STOCKS

News


రిస్క్‌ తగ్గిస్తూ రాబడినిచ్చే ఫండ్‌

Monday 3rd December 2018
personal-finance_main1543815278.png-22590

  • రిస్క్‌ను తగ్గిస్తూ రాబడినిచ్చే ఫండ్‌
  • కోటక్‌ స్టాండర్డ్‌ మల్టీక్యాప్‌

ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులతో కొనసాగుతుండడాన్ని చూస్తున్నాం. కొన్ని రోజులు ర్యాలీ చేయడం, కొన్ని రోజులు నష్టాల పాలు కావడం సాధారణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులను సమర్థంగా నెగ్గుకొచ్చే మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇవ్వగలుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తరహా పథకాలపై దృష్టి సారించడం మంచిది. అటువంటి వాటిల్లో కోటక్‌ స్టాండర్డ్‌ మల్టీ‍క్యాప్‌ ఒకటి. 2008-09 మార్కెట్‌ పతనం తర్వాత ఈ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం ప్రారంభమైంది. 2011, 2013, 2015, 2016 సంవత్సరాల్లో మార్కెట్లలో అస్థిరతల సమయంలో ఈ పథకం నష్టాలను పరిమితం చేసి చూపించింది. గతంలో కోటక్‌ సెలక్ట్‌ ఫోకస్‌ ఫండ్‌ పేరుతో కొనసాగిన ఈ పథకం... సెబీ మార్పుల తర్వాత కోటక్‌ స్టాండర్డ్‌ మల్టీక్యాప్‌గా మారింది.
పెట్టుబడి విధానాలు
మార్కెట్‌ కరెక్షన్లలో, ఒడిదుడుకుల సమయాల్లో నగదు నిల్వలు పెంచుకోవడం లేదా డెట్‌ విభాగంలో పెట్టుబడులను అధిగం చేయడం వంటి విధానాలతో నష్టాలను తగ్గించడంపై ఈ ఫండ్‌ మేనేజర్లు దృష్టి సారిస్తుంటారు. అదే సమయంలో అస్థిరతలు తక్కువగా ఉండే రంగాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. ఉదాహరణకు 2011 కరెక్షన్‌ సమయంలో ఈ పథకం నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 8-12 శాతం నగదు, డెట్‌ రూపంలోనే ఉన్నాయి. అలాగే, ఫార్మా, నాన్‌ డ్యుబుల్స్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో ప్రధాన సూచీలతో పోలిస్తే చాలా తక్కువగా కేవలం 4 శాతం నష్టాలకే పరిమితం అయింది. లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం ఈ పథకం పనితీరులో భాగం. దీంతో స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌తో పోలిస్తే నష్టాలు తక్కువగా ఉంటాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ కలిపి పెట్టుబడులు 20 శాతం దాటకుండా చూస్తుంది. ఇక 2013, 2015, 2016 కరెక్షన్లలో మిడ్‌, స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులను తగ్గించుకోవడం ద్వారా నష్టాలను పరిమితం చేసింది.
రాబడులు
ఈ తరహా విధానాల కారణంగా బుల్‌ ర్యాలీల్లో పనితీరు అద్భుతంగా లేకపోయినప్పటికీ మెరుగ్గా ఉండడం గమనార్హం. ఇందుకు నిదర్శనం ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా చూసే నిఫ్టీ 200 కంటే పనితీరు పరంగా మెరుగ్గానే ఉంది. మూడేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు వార్షికంగా 12 శాతంగా, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 18.4 శాతంగా ఉన్నాయి. కానీ, ఇదే కాలంలో బెంచ్‌ మార్క్‌ నిఫ్టీ 200 రాబడులు 11.5 శాతం, 13.9 శాతం చొప్పునే ఉండడం గమనార్హం. అయితే, ఏడాది కాలంలో బెంచ్‌ మార్క్‌ నష్టాలు 1.2 శాతం అయితే, ఈ పథకంలో నష్టాలు 3.2 శాతంగా ఉన్నాయి. ఏడాది కాలంలో బెంచ్‌ మార్క్‌ పనితీరు కంటే కాస్త వెనుకబడడానికి కారణం... 2018లో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌లో నష్టాలు భారీగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ పథకం ఫండ్‌ మేనేజర్లు మిడ్‌, స్మాల్‌క్యాప్‌ విభాగంలో పెట్టుబడులను తగ్గించుకోలేదు. 17-18 శాతం స్థాయిలోనే కొనసాగించారు. దీంతో పనితీరు ఏడాది  కాలంలో మెరుగ్గా లేదు. కానీ, దీర్ఘకాలంలో దీన్ని అధిగమించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.



You may be interested

సన్‌ఫార్మాకు సెబి షాక్‌

Monday 3rd December 2018

10శాతం పతమైన షేరు ధర గతంలో సెటిల్‌మెంట్‌ చేసుకున్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసును సెబీ తిరిగి చేపట్టనుందనే వార్తల నేపథ్యంలో సన్‌ఫార్మా షేరు సోమవారం ట్రేడింగ్‌లో 10శాతానికి పైగా నష్టపోయింది. 2017లో సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఎండీ దిలీప్‌ సంఘ్వీతో పాటు 9 మంది ప్రమోటర్లు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలకు సంబంధించి దర్యాప్తును రూ. 18 లక్షలు చెల్లించి సెటిల్‌మెంట్‌ చేసుకున్నారు. తాజాగా ఈ కేసును తిరిగి విచారించాలని సెబీ భావిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

ప్రణాళికతో పెళ్లి... భవిష్యత్తుకు భరోసా

Monday 3rd December 2018

వివాహం చేసుకోవడానికి ముందు నుంచే భవిష్యత్తు ఆర్థిక ప్రణాళిక గురించి ఆలోచించడం భరోసానిస్తుంది. వచ్చే జీవిత భాగస్వామి డబ్బు నిర్వహణ ఎలా చేస్తారో తెలుసుకోవడం ముఖ్యమైనది. ఆదాయం, వారి ఖర్చులు, అలవాట్లు అన్నీ తెలుసుకోవాలి. పిల్లలకు ఇతర భారీ లక్ష్యాలకు పొదుపు చేయడాన్ని ప్రారంభించాలి’’అని మనీవర్క్స్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌కు చెందిన సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ నిస్రీన్‌ మామాజి తెలిపారు. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆర్థిక నిపుణుడిని సంప్రదించి

Most from this category