STOCKS

News


ఎస్‌బీఐ ఫండ్‌పై రుణమిస్తారా ?

Monday 10th September 2018
personal-finance_main1536557591.png-20124

ప్ర: నేను గతంలో ఎస్‌బీఐ డ్యుయల్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌లో రూ.40,000 వరకూ ఇన్వెస్ట్‌ చేశాను. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆపేశాను. నాకు ఇప్పుడు డబ్బులు అవసరమయ్యాయి. ఈ ఫండ్‌ తనఖాగా నాకు రుణాలు వచ్చే అవకాశాలున్నాయా ?
-భవానీ, విజయవాడ 
జ: మీ ఎస్‌బీఐ ఫండ్‌పై మీరు రుణం పొందవచ్చు. ఇతర ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, రుణాలు రావడం కష్టమే కానీ, ఎస్‌బీఐ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, మీరు ఓవర్‌డ్రాఫ్ట్‌  పొందే అవకాశాలున్నాయి.  ఎస్‌బీఐ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నందుకు ఎస్‌బీఐ అందిస్తున్న అదనపు ప్రయోజనం ఇది. మీరు ఎస్‌బీఐ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి, మీకు ఎస్‌బీఐ బ్యాంక్‌ ఖాతా ఉన్నట్లయితే, మీరు ఇలా ఓవర్‌డ్రాఫ్ట్‌ పొందవచ్చు. మీరు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం కావాలంటూ ఒక అభ్యర్థన పంపితే సరిపోతుంది. మీరు ఇన్వెస్ట్‌ చేసిన మొత్తంలో 90 శాతం వరకూ (మీ విషయంలో అయితే రూ.36,000 వరకూ) మీరు ఓవర్‌డ్రాఫ్ట్‌ పొందవచ్చు. మీరు వేరే రుణం పొందాల్సిన అవసరం లేదు. ఈ మొత్తానికి మీరు చెక్కులు రాసేసి, మీ వద్ద డబ్బులు ఉన్నప్పుడు జమ చేస్తే సరిపోతుంది. స్వల్పకాలిక నగదు  అత్యవసరాలకు ఇదొక మంచి సౌలభ్యం. 

ప్ర: దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నేపథ్యంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వె‍స్ట్‌ చేయడం కన్నా, యులిప్‌(యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌)ల్లో ఇన్వెస్ట్‌ చేయడమే మంచిదని కొంత మంది మిత్రులు చెప్తున్నారు. ఈ సూచన సరైనదేనా ?
-సంజయ్‌, హైదరాబాద్‌
జ: దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విషయమై, ఈక్విటీ ఫం‍డ్స్‌ కంటే యులిప్‌లకే ప్రయోజనం ఉన్న మాట నిజమే. అయితే ఈ ఒక్క విషయం కారణంగా ఈక్విటీ ఫండ్స్‌ కంటే యులిప్‌లు ఆకర్షణీయమని చెప్పలేము. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ పారదర్శకంగా ఉంటాయి. వాటిల్లో లిక్విడిటీ అధికంగా ఉంటుంది. వ్యయాల పరంగా చూసినా, యులిప్‌ల కంటే ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, వ్యయాలు తక్కువగా ఉంటాయి. మీరు ఇన్వెస్ట్‌ చేసిన ఫండ్స్‌ సరైన పనితీరు కనబరచకపోతే, సదరు ఫండ్స్‌నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎప్పుడైనా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక యులిప్‌ల విషయానికొస్తే, ఇలాంటి ప్రయోజనాలు ఏమీ ఉండవు. వీటిల్లో లిక్విడిటీ పెద్దగా ఉండదు. పారదర్శకత కూడా పెద్దగా ఉండదు. యులిప్‌ల నుంచి బయటకు రావాలంటే సరెండర్‌ చార్జీలు అధికంగా ఉంటాయి. ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యయాల పరంగా చూస్తే.. యులిప్‌ల విషయంలో ఒకింత వెసులుబాటు ఉంటుంది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే, బీమా, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎప్పుడు కలగలపకూడదు. బీమా, ఇన్వెస్ట్‌మెంట్స్‌ కలగలసిన యులిప్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల తగిన బీమా కవరేజ్‌ను పొందలేరు. అలాగే మంచి రాబడులను కూడా రావు. మీ బీమా అవసరాలను యులిప్‌లను తీర్చలేవు. ఒక వ్యక్తికి బీమా అత్యంత అవసరమైన అంశం. దీని కోసం కేవలం యులిప్‌లపైననే ఆధారపడకూడదు. బీమా అవసరాల కోసం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకోవాలి. ఇక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి. 

