STOCKS

News


వాహనదారులపై బీమా మోత

Friday 31st August 2018
personal-finance_main1535694401.png-19827

న్యూఢిల్లీ: కార్లు, ద్విచక్ర వాహనదారులు థర్డ్‌ పార్టీ బీమా రూపంలో శనివారం నుంచి అదనపు భారం మోయాల్సిన పరిస్థితి. ఇకపై కార్ల కొనుగోలు సమయంలో ఏడాది బీమా కాకుండా మూడేళ్ల కాలానికి వర్తించే బీమా పాలసీని తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే ద్విచక్ర వాహనాలు అయితే కొనుగోలు సమయంలోనే ఐదేళ్ల బీమా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వాహనాల కొనుగోలు వ్యయం ఒక్కసారిగా పెరిగిపోనుంది. ఇది వాహనదారులకు కాస్తంత రుచించనిదే. అయితే, ఏటా రెన్యువల్‌ చేసుకోవాల్సిన ఇబ్బంది అయితే తప్పనుంది. ఈ భారం ఏ స్థాయిలో ఉంటుందంటే... 1500సీసీ సామర్థ్యంపైన ఉన్న కార్లకు ఏడాది బీమా పాలసీ ప్రీమియం ప్రస్తుతం రూ.7,890 స్థాయిలో ఉండగా, మూడేళ్లకు తీసుకోవాలంటే ఇక మీదట ఒకేసారి రూ.24,305ను జేబు నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. అదే 350సీసీ సామర్థ్యంపైన ఉన్న బైకులకు ఏడాది ప్రీమియం రూ.2,323గా ఉంటే, ఇక మీదట ఐదేళ్ల పాలసీ కోసం రూ.13,034 ఖర్చు చేయాల్సి వస్తుంది. వివిధ సామర్థ్యం కలిగిన మోడళ్ల ఆధారంగా ఈ ప్రీమియంలో మార్పులు ఉంటాయి. ఇదంతా సుప్రీంకోర్టు ఆదేశాల పర్యవసానమే. కొత్త కార్లకు మూడేళ్లు, ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల థర్డ్‌ పార్టీ బీమా తప్పనిసరిగా సెప్టెంబర్‌ 1 నుంచి అమలు చేయాలంటూ ఈ ఏడాది జూలై 20న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాహనదారుల్లో థర్డ్‌ పార్టీ కవరేజీ తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో, దీర్ఘకాల పాలసీలను కొనుగోలు సమయంలోనే తీసుకునే విధంగా సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనల ప్రకారం మన దేశంలో వాహనాలకు బీమా తప్పనిసరి అని తెలిసిందే. థర్డ్‌ పార్టీ బీమా అనేది, వాహనదారుడు, అతని వాహనం కారణంగా మూడో పార్టీకి కలిగిన నష్టానికి పరిహారం చెల్లించేది. దీన్ని వాహనదారులు అందరూ తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు కలిగే నష్టానికి పరిహారం లభిస్తుంది. ప్రాణ నష్టానికి బాధిత కుటుంబాలు పెద్ద మొత్తంలో పరిహారం అందుకోగలవు. ఆస్తి నష్టానికి కూడా పరిహారం లభిస్తుంది.
రెండు రకాల పాలసీలు...
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నూతన కార్లకు మూడేళ్లు, నూతన ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియంను కొనుగోలు సమయంలోనే వాహనదారుల నుంచి వసూలు చేయాలని బీమా కంపెనీలను బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏ) ఆదేశించింది. దీంతో బీమా సంస్థలు ఓన్‌ డ్యామేజ్‌, థర్డ్‌ పార్టీ కవరేజ్‌ను దీర్ఘకాలానికి లేదా దీర్ఘకాలానికి థర్డ్‌ పార్టీని, ఏడాది కాలానికి ఓన్‌ డ్యామేజీ కవర్‌తోనూ పాలసీలను ఆఫర్‌ చేసే అవకాశం ఉంది. థర్డ్‌ పార్టీ బీమానే దీర్ఘకాలానికి తీసుకోవడం తప్పనిసరి. చోరీ, ఇతర నష్టాలకు కూడా కవరేజీ ఇచ్చే పాలసీని ఏడాది లేదా ఐదేళ్ల కోసం ఎంచుకునే స్వేచ్ఛ వాహనదారులకు ఉంటుంది. బిల్లులో మాత్రం ఒక్కో ఏడాదికి విడిగా కవరేజీని పేర్కొనడం జరుగుతుంది. రెండో ఏడాది, ఆ తర్వాత కాలానికి ప్రీమియంను ‘ముందస్తు ప్రీమియం’గా పేర్కొటాయి. పాలసీ కాల వ్యవధి మధ్యలో సాధారణంగా థర్డ్‌ పార్టీ కవర్‌ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉండదు. వాహనం ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకపోవడం, అమ్మేయడం, బదిలీ చేయడం సందర్భాల్లో మినహాయింపు ఉంటుంది. 
బీమా విస్తరణకు దోహదం
