STOCKS

News


ఎగ్జిట్‌ పోల్స్‌ ఏం చేస్తాయో!

Saturday 8th December 2018
Markets_main1544257070.png-22768

సోమవారం మార్కెట్లో కరెక‌్షన్‌ తప్పదా?
ఫలితాలు పాజిటివ్‌గా ఉంటే ర్యాలీకి అవకాశం

క్రూడాయిల్‌ ధర పెరిగిందా? తగ్గిందా?
డాలర్‌తో రూపాయి విలువ బలపడిందా? పతనమైందా?
క్యాడ్‌ ఎంత ఉంది?
ట్రేడ్‌వార్‌ ముగిసినట్లేనా?..
ఇవన్నీ మార్కెట్లు ప్రతిరోజూ పట్టించుకునే అంశాలు. వీటి ఆధారంగానే మార్కెట్‌ కదలికలుంటుంటాయి. కానీ ఇవన్నీ ప్రస్తుతం అప్రస్తుతంగా మారాయి.

ఈ వారానికి ఒకే ఒక్క విషయం మార్కెట్‌ కదలికలను శాసించబోతోంది. అదే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితం.

 సార్వత్రిక ఎన్నికలకు సెమి ఫైనల్స్‌గా భావించే ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే రోజుల్లో దేశ రాజకీయ రంగంపై ఒక అవగాహనను ఇవ్వనున్నాయి. అందుకే ఈ ఫలితాలకు ఇంత క్రేజ్‌. శుక్రవారం పోలింగ్‌ ముగిసిన వెంటనే వెలువడ్డ ఎగ్జిట్‌ పోల్స్‌ సోమవారం మార్కెట్‌ను నడిపించనున్నాయని నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్‌, అక్టోబర్‌లో భారీ పతనం అనంతరం సూచీలు ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాయి. కొన్ని సెషన్లుగా మార్కెట్లలో మళ్లీ క్షీణత కనిపిస్తోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ను బట్టి వచ్చే వారం ఆరంభం మార్కెట్‌ కదలికలుంటాయి. ఒకసారి ఫలితాలు వచ్చినతర్వాత కొన్ని సెషన్లపాటు ఈ ప్రభావం ఉంటుంది. అనంతరం తిరిగి స్థూల ఆర్థికాంశాలే మార్కెట్‌ నిర్ణయాత్మక శక్తులుగా మారతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఏం చెబుతున్నాయి
ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ను బట్టి చూస్తే హిందీ బెల్ట్‌లోని కీలక రాష్ట్రాలైన చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు తెలంగాణ, మిజోరం ఎన్నికలు జరిగినా మార్కెట్‌ వర్గాలు వీటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కీలకమైన మూడు హిందీ రాష్ట్రాల్లో దాదాపు 60కి పైగా ఎంపీ సీట్లున్నాయి. వీటిలో మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లో హోరాహోరీ పోరు ఉంటుందని ఎక్కువ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. రాజస్తాన్‌ మాత్రం పక్కాగా కాంగ్రెస్‌దేనని చెబుతున్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కే పోల్స్‌ ఓటేశాయి. 


