STOCKS

News


ఉమ్మడి రుణం...ఉభయకుశలోపరి  

Monday 17th December 2018
personal-finance_main1545035656.png-23002

సొంతింటిని సమకూర్చుకోవాలన్న కల ఎందరికో వుంటుంది. అయితే సొంతంగా ఇంటి కొనుగోలుకు సరిపడా డబ్బులను సమకూర్చుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఇప్పటికే గణనీయంగా పొదుపు చేసి ఉన్నవారు, వేరే ఆస్తులను విక్రయించడం ద్వారా సమకూర్చుకునే వారికి ఇది సాధ్యమే అయినా, మిగిలిన వారి ముందున్న ఉన్న ఏకైక మార్గం గృహ రుణమే. అందుకే నేడు విక్రయం అవుతున్న కొత్త ప్రాజెక్టుల్లో మూడింట రెండొంతులు గృహ రుణాలపైనే ఉంటున్నాయి. ఇందులో ఇద్దరు కలసి తీసుకునే గృహ రుణాలు కూడా ఉన్నాయి. మరొకరితో కలసి గృహ రుణం తీసుకోవాల్సిన అవసరం ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో ఉండొచ్చు. కారణం ఏదైనా జాయింట్‌ హోమ్‌లోన్‌ విషయంలో ఉండే సానుకూల ప్రతికూలతలు ఏంటన్నవి తెలుసుకుంటే గృహ రుణ గ్రహీతలకు సాయంగా ఉంటుంది. వాటిని తెలియజేసే కథనమే ఇది. 

ఉమ్మడిగా గృహరుణం
జాయింట్‌హోమ్‌ లోన్‌ అన్నది మరో వ్యక్తితో కలసి ఉమ్మడిగా తీసుకునే రుణం. సాధారణంగా జీవిత భాగస్వామి లేదా తోడబుట్టిన వ్యక్తితో కలసి జాయింట్‌ హోమ్‌లోన్‌ తీసుకోవచ్చు. విడిగా ఒక్కరే తీసుకునే రుణంతో పోలిస్తే, ఇతరులతో కలసి ఉమ్మడిగా తీసుకునే రుణానికి ఎన్నో కారణాలు ఉంటాయి. విడిగా తీసుకునేందుకు అనుకూలమైన ‍క్రెడిట్‌ స్కోరు లేకపోవచ్చు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) దరఖాస్తుదారుల రుణ చరిత్ర (క్రెడిట్‌ స్కోరు)ను చూసిన తర్వాతే రుణంపై తేలుస్తాయి. వారి క్రెడిట్‌ రిపోర్ట్‌ను పరిశీలించి ఒకవేళ రుణం మంజూరు చేస్తే తిరిగి చెల్లించే సామర్థ్యం వారికి ఉందా అని ఆరాతీస్తాయి. రుణ ఎగవేతల నివారణకు తీసుకునే చర్యల్లో భాగంగా ఈ విధానాన్ని ఎప్పటి నుంచో పాటిస్తున్నాయి. ఒకవేళ ఒకరి క్రెడిట్‌ రిపోర్ట్‌ మంచిగా ఉండి, గతంలో తీసుకున్న రుణాలకు చెల్లింపులు సకాలంలో చేసి ఉంటే, సహజంగానే క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉంటుంది. ఇటువంటి వారికి గృహ రుణం సులభంగానే లభిస్తుంది. అయితే, క్రెడిట్‌ స్కోరు తగినంత లేని వారి పరిస్థితి ఏంటి? వీరు ఆశ కోల్పోనవసరం లేదు. క్రెడిట్‌ స్కోరు మంచిగా ఉన్న మరో వ్యక్తితో కలసి ఉమ్మడిగా రుణం కోసం దరఖాస్తు చేసుకోవడమే పరిష్కారం. మీరు ఎంచుకునే ఆ భాగస్వామి క్రెడిట్‌ స్కోరు మంచిగా ఉంటే, అప్పుడు సులభంగానే రుణం లభిస్తుంది. ఇక తీసుకున్న రుణాన్ని తాము ఒక్కరమే తిరిగి చెల్లించడం కష్టమని భావించే వారు కూడా ఉమ్మడిగా రుణం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాగే, భార్యాభర్తలు ఇరువురూ వేతన జీవులు అయి ఉంటే, పన్ను ప్రయోజనం ఇరువురికీ అవసరం కనుక జాయింట్‌ హోమ్‌లోన్‌కు మొగ్గు చూపుతారు.  

సానుకూలతలు
ఉమ్మడిగా గృహ రుణం తీసుకుంటే సాధారణ హోమ్‌లోన్‌తో పోలిస్తే ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు లభించే అవకాశాలు ఎక్కువ. ఖరీదైన ప్రాపర్టీ అయితే పెద్ద మొత్తంలోనే గృహ రుణాన్ని పొందొచ్చు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ ప్రకారం జాయింట్‌ హోమ్‌లోన్‌లో ఇద్దరూ పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. రుణంపై చేసే వడ్డీ చెల్లింపులకు గాను ఒక్కొక్కరు విడిగా రూ.2లక్షలను మినహాయింపు చూపించుకోవచ్చు. అలాగే, రుణం అసలుకు చేసే చెల్లింపులు రూ.1.5 లక్షలపై అదనంగా తమ ఆదాయం నుంచి పన్ను మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంది. బలహీన క్రెడిట్‌ స్కోరు ఉన్న వారికి కూడా జాయింట్‌ హోమ్‌లోన్‌లో సులభంగా రుణం లభిస్తుంది.  

