STOCKS

News


సమయానికి తగు బీమా

Monday 13th August 2018
personal-finance_main1534137157.png-19208

    వివాహాది శుభకార్యాలు సంతోషాలు కలిగించడంతో పాటు కొత్త బాధ్యతలను కూడా మోసుకొస్తాయి. పెళ్లి, కొత్తగా సొంతిల్లు .. పిల్లల కోసం, వారి చదువుల కోసం ప్లానింగ్‌ ఇవన్నీ వరుసగా ఒకదాని తర్వాత మరొకటి వచ్చేస్తాయి. వీటి కోసం ప్లానింగ్ చేసుకోవడంతో పాటు దురదృష్టకరమైన సంఘటనేదైనా జరిగితే ..కుటుంబం ఆర్థికంగా ఇబ్బందిపడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో సరైన సమయంలో బీమా పాలసీ తీసుకున్న పక్షంలో ఆర్థికంగా ఎలాంటి అవరోధాన్నైనా ధీమాగా ఎదుర్కొనవచ్చు. 

    సాధారణంగా పెళ్లిళ్లకు సంబంధించి సగటు వయస్సు అంతర్జాతీయంగా 28 ఏళ్లుగా ఉంటుండగా.. మన దగ్గర 22.8 సంవత్సరాలుగా ఉంటోంది. వయస్సు పెరిగే కొద్దీ బీమా ప్రీమియం పెరుగుతుందన్న సంగతి తెలిసిందే. కాబట్టి వివాహం నాటికే లేదా వివాహ సమయానికే బీమా తీసుకుంటే.. స్వల్ప ప్రీమియానికి అధిక కవరేజీ పొందడానికి వీలవుతుంది. మరికాస్త వివరంగా చెప్పాలంటే పలు అధ్యయనాల ప్రకారం .. సాధారణంగా 55–60 ఏళ్లు వచ్చేసరికి పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు పూర్తయిపోవడం .. ఇతరత్రా ఇంటి రుణాల చెల్లింపు మొదలైన బాధ్యతలను తీర్చేసుకోవడం జరుగుతుంటుంది. కనుక.. సరైన సమయంలో జీవిత బీమా టర్మ్‌ పాలసీ తీసుకున్న పక్షంలో అత్యంత కీలకమైన సమయంలో ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. 

కవరేజీని పెంచుకోవచ్చు..
వివాహానికి ముందో లేదా వివాహ సమయంలోనో పాలసీ తీసేసుకున్నా.. ఆ తర్వాత పిల్లలు పుట్టాక మరికొన్ని బాధ్యతలు జతవుతాయి కాబట్టి.. కవరేజీని, సమ్‌ అష్యూర్డ్‌ను పెంచుకోవడం శ్రేయస్కరం. ఇటు ద్రవ్యోల్బణం.. అటు పెరిగే బాధ్యతలకు అనుగుణంగా వయస్సు పెరిగే కొద్దీ ఆటోమేటిక్‌గా సమ్‌ అష్యూర్డ్‌ కూడా పెరిగేలా ప్రస్తుతం పలు పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీ పాలసీ ఈ కోవకి చెందినది కాకపోతే కొత్తగా మరో పాలసీ తీసుకోవడమో లేదా.. కొంత ప్రీమియంలో వ్యత్యాసాలన్ని కట్టేసి.. ఇప్పటికే ఉన్న పాలసీలో సమ్‌ అష్యూర్డ్‌ను పెంచుకోవడమో చేయొచ్చు. 

పిల్లల భవిష్యత్‌ చైల్డ్ పాలసీలు ..
పిల్లల బంగారు భవిష్యత్‌ కోసం ప్లానింగ్‌ చేసేందుకు అనువైన చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ బీమా తీసుకున్న పేరెంట్‌కి ఏదైనా అనుకోనిది జరిగినా పాలసీ కొనసాగేలా భవిష్యత్‌ ప్రీమియంలను కట్టడం నుంచి మినహాయింపునిచ్చే పథకాలు కూడా ఉన్నాయి. ఇటు పొదుపు, అటు రక్షణ ప్రయోజనాలు కూడా కల్పించే ఇలాంటి పాలసీలు పిల్లల బంగారు భవిష్యత్‌ కోసం బాటలు వేసేందుకు ఉపయోగపడతాయి. ఇక సొంతింటి కోసం రుణం తీసుకున్నా .. ఆ భారం మరీ అధికం కాకుండా మార్టిగేజ్‌ లోన్‌ తీసుకుంటే శ్రేయస్కరం. 

