STOCKS

News


ఈ అపోహలకు చోటివ్వొద్దు

Monday 28th January 2019
personal-finance_main1548649492.png-23840

ఆన్‌లైన్‌లో అన్ని బీమా ఉత్పత్తులూ చౌక కాదు
మ్యూచువల్‌ ఫండ్స్‌కు కాంపౌండింగ్‌ సరికాదు
ఆన్‌లైన్‌ భారీ సేల్స్‌లో తగ్గింపు కొసరంతే
సిప్‌పై నష్టాలు రావన్న గ్యారంటీ లేదు
తెలుసుకోవాల్సిన ఇలాంటి అంశాలెన్నో...

ఆర్థిక విషయాలు, పెట్టుబడుల విషయంలో కచ్చితంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలం. అయితే, ఈ మార్గంలో ఎన్నో సందేహాలు, అపోహలు తలెత్తుతుంటాయి. ఏది నిజం? అన్నది తెలిస్తేనే సరైన నిర్ణయాలకు అవకాశం ఉంటుంది. అపోహతో తీసుకునే నిర్ణయం నష్టానికి కారణం కావచ్చు. అందుకని ఇన్వెస్టింగ్‌, పలు ఉత్పత్తుల కొనుగోళ్లకు సంబంధించి తప్పుడు అభిప్రాయాలకు చెక్‌ పెట్టాలి. అవేంటన్నది తెలియజేసే కథనమే ఇది.

ఆన్‌లైన్‌లో బీమా మంచిదా?
ఆన్‌లైన్లో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లు కొనుగోలు చేయడం వల్ల తక్కువ ధరలకే వస్తాయి. ఉదాహరణకు రూ.కోటి టర్మ్‌ పాలసీని 30 ఏళ్ల వ్యక్తి 30 ఏళ్ల కాలానికి తీసుకునేట్టు అయితే మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌లైన్‌లో ఇచ్చే సూపర్‌ టర్మ్‌ ప్లాన్‌పై ఏడాది ప్రీమియం కింద రూ.12,100 చార్జ్‌ చేస్తోంది. ఇంతే మొత్తానికి ఇదే సంస్థ నుంచి ఆన్‌లైన్‌లో టర్మ్‌ ప్లాన్‌ తీసుకుంటే ప్రీమియం 30 శాతం తక్కువకు రూ.8,378కే వస్తోంది. అయితే, వైద్య బీమా, వాహన బీమా పాలసీలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం వల్ల ఈ విధమైన డిస్కౌంట్‌ ఉండడం లేదు. ఆన్‌లైన్‌లో వాహన బీమా ప్రీమియం తక్కువకే తీసుకోవచ్చన్న ప్రకటనలు వినిపిస్తుంటాయి. వైద్య బీమా లేదా కారు బీమాను ఆన్‌లైన్‌లో తీసుకునే ముందు సంబంధిత ప్లాన్‌ సదుపాయాల గురించి తప్పక తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇన్సూర్డ్‌ డిక్లేర్డ్‌ వ్యాల్యూ (వాహన బీమా మొత్తం) తగ్గించడం ద్వారా తక్కువ ప్రీమియంతో ఆకర్షించే ఎత్తుగడలు ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి. అందుకే జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఫండ్స్‌కు కాంపౌండింగ్‌ సూత్రమా!
మ్యూచువల్‌ ఫండ్స్‌ దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇస్తాయని ఇప్పటి వరకు ఉన్న చారిత్రక అనుభవాలు తెలియజేస్తాయి. దీర్ఘకాలం పాటు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల కాంపౌండింగ్‌ ప్రయోజనంతో అధిక రాబడులు పొందొచ్చని ఎవరైనా చెబితే అది తప్పే అవుతుంది. ఎందుకంటే కాంపౌండింగ్‌ అన్నది అప్పటికే పెట్టుబడిపై ఆర్జించిన వడ్డీ ఆదాయానికి అదనపు రాబడి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో వడ్డీ రేటును ముందే నిర్ణయించడం జరుగుతుంది. ఏటేటా వృద్ధి ఒకే విధంగా ఉంటుంది. కానీ, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడులు స్థిరంగా ఉండవు. 2016లో లార్జ్‌క్యాప్‌ ఈక్విటీ ఫండ్‌ సగటు రాబడి 3.7 శాతంగా ఉంటే, 2017లో అది 31 శాతానికి పెరిగింది. తిరిగి 2018లో 1.1 శాతం దగ్గరే ఆగిపోయింది. స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ నెగెటివ్‌ రిటర్నులు (నష్టాలు) కూడా ఇస్తాయి. ‘‘కాంపౌండింగ్‌ అన్నది కాంపౌండ్‌ వడ్డీకే వినియోగించడం జరుగుతుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎటువంటి వడ్డీని ఆఫర్‌ చేయవు. కనుక కాంపౌడింగ్‌ అంశం మ్యూచువల్‌ ఫండ్స్‌కు వర్తించదు’’ అని ఫ్రీఫిన్‌కాల్‌ అనే బ్లాగ్‌సైట్‌ వ్యవస్థాపకుడు ఎం.పట్టాభిరామన్‌ పేర్కొన్నారు. కాంపౌండింగ్‌ వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌)ను పనితీరును అంచనా వేయడానికి వినియోగిస్తారని, దీనివల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి కాంపౌండింగ్‌ చెందుతున్నట్టు భావిస్తారని, ఇది తప్పుడు అభిప్రాయంగా పేర్కొన్నారు.

