STOCKS

News


ప్రణాళికతో పెళ్లి... భవిష్యత్తుకు భరోసా

Monday 3rd December 2018
personal-finance_main1543814959.png-22589

వివాహం చేసుకోవడానికి ముందు నుంచే భవిష్యత్తు ఆర్థిక ప్రణాళిక గురించి ఆలోచించడం భరోసానిస్తుంది. వచ్చే జీవిత భాగస్వామి డబ్బు నిర్వహణ ఎలా చేస్తారో తెలుసుకోవడం ముఖ్యమైనది. ఆదాయం, వారి ఖర్చులు, అలవాట్లు అన్నీ తెలుసుకోవాలి. పిల్లలకు ఇతర భారీ లక్ష్యాలకు పొదుపు చేయడాన్ని ప్రారంభించాలి’’అని మనీవర్క్స్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌కు చెందిన సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ నిస్రీన్‌ మామాజి తెలిపారు. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆర్థిక నిపుణుడిని సంప్రదించి ప్రణాళిక విషయంలో సాయం తీసుకోవడం మంచిదన్నారు. లక్ష్యాలు, పిల్లలు, వారి అవసరాలు, రిటైర్మెంట్‌కు సిద్ధం కావడం మం‍చిదని సూచించారు.

బడ్జెట్‌ దాటకుండా...
ఇక వివాహ బడ్జెట్‌ విషయంలో చాలా మంది జంటలు అధిక ఖర్చులకు వెళుతుంటారని సృజన్‌ ఫైనాన్షియల్స్‌కు చెందిన దీపాలిసేన్‌ పేర్కొన్నారు. అనుకున్న బడ్జెట్‌లోనే వివాహ వేడుకను పూర్తి చేయడానికి కట్టుబడి ఉండాలని, భరించలేని స్థాయిలో ఖర్చులకు వెళ్లరాదని సూచించారు. భారీ స్థాయిలో ఆడంబరాలకు పోయి వైవాహిక జీవితాన్ని ప్రారంభించడం, ఆర్థికంగా ప్రతికూలతేనన్నారు. తీసుకున్న రుణాలను చెల్లించేందుకు ఏళ్ల తరబడి పడుతుందన్నారు. పెళ్లికి ఏడాది, రెండేళ్ల ముందు నుంచే పొదుపు చేయడం మొదలు పెట్టాలని మామాజి సూచించారు. వివాహ ఖర్చులకు సరిపడా లేకపోతే, బంధువులు, స్నేహితుల వద్ద నుంచి వడ్డీ లేని రుణాన్ని తీసుకోవాలని సూచించారు. అంతేకానీ, ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సముచితం కాదన్నారు.

ఇక పెళ్లి అయిన వెంటనే చేయాల్సిన పని.... జీవిత బీమా నుంచి అన్ని రకాల పెట్టుబడులు, బ్యాంకు ఖాతాల వరకు నామినీగా జీవిత భాగస్వామిని చేర్చడం. అందుకోసం అవసరమైన పత్రాలను ముందే సిద్ధం చేసుకోవాలన్నది మామాజి సూచన. పెళ్లయిన తర్వాత పేరు మార్చుకుంటే అన్ని రకాల డాక్యుమెంట్లలో ఆ మేరకు మార్పులు చేసుకోవాలి. పాన్‌, ఆధార్‌, పాస్‌పోర్ట్‌ వంటి పత్రాల్లోనూ అప్‌డేట్‌ చేసుకోవడం అవసరం అవుతుంది. కాబోయే దంపతులు ఇద్దరూ సంపాదన ఉన్న వారు అయితే పెట్టుబడులు వేర్వేరుగాను, ఉమ్మడిగా ప్లాన్‌ చేసుకోవాల్సిన ఖర్చులు ఉంటాయి. ఇంటికి అవసరమయ్యే ఖర్చులను ఇద్దరూ సమానంగా పంచుకోవడం, సొంతంగా ఖాతాలు నిర్వహించుకోవాలని మామాజి సూచించారు. కొందరు తమ సంపాదనలను కలిపేయాలనుకోరు. ‘‘భర్త సంపాదన అంతా పెట్టుబడులకు, భార్య సంపాదన అంతా ఖర్చులకు వెళ్లడం చాలా కేసుల్లో చూశాం. వివాహ బంధం ముక్కలైతే, సంబంధిత మహిళ ఏమీలేని పరిస్థితిలో ఉండిపోతారు. ఒకవేళ వేర్వేరు ఖాతాలు ఉండుంటే లేదా ఉమ్మడిగా ఖాతాలు, పెట్టుబడులను కలిగి ఉంటే అటువంటి పరిస్థితుల్లో ఎవరూ నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురు కాదు’’ అన్నది ఆర్థిక నిపుణుల  అభిప్రాయం. ఈ విషయంలో సందేహాలు ఉంటే ఆర్థిక సలహాదారుల సూచనలను తీసుకోవడం మంచిది.