రియాక‌్షన్‌
ఇప్పటికే రాజస్తాన్‌లో బీజేపీ ఓటమిని మార్కెట్లు జీర్ణించుకున్నాయని బీఎన్‌పీ పారిబా అభిప్రాయపడింది. చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ వస్తుందనే మార్కెట్లు ఆశిస్తున్నాయని తెలిపింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో బీజేపీ విజయాన్ని మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ ఫలితాలు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాల ఫలితాలు ప్రభావితం చేస్తాయని అంచనా. ఎగ్జిట్‌పోల్స్‌ను బట్టి చూస్తే పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల మార్కెట్‌ సోమవారం తీవ్ర ఒడిదుడుకుల చూడవచ్చు. పైస్థాయిలో 10950 స్థాయి, దిగువన 10500 పాయింట్ల స్థాయి నిఫ్టీకి కీలకం. 
నిజ ఫలితాలు
బీజేపీ కీలకమైన మూడు రాష్ట్రాలను 3-0తో గెలుచుకుంటే పెద్ద ర్యాలీకి అవకాశం ఉంటుంది. ఒకవేళ 2-1 స్కోరైనా మార్కెట్లు ముందుకే కొనసాగవచ్చు. అలాకాకుండా 1-2, 0-3 వస్తే మాత్రం మార్కెట్‌ కుప్పకూలవచ్చని అంచనా. ఆ పరిస్థితుల్లో నిఫ్టీ 10,000 పాయింట్ల వరకు దిగజారవచ్చు. బీజేపీ కీలక రాష్లా‍్రలను ఓడితే అదే పరిస్థితి లోక్‌సభ ఎన్నికల్లో రిపీటవుతుందన్న భయాలు పెరిగి మార్కెట్లు కూలదోస్తాయి. ఎఫ్‌ఐఐలు నిధుల ఉపసంహరణకు దిగుతాయి. కానీ బీజేపీకి పాజిటివ్‌గా ఫలితాలు ఉంటే నిఫ్టీ 11,000 పాయింట్ల వరకు ఎగబాకవచ్చు. అయితే ఈ ప్రతిస్పందనలు తాత్కాలికంగా ఉంటాయని, క్రమంగా మార్కెట్లు మరలా అంతర్జాతీయ, దేశయ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ట్యూన్‌ అవుతాయని నిపుణుల అంచనా.
ఏంచేయాలి?
వీక్లీ చార్టుల్లో నిఫ్టీ బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. వారాంతానికి 200 రోజుల డీఎంఏ స్థాయి 10750 పాయింట్లకు దిగువన క్లోజయింది. ఈ స్థాయిని తిరిగి అందిపుచ్చుకుంటేనే బుల్స్‌ ఊపిరి తీసుకోగలరు. అదే జరిగితే నిఫ్టీ క్రమంగా 10950-11000 పాయింట్లను తాకవచ్చు. నెగిటివ్‌ ప్రభంజనం కొనసాగితే పతనం లోతుగా ఉంటుంది. అందువల్ల దీర్ఘకాలిక మదుపరులు ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా వచ్చే 3- 4రోజులు చాలా అప్రమత్తత అవసరం. అనవసర పొజిషన్ల జోలికి పోవద్దు. ఉన్న పొజిషన్లను సాధ్యమైనంతవరకు హెడ్జ్‌ చేయాలి. ఒకవేళ సూచీలు స్తబ్దుగా ఓపెన్‌ అయితే లాంగ్‌ పొజిషన్లను పుట్స్‌తో హెడ్జ్‌ చేసుకోవాలని నిపుణుల సూచన. ఇప్పటికే షార్ట్‌ పొజిషన్లు ఉన్నవాళ్లు జాగ్రత్తగా స్టాప్‌లాస్‌ మెయిన్‌టెయిన్‌ చేయాలి. నిఫ్టీ 10650 పాయింట్లకు పైన ఉన్నంత వరకు కొంతమేర పాజిటివ్‌గానే ఉన్నట్లు భావించాలి. ఈ స్థాయిని కోల్పోతే 10500 వరకు పతనం కావచ్చు. 

 You may be interested

10000- 13000 పాయింట్ల రేంజ్‌లో నిఫ్టీ!

Saturday 8th December 2018

వచ్చే ఏడాదిపై కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వచ్చే ఏడాది చివరి వరకు నిఫ్టీ పదివేలు- పదమూడు వేల పాయింట్ల శ్రేణిలోనే కదలాడవచ్చని కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. ఎన్నికల ఫలితాలను బట్టి ఈ కదలికలుంటాయని తెలిపింది. అప్‌సైడ్‌ టార్గెట్‌ అందుకోవాలంటే, ఎర్నింగ్స్‌ జోరు ఇలాగే కొనసాగాలని, ఎన్నికల్లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని తెలిపింది. వచ్చే రెండేళ్లకు కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌లో 16 శాతం సరాసరి చక్రీయ వార్షిక వృద్ధి ఉంటుందన్న అంచనా వేసుకుంటే

ఫేస్‌బుక్‌ మరింత బైబ్యాక్‌!

Saturday 8th December 2018

షేర్ల పతనంతో తీవ్ర ఆందోళనలకు గురవుతున్న ఇన్వెస్టర్లకు ఊరట కలిగించేందుకు ఫేస్‌బుక్‌ కంపెనీ 9మిలియన్‌ డాలర్ల విలువైన అదనపు బైబ్యాక్‌ ఇష్యూను ప్రకటించింది. కేంబ్రిడ్జ్ ఎనలిటికా కారణంగా జరిగిన సమాచార దుర్వినియోగం కుంభకోణంతో పాటు యూరోపిన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగే ప్రక్రియ ‘‘బ్రెగ్జిట్‌’’కు నిర్వహించిన ఓటింగ్‌లో ఓటర్లను ప్రభావితం చేసిందనే ఆరోపణ ఫేస్‌బుక్‌పై వచ్చాయి. రానున్న రోజుల్లో బలహీనమైన ఆదాయం ఉంటుందనే అంచనాలతో పాటు, వాల్‌స్ట్రీల్‌లో టెక్నాలజీ షేర్ల

Most from this category