STOCKS

News


బహుమతిగా వచ్చిన సొమ్ములు ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి ?

Tuesday 9th April 2019
personal-finance_main1554791559.png-25020

ప్ర: మా మొదటి పాప రెండో పుట్టిన రోజు సందర్భంగా మా అత్తగారు రూ.లక్ష బహుమతిగా ఇచ్చారు. దీంట్లో సగం మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి, మిగిలినమొత్తాన్ని ఏదైనా లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌లో గానీ, ఇండెక్స్‌ ఫండ్‌లో గానీ ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. నా కూతురితో పాటు ఈ సొమ్ములు కూడా పెరగాలనేది నా పెట్టుబడి వ్యూహం. ఈ వ్యూహం సరైన ఫలితాలనిస్తుందా ? 
-ఆనంద్‌, నెల్లూరు 
జ: పదేళ్లు, అంతకు మించి ఇన్వెస్ట్‌ చేయాలనుకున్న పక్షంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ గురించి అస్సలు ఆలోచించకండి. మీరు కనీసం ఈ సొమ్ములను 17-18 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్‌ చేస్తారని నేను భావిస్తున్నాను. ఇంత దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఏదైనా ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. గతంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసిన అనుభవం లేకపోయినా, లేకపోతే ఈక్విటీల పట్ల భయం ఉన్నా, తగిన అవగాహన లేకపోయినా, పెట్టుబడి నష్టపోతామనే ఆందోళన ఉన్నట్లయితే, ఏదైనా బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. ఈ బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ మేనేజర్‌ తన ఫండ్‌ మొత్తం నిధుల్లో నాలుగో వంతు స్థిరాదాయ సాధనాల్లో, మూడో వంతు ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తారు. బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లోగానీ, ఈక్విటీ ఫండ్‌లో గానీ ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు, ఆ మొత్తాన్ని ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయకండి. లక్షలోపు మొత్తం ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, ఈ మొత్తాన్ని కనీసం ఆరు నుంచి పది సమాన భాగాలుగా చేసి, ఆ మొత్తాన్ని సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయండి. ఇలా చేస్తే మీకు దీర్ఘకాలంలో మంచి రాబడులు వస్తాయి. 18 నుంచి 20 ఏళ్ల కాలంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కంటే ఈక్విటీలోనే అధిక రాబడులు వస్తాయని నేను గట్టిగా చెప్పగలను. 

ప్ర: నా వయస్సు 80 సంవత్సరాలు. నేను ఇప్పటిదాకా కష్టపడి కూడబెట్టింది రూ.15 లక్షల వరకూ ఉంది. ఈ మొత్తంపై నేను నెలకు రూ.10,000 ఆదాయం ఆశిస్తున్నాను. ప్రధానమంత్రి వయ వందన యోజనలో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. నెలకు రూ.10,000 ఆదాయం వచ్చేలా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే మార్గం ఏదైనా ఉందా ? 
-సుదర్శన్‌, విజయవాడ 
జ: మీరు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి సిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌  ప్లాన్‌(ఎస్‌డబ్ల్యూపీ) ద్వారా నెలకు 10,000 పొందవచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం రిస్క్‌ అని మీరు భావిస్తే, సీనియర్‌ సిటిజన్‌ సేవిం‍గ్స్‌ స్కీమ్‌(ఎస్‌సీఎస్‌ఎస్‌)ను పరిశీలించవచ్చు. ఈ స్కీమ్‌లో మీరు రూ.15 లక్షల వరకూ ఇన్వెస్ట్‌ చేయవచ్చు. దీనిపై రాబడులు నెలకు దాదాపు రూ.10,000 వరకూ వస్తాయి. కానీ, దీంట్లో ఉన్న ఒకే ఒక లోపం ఏమిటంటే, మీకు వడ్డీ మూడు నెలలకొకసారి చెల్లిస్తారు. మీరు మీ పెట్టుబడిపై ఖచ్చితంగా రాబడులు ఆశించాల్సిన అవసరం లేకపోతే, అంటే, మీ ఖర్చులకు ఇతరత్రా సొమ్ములు మీకు అందుబాటులో ఉండి, ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు నెలవారీ డబ్బులు అవసరం లేని పక్షంలో మీరు ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. దీంట్లో సదరు ఫండ్‌ మేనేజర్‌ మొత్తం నిధుల్లో 30 నుంచి 40 శాతం వరకూ పెట్టుబడులను ఈక్విటీలోనూ, మిగిలిన మొత్తాన్ని స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తారు. ఈ ఫండ్‌ నుంచి సిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌(ఎస్‌డబ్ల్యూపీ) ద్వారా రూ.10,000కు అటూ, ఇటూ విత్‌డ్రా చేయవచ్చు. ప్రధాన మంత్రి వయ వందన యోజన, సీనియర్‌ సిటిజన్‌ సేవిం‍గ్స్‌ స్కీమ్‌లతో పోల్చితే ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అధిక రాబడులు పొందవచ్చు. 

