STOCKS

News


ఖాతాలో ఉన్నదంతా ఊడ్చేస్తారు జాగ్రత్తా..!

Saturday 4th November 2017
personal-finance_main1509778615.png-10832

ఢిల్లీలోని ఓ స్వచ్ఛంద సంస్థ పేరిట శ్రీనివాస్‌కు ఫోనొచ్చింది. ‘‘ఓ పసిపాప తీవ్రమైన ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతోంది. వైద్యం కోసం మేం దేశవ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్నాం. సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తున్నాం. మీరూ సహకరించండి’’ అనేది ఆ కాల్ సారాంశం. అంతేకాదు! ఆ పాప చేత కూడా ఫోన్ చేయించారు సదరు ప్రతినిధులు. ‘‘నీ వివరాలు మెయిల్ చేస్తే నేనేం చేయగలనో ఆలోచిస్తా’’ అన్నాడు శ్రీనివాస్. కాసేపటికి ఆన్‌లైన్లో సదరు స్వచ్ఛంద సంస్థ కోసం గాలించాడు. బోలెడంత మంది తాము మోసపోయామంటూ పెట్టిన పోస్ట్‌లు కనిపించాయి. దీంతో అదెంత పెద్ద మోసమో అర్థమైంది శ్రీనివాస్‌కి.

ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. నిజానికి దేశ వ్యాప్తంగా ఇపుడు జరుగుతున్న మోసాలకు లెక్కలేదు. ఆన్‌లైన్ ప్రపంచం గురించి పెద్దగా తెలియని వారంతా ఈ మోసగాళ్ల వలలో ఈజీగా పడిపోతున్నారు. నిజానికిది అబద్ధాలు చెప్పి అమ్మటంకన్నా దారుణం. ఎందుకంటే అబద్ధాలు నమ్మి ఒక ఉత్పత్తి కొంటే మన డబ్బు ఇరుక్కుపోవటమో, తగిన లాభాలు రాకపోవటమో మాత్రమే జరుగుతుంది. కానీ ఇలాంటి మోసాలకు గురైతే ఇక డబ్బు తిరిగిరాదు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ మోసాలు ఎలా జరుగుతాయి? వాటి బారిన పడకుండా అనుసరించాల్సిన మార్గాలేంటి? ఇవన్నీ తెలియజేసేదే ఈ కథనం...

నకిలీ ఉద్యోగాల ఆఫర్లు...

దేశంలో లక్షల మంది నిరుద్యోగులున్నారు. ఇదే ఈ నకిలీ ఉద్యోగాల పుట్టుకకు మూలం. వీళ్లు మోసం చేసే పద్ధతేంటంటే... మొదట మీకో ప్రముఖ కంపెనీ పేరిట ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తూ ఈ-మెయిల్ వస్తుంది. అందులో ఇంటర్వ్యూ స్థలం, తేదీ, ఫోన్ నంబర్లు అన్నీ ఉంటాయి. చివర్లో... మీరు సెక్యూరిటీ డిపాజిట్‌గానో, బేసిక్ ఫీజుగానో కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని, దాన్ని తరవాత తిరిగి ఇచ్చేస్తామని ఉంటుంది. మన దేశంలో ఉన్న నిరుద్యోగం దృష్ట్యా చాలా మంది తేలిగ్గా ఈ వలలో పడిపోతుంటారు. కంపెనీ లోగో వంటివన్నీ ఉండి, చదువుతున్నపుడు ఈ మెయిల్‌లు చాలా నిజమైనవిగా కనిపిస్తాయి.

ఇటీవలే బెంగళూరులో నర్సు ఉద్యోగాల పేరిట పలువురిని మోసం చేసిన ఓ నైజీరియన్ ముఠాను సైబర్‌క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. బ్రిటన్‌లో ఉద్యోగాల పేరిట ఈమెయిళ్లు పంపించింది ఈ ముఠా. దీనికి స్పందించిన ఓ నర్సు... యూకేలోని ఈలంగ్ ఆసుపత్రిలో ఉద్యో గం ఉందంటే తన రెజ్యుమె పంపింది. దాంతో ఆమె నంబరుకు ఫోన్ చేసిన ముఠా... యాంటీ టైస్ట్, డ్రగ్ ట్రాఫికింగ్ సర్టిఫికెట్ల కోసం, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం, స్కిల్డ్ ఇమిగ్రేషన్ సర్టిఫికెట్ల కోసం రూ.11,03,500 డిపాజిట్ చేయాలని కోరింది. అలానే చేసిన ఆమె... ఆ తరవాత తెలుసుకుంది తాను మోసపోయానని.

