News


ఫండ్స్‌ పెట్టుబడుల్లో సింహ భాగం ఈ రంగాలదే

Tuesday 22nd January 2019
personal-finance_main1548179442.png-23735

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు నిపుణుల పర్యవేక్షణలో పెట్టుబడులు పెట్టి రాబడులు పంచుతుంటాయి. అందుకే సాధారణ ఇన్వెస్టర్లు సరైన అవగాహన లేకుండా నేరుగా షేర్లలో ఇన్వెస్ట్‌ చేసి చేతులు కాల్చుకోకుండా, ఫండ్స్‌ను నమ్ముకోవడం మంచిదని ఆర్థిక సలహాదారులు సూచిస్తుంటారు. కాస్త విషయ పరిజ్ఞానం ఉన్న ఇన్వెస్టర్లు మాత్రం మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు తీసుకునే పెట్టుబడి నిర్ణయాలను ఫాలో అయిపోతుంటారు. సొంతంగానే ఇన్వెస్ట్‌ చేసి రాబడులు తెచ్చుకోవాలనుకునే వారు మ్యూచువల్‌ పండ్స్‌ ఏ రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

 

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ తమ పెట్టుబడుల్లో ఎక్కువ భాగాన్ని బ్యాంకు స్టాక్స్‌లోనే కుమ్మరించాయి. 2018 డిసెంబర్‌ నాటి గణాంకాలు ఈ విషయాన్నే తెలియజేస్తున్నాయి. తమ మొత్తం ఈక్విటీ పెట్టుబడుల్లో 21.85 శాతాన్ని బ్యాంకు స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేశాయి. 43 మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు కలసి రూ.2,22,523 కోట్లను బ్యాంకు స్టాక్స్‌లో పెట్టినట్టు సెబీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. నవంబర్‌ నాటికి ఉన్న 21.58 శాతం (రూ.2,13,717 కోట్లు)తో పోలిస్తే పెట్టుబడులు పెరిగాయి. అక్టోబర్‌ నాటికి ఈ శాతం 21.04గానే ఉంది. గత మూడు నెలల్లో వరుసగా పెట్టుబడులు పెరగడాన్ని చూస్తే... బ్యాంకుల వృద్ధి, లాభదాయకతపై అంచనాలు పెరిగినట్టు తెలుస్తోంది. ఆర్థిక రంగంతో ముడిపడి ఉండడం, ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో బ్యాంకింగ్‌ రంగానికి 35 శాతం వెయిటేజీ ఉండడం వంటివి ఫండ్స్‌ అగ్ర ప్రాధాన్యం వెనుక కారణాలు. దీని తర్వాత ఫైనాన్షియల్‌ రంగానికి పెద్ద పీట వేశాయి. ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో రూ.98,053 కోట్లను డిసెంబర్‌ నాటికి ఇన్వెస్ట్‌ చేశాయి. ఫండ్స్‌ మొత్తం ఈక్విటీ పెట్టుబడుల్లో ఇది 9.63 శాతానికి సమానం. మూడో ప్రాధాన్య రంగంగా సాఫ్ట్‌వేర్‌ ఉంది. సాఫ్ట్‌వేర్‌ స్టాక్స్‌లో 8.45 శాతానికి సమానమైన రూ.86,094 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. కన్జ్యూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ రంగంలో రూ.76,153 కోట్ల మేర పెట్టుబడులు కలిగి ఉన్నాయి. ఇవి టాప్‌ 5 రంగాలు.

 

ఇక మిగిలిన రంగాల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులను పరిశీలిస్తే... ఫార్మా రంగంలో 5.51 శాతం మేర రూ.56,115 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన స్టాక్స్‌లో రూ.52,029 కోట్లు (5.11 శాతం), ఆటో రంగ స్టాక్స్‌లో రూ.44,526 కోట్లు (4.37 శాతం), కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల్లో రూ.42,808 కోట్లు (4.20శాతం), పవర్‌ కంపెనీల్లో 33,258 కోట్లు (3.27శాతం), ఆటో యాన్సిలరీ కంపెనీల్లో రూ.28,084 కోట్లు(2.76శాతం) డిసెంబర్‌ నాటికి కలిగి ఉన్నాయి. ఎంపిక చేసిన ప్రైవేటు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల కంపెనీలు ఇక ముందూ మంచి వృద్ధి, లాభాల నమోదును, క్యాపిటల్‌ రేషియోను కొనసాగిస్తాయని ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఐవో మహేష్‌పాటిల్‌ పేర్కొన్నారు. జీవిత బీమా, సాధారణ బీమా కంపెనీలకు భవిష్యత్తులో అద్భుతమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయని చాలా మంది ఫండ్‌ మేనేజర్లు అభిప్రాయపడుతున్నారు.



You may be interested

2019 బడ్జెట్‌పై నిపుణుల అంచనాలు

Tuesday 22nd January 2019

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్‌పై సామాన్యుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఎన్నికల ముందు బడ్జెట్‌ కావడంతో కచ్చితంగా ప్రజలను సంతోషపరిచే నిర్ణయాలు ఉంటాయన్న అంచనాలు ఎక్కువయ్యాయి. దేశంలో పెట్టుబడుల వాతావరణం ఏటేటా ఇనుమడిస్తుండడం, కొత్త ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌, స్టాక్‌ మార్కెట్ల వైపు అడుగులు వేస్తున్న పరిస్థితులను చూస్తున్నాం. ఈ క్రమంలో ఇన్వెస్టర్ల వర్గానికి మేలు చేసే నిర్ణయాలు ఉంటాయని విశ్లేషకులు

క్యు3లో దిగ్గజాల పోర్టుఫోలియో మార్పులు

Tuesday 22nd January 2019

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఈక్విటీలు తీవ్ర ఒడిదుడుకులు చూశాయి. ఒకదశలో భారీగా పతనమై మరలా క్రమంగా కోలుకున్నాయి.  ఇలాంటి సంక్షోభ సమయంలో దేశంలో ప్రముఖ దిగ్గజ ఇన్వెస్టర్లు ఏం కొన్నారు? ఏం అమ్మారు? చూద్దాం.. - రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా: కొనుగోళ్లు: ఫెడరల్‌ బ్యాంక్‌, ఎన్‌సీసీల్లో ఒక శాతానికి మించి వాటా పెంచుకున్నారు. జుబిలాంట్‌ లైఫ్‌, ఆప్‌టెక్‌లో గణనీయంగా కొనుగోళ్లు చేశారు. అమ్మకాలు: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ర్యాలీస్‌ఇండియా, టైటన్‌, లుపిన్‌లో దాదాపు 0.02 నుంచి

Most from this category