News


మొబైల్ వాలెట్లకు మార్చి గండం

Thursday 10th January 2019
news_main1547097845.png-23496

  • కేవైసీ ధృవీకరణకు ఫిబ్రవరి డెడ్‌లైన్‌
  • గడువులోగా ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు తక్కువే
  • ఆధార్‌పై చెల్లుబాటుపై సుప్రీం తీర్పుతో మరిన్ని
  • దీంతో 95 శాతం వాలెట్లు మూతబడే పరిస్థితి

న్యూఢిల్లీ: డిజిటల్‌ విప్లవంతో కుప్పతెప్పలుగా పుట్టుకొచ్చిన మొబైల్‌ వాలెట్‌ సంస్థలకు ప్రస్తుతం కేవైసీ నిబంధనలు సంకటంగా మారాయి. ఈ ఏడాది ఫిబ్రవరి ఆఖరు నాటికి కస్టమర్లందరి వివరాల (కేవైసీ) ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలను అమలు చేయడానికి వాలెట్‌ సంస్థలు పరుగులు తీస్తున్నాయి. కానీ, నిర్దేశిత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మరోపక్క, ప్రైవేటు సంస్థలు కస్టమర్ల నుంచి ఈ-కేవైసీ కోసం ఆధార్‌ను తీసుకోవడానికి వీల్లేదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వాలెట్‌ సంస్థలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. డెడ్‌ లైన్‌ ముగియడానికి ఇంకా కొన్ని వారాల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగా.. ఇప్పటిదాకా చాలా మటుకు సంస్థలు కేవలం కొద్ది మంది కస్టమర్ల కేవైసీ మాత్రమే పూర్తి చేయగలిగాయి. దీంతో దాదాపు 95 శాతం మొబైల్‌ వాలెట్లు మార్చి తర్వాత కార్యకలాపాలు నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
    మొబైల్‌ వాలెట్‌ సంస్థలన్నీ కూడా కచ్చితంగా కేవైసీ ధృవీకరణ జరపాల్సిందేనంటూ 2017లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశించింది. దీంతో వనరులున్న సంస్థలు ఆధార్‌ ఆధారంగా ఎలక్ట్రానిక్‌ రూపంలో కేవైసీ వెరిఫికేషన్‌ జరిపాయి. పేమెంట్స్‌ బ్యాంకింగ్‌ లైసెన్స్‌ కూడా పొందిన పేటీఎం.. బయోమెట్రిక్‌ డాంగిల్స్, ఫీల్డ్‌ ఏజెంట్లను ఉపయోగించి కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు కొత్త బ్యాంకు ఖాతాలు కూడా తెరిచింది. ఈ విధంగా పేటీఎం తమ యూజర్లలో దాదాపు 70 శాతం మందికి పూర్తి స్థాయిలో కేవైసీ నిబంధనలు అమలు చేయగలిగినట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. కానీ మిగతా కంపెనీలు నానా తంటాలు పడుతున్నాయి. ప్రాథమిక స్థాయి ధృవీకరణ మాత్రమే పూర్తి చేయగలిగామని, బయోమెట్రిక్స్‌ లేకపోవడంతో పూర్తి వెరిఫికేషన్‌ చేయలేకపోతున్నామని మరో వాలెట్‌ సంస్థ అధికారి వివరించారు. పేపర్‌ రూపంలో డాక్యుమెంట్స్‌ను సేకరించి, వెరిఫికేషన్‌ చేయాలంటే ఖర్చులు భారీగా పెరిగిపోయి, లాభదాయకత సమస్యలు ఉంటున్నాయని వాపోయారు. మరోవైపు, సుప్రీం తీర్పు కారణంగా ఇప్పటికే ఆధార్‌ ఆధారిత ఈకేవైసీ పూర్తి చేసిన కస్టమర్ల డేటా అంతా కూడా మార్చి తర్వాత తమ సర్వర్ల నుంచి తొలగించనుండటంతో ఆయా యూజర్లు కూడా మళ్లీ ప్రత్యేకంగా ఇతరత్రా ధృవీకరణ పత్రాలతో కేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం రావొచ్చని కూడా వాలెట్‌ సంస్థల వర్గాలు తెలిపాయి.