ప్రతికూలతలు
జాయింట్‌ లోన్‌ తీసుకునే వారు గుర్తించుకోవాల్సిన ప్రతికూల అంశాలు కూడా కొన్ని ఉ‍న్నాయి. ఉమ్మడిగా గృహ రుణం తీసుకున్న తర్వాత వారిలో ఒకరు తమవాటా చెల్లించలేని పరిస్థితి ఏర్పడితే ఇద్దరి క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుంది. ఇక భార్యా భర్తలు ఉమ్మడిగా గృహ రుణం తీసుకుని, అది చెల్లించే కాలంలో విభేదాల కారణంగా వారు విడిపోతే న్యాయపరమైన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రాపర్టీ అనేది ఒకరి పేరిట నమోదై ఉండి, ఇద్దరూ కలసి రుణం తీసుకుని పూర్తిగా చెల్లించారనుకోండి. అయినప్పటికీ ప్రాపర్టీ ఉన్న వారికే దానిపై చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి. 

అపోహలకు చెక్‌
- జాయింట్‌ హోమ్‌లోన్‌ విషయంలో ఎన్నో సందేహాలు ఉన్నాయి. రుణం తీసుకునే వారు ముందుగా వీటిపై స్పష్టత తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక రుణ దరఖాస్తుదారునితో సమానంగా సహ దరఖాస్తుదారునిపైనా గృహ రుణం చెల్లించాల్సిన బాధ్యత సమంగానే ఉంటుంది. అందుకే రుణ డాక్యుమెంట్‌పై సంతకం చేయడానికి ముందే నిబంధనలపై పూర్తిగా స్పష్టత తెచ్చుకోవాలి. బ్యాంకుతో చేసుకునే ఒప్పందం గురించి సందేహాలు తీర్చుకోవాలి.  
- ఉమ్మడిగా తీసుకునే రుణంలో ఒక్కరికే పన్ను ప్రయోజనాలు లభిస్తాయా? అంటే... ఇద్దరు గ్రహీతలకూ ప్రయోజనాలు సమానంగా వర్తిస్తాయి. కానీ, ఉమ్మడిగా తీసుకునే రుణాలపై పన్ను స్పష్టత కోసం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 24ను చూడాల్సి ఉంటుంది. ఆదాయపన్ను శాఖ మార్గదర్శకాల ప్రకారం... సహ రుణ గ్రహీత పన్ను ప్రయోజనాలు క్లెయిమ్‌ చేసుకోవాలనుకుంటే సంబంధిత ఆస్తికి అతను లేదా ఆమె సైతం సహ యజమానికి అయి ఉండాలి. 
- ఒక్కరు విడిగా దరఖాస్తు చేయడంతో పోలిస్తే మరొకరితో కలసి జాయింట్‌గా దరఖాస్తు చేసుకుంటే రుణాన్ని సులభంగా పొందడం అన్నది నిజమే. అయితే, కచ్చితంగా రుణం వస్తుందన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఎందుకంటే గృహ రుణాలను బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అధిక రిస్క్‌తో కూడినవిగానే పరిగణిస్తాయి. కనుక సహ దరఖాస్తుదారునితో కలసి రుణం తీసుకునే ప్రయత్నం చేసే వారు... వారి క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉండి, ఈఎంఐ చెల్లించేంత ఆదాయం కలిగి ఉంటేనే రుణాన్ని పొందగలరు. ఉమ్మడి గృహ రుణం విషయంలో ఈ అంశాలతోపాటు వడ్డీ రేటు సహా చూడాల్సినవి మరి కొన్ని కూడా ఉన్నాయి. ఒక్క సారి రుణం తీసుకుంటే వెనుదిరిగి చూసకోవాల్సిన అవసరం లేదు కనుక ముందే సమగ్రంగా విచారించుకుని నిర్ణయం తీసుకోవాలి.
 



You may be interested

అటో షేర్ల ర్యాలీ

Monday 17th December 2018

టాటా మోటార్స్‌ అండతో సోమవారం అటోరంగ షేర్లు హుషారుగా ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 1శాతం ఎగిసింది. టాటామోటర్స్‌ బ్రిటన్‌ అనుబంధ సం‍స్థ జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ వ్యయనియంత్రణలో భాగంగా వచ్చే ఏడాదిలో వేలాది ఉద్యోగాల కోత విధిస్తన్నట్లు వార్తలువడటంతో టాటామోటర్స్‌ షేరు 6శాతం ర్యాలీ చేసింది. అలాగే టాటామోటర్స్‌ డీవీఆర్‌ 5శాతం లాభపడింది. అశోక్‌ లేలాండ్‌ 3శాతం, ఎంఆర్‌ఎఫ్‌, టీవీఎస్‌ మోటర్స్‌,

ప్రభుత్వరంగ బీమా సంస్థల విలీనానికి ఈవై సూచనలు

Monday 17th December 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని మూడు అన్‌లిస్టెడ్‌ సాధారణ బీమా సంస్థల విలీనంపై సూచనలు చేసేందుకు ఈవై సంస్థ ఎంపికైంది. నేషనల్‌ ఇన్సూరెన్స్‌, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలను కేంద్రం విలీనం చేయనున్న విషయం తెలిసిందే. ఈ సంస్థల పునర్‌వ్యవస్థీకరణ, ఉద్యోగుల క్రమబద్ధీకరణ, నిర్వరహణపరమైన అంశాలు, నియంత్రణ సంస్థలు, నిబంధనల అమలు విషయాల్లో ఈవై సూచనలు చేయనుంది. 

Most from this category