STOCKS

News


బంగారం కంటే బంగారం బాండ్లు మిన్న! 

Monday 22nd October 2018
personal-finance_main1540182988.png-21340

స్టాక్‌ మార్కెట్‌ పతనమవుతున్న నేపథ్యంలో ఇటీవలికాలంలో బంగారం ధర పెరుగుతోంది. ఈ సమయంలో ఇన్వెస్టర్లు...వారి దీర్ఘకాలిక  పెట్టుబడుల్లో కొంతభాగాన్ని బంగారం కొనుగోలుకు కేటాయించుకోవాలనుకోవడం సహజం. బంగారాన్ని భౌతికంగా కొని, భద్రపర్చేకంటే..బంగారాన్ని ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉంచుకోవడం మెరుగైన ఆ‍ప్షన్‌ అవుతుంది. ఎలక్ట్రానిక్‌ రూపంలో బంగారాన్ని నిల్వ చేసుకోవాలనుకునే వారు... గోల్డ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌), మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు అందించే గోల్డ్‌ ఫండ్స్‌, సావరీన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ) ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అయితే, గోల్డ్‌ ఈటీఎఫ్‌, గోల్డ్‌ ఫండ్స్‌ ఈ రెండూ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు అందించేవే. కనుక వీటి కొనుగోలుకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కనీసం 0.6 శాతం నుంచి 1.2 శాతం మధ్యలో చార్జీలు, ఎక్స్‌పెన్స్‌ రేషియో రూపంలో చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ మూడింటిలో ప్రభుత్వం అందించే సార్వభౌమ బంగారం బాండ్లు బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మంచి ఆప్షన్‌ అవుతుందంటున్నారు నిపుణులు. వీటికి ఎటువంటి చార్జీలు లేకపోవడం, పైగా వడ్డీ రూపంలో కొంత ఆదాయం కూడా అందుకునే అవకాశం ఇందులోనే ఉందన్న విషయాన్ని గుర్తించాలి. 

సార్వభౌమ బంగారం బాం‍డ్లు అంటే?
వీటిని కేంద్ర ప్రభుత్వం మొట్ట మొదటిగా 2015లో ప్రారంభించింది. బంగారంలో పెట్టుబడులను ఎలక్ట్రానిక్‌ రూపంలోకి మళ్లించడం ద్వారా, దిగుమతుల భారాన్ని తగ్గించడం కోసం వీటిని తీసుకొచ్చింది. ఆర్‌బీఐ ద్వారా ఆఫర్‌ చేస్తోంది. ఎస్‌జీబీ అన్నది కేంద్ర ప్రభుత్వం అందించే సెక్యూరిటీ. ఈ బాండ్లను బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా విక్రయిస్తాయి. అయితే, ఇందులో ఇన్వెస్ట్‌ చేయాలంటే ఇతర పెట్టుబడి సాధనాల మాదిరే... కేవైసీ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. బంగారం బాండ్లు డీమ్యాట్‌ రూపంలో ఉంటాయి. రూ.20,000 వరకు పెట్టుబడి అయితే నగదు రూపంలో చెల్లించేందుకు అవకాశం ఉంది. అంతకు మించితే మాత్రం తప్పనిసరిగా చెక్కులు, డీడీలు, ఎలక్ట్రానిక్‌ రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం జారీచేసిన బంగారం బాండ్ల ఇష్యూ ఒకటి ఇటీవలే ముగిసింది. స్టాక్‌ ఎక్సే‍్ఛంజీల్లో గత ఇష్యూలకు సంబంధించిన సావరిన్‌ బాండ్లు సబబైన ధరల్లో లభిస్తుంటే ఇన్వెస్టర్లు కొనవచ్చు. లేదా ప్రభుత్వం నుంచి వెలువడే తదుపరి ఇష్యూ కోసం వేచిచూడాల్సివుంటుంది. 

