News


భార్యా భర్తలకూ ఒకటే పాలసీ.. చూడాల్సినవివే...

Wednesday 14th November 2018
personal-finance_main1542134499.png-21963

జాయింట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ... జీవిత భాగస్వాములు ఇద్దరికీ కలిపి బీమా రక్షణ అందించే ఏకైక పాలసీ. భార్య గృహిణి అయిటే టర్మ్‌ పాలసీ తీసుకోవడం సాధ్యం కాదు. భాగస్వాములు ఇద్దరూ ఉద్యోగులు అయితే ఎవరికి వారే టర్మ్‌ పాలసీలు తీసుకోవచ్చు. అయితే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. కానీ, కాస్త తక్కువ ప్రీమియానికే, భార్య గృహిణి అయినప్పటికీ లభించే పాలసీయే... జాయింట్‌ లైఫ్‌ టర్మ్‌ పాలసీ. దీనికి సంబంధించిన వివరాలు ఇవి...

 

సదుపాయాలు

పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎడెల్వీజ్‌ టోక్యో లైఫ్‌, బజాజ్‌ ఆలియాంజ్‌, ఏగాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలు జాయింట్‌ లైఫ్‌ టర్మ్‌ ప్లాన్లను ఆఫర్‌ చేస్తున్నాయి. వీటిలో ఒకటి రెండు మాత్రం జీవిత భాగస్వాములు ఇద్దరూ పనిచేస్తుండాలన్న నిబంధనను అమలు పరుస్తున్నాయి. ఇద్దరికీ ఒకటే పాలసీ అయితే చెల్లింపులు చేయడం సులభమని ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ యాక్చూరియల్‌ ఆఫీసర్‌ అనిల్‌కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఈ పాలసీ తీసుకునే మొదటి వ్యక్తి మాత్రం ఆర్జనా పరులై ఉండాలన్నది అన్ని పాలసీల్లోనూ ఉండే సాధారణ నిబంధన. అలాగే, చాలా పాలసీలు మొదటి వ్యక్తి ఎంచుకునే బీమా మొత్తంలో సగం మేర వారి జీవిత భాగస్వామికి కవరేజీని ఇస్తున్నాయి. 

 

‘‘పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ మేరా టర్మ్‌ ప్లాన్‌లో పాలసీదారుని జీవిత భాగస్వామికి గరిష్టంగా రూ.25 లక్షల కవరేజీ లభిస్తుంది. పాలసీదారు మరణించినట్టయితే జీవిత భాగస్వామి బీమా కవరేజీ, భవిష్యత్తులో ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా కొనసాగుతుంది’’ అని సంతోష్‌ అగర్వాల్‌ తెలిపారు. ఎడెల్వీజ్‌ టోకియో జిందగి ప్లస్‌ ప్లాన్‌లో అయితే బెటర్‌ ఆఫ్‌ బెనిఫిట్‌ ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. రూ.50 లక్షలు ఆపై బీమా తీసుకునే వ్యక్తికి ఆటోమేటిగ్గానే అందులో సగం మేర జీవిత భాగస్వామికి (గరిష్టంగా రూ.50 లక్షల వరకు) కవరేజీ లభిస్తుంది. కాకపోతే భార్యా, భర్తల మధ్య వయసు తారతమ్యం పదేళ్లకు మించకూడదన్నది నిబంధన. బెటర్‌ ఆఫ్‌ బెనిఫిట్‌ అన్నది పాలసీదారు మరణించిన తర్వాతే జీవిత భాగస్వామికి బీమా కవరేజీ మొదలవుతుంది. ఒకవేళ పాలసీదారు జీవించి ఉన్నాగానీ, పాలసీ కాల వ్యవధిలోపు అతని జీవిత భాగస్వామి మరణించినట్టయితే పరిహారం రాదు. ఎందుకంటే కేవలం పాలసీదారు మరణించిన తర్వాతే జీవిత భాగస్వామికి కవరేజీ ఇవ్వడం ఇందులోని విధానం. అలాగే, పాలసీదారు మరణానికి సంబంధించి బీమా మొత్తంలో 50 శాతం పరిహారంగా లభిస్తుంది.  