యుక్త వయస్సులోనే బీమా..
వయస్సు పెరిగే కొద్దీ ప్రీమియంలు పెరుగుతాయి కాబట్టి సాధ్యమైనంత వరకూ 30 ఏళ్ల లోపే పాలసీని తీసుకోవటం మంచిది. పెరిగే వయస్సుతో పాటు ఆరోగ్య సమస్యలూ తలెత్తవచ్చు.. ఫలితంగా ప్రీమియం పెరగొచ్చు. ఒకవేళ 60 ఏళ్లు దాటేస్తే.. బీమా సంస్థలు కవరేజీనిచ్చేందుకు నిరాకరించే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకు.. 30–35 ఏళ్ల వ్యక్తి (సిగరెట్ల అలవాటు లేకుండా) రూ. 1 కోటి సమ్‌ అష్యూర్డ్‌కి పాలసీ తీసుకుంటే.. ప్రీమియం దాదాపు రూ. 8,000 ఉంటుంది. అదే మరో పదిహేనేళ్లు వాయిదా వేసి.. 45 ఏళ్లప్పుడు తీసుకుందామనుకుంటే.. అదే కవరేజీకి ఏకంగా రూ. 20,100 దాకా కట్టాల్సి ఉంటుంది. పైగా ఆరోగ్య సమస్యల్లాంటివేమైనా ఉన్న పక్షంలో ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. 
    కనుక.. పెళ్లి, పిల్లలు, వారి చదువులు, ఇంటి కొనుగోళ్లు ఇలా సందర్భాలను బట్టి బీమా కవరేజీని ఎప్పటికప్పుడు పునఃసమీక్షించుకుంటూ ఉండాలి. కుటుంబానికి అంతటికీ ఆధారమైన ఇంటి పెద్దకేదైనా జరిగిన పక్షంలో వారు లేని లోటు తీర్చలేనిదే అయినా.. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఇలాంటి బీమా పాలసీలతో రక్షణ కల్పించవచ్చు.

 You may be interested

మహిళ అంటే.. మరింత పొదుపు!!

Monday 13th August 2018

 జీవన కాలం ఎక్కువ- ఆర్జించే వయసు తక్కువ  రిటైర్మెంట్‌ తర్వాత అవసరాలు సైతం ఎక్కువే  అందుకోసం మగవారికన్నా ఎక్కువ పొదుపు చేయాలి  దీనికోసం ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లటం తప్పనిసరి (సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం) మగ, ఆడ తేడా లేకుండా ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కాకపోతే ఆర్థిక అవసరాల పరంగా చూస్తే పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగులకే ఇవి ఎక్కువనేది నిపుణుల మాట. పురుషులతో పోలిస్తే తక్కువ వేతనం, సగటు ఉద్యోగ కాలం తక్కువగా ఉండడం, జీవన

స్వల్ప కాల పెట్టుబడుల కోసం ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ షార్ట్‌టర్మ్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌

Monday 13th August 2018

సెబీ ఆదేశాల మేరకు షార్ట్‌ డ్యురేషన్‌ కేటగిరీ ఫండ్స్‌ ఏడాది నుంచి మూడేళ్లు కాల వ్యవధి కలిగిన డెట్‌ సెక్యూరిటీల్లోనే ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. పెద్దగా రిస్క్‌ తీసుకోని వారు, స్వల్ప స్థాయి నుంచి మోస్తరు రిస్క్‌ను తట్టుకునేవారు, ఏడాది నుంచి మూడేళ్ల కాల వ్యవధి కోసం పెట్టుబడుల కోసం షార్ట్‌ డ్యురేషన్‌ లేదా షార్ట్‌ టర్మ్‌ అపార్చునిటీస్‌ పథకాలను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ షార్ట్‌

Most from this category