డెస్టినేషన్‌ వెడ్డింగ్‌
ఇటీవలి కాలంలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ పట్ల క్రేజీ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఎక్కువ మంది దీన్ని ఎంచుకుంటున్నారని, రూ.లక్షల నుంచి రూ.కోట్ల వరకు ఇందుకు ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ఎంతో వృద్ధి చెందుతోంది. మేం ప్రతీ సీజన్‌లో 15 వరకు వివాహాల నిర్వహణ చూస్తుంటే, అందులో 12 విదేశాల్లోనే ఉంటున్నాయి’’ అని ట్యామరిండ్‌ గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కునాల్‌రాణి అంటున్నారు. ఈ సంస్థ డెస్టినేషన్‌ అండ్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ. అయితే, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ అంటే అది దుబారా ఖర్చుగా చూడరాదు. ఎంత మందిని ఆహ్వానిస్తున్నారు, ఏ తరహా స్థలాన్ని లీజుకు తీసుకుంటున్నారు అనే అంశాలపైనే ఖర్చు ఆధారపడి ఉంటుందని వెడ్డింగ్‌ బ్రిగేడ్‌ వ్యవస్థాపకులు, సీఈవో సన్నా వోహ్రా తెలిపారు.
లొకేషన్‌ ఎక్కడ?
విదేశాల్లో వేడుక జరుపుకోవాలంటే ముఖ్యంగా చూడాల్సింది విమానయాన సర్వీసుల అందుబాటు. యూఏఈ ఈ విషయంలో ఎంతో మందిని ఆకర్షిస్తోంది. కారణం విమాన ప్రయాణ సమయం తక్కువ. టర్కీని ఎంచుకునే వారు కూడా ఉన్నారు. ‘‘600 మంది సమక్షంలో వివాహం చేసుకోవాలంటే అందుకోసం 300-350 గదులు ఒకే చోట కావాల్సి ఉంటుంది. టర్కీలో అయితే ఒకే చోట 600-7000 మంది వసతికి సరిపడా హోటళ్లు ఉన్నాయి’’అని ఓ వెడ్డింగ్‌ సంస్థకు చెందిన అధినేత రాయ్‌ తెలిపారు. థాయిలాండ్‌, బాలి, శ్రీలంక కూడా భారతీయుల పెళ్లిళ్లకు వేదికలవుతున్నాయని వోహ్రా తెలిపారు. మన దేశంలో చూస్తే ఉదయ్‌పూర్‌, జోధ్‌పూర్‌, జైపూర్‌ ( ఈ మూడూ రాజస్థాన్‌లోనివి), గోవా పెళ్లి వేడుకలకు చిరునామాగా ఉన్నాయి. అలాగే, లోనవాలా, ముస్సోరి, కేరళ కూడా ప్రముఖమైనవిగా వోహ్రా పేర్కొన్నారు.
వ్యయం
పెళ్లి వేడుకల బడ్జెట్‌ అన్నది ఆయా కుటుంబాల ఆకాంక్షలపైనే ఆధారపడి ఉంటుంది. ‘‘యూఏఈలో అయితే 600 మంది కోసం రూ.7.5 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక్క వ్యక్తికి రెండు రోజుల కార్యక్రమానికి కలిపి రూ.90,000-1.25 లక్షల మధ్య ఉంటుంది. దీనికి రాను, పోను విమానచార్జీలు అదనం. యూరోప్‌ అయితే ఈ వ్యయం రూ.3 లక్షలు అవుతుంది’’ అని రాయ్‌ తెలిపారు. అయితే, స్వదేశంలోనే మంచి ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటే తక్కువ ఖర్చుతోనే పోతుందిలే అనుకుంటే పొరపాటేనంటున్నరు వివాహ వేడుక నిర్వాహకులు. రాజస్థాన్‌లో చౌకేమీ కాదు. ఉదయ్‌పూర్‌లో పెళ్లి వేడుక ఖర్చు, దుబాయి వరకు వెళ్లి చేసుకోవడానికి అయ్యేంత ఉంటుంది. డెకరేషన్‌ విషయంలో రెండు ప్రాంతాలూ ఖరీదైనవే. ఆహారం విషయంలో దుబాయిలో ఖర్చు ఎక్కువ. దుబాయిలో నేను నిర్వహించే ఓ పెళ్లి కార్యక్రమానికి 40-45 మంది వంట నిపుణులు ఇక్కడి నుంచి వెళుతున్నారు’’ అని రాయ్‌ వివరించారు. అయితే, పెళ్లి మరో ఏడాది ఉందనగా ముందు నుంచే ప్రణాళిక ప్రకారం నడుచుకుంటే ఖర్చు తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. ‘‘సహజ పూలతో అలంకరణకు ఎక్కువ ఖర్చు అవుతుంది. స్థానికంగా దొరికే పూలతో పాటు కృత్రిమ వస్తువులతో చేయించుకోవడం మంచిది. అలాగే, పగటిపూట పెళ్లి వేడుక పెట్టుకుంటే విందుకు ఖర్చు తగ్గుతుంది. అలాగే, అవుట్‌డోర్‌లోనూ వేడుక ఏర్పాటు చేసుకోవడం ఓ ఆప్షన్‌’’ అని వోహ్రా తెలిపారు.
వివాహ బీమా (ప్రాఫిట్‌)
వివాహ వేడుకకు సంబంధించి బీమా పాలసీలు కూడా ఉన్నాయి. ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, ఫ్యూచర్‌ జనరాలి సాధారణ బీమా సంస్థలు ఈ తరహా పాలసీలు అందిస్తున్నాయి. విపత్తుల కారణంగా వివాహానికి ఆటంకాలు ఏర్పడి నష్టం జరిగితే ఈ పాలసీల్లో పరిహారం లభిస్తుంది. అంతేకాదు, చోరీలు జరిగినా, వరుడు, వధువుల్లో ఎవరికైనా ప్రమాదం వాటిల్లి వాయిదా పడినా ఈ బీమాలు ఆదుకుంటాయి. అయితే, కుటుంబపరమైన వివాదాలు, వాతావరణం అనుకూలించగా వాయిదా వేసుకుంటే మాత్రం పరిహారం రాదు.
ప్రీమియం;
వివాహ బీమా పాలసీ ప్రీమియం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఏ ప్రాంతంలో వివాహం నిర్వహిస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు అన్నవి కూడా కీలకం అవుతాయి. ‘‘ఇక ఎంత మొత్తానికి బీమా తీసుకుంటున్నారు అన్నది కూడా ముఖ్యమే. ఉదాహరణకు జీవితాంతం గుర్తుండిపోవాలని ఓడలో ప్లాన్‌ చేసుకున్నారనుకోండి... అప్పుడు వధువు, వరుడు, అథితులకు కూడా బీమా తీసుకోవాల్సి వస్తుంది. హోటల్‌లో అయితే జ్యుయలరీ, కానుకల విలువకు కవరేజీ తీసుకోవాల్సి వస్తుంది’’ అని బ్యాంక్‌ బజార్‌ ప్రతినిధి తెలిపారు. పెద్ద వివాహాలు అయితే, మొత్తం ఖర్చులో 1 శాతం ప్రీమియంగా ఉంటుందన్నారు.
తీసుకోవాలా?
ఇంటి వద్దే వివాహం చేసుకునే వారు, వ్యక్తిగత ఆరోగ్యబీమా, ప్రమాద బీమా, గృహ బీమా ఉన్న వారు ప్రత్యేకంగా వివాహ బీమా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రత్యేకంగా ఎక్కడైనా వేడుక ఏర్పాటు చేసుకుంటూ, అది ఖరీదైనది అయితే, ముందు జాగ్రత్తగా కవరేజీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకునే వారు ఖర్చులకు సంబంధించి రుజువులు చూపించాల్సి ఉంటుంది. అందుకే బిల్లులన్నింటినీ భద్రంగా ఉంచుకోవాలి. పాలసీ తీసుకునే వారు బీమా సంస్థల క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ చరిత్రను చూసి తీసుకోవడం సముచితం. ముఖ్యంగా పెళ్లిళ్లు ఘనంగా నిర్వహించుకునే వారు బీమా పాలసీ తీసుకోవడం తెలివైన నిర్ణయమే అవుతుందని నిపుణుల అభిప్రాయం.You may be interested