ప్ర: నాకు నెల క్రితమే పాప పుట్టింది. పాప కోసం ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఒక మంచి మ్యూచువల్‌ ఫండ్‌ను సూచించండి. అలాగే సిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌(ఎస్‌డబ్ల్యూపీ) కోసం ఒక మంచి ఫండ్‌ను సూచించండి.
-ఫాతిమా, హైదరాబాద​ 
జ: మీ పాప కోసం మీరు కనీసం 18-22 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, ఏ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌నైనా ఎంచుకోవచ్చు. చిల్డ్రన్‌ ప్లాన్‌ పేరుతో వచ్చే ఫండ్‌లోనే ఇన్వె‍స్ట్‌ చేయాల్సిన అవసరం లేదు.. మీరు ప్రతి నెలా కొంత మొత్తాన్ని సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)విధానంలో ఇన్వెస్ట్‌ చేయడానికి ఏ మ్యూచువల్‌ ఫండ్‌ను ఎంచుకున్నా సరిపోతుంది. మీరు ఉద్యోగి అయిన పక్షంలో మీకు ఇంక్రిమెంట్‌ వచ్చినా, మీ వేతనం పెరిగినా, మీ సిప్‌లను పెంచండి. మీరు స్వయం ఉపాధి పొందుతున్న వారైతే, ప్రతి ఏడాది సిప్‌ మొత్తాన్ని పది శాతం మేర పెంచండి. ఇక మీ రెండో ప్రశ్నకు వస్తే, ఏ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచైనా సిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ)ని ఉపయోగించుకోవచ్చు. నెలకు కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా పొందడానికి ఎస్‌డబ్ల్యూపీ ఒక మంచి విధానం. ఈ విధానంలో పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు. మీరు నెలకు ఎంత మొత్తం పొందాలి అనే దాన్ని బట్టి ఏ ఫండ్‌కు ఎస్‌డబ్ల్యూపీని ఉపయోగించుకోవాలో నిర్ణయించుకోవచ్చు. ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో మీకు కొంత ఆదాయం కావాలనుకుంటే, సీనియర్‌ సిటిజెన్‌ సేవిం‍గ్స్‌ స్కీమ్‌, పోస్ట్‌ ఆఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ ప్లాన్‌, ప్రధాన మంత్రి వయోవందన యోజన...వంటి స్కీమ్‌లను పరిశీలించవచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో అయితే నిర్ణీత మొత్తం ఆదాయం వస్తుందని చెప్పలేము. కొంచెం అటూ, ఇటూగా పర్వాలేదనుకుంటే, ఏదైనా మంచి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ను ఎంచుకోవచ్చు.You may be interested

సెన్సెక్స్‌ తక్షణ నిరోధశ్రేణి 39,120-39,270

Tuesday 9th April 2019

వెల్లువలా వచ్చిపడుతున్న విదేశీ ఇన్వెస్టర్ల నిధుల కారణంగా వారం రోజుల క్రితమే సెన్సెక్స్‌ కొత్త రికార్డును నెలకొల్పగా, గతవారం నిఫ్టీ కూడా అదే ఫీట్‌ను సాధించింది. కేవలం నెలరోజుల్లో భారత్‌ సూచీలు 10 శాతం ర్యాలీ జరపడం విశేషం. ఈ ట్రెండ్ భారత్‌కే పరిమితం కాలేదు. దాదాపు ఇదేస్థాయిలో అమెరికా, జర్మనీ సూచీలు సైతం పెరిగాయి. ఆసియాలో హాంకాంగ్‌, చైనా ఇండెక్స్‌లు కూడా 5 శాతంపైగానే జంప్‌చేసాయి. అమెరికా కేంద్రబ్యాంక్‌

మనీలాండరింగ్‌ వివాదంలో రిలయన్స్‌!!

Tuesday 9th April 2019

- నెదర్లాండ్స్‌ సంస్థ హక్‌తో కుమ్మక్కై 1.2 బిలియన్‌ డాలర్ల మళ్లింపు - ముగ్గురు హక్‌ ఉద్యోగులను అరెస్ట్‌ చేసిన డచ్‌ ప్రభుత్వం - ఆరోపణలు ఖండించిన రిలయన్స్‌ న్యూఢిల్లీ: దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) తాజాగా మనీలాండరింగ్‌ వివాదంలో చిక్కుకుంది. నెదర్లాండ్స్‌ సంస్థ ఎ హక్‌ తోడ్పాటుతో 1.2 బిలియన్‌ డాలర్లు మళ్లించినట్లు డచ్‌ ప్రాసిక్యూటర్స్‌ ఆరోపించడం సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఎ హక్‌ ఉద్యోగులు ముగ్గురు అరెస్టయ్యారు.

Most from this category