స్వచ్ఛంద సంస్థల పేరిట...

ఇంటర్నెట్‌లో ‘రిలీఫ్ ఇండియా ట్రస్ట్ స్కామ్’ అని కొట్టి చూడండి. ఈ స్వచ్ఛంద సంస్థ పేరిట ఎంతమందికి ఫోన్లొచ్చాయో అర్థమవుతుంది. వైద్య సాయం అవసరమైన పలువురు పిల్లల కోసం నిధులు సేకరిస్తున్నామనే పేరిట ఈ సంస్థ ఫోన్లు చేస్తోంది. నిజానికది రిజిస్టరయిన స్వచ్ఛంద సంస్థే. కానీ దాని ఉద్దేశాలు మాత్రం వేరు. పసిపాప వెంటిలేటర్‌పై ఉందని, మరోపాప చదువుకోసమని, మరో అర్ధగంటలో సర్జరీ చేయాలని... ఇలా రకరకాల కారణాలు. అయితే అన్ని స్వచ్ఛంద సంస్థలూ ఇలా చేస్తాయని కాదు. ఒకటి రెండు చేసినా... ఇలాంటి కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండటం మాత్రం తప్పనిసరి.

ఐఆర్‌డీఏ నుంచి కాల్ చేస్తున్నామంటూ...

ప్రస్తుతం ఇది సహజమైపోయింది. ఈ రోజుల్లో ప్రతి ఇన్వెస్టర్‌కూ ఏదో ఒక బీమా తప్పనిసరిగా ఉంటుంది. ప్రత్యేకించి ఎల్‌ఐసీ నుంచి. దీన్ని అదనుగా తీసుకున్న మోసగాళ్లు... తాము ఐఆర్‌డీఏ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ, చాలా ఏళ్లుగా బీమా మొత్తం కడుతున్నందుకు మీ బీమా పాలసీ బోనస్‌కు ఎంపికైందని, ఇది క్లెయిమ్ చేయాలంటే మీరు కొంత మొత్తం చెల్లించాలని చెబుతారు. లేదంటే కొత్త పాలసీ తీసుకోవాలని చెబుతారు. చాలా సందర్భాల్లో వారు మీ గురించి పలు వివరాలు చెబుతారు. దీంతో అదంతా నిజమైన సంభాషణలానే అనిపిస్తుంది. అందుకే చాలామంది ఇన్వెస్టర్లు వీటి వలలో పడిపోతారు. సెబీ లాంటి సంస్థలు కూడా ఇన్వెస్టర్లు ఇలాంటి వాటి వలలో పడొద్దని ప్రకటనలిస్తున్నాయి.

వెరిఫికేషన్ పేరిట బ్యాంకుల ఫోన్లు...

చాలామంది ఇన్వెస్టర్లకు ఇది కొత్త రకం మోసమే. పెద్దగా అవగాహన లేని ఇన్వెస్టర్లను, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను అప్పుడే వాడుతున్న వారిని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్లు వస్తుంటాయి. మోసగాళ్లు తమను తాము బ్యాంకు వెరిఫికేషన్ అధికారులుగా పరిచయం చేసుకుంటారు. మీ డెబిట్/ క్రెడిట్ కార్డు నంబరు, చెల్లుబడి గడువు, సీవీవీ నంబరు... ఇలాంటివన్నీ అడుగుతారు. మీరు చెబుతున్నపుడే వారొక లావాదేవీ జరుపుతుంటారు. ‘‘మీ ఫోన్‌కు ఇపుడు ఒక పాస్‌వర్డ్ (ఓటీపీ) వచ్చింది... అది కాస్త చెబుతారా’’ అని అడుగుతారు. అమాయకంగా అదికూడా చెబితే... అంతే సంగతులు. లావాదేవీ పూర్తయి బిల్లు మీ చేతికొస్తుంది.

చేయాల్సిందేమంటే...

మీ బ్యాంకు ఖాతా వివరాలు ఎప్పుడూ, ఎవ్వరికీ చెప్పొద్దు. సీవీవీ నంబరు, ఓటీపీ వంటివి అసలే చెప్పొద్దు. చాలాసార్లు పెట్రోలు పంపులు, రెస్టారెంట్లలో కార్డు ఇచ్చి నంబరు వాళ్లకు చెప్పటం జరుగుతుంటుంది. 99.9 సందర్భాల్లో ఏమీ జరగదు. కానీ ఎక్కడో 0.1% మాత్రం ఇలాంటివి జరుగుతుంటాయి. మన టైమ్ బాగాలేక ఆ 0.1%లోనే మనముంటే..!! అందుకే జాగ్రత్తగా ఉండటం అవసరం.