సిప్‌ అన్నది సురక్షితమేనా?
రెగ్యులర్‌గా సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లడం వల్ల నష్టపోవడానికి అవకాశం ఉండదని నమ్ముతున్నారా...? నిజానికి సిప్‌ విధానంలో ఈక్విటీ ఫండ్స్‌లో నష్టాలు రావన్న గ్యారంటీ ఏదీ ఉండదు. కేవలం రిస్క్‌ను తగ్గించుకునేందుకే సిప్‌ పనికొస్తుంది. సిప్‌ అన్నది ఇటీవలి కాలంలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రతీ నెలా సిప్‌ మార్గంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి రూ.7,000 కోట్లకుపైగా పెట్టుబడులు వస్తుండడం గమనార్హం. సిప్‌ అన్నది మార్కెట్‌ అస్థిరతల నుంచి రక్షణ కల్పిస్తుంది. కొనుగోలు ధరను సగటు చేస్తుంది. అంతేకానీ నష్టాలు రాకుండా హామీనివ్వలేదు. ‘‘సిప్‌ అనేది మంచి రాబడులు, చెత్త రాబడులను ఇవ్వదు. రాబడులు అన్నవి మీరు పెట్టుబడి పెట్టే పథకం పనితీరుపైనే ఆధారపడి ఉంటాయి’’ అని మార్కెటింగ్‌ నిపుణులు రేణు మహేశ్వరి పేర్కొన్నారు. నిజానికి ఏడాది, ఏడాదిన్నర క్రితం సిప్‌ విధానంలో ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రారంభించిన వారికి ఇప్పటికీ నష్టాలే మిగిలాయి. నష్టాలు చూపిస్తున్నాయని సదరు సిప్‌ను ఆపడం కూడా తెలివైన నిర్ణయం కాదన్నది ఆర్థిక సలహాదారుల సూచన. సిప్‌ అనేది దీర్ఘకాల లక్ష్యాల సాధనకు వీలు కల్పించే క్రమశిక్షణతో కూడిన ఉపకరణం వంటిదిగా పేర్కొంటున్నారు. భిన్న మార్కెట్‌ సైకిల్స్‌ (పెరిగినప్పుడు, పడినప్పుడు)లో దీంతో ప్రయోజనం పొందొచ్చంటున్నారు.