వాహనం వయసు పెరుగుతున్న కొద్దీ దానికి బీమా కవరేజీ విలువ తగ్గుతూ వెళుతుంది. పైగా ప్రీమియం పెరుగుతూ వెళుతుండడం గమనించొచ్చు. ముఖ్యంగా థర్డ్‌ పార్టీ బీమా విషయంలో పరిహార చెల్లింపులు పెరుగుతుండడంతో, ప్రీమియంలను బీమా కంపెనీలు ఏటా సవరిస్తుండడం వల్ల భారం అధికం అవుతోంది. దీంతో చాలా మంది వాహనదారులు బీమా పాలసీని రెన్యువల్‌ చేయించుకోకుండా వదిలిపెట్డడం, రిస్క్‌ను పూర్తిగా కవర్‌ చేయని పాలసీలను కొనుగోలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ‘‘దీర్ఘకాలిక పాలసీల కారణంగా బీమా ఉత్పత్తుల విస్తరణ పెరుగుతుంది. మరిన్ని వాహనాలు కవరేజీ పరిధిలోకి వస్తాయి’’ అని ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ అండర్‌రైటింగ్‌ హెడ్‌ సంజయ్‌ దత్తా వివరించారు. బీమా పరిధి లో ఉన్నవి, పరిధిలో లేనివి అన్న ప్రశ్నకు తావుండదని, థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ కవరేజీ పెద్ద మొత్తంలో, మెరుగ్గా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం 2015లో ప్రతిరోజూ 1,374 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 400 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధితులు ‍క్లెయిమ్‌ దాఖలకు సమయ పరిమితి కూడా లేదు. ప్రమాదం జరిగిన ప్రాంత పరిధిలో లేదా తన నివాస ప్రాంత పరిధిలోనూ క్లెయిమ్‌ దాఖలకు అవకాశం ఉంటుంది.  
టూవీలర్ల డిమాండ్‌కు దెబ్బ!
నూతన నిబంధనలు ద్విచక్ర వాహన కొనుగోళ్ల డిమాండ్‌పై ప్రభావం చూపిస్తుందంటున్నారు ఈ రంగానికి చెందిన నిపుణులు. ఇప్పటి వరకు బీమా కోసం వెచ్చించిన మొత్తానికి ఇకపై నాలుగు రెట్లు అదనంగా (ఐదేళ్ల పాలసీ) ప్రీమియంను భరించాల్సి రావడమే ఇందుకు కారణం. కానీ, కార్లపై పెద్దగా ప్రభావం ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది. 100సీసీ ఇంజన్ల విభాగంపై ఎక్కువ ప్రభావం పడనుంది. ఎందుకంటే తక్కువ ధర కారణంగానే వీటిని ఎక్కువ మంది కొనుగోలు చేస్తుంటారు. కానీ, ఇప్పుడు ఈ విభాగంలోని బైక్‌లపై రూ.720గా ఉన్న ప్రీమియం కాస్తా ఇకపై రూ.3,285 అవుతోంది. అంటే మూడున్నరెట్లు పెరిగినట్టు. ప్రతీ ఐదు మోటారుసైకిళ్ల అమ్మకాల్లో మూడు 100సీసీ విభాగంలోనివే ఉంటున్నాయి. ఇక 150సీసీ ఆపైన 350సీసీ సామర్థ్యంలోపు బైకులకు నాలుగున్నర రెట్లు పెరిగి రూ.5,453 కానుంది. ఇక ఈ పెరిగే మొత్తంపై జీఎస్టీ భారం అదనం. 
ప్రీమియం పెరుగుదల
ప్రైవేటు కారు
సామర్థ్యం    ఏడాది ప్రీమియం    మూడేళ్ల ప్రీమియం    ఎన్నిరెట్లు
1000సీసీ వరకు    1,850    5,286    2.86
1,000సీసీపైన 1500సీసీ వరకు    2,863    9,534    3.33
1500సీసీపైన    7,890    24,305    3.08
ద్విచక్ర వాహనాలు
సామర్థ్యం    ఏడాది ప్రీమియం    ఐదేళ్ల ప్రీమియం    ఎన్నిరెట్లు
75సీసీ వరకు    427    1,045    2.45
75సీసీపైన 150సీసీ వరకు    720    3,285    4.56
350సీసీపైన    2,323    13,034    5.61
 బజాజ్‌ వాహనాలకు ఉచిత ఇన్సూరెన్స్‌
దీర్ఘకాలిక బీమా పాలసీల కారణంగా కొత్త వాహనాల ఆన్‌రోడ్డు ధరలు సెప్టెంబర్‌ 1 నుంచి పెరిగిపోనుండడంతో... బజాజ్‌ ఆటో తన ద్విచక్ర వాహనాల కొనుగోలుదారులకు హ్యాట్రిక్‌ ఆఫర్‌ ప్రకటించింది. నూతన ఆదేశాలు అమల్లోకి రావడానికి ముందు రోజు ఆగస్ట్‌ 31 వరకు...  నూతన వాహనాలు కొనుగోలుపై ఉచిత ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నట్టు బజాజ్‌ ఆటో తెలిపింది. ఏడాది కాల బీమా పాలసీ విధానం శుక్రవారం వరకు అమల్లో ఉండనుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు వరకు బజాజ్‌ ప్లాటినా, డిస్కవర్‌, పల్సర్‌ 150, పల్సర్‌ ఎన్‌ఎస్‌ 160, వి శ్రేణి బైకులను కొనుగోలు చేసే వారికి భారం తగ్గుతుందని బజాజ్‌ తెలిపింది. బజాజ్‌ ప్లాటినా కొనుగోలుపై రూ.4,800, పల్సర్‌ ఎన్‌ 160పై రూ.8,000 వరకు భారం తగ్గుతుందని పేర్కొంది. ఉచిత ఇన్సూరెన్స్‌తోపాటు రెండేళ్లపాటు ఉచిత సర్వీస్‌, ఐదేళ్ల వారంటీ ప్యాకేజీని ఉచితంగా పొందొచ్చని బజాజ్‌ ఆటో తెలిపింది. సెప్టెంబర్‌ 1 నుంచి ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది. 