సుప్రీం కోర్టు తీర్పుతో కష్టాలు..
ప్రైవేట్‌ కంపెనీలు తమ కస్టమర్ల ధృవీకరణ కోసం ఆధార్‌ ఆధారిత ఎలక్ట్రానిక్‌ కేవైసీ వెరిఫికేషన్‌Œ  (ఈకేవైసీ) ప్రక్రియను అమలు చేయడానికి లేదంటూ సుప్రీం కోర్టు గతేడాది తీర్పునివ్వడంతో మొబైల్‌ వాలెట్‌ సంస్థలకు తాజా సమస్యలు వచ్చి పడ్డాయి. ’ఈకేవైసీ లేదు. సులభతరమైన ప్రత్యామ్నాయ కేవైసీ విధానాల గురించి ఆర్‌బీఐ ఇప్పటివరకూ ఏ విషయమూ స్పష్టంగా చెప్పలేదు. మరోవైపు, డెడ్‌లైన్‌ చూస్తే ఇంకా కొన్ని వారాలే మిగిలి ఉంది. ప్రస్తుత స్థాయిని బట్టి చూస్తే.. ఆలోగా వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేయగలిగే పరిస్థితి కనిపించడం లేదు’ అని ఒక వాలెట్‌ సంస్థ సీనియర్‌ అధికారి తెలిపారు. ప్రైవేట్‌ కంపెనీలకు ఈ–కేవైసీ అందుబాటులో లేకపోవడంతో.. వీడియో ఆధారిత వెరిఫికేషన్, ఎక్స్‌ఎంఎల్‌ ఆధారిత కేవైసీ వంటి ప్రత్యామ్నాయ విధానాలనైనా అనుమతించాలన్న డిమాండ్లు ఉన్నాయి. అయితే, వీటికి రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి అధికారికంగా ఆమోదముద్ర లేదు.

స్టాండెలోన్‌ వాలెట్లపైనే ప్రభావం ఎక్కువ..
దేశీయంగా నాలుగేళ్ల క్రితం పెద్దయెత్తున వాలెట్‌ కంపెనీలు వచ్చినప్పటికీ.. ప్రస్తుతం కొన్ని మాత్రమే మిగిలాయి. మొబిక్విక్, ఫోన్‌పే, అమెజాన్‌పే వంటి సంస్థలు యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లేదా టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సేవలు అందించే ఇతరత్రా ఫిన్‌టెక్‌ కార్యకలాపాల్లోకి మళ్లాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి సంస్థలకు మాత్రమే మనుగడ ఉండవచ్చని, స్టాండెలోన్‌ వాలెట్లపై మాత్రం తీవ్ర ప్రతికూల ప్రభావం పడగలదని కన్సల్టెన్సీ సంస్థ ఎర్న్‌స్ట్‌ అండ్‌ యంగ్‌ వర్గాలు తెలిపాయి.

పార్లమెంటు వైపు చూపు..
ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్‌ చట్ట సవరణకి పార్లమెంటు ఆమోదముద్ర వేస్తే కాస్తంత గట్టెక్కగలమని వాలెట్‌ సంస్థలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ వెరిఫికేషన్‌ కోసం కస్టమర్లు స్వచ్ఛందంగా ఆధార్‌ని ఇచ్చేలా చట్ట సవరణ ప్రతిపాదనలు ఉన్నాయి. సౌకర్యంపరంగా చూస్తే.. చాలా మంది కస్టమర్లు ఆధార్‌ వెరిఫికేషన్‌ వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అటు రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి కూడా కొంత భరోసా లభిస్తే బాగుండేదని అంటున్నాయి.



You may be interested

యాపిల్‌ సీఈవో వేతనం @ రూ.110 కోట్లు

Thursday 10th January 2019

వాషింగ్టన్‌: టెక్ దిగ్గజం యాపిల్ అమ్మకాలు భారీగా పెరిగిన నేపథ్యంలో సంస్థ సీఈవో టిమ్ కుక్ జీతభత్యాలు గతేడాది ఏకంగా 22 శాతం పెరిగాయి. 2018లో ఆయన ఏకంగా 15.7 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 110 కోట్లు) ప్యాకేజీ అందుకున్నారు. ఇందులో 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 21 కోట్లు) మూల వేతనం కాగా, 12 మిలియన్ డాలర్ల (దాదాపు 84 కోట్లు) బోనస్‌, 6,80,000 డాలర్లు

పసిడి 1300 డాలర్ల వైపు అడుగులు

Thursday 10th January 2019

ప్రపంచమార్కెట్లో పసిడి అడుగులు మరోసారి 1300డాలర్లు దిశగా కదులుతున్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత అందుకు తోడ్పాటును అందిస్తుంది. ఆసియా మార్కెట్లో గురువారం ఉదయం గం.10:00ని.లకు ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు లాభపడి 1,297 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ డిసెంబర్‌లో జరిపిన సమీక్ష వివరాలు బుధవారం వెల్లడయ్యాయి. అందులో ఫెడ్‌ సభ్యుల్లో ఎక్కువ మంది వడ్డీ రేట్లపై మెతకవైఖరి వహించాలని కోరినట్లు తెలుస్తుంది.

Most from this category