ప్ర: అభివృద్ధి చెందుతున్న భారత్‌లాంటి దేశంలో వాల్యూ ఇన్వెస్టింగ్‌ వ్యూహం మంచిదేనా ?  వాల్యూ ఆధారిత ఫండ్‌లో ఇన్వెస్ట్‌చేయడం వల్ల మంచి ప్రయోజనాలే వస్తాయని, దీంట్లో ఇన్వెస్ట్‌ చేస్తే, మంచిదని మిత్రుడొకరు చెబుతున్నారు. ఆయన మాటను పాటించవచ్చా ?
-కిరణ్‌, కాకినాడ 
జ: అభివృద్ధి చెందుతున్న మన దేశంలో ఇన్వెస్ట్‌మెంట్‌ పరంగా చూస్తే, వాల్యూ ఇన్వెస్టింగ్‌ వ్యూహం మంచిదే. అందుకని ప్రతి ఇన్వెస్టర్‌ పోర్ట్‌ఫోలియోలో వాల్యూ ఫండ్‌ తప్పనిసరిగా ఉండాల్సిందే. మన దేశంలో అర్థికంగా ఎదుగుతోంది. ఈ క్రమంలో కంపెనీల మధ్య పోటీ పెరుగుతుంది. పోటీని తట్టుకోవడానికి కంపెనీ యాజమాన్యాలు కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తాయి. మరోవైపు చిన్న చిన్న ప్రతికూలతల కారణంగా షేర్ల ధరలు స్వల్పకాలంలోనే తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయి. ఉదాహరణకు ఐటీ, లేదా టెక్నాలజీ  షేర్లను తీసుకుందాం. కొన్ని కంపెనీల ఆర్థిక ఫలితాలు  అంచనాలకు అనుగుణంగా లేకపోతే, ఆయా కంపెనీల షేర్లు 5-10 శాతం రేంజ్‌లో పతనమవుతాయి. అలాగే భవిష్యత్తు అంచనాలు అంతంతమాత్రంగానే ఉంటాయని వెల్లడించినా కానీ, ఆయా కంపెనీల షేర్లు కూడా ఇదే రేంజ్‌లో క్షీణిస్తాయి. చాలా మంది ఫండ్‌ మేనేజర్లు దీర్ఘకాలిక లక్ష్యాల ఆధారంగా ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్క రోజు మార్పుల వల్ల కంపెనీ వ్యాపారాలు పెద్దగా ప్రభావితం కావనే విషయం వారికి తెలుసు. అందుకనే దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు బాగా ఉన్న కంపెనీల షేర్లు స్వల్పకాలంలో నష్టపోతే, వాటిని కొనుగోలు చేస్తారు. ఇలా ఐటీ షేర్లలోనే కాకుండా పలు కంపెనీల విషయంలో అవకాశాలను వారు అందిపుచ్చుకుంటారు. ఈ విధంగా వృద్ది చెందుతున్న మన దేశంలో వేల్యూ ఇన్వెస్టింగ్‌ వ్యూహం సత్ఫలితాలను ఇస్తుందనే చెప్పవచ్చు. అందుకని మీ పోర్ట్‌ఫోలియోలో వేల్యూ ఫండ్‌ను తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. 



You may be interested

బేర్‌మంటున్న బ్యాంకింగ్‌ షేర్లు

Monday 10th September 2018

ముంబై:- అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులకు, రూపాయి కొత్త కనిష్టాలకు క్షీణత తోడవ్వడంతో సోమవారం మార్కెట్‌ నష్టాల బాట పట్టింది. అత్యధికంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌(0.50శాతం లాభం) తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌:- నేడు 27,395.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభంమైంది. మార్కెట్‌ పతనంలో భాగంగా 1శాతం(271 పాయింట్లు నష్టపోయి 27210 వద్దకు పతనమైంది. ఈ

సెబీ ముందుకు త్వరలో చందా కొచర్‌..

Monday 10th September 2018

న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల వ్యవహారంలో నిబంధనల ‍అతిక్రమణ ఆరోపణలకు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్‌, ఆమె భర్త దీపక్ కొచర్‌లను ప్రశ్నించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ త్వరలో సమన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వారితో పాటు కొందరు బ్యాంకు ఉన్నతాధికారుల్లో, వీడియోకాన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్స్‌కు కూడా సమనల్ు జారీ చేయొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై వివిధ దర్యాప్తు సంస్థల

Most from this category