రిస్క్‌ తగ్గిస్తూ రాబడినిచ్చే ఫండ్‌

Monday 3rd December 2018

రిస్క్‌ను తగ్గిస్తూ రాబడినిచ్చే ఫండ్‌ కోటక్‌ స్టాండర్డ్‌ మల్టీక్యాప్‌ ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులతో కొనసాగుతుండడాన్ని చూస్తున్నాం. కొన్ని రోజులు ర్యాలీ చేయడం, కొన్ని రోజులు నష్టాల పాలు కావడం సాధారణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులను సమర్థంగా నెగ్గుకొచ్చే మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇవ్వగలుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తరహా పథకాలపై దృష్టి సారించడం మంచిది. అటువంటి వాటిల్లో కోటక్‌ స్టాండర్డ్‌

అన్ని ఫండ్లూ లాభాలివ్వవు

Monday 3rd December 2018

 మ్యూచ్‌వల్‌ ఫండ్లలో వైవిధ్యత లేకుంటే రిస్కే - ఒకోసారి లాభాల మాట అటుంచి పెట్టుబడికీ ఇబ్బందే - మార్కెట్‌ పతనాల్లో నష్టాలు మరింత పెరగొచ్చు - అనుకున్న లక్ష్యాల సాధనలో వెనుకడుగు - మల్టీక్యాప్‌ ఫండ్స్‌ వైవిధ్య పరంగా అనువైనవి - లార్జ్‌, మిడ్‌క్యాప్‌, సెక్టార్‌ ఫండ్స్‌ ఎంచుకోవచ్చు - ఫండ్స్‌ ఎక్కువ ఉంటే ప్రతికూలం కావచ్చు (సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం) మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే చాలు... చక్కని రాబడులు వచ్చేస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ అది కరెక్టు

Most from this category