 

ఖర్చు ఆదా

విడిగా ఎవరికి వారు టర్మ్‌ ప్లాన్‌ తీసుకునే బదులు ఇద్దరూ కలిపి ఒకటే తీసుకోవడం వల్ల ఖర్చు ఆదా అవుతుందని బీమా రంగ నిపుణులు చెప్పే మాట. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి తన పేరిట రూ.కోటి బీమాను 60 ఏళ్ల వరకు, 33 ఏళ్ల వయసున్న అతని భార్యకు రూ.25 లక్షల కవరేజీతో జాయింట్‌ పాలసీ తీసుకుంటే... పీఎన్‌బీ మెట్‌లైఫ్‌లో ప్రీమియం రూ.14,053. ఎడెల్వీజ్‌ టోక్యోలో రూ.8,821, ఏగాన్‌లైఫ్‌లో అయితే రూ.13,541, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌లో రూ.15,936గా ఉంది. 

 

ఇవి కీలకం...

అయితే, జాయింట్‌ లైఫ్‌ పాలసీలో జీవిత భాగస్వామి కవరేజీపై పరిమితులు ఉన్నాయి. దీనికి బదులు ఎవరికి వారు విడిగా టర్మ్‌ ప్లాన్‌ తీసుకుంటే అధిక కవరేజీ లభిస్తుంది. కోరుకున్న మేర కవరేజీ తీసుకోవచ్చు. ఏ వయసు వరకు అవసరమో కూడా వారి ఇష్టానికే ఉంటుంది. విడిగా తీసుకోవాలంటే ఇద్దరూ ఆర్జనా పరులై ఉండాలన్నది మర్చిపోరాదు. జాయింట్‌ లైఫ్‌ ప్లాన్‌లో ప్రైమరీ హోల్డర్‌ వయసు, వార్షికాదాయం, వైద్య చరిత్రను చూసి కంపెనీ ప్రీమియం నిర్ణయిస్తుంది. జీవిత భాగస్వామి విషయంలో కేవలం వయసు, వైద్య చరిత్రనే పరిగణనలోకి తీసుకుంటుంది. విడిగా ప్లాన్‌ తీసుకునేట్టు అయితే ఇద్దరికీ ఆర్జన ఉండాలి. జాయింట్‌ లైఫ్‌ ప్లాన్‌లో పాలసీదారు మరణిస్తే, ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా జీవిత భాగస్వామి బీమా కవరేజీ పొందొచ్చు. విడిగా పాలసీ తీసుకుంటే ఈ వెసులుబాటు ఉండదు. జీవిత భాగస్వాములు ఇద్దరూ ఒకేసారి మరణించినట్టయితే, కొన్ని పాలసీలు పాలసీదారునికి సంబంధించిన ఒక్క పరిహారాన్నే చెల్లిస్తున్నాయి. పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ మేరా టర్మ్‌ ప్లాన్‌ అయితే ఇద్దరికి సంబంధించిన పరిహారాలను చెల్లిస్తోంది. ఈ తరహా షరతులు, నియమ నిబంధనలను ముందే పూర్తిగా తెలుసుకోవాలి.



You may be interested

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ..

Wednesday 14th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:44 సమయంలో 34 పాయింట్ల లాభంతో 10,639 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 10,615 పాయింట్లతో పోలిస్తే 24 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఇక

కరెక్షన్‌ తర్వాత పరుగులు తీసే షేర్లు ఏవి?

Wednesday 14th November 2018

రెండు నెలల కరెక్షన్‌ తర్వాత మార్కెట్లు కుదురుకునే క్రమంలో ఉన్నాయి. ఈ స్థాయిలోనే స్థిరపడతాయా? లేక మరికాస్త దిద్దుబాటు ఉంటుందా? అన్నది రానున్న రాష్ట్రాల ఎన్నికల తర్వాత తేలిపోనుంది. అయితే, కరెక్షన్‌ తర్వాత రికవరీ, ర్యాలీలో పాల్గొనే షేర్లు ఏవై ఉంటాయి? అన్న ఆసక్తి ఇన్వెస్టర్లలో ఉండడం ఆశర్యమేమీ కాదు. దీనిపై ఎలారా క్యాపిటల్‌ ఓ అధ్యయనం చేసి ర్యాలీ చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్న షేర్ల వివరాలను వెల్లడించింది.    2006

Most from this category