బీమా నుంచి వచ్చే రాబడి
బీమా పాలసీల మెచ్యూరిటీ మొత్తంపై ఆదాయపన్ను మినహాయింపు ప్రయోజనం చాలా మందిని ఆకర్షిస్తూ ఉంటుంది. బీమా సంస్థలు, ఏజెంట్లు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తుంటారు. వార్షిక ప్రీమియానికి కనీసం 10 రెట్లు బీమా కవరేజీ ఉన్న పాలసీలకే సెక్షన్‌ 10(10డి) ప్రయోజనం ఉంటుంది. అప్పుడే మెచ్యూరిటీపై పన్ను ఉండదు. అయితే, నాణేనికి మరో కోణమన్నట్టు... ద్రవ్యోల్బణం కంటే తక్కువ రాబడి ఇచ్చే సంప్రదాయ బీమా పాలసీల వంటి సాధనాలు ఏమంత సూచనీయం కావు. సంప్రదాయ బీమా పాలసీలు 4.5-5 శాతం రాబడులను ఇస్తాయి. 15 ఏళ్లు అంతకుమించిన కాలానికి అయితే రాబడులు 5-6 శాతం మధ్య ఉంటాయి. మరి ద్రవ్యోల్బణం వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటే గత 15 ఏళ్ల కాలంలో కాస్ట్‌ ఇన్‌ఫ్లేషన్‌ ఇండెక్స్‌ 6.49 శాతం ఉంది. దీంతో బీమాపై వచ్చే రాబడుల కంటే ద్రవ్యోల్బణ రేటే ఎక్కువ ఉన్నట్టు. అందుకే సంప్రదాయ బీమా పాలసీల మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఏమంత ఆకర్షణీయం కాదు.

క్రెడిట్‌ కార్డులు ఎక్కువైతే ఊబిలోకి వెళ్లినట్టేనా?
డీమోనిటైజేషన్‌ తర్వాత డిజిటల్‌ లావాదేవీల ప్రోత్సాహం పుణ్యమా అని క్రెడిట్‌ కార్డుల వినియోగం కూడా పెరిగింది. అయితే, ఒకటికి మించిన క్రెడిట్‌ కార్డులు ఉంటే అధిక వినియోగానికి దారితీసి రుణ ఇబ్బందుల్లోకి వెళ్లిపోవచ్చన్న అభిప్రాయం ఒకటి ఉంది. నిజానికి ఒకటికి మించిన కార్డుల వల్ల అధిక ఖర్చులకు దారితీయాలనేమీ లేదు. ఈ అభిప్రాయం అవాస్తవమని మనీమంత్ర ఎండీ రాజ్‌ఖోస్లా స్పష్టం చేశారు. ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉంటే ప్రయోజనాలు కూడా ఎక్కువే ఉన్నాయంటున్నారు. చెల్లించని బ్యాలనెన్స్‌ను బదలాయించుకునేందుకు చాలా కార్డు సంస్థలు అనుమతిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు మొదటి ఒకటి, రెండు నెలల పాటు చార్జీ వసూలు చేయడం లేదు. అంతకుమందు కార్డు కంటే తక్కువ వడ్డీ రేటునే వసూలు చేస్తున్నాయి. క్రెడిట్‌ స్కోరు పెంచుకోవచ్చు. ఒకటికి మించి కార్డులు ఉంటే ఒక కార్డుపై వినియోగ రేషియో తక్కువగా ఉంటుంది. క్రెడిట్‌ వినియోగ రేషియో క్రెడిట్‌ స్కోరులో కీలక పాత్ర పోషిస్తుంది. రివార్డులు, ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్ని కార్డులు ఒకే తీరులో ఉండవు. కొన్ని గ్రోసరీ కొనుగోళ్లకు బాగా పనికొస్తాయి. కొన్ని ఆన్‌లైన్‌ షాపింగ్‌పై బెనిఫిట్స్‌ ఎక్కువ ఆఫర్‌ చేయవచ్చు. కొన్ని ఇంధనం పోయించుకుంటే సర్‌చార్జీ వసూలు చేయడం లేదు’’ అని ఖోస్లా తెలిపారు.

చిన్న మొత్తాల పథకాల్లో స్థిరమైన రాబడులు?
చిన్న మొత్తాల పొదుపు పథకాల గురించి దాదాపు అందరికీ తెలుసు. వీటిలో రిస్క్‌ ఉండకపోవడంతోపాటు రాబడులకు హామీ ఉంటుంది. అయితే, రాబడులు మాత్రం ఎప్పుడూ ఫిక్స్‌డ్‌గా ఒకే రేటుతో ఉండవు. ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్‌తో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై రేట్లను అనుసంధానించి కొన్నేళ్లు అవుతోంది. కనుక వీటి రేట్లు మార్కెట్‌తో అనుసంధానమై ఉంటాయి. దీంతో ఎప్పటికప్పుడు తగ్గడం, పెరగడం జరుగుతుంది. ప్రతీ త్రైమాసికానికి ఓ సారి వడ్డీ రేట్లను కేంద్రం సమీక్షిస్తుంటుంది. ఎన్‌ఎస్‌సీ, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌, టర్మ్‌ డిపాజిట్లపై మాత్రం ఇన్వెస్ట్‌ చేసే సమయంలో ఉన్న వడ్డీ రేటే కాల వ్యవధి ముగిసే వరకు అమలవుతాయి. పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన పథకాల్లో మారిన వడ్డీ రేటు సంబంధిత కాలానికి అమలవుతుంది.