రాబడులు
దేశీయ బంగారం ధరలకు అనుగుణంగానే బంగారం బాండ్ల ధర కూడా ఉంటుంది. పెట్టుబడులను వెనక్కి తీసుకునే సమయంలో... అంతక్రితం మూడు రోజుల సగటు బంగారం (999 స్వచ్ఛత కలిగినది) ధర ఆధారంగా చెల్లింపులు జరుగుతాయి. ఇండియన్‌ బులియన్‌ అండ్‌ జ్యుయలర్స్‌ అసోసియేషన్‌ ఈ ధరల్ని ప్రకటిస్తుంది. ఇక ఈ బాండ్లపై వడ్డీ ఆదాయం కూడా అందుకోవచ్చు. ప్రారంభంలో చేసిన పెట్టుబడి విలువపై వార్షికంగా 2.5 శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తుంది. ఈ వడ్డీని ఇన్వెస్టర్ల బ్యాంకు ఖాతాకు ఆరు నెలలకోసారి జమ చేస్తారు. బంగారం బాండ్లు... గ్రాము బంగారం ఒక యూనిట్‌గా ఉంటాయి. కనీస పెట్టుబడి ఒక గ్రాము. ఒక్కో వ్యక్తి సొంతంగా 4కిలోల వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో బాండ్లు కొనుగోలు చేసుకునేందుకు అనుమతి ఉంది. ట్రస్ట్‌లు, ఇతర సంస్థలకు ఈ పరిమితి 20 కిలోలుగా ఉంది. బంగారం బాండ్లను జాయింట్‌గా కూడా తీసుకోవచ్చు. అటువంటి సందర్భాల్లో గరిష్ట కొనుగోలు పరిమితి ఫస్ట్‌ హోల్డర్‌కు వర్తిస్తుంది. ఆన్‌లైన్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆన్‌లైన్‌లో బాండ్ల దరఖాస్తుకు ప్రతీ గ్రాముపై ఆర్‌బీఐ రూ.50 తగ్గింపునిస్తోంది. బంగారం బాండ్ల ధర పెరగడం, తగ్గడం అన్నది మార్కెట్‌తోనే ముడిపడి ఉంటుంది. బంగారం ధరలు తగ్గినప్పుడు వడ్డీ ఆదాయం రూపంలో కొంత మేర పెట్టుబడి విలువకు రక్షణ ఉంటుంది. బంగారం మాదిరే బంగారం బాండ్లను కూడా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వద్ద హామీగా ఉంచి రుణాలను పొందొచ్చు. 

ఉపసంహరణ, పన్ను
సార్వభౌమ బంగారం బాండ్ల కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ఒకవేళ ఏదైనా అత్యవసరం ఏర్పడి డబ్బులు అవసరమైతే... బాండ్లను జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్ల తర్వాత ముందుగానే వెనక్కి తీసేసుకోవచ్చు. వడ్డీ చెల్లించడానికి కనీసం ఒక రోజు ముందు బ్యాంకు లేదా పోస్టాఫీసులో రిడీమ్‌ (ఉపసంహరణ) గురించి తెలియజేయాలి. డీమ్యాట్‌ రూపంలో కలిగి ఉంటే, స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లోనూ ట్రేడ్‌ అవుతాయి. కాకపోతే ట్రేడింగ్‌ అన్నది పరిమితంగా ఉంటుంది. బంగారం బాండ్లపై చేసే వడ్డీ చెల్లింపులు పన్ను ఆదాయం కిందకే వస్తుంది. పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఆదాయం శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, బంగారం పెట్టుబడిపై వచ్చిన మూలధన లాభానికి పన్ను లేదు. 



You may be interested

సత్తా ఉన్న స్టాక్స్‌లో ఇన్వెస్టింగ్‌

Monday 22nd October 2018

హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌ బిల్డర్‌ వ్యాల్యూ ఫండ్‌ ఇటీవలి మార్కెట్‌ కరెక్షన్‌లో అన్ని రకాల స్టాక్స్‌ దిద్దుబాటుకు గురయ్యాయి. దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలని భావించే వారి ముందు, స్టాక్స్‌ విలువలు పడిపోయిన ప్రస్తుత తరుణంలో చక్కని అవకాశాలు ఉన్నాయి. మంచి పనితీరుతో కూడిన వ్యాల్యూ ఫండ్స్‌ను ఎంచుకోవడమే ఇన్వెస్టర్లు చేయాల్సిన పని. ఆ విధంగా చూసినప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌ బిల్డర్‌ వ్యాల్యూ ఫండ్‌ ఒక ఎంపికగా

సిప్‌లు ఆపొద్దు ఈ సమయంలో...

Monday 22nd October 2018

సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌/క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక) ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రతీ నెలా రూ.5,000-7,000 కోట్ల వరకు సిప్‌ మార్గంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు తరలిరావడం చూస్తున్నాం. సామాన్యుల నుంచి ఉన్నతాదాయ వర్గాల వారి వరకు అందరిలోనూ సిప్‌పై ఇటీవల అవగాహన విస్తృతం అయింది. అయితే, తాజా మార్కెట్‌ క్రాష్‌లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడులు ప్రతికూలం (మైనస్‌)గా

Most from this category