బ్యాంకు వివరాల తనిఖీ పేరిట ఫిషింగ్...

ఫిషింగ్ అనేది ఆన్‌లైన్ ప్రపంచంలో అత్యంత సహజమైన మోసం. దీన్లో మోసగాళ్లు చేసేదేమంటే... వెరిఫికేషన్ పేరిట మీ బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతూ మీకొక మెయిల్ వస్తుంది. దాన్ని పూర్తి చేసి పంపించని పక్షంలో మీ ఖాతా క్లోజ్ అయిపోతుందనే హెచ్చరిక కూడా అందులో ఉంటుంది. ఆ దిగువనే... మీ బ్యాంకు లింక్ కూడా ఉంటుంది. మీరు ఆ లింక్‌ను క్లిక్ చేసినట్లయితే... అప్పుడు అచ్చం మీ బ్యాంకు వెబ్‌సైట్ పేజీని పోలి ఉండే మరో వెబ్‌సైట్ కనిపిస్తుంది. అచ్చం మీ బ్యాంకు వెబ్‌సైట్‌లానే ఉండటంతో అనుమానం రాదు. అక్కడ మీ వివరాలన్నీ నమోదు చేశాక... ఆ వెబ్‌సైట్ క్లోజ్ అయిపోతుంది. నిజానికి అదంతా మీ వివరాలు తెలుసుకోవటానికి పన్నిన పన్నాగం. అలా సేకరించిన వివరాలతో తదనంతరం వారే నేరుగా లావాదేవీలు నిర్వహిస్తారు.

చేయాల్సిందిదీ...

ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. ఏ బ్యాంకూ మీ పిన్ నంబరు అడగదు. ఏ బ్యాంకూ ఎప్పుడూ మీ పాస్‌వర్డ్‌ల వంటివి తమకు ఇవ్వాలని అడగదు. అవన్నీ లావాదేవీ జరిపేటపుడు మీకు మీరుగా నమోదు చేయాల్సినవే తప్ప వేరొకరికి ఇచ్చేవి కావు.

తెలుసుకునేదిలా...

అయితే ఇక్కడో విషయం గమనించాలి. మీకు వచ్చిన మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనేది చూసినా...వాళ్లిచ్చిన వెబ్‌సైట్ లింక్ చూసినా విషయం అర్థమైపోతుంది. ఎందుకంటే అది నిజంగా సదరు కంపెనీ అధికారిక మెయిల్ నుంచి వచ్చిందయి ఉండదు. పెపైచ్చు ఇంటర్వ్యూకి పిలిచిన ఏ కంపెనీ కూడా డబ్బులు డిపాజిట్ చేయమని అడగదు.You may be interested

గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ లాభం 44 కోట్లు

Saturday 4th November 2017

ముంబై: రియాల్టీ దిగ్గజం గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.44 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే క్యూ2లో సంస్థ సాధించిన నికరలాభం రూ.23 కోట్లతో ఇది 88శాతం అధికం.  ఇదే సెప్టెంబర్‌ త్రైమాసికంలో మొత్తం ఆదాయం 49.5శాతం వృద్ధి చెంది రూ.492 కోట్లను సాధించింది. గతేడాదిలో మొత్తం ఆదాయం రూ.329 కోట్లుగా నమోదు చేసింది. మొత్తం బుక్‌ వాల్యూ ఈ క్యూ2లో రూ.1,335

వాహన బీమాకు యాడ్ఆన్ కవచం

Saturday 4th November 2017

అందరికీ వాహనం అవసరమే. కాకపోతే మనుషుల్ని బట్టి వారి అవసరాలు కూడా వేరుగా ఉంటాయి. పెద్ద కుటుంబమైతే విశాలమైన పెద్ద కారు కావాల్సి రావొచ్చు. అదే చిన్న కుటుంబం, సింగిల్‌గా ఉన్న ప్రొఫెషనల్స్ లాంటి వారికయితే ఇటు పార్కింగ్‌కు అటు మెయింటెనెన్స్‌కు సులువుగా ఉండే చిన్న కారు బెటరని అనిపించొచ్చు. ఇక గృహిణులైతే.. చిన్నా, చిత్రకా పనులు చుట్టబెట్టేందుకు తేలికపాటి స్కూటర్‌లాంటి దాన్ని ఇష్టపడొచ్చు. ఇలా ఒకరికి అనువైన వాహనం

Most from this category