ఆన్‌లైన్‌లో భారీ తగ్గింపుల్లో నిజమెంత?
ఈ కామర్స్‌ సంస్థలు ప్రత్యేక సందర్భాల్లో మెగాసేల్స్‌ పేరిట భారీ తగ్గింపు ధరలతో విక్రయాలు నిర్వహించే ప్రచారాన్ని చూసే ఉంటారు. అటువంటి మెగాసేల్స్‌లోనే తక్కువ ధరలకు లభిస్తాయన్న అభిప్రాయం కరెక్ట్‌ కాదు. స్టాక్‌ క్లియరెన్స్‌ సేల్స్‌ అంటూ తరచుగా నిర్వహించే విక్రయాల సందర్భాల్లోనూ తగ్గింపు ఆఫర్లు ఉంటాయి. పైగా తరచుగా, రోజువారీగా ఇవి కొన్ని ఉత్పత్తులపై తగ్గింపులను ఆఫర్‌ ఇస్తూనే ఉంటాయి. సాధారణ రోజులతో పోలిస్తే భారీ తగ్గింపు విక్రయ కార్యక్రమాల సందర్భాల్లో కొనుగోళ్లు నాలుగు రెట్లు అధికంగా ఉంటాయని రిటైల్‌ టెక్నాలజీ సంస్థ ఏస్‌ టర్టిల్‌ అంటోంది. ఈ సంస్థ భారీ విక్రయ కార్యక్రమాలపై అధ్యయనం చేయగా... అటువంటి సందర్భాల్లో ఉత్పత్తుల విక్రయ ధరలు సాధారణ రోజులతో పోలిస్తే సగటున 17 శాతం తక్కువగా ఉంటున్నట్టు తెలిసింది. సాధారణ రోజుల్లో ఉండే డిస్కౌంట్లతో పోలిస్తే ఇదేమంత భారీ తగ్గింపు కాదన్నది ఈ సంస్థ విశ్లేషణ. ఇక, భారీ తగ్గింపు సందర్భాల్లో... ఉత్పత్తుల ధరలను పెంచి, వాటిపై ఎక్కువ తగ్గింపు ఇస్తుంటారని కూడా ఈ సంస్థ అంటోంది.You may be interested

గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఈక్విటీల సెగ

Monday 28th January 2019

- 2018లో రూ. 570 కోట్ల ఉపసంహరణ - వరుసగా ఆరో ఏడాది తగ్గిన ఇన్వెస్ట్‌మెంట్స్‌ న్యూఢిల్లీ: అధిక రాబడుల కోసం ఇన్వెస్టర్లు ఈక్విటీల వైపు చూస్తుండటంతో గోల్డ్ ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌) కళ తప్పుతున్నాయి. వరుసగా ఆరో ఏడాది కూడా గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. 2018లో వీటి నుంచి రూ. 571 కోట్ల మేర పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. దీంతో గోల్డ్ ఫండ్స్ నిర్వహణలో

రేటింగ్‌లు ఆధారంగా పెట్టుబడులు పెట్టవద్దు.

Monday 28th January 2019

ప్ర: నేను గత కొంతకాలం నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను.  కనీసం 10–15 ఏళ్ల దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనేది నా ఆలోచన. మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పెంచాలనుకుంటున్నాను. అయితే నా పోర్ట్‌ఫోలియోలోని అన్ని మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ గత ఏడాది ఒక్క డిసెంబర్‌ నెలలోనే 3–4 శాతం వరకూ నష్టపోయాయి. వీటిల్లోంచి పెట్టుబడులను వెనక్కి తీసుకొని వేరే ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా  ? -సంజయ్‌, విజయవాడ జ: మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌

Most from this category