 You may be interested

వాణిజ్య యుద్ధభయాలతో పెరిగిన పసిడి

Friday 31st August 2018

వాణిజ్యయుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడంతో  శుక్రవారం పసిడి ధర పెరిగింది. నేడు ఆసియా మార్కెట్‌లో భారత కాలమాన ప్రకారం ఉదయం 10:00లకు ఔన్స్‌ పసిడి 6.10 డాలర్లు లాభపడి 1,210.90 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. క్రితం ట్రేడింగ్‌లో ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో పసిడి నష్టాల బాట పట్టిన సంగతి తెలిసిందే. చైనా దిగుమతులపై టారీఫ్‌లు సెప్టెంబర్‌ 5నుంచి అమల్లోకి వస్తున్న టారిఫ్‌లపై వెనక్కి తగ్గేదిలేదంటూ అమెరికా

ఇన్వెస్టర్ల సొమ్ములు రీఫండ్‌ చేయండి

Friday 31st August 2018

న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా వసూలు చేసిన సొమ్ములను తిరిగి చెల్లించాలని ప్రయాగ్‌ ఇన్ఫోటెక్‌ హై-రైజ్‌ కంపెనీకి మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఈ కంపెనీ ప్రస్తుత, మాజీ డైరెక్టర్లు మార్కెట్‌ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. ప్రయాగ్‌ ఇన్ఫోటెక్‌ కంపెనీ 2007-2008, 2011-12 కాలంలో రిడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లు(ఆర్‌పీఎస్‌) జారీ చేస్తామంటూ 1.57 లక్షల మంది ఇన్వెస్టర్ల నుంచి రూ.131 కోట్లు

Most from this category