడింగ్‌ పరిమాణంతో జరుగుతున్నది. ఇది ప్రపంచవ్యాప్తంగా బుల్స్‌ను ఆందోళనపర్చే అంశం. అయితే సాధారణంగా జనవరి తొలివారంలో దాదాపు ప్రపంచ సూచీలన్నీ స్థిరంగా ట్రేడవుతూవుంటాయి. జనవరి రెండోవారంలో ఒడుదుడుకులు మొదవుతుంటాయి. ఈ సందర్భంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌

Most from this category