News


టెలికం వినియోగదారులపై ఇక ధరల మోత!

Thursday 1st November 2018
personal-finance_main1541095837.png-21646

టెలికం మార్కెట్లో జియో రాక ముందు వరకు కస్టమర్లు అధిక చార్జీల భారం భరించే వారు. 2016లో జియో అడుగు పెట్టడంతో కస్టమర్లపై పన్నీరు చల్లినట్టయింది. వాయిస్‌కాల్స్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌ల ధరలన్నీ నేలపైకి దిగొచ్చాయి. జియో ఇప్పటికీ ధరలు, సేవల విషయంలో దూకుడు కొనసాగిస్తూనే ఉంది. అయితే, జియో కారణంగా రెండేళ్లపాటు భారీ లాభాలను కోల్పోయిన ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాలు ఇప్పుడు కస్టమర్లపై ధరల బాదుడుకు రెడీ అయిపోయాయి. ఇన్నాళ్లు పరిశ్రమలో ఎక్కువ మంది ఆపరేటర్లు ఉండడంతో పోటా పోటీగా ఆఫర్లు, ప్యాక్‌లు ఉండేవి. కానీ, జియో వచ్చిన తర్వాత టెలినార్‌, టాటా డొకోమోలు ఎయిర్‌టెల్‌లో కలిసిపోగా, వొడాఫోన్‌, ఐడియా ఒక్కటైపోయాయి. ఎయిర్‌సెల్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ దుకాణాలను మూసేశాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటికీ అందుబాటు ధరలకే ప్యాక్‌లను ఆఫర్‌ చేస్తోంది. అయితే, ఆదాయ లోటును తగ్గించుకోవడానికి, ఓ కస్టమర్‌పై ప్రతీ నెలా వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) పెంచుకునేందుకు ఎయిర్‌టెల్‌, వొడా ఐడియా కనీసం రీచార్జ్‌ చేసుకోవాల్సిన కొత్త ప్లాన్లు తీసుకొచ్చాయి. 

 

ఈ రెండు కంపెనీలు 28 రోజుల వ్యాలిడిటీతో రూ.100లోపు ప్యాక్‌లను తీసుకొచ్చాయి. రూ.35, రూ.65, రూ.95 ప్యాక్‌లో ఏదో ఒకదాన్ని తప్పనిసరిగా ప్రతీ 28 రోజులకు రీచార్జ్‌ చేసుకోవాలి. రీచార్జ్‌ చేసుకోకపోతే 30 రోజుల తర్వాత అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ బ్లాక్‌ అవుతాయి. 45 రోజులకు ఇన్‌కమింగ్‌ కాల్స్‌కూడా రావు. తిరిగి రీచార్జ్‌ చేసుకుంటేనే ఆ నంబర్‌ పనిచేస్తున్నట్టు. అంటే నామమాత్రంగా వినియోగించే వారు ఇకపై 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన ఏదో ఒక ప్యాక్‌ను తప్పకుండా రీచార్జ్‌ చేసుకోవాల్సి వస్తుంది. ఇది వారిపై భారం మోపేదే. తమ ఏఆర్‌పీయూ పెంచుకునేందుకు ఎయిర్‌టెల్‌, వొడా ఐడియా ఒక్కటైపోయాయని ఇది తెలియజేస్తోంది. గత రెండేళ్లలో జియో కారణంగా నష్టపోయిన దాన్ని సరిదిద్దుకునేందుకు ఇవి చేతులు కలిపినట్టు విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

 

కనీస రీచార్జ్‌ ప్లాన్లను దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావడం ద్వారా తమకు ఆదాయం తెచ్చిపెట్టని కస్టమర్లు దూరమైనా పట్టించుకోమన్నట్టు ఎయిర్‌టెల్‌, వొడా ఐడియాల ఆలోచనగా కనిపిస్తోందని ఐఐఎఫ్‌ఎల్‌ కార్పొరేట్‌ వ్యవహారాల ప్రెసిడెంట్‌ సీంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. మధ్యస్థాయి, అధిక వినియోగ కస్టమర్లపై ఇవి దృష్టి పెట్టనున్నట్టు పేర్కొన్నారు. కనీస రీచార్జ్‌ ప్లాన్లను తీసుకురావడంతో టారిఫ్‌లు మూడు, నాలుగో (జనవరి-మార్చి) త్రైమాసికాల్లో పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోందని అనలసిస్‌ పార్ట్‌నర్‌ రోహన్‌ ధమిజ పేర్కొన్నారు. అయితే, ఈ పరిణామాలను ట్రాయ్‌ చూస్తూ ఊరుకుంటుందా, చర్యలకు ఉపక్రమిస్తుందా అన్నది చూడాలి.You may be interested

భారీ నష్టాలను మిగిల్చిన అక్టోబర్‌

Thursday 1st November 2018

ఇన్వెస్టర్లకు 2009 తర్వాత అత్యంత నష్టాలను మిగిల్చిన మాసం ఈ ఏడాది అక్టోబర్‌. గత నెలలోనే నిఫ్టీ 10,004 పాయింట్ల కనిష్ట స్థాయి వరకూ పడిపోగా, సెన్సెక్స్‌ 33,776 వరకు తగ్గి ఆ తర్వాత కొంత రికవరీ అయ్యాయి. ఒక్క గత నెలలో ఇన్వెస్టర్లు రూ.6 లక్షల కోట్ల మేర తమ వాటాల విలువను నష్టపోయారు. బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.144.86 లక్షల కోట్ల వద్ద సెప్టెంబర్‌

ఈ షేర్లు ఆకర్షణీయం: సెంట్రమ్‌ వెల్త్‌

Thursday 1st November 2018

బ్యాంకింగ్‌ రంగం వ్యవస్థాగత, నిర్మాణాత్మక మార్పులోకి వెళ్లడంతో, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీలపై దృష్టి సారించినట్టు సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ జగన్నాథం తూనుగుంట్ల తెలిపారు. ఈ రంగాల్లో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, సీడీఎస్‌ఎల్‌ పట్ల సానుకూలతను వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.    ఎల్‌అండ్‌టీ ఎంత వరకు పెరగొచ్చు? ఎల్‌అండ్‌టీ మంచి ఫలితాలను ప్రకటించిందని, ఈ సమయంలో మంచి ఫలితాలను ప్రకటించే కంపెనీ మార్కెట్‌ను

Most from this category