STOCKS

News


మార్చిలో ఎగుమతుల మెరుపు!

Tuesday 16th April 2019
Markets_main1555392094.png-25153

- 11 శాతం వృద్ధి
- ఐదు నెలల గరిష్టస్థాయి
- ఔషధ, రసాయన,
ఇంజనీరింగ్‌ రంగాలు భేష్‌
- వాణిజ్యలోటు 
10.89 బిలియన్‌ డాలర్లు
- ఆర్థిక సంవత్సరంలో 9 శాతం పురోగతి

న్యూఢిల్లీ: ఎగుమతులు మార్చిలో భారీగా నమోదయ్యాయి. 11 శాతం వృద్ధి నమోదయ్యింది. ఔషధాలు, రసాయనాలు, ఇంజనీరింగ్‌ రంగాల నుంచి ఎగుమతులు భారీగా పెరగడం దీనికి కారణం. కాగా మార్చితో ముగిసిన 12 నెలల కాలంలో (2018-2019) ఎగుమతులు 9 శాతం పెరిగాయి.  కేంద్రం సోమవారం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే...

- మార్చిలో ఎగుమతుల విలువ 32.55 బిలియన్‌ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.29.32 బిలియన్‌ డాలర్లు. అంటే వృద్ధి 11 శాతం అన్నమాట. శాతాల్లో ఇంత స్థాయిలో వృద్ధి నమోదుకావడం 2018 అక్టోబర్‌ (17.86 శాతం) తరువాత ఇదే తొలిసారి. 
- ఇక ఇదే నెలలో దిగుమతులు కేవలం 1.44 శాతమే పెరిగాయి. విలువ రూపంలో 43.44 బిలియన్‌ డాలర్లు. 
- దీని ప్రకారం- ఎగుమతులు-దిగుమతులకు మధ్య నికర వ్యత్యాసం- వాణిజ్యలోటు 10.89 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 2018 మార్చి నెలలో ఈ లోటు 13.61 బిలియన్‌ డాలర్లు. 

2018-19 వాణిజ్యలోటు 176.42 బిలియన్‌ డాలర్లు
కాగా ఆర్థిక సంత్సరం మొత్తంగా చూస్తే, ఎగుమతులు 9 శాతం పెరిగి 331 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  దిగుమతులూ 9 శాతం వృద్ధి చెందాయి. విలువ రూపంలో ఇది 507.44 బిలియన్‌ డాలర్లు. వెరసి వాణిజ్యలోటు 176.42 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 2017-18లో మొత్తం వాణిజ్యలోటు 162 బిలియన్లు మాత్రమే. ఈ ఏడాది కాలంలో పెట్రోలియం (28 శాతం), ప్లాస్టిక్‌ (25.6 శాతం), రసాయనాలు (22 శాతం) ఫార్మా (11 శాతం), ఇంజనీరింగ్‌ (6.36 శాతం) రంగాలు మంచి పనితనం ప్రదర్శించాయి.  ఈ కాలంలో చమురు దిగుమతులు 29.27 శాతం పెరిగి 140.47 బిలియన్‌ డాలర్లుగా నమోదయితే, చమురుయేతర దిగుమతులు 2.82 శాతం పెరిగి 366.97 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 
కష్టనష్టాల్లోనూ మంచి ఫలితం
గడచిన మూడు సంవత్సరాలుగా అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ 2018-19లో 331.02 బిలియన్‌ డాలర్లు ఎగుమతులు జరిపాం. 2013-14లో సాధించిన 314.4 బిలియన్‌ డాలర్లకన్నా ఇది అధికం. సవాళ్లతో కూడిన అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లోనూ సాధించిన విజయమిది’’
- కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ
మరిన్ని రంగాలపై దృష్టి అవసరం
అంతర్జాతీయ వాణిజ్య ప్రతికూలతల్లోనూ ఎగుమతుల విషయంలో మంచి ఫలితాలు సాధించడం హర్షణీయం. అయితే ఫుడ్‌ కమోడిటీ వంటి కొత్త ఉత్పత్తుల ఎగుమతులపైనా దృష్టి సారించాలి. ఎగుమతుల వృద్ధికి ఇలాంటి నిర్ణయాలు మరింత దోహదపడతాయి. దీర్ఘకాలంలో అంతర్జాతీయ ఒడిదుడుకులను తట్టుకుని ఎగుమతులు వృద్ధి చెందుతాయి. 
- మోహిత్‌ సింగ్లా, టీపీసీఐ చైర్మన్‌
డిమాండ్లు నెరవేర్చాలి
రక్షణాత్మక వాదం, అంతర్జాతీయ, దేశీయ కఠిన పరిస్థితుల్లోనూ ఎగుమతులు పెరగడం హర్షణీయం. అయితే ఎగుమతుల వృద్ధి మున్ముందూ కొనసాగడానికి కొన్ని చర్యలు అవసరమని డిమాండ్‌ చేస్తున్నాం. అందులో తగిన సమయంలో తగిన రుణ సదుపాయం ఒకటి.  పరిశోధనా, అభివృద్ధి విభాగాల విషయంలో పన్ను రాయితీలు ఉండాలి. జీఎస్‌టీ నుంచి మినహాయింపులు అవసరం. వ్యవసాయ ఎగుమతులకు వడ్డీ రాయితీ మద్దతు ఉండాలి. విదేశీ పర్యాటకులకు అమ్మకాలపై ప్రయోజనాలు ఉండాలి. 
- గణేశ్‌ కుమార్‌ గుప్తా, ఎఫ్‌ఐఈఓ ప్రెసిడెంట్‌
ఫిబ్రవరిలో సేవలు పేలవం
సేవల రంగం 2019 ఫిబ్రవరి గణాంకాలు నిరాశపరిచాయి. తాజా గణాంకాల ప్రకారం- సేవల రంగం ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 6.54 శాతం (2018 ఫిబ్రవరితో పోల్చి) తగ్గాయి. విలువ రూపంలో 16.58 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఇదే కాలంలో సేవల దిగుమతులూ 11 శాతం తగ్గి 9.81 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.



You may be interested

నిధులిచ్చి సంస్థను కాపాడండి!

Tuesday 16th April 2019

- ఇది 20వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు - బ్యాంకులకు, ప్రధానికి జెట్ ఎయిర్‌వేస్ పైలట్ల అభ్యర్థన ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్‌కు రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళిక కింద ఇస్తామన్న రూ.1,500 కోట్ల నిధులను తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జెట్ ఎయిర్‌వేస్ పైలట్ల సమాఖ్య నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ కోరింది. కంపెనీ మూతబడితే 20,000 పైచిలుకు సిబ్బంది రోడ్డున పడే ప్రమాదం

నిఫ్టీ కొత్త రికార్డు

Tuesday 16th April 2019

ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ సూచీ మంగళవారం కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో నిఫ్టీ ఇండెక్స్‌ గతముగింపు(11,690.35)తో పోలిస్తే 76 పాయింట్ల లాభపడి 11,776.55 పాయింట్ల వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. 8 రోజుల క్రితం 11,761 వద్ద  రికార్డ్‌ గరిష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరో సూచీ సెన్సెక్స్‌ ఆల్‌టైం గరిష్టానికి 100 పాయింట్ల దూరంలో ఉంది.

Most from this category