STOCKS

News


బ్యాంకింగ్‌ రంగంలో రికవరీ షురూ

Tuesday 1st January 2019
news_main1546319184.png-23341

- ఎన్‌పీఏలు తగ్గుతున్నాయ్‌
- పీఎస్‌బీల్లో మరిన్ని సంస్కరణలు అవసరం
- ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌
- అర్ధ సంవత్సర ఆర్థిక స్థిరత్వ నివేదిక విడుదల

ముంబై: పేరుకుపోయిన మొండిబకాయిలు తగ్గుతుండడంతో బ్యాంకింగ్‌ రంగం ఊపిరి పీల్చుకుంటోందని ఆర్‌బీఐ వ్యాఖ్యానించింది. బ్యాంకింగ్‌ రంగం రికవరీ బాట పట్టినా, పీఎస్‌యూ బ్యాంకుల్లో పాలనా పరంగా మరిన్ని సంస్కరణలు రావాల్సి ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆర్‌బీఐ అర్ధ వార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదికను (ఎఫ్‌ఎస్‌ఆర్‌) విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్థూల ఎన్‌పీఏలు తగ్గుముఖం పట్టాయని నివేదిక వెల్లడించింది. పదకొండు బ్యాంకులను పీసీఏ ఛట్రం కిందకు తీసుకురావడంతో బ్యాంకింగ్‌ రంగంలో క్రమశిక్షణ వచ్చినట్లయిందని తెలిపింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని ఫైనాన్షియల్‌ దిగ్గజాల ఆర్థిక స్థిరత్వంపై ఎక్కువ ఫోకస్‌ పెడతామని సూచించింది. ప్రభుత్వ బ్యాంకుల్లో బలహీనమైనవాటికి ప్రభుత్వం సాయం చేయాలని దాస్‌ సూచించారు. ‘‘మొండి బకాయిలు తగ్గడం ఆరంభం కావడంతో సుదీర్ఘకాలం ఒత్తిడిలో ఉన్న బ్యాంకింగ్‌ రంగం రివకరీ బాట పట్టింది’’అని దాస్‌ చెప్పారు.
మొండిపద్దులు తగ్గుతున్నాయ్‌
ఎఫ్‌ఎస్‌ఆర్‌ ప్రకారం... గత మార్చిలో 11.5 శాతం ఉన్న బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు సెప్టెంబర్‌ నాటికి 10.8 శాతానికి దిగివచ్చాయి. ఇదే కాలంలో పీఎస్‌యూ బ్యాంకుల జీఎన్‌పీఏలు 15.2 నుంచి 14.8 శాతానికి తగ్గాయి. ప్రైవేట్‌ బ్యాంకుల జీఎన్‌పీఏలు 4 నుంచి 3.8 శాతానికి పరిమితమయ్యాయి. ఇదే జోరు కొనసాగితే వచ్చే మార్చినాటికి బ్యాంకులన్నింటి స్థూల ఎన్‌పీఏలు 10.3 శాతానికి, పీఎస్‌బీల జీఏన్‌పీఏలు 14. 6 శాతానికి, ప్రైవేట్‌ బ్యాంకుల జీఎన్‌పీఏలు 3.3 శాతానికి తగ్గవచ్చని నివేదిక అంచనా వేసింది. నికర ఎన్‌పీఏలు గత మార్చిలో 6.2 శాతం ఉండగా మార్చినాటికి 5.3 శాతానికి పతనమయ్యాయి. 2015 అనంతరం అటు స్థూల, నికర ఎన్‌పీఏల్లో అర్ధవార్షిక తరుగుదల నమోదు కావడం ఇదే తొలిసారి. రిస్ట్రక్చర్డ్‌ స్టాండర్డ్‌ అడ్వాన్సుల (ఆర్‌ఎస్‌ఏ) నిష్పత్తి సెప్టెంబర్‌ నాటికి 0.5 శాతానికి పతనమైందని, ప్రొవిజన్‌ కవరేజ్‌ నిష్పత్తి (పీసీఆర్‌) 51 శాతానికి పెరిగిందని, క్యాపిటల్‌ టు రిస్క్‌ వెయిటెడ్‌ అసెట్‌ నిష్పత్తి (సీఆర్‌ఏఆర్‌) 13.7 శాతానికి వచ్చిందని నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్‌నాటికి బ్యాంకు పోర్టుఫోలియోల్లో పెద్ద రుణఖాతాలు 54.6 శాతానికి, బ్యాంకుల జీఎన్‌పీఏల్లో బడా బకాయిల వాటా 83.4 శాతానికి చేరాయని వివరించింది. ‘‘ప్రస్తుత ఎన్‌పీఏలు అధికమే. కానీ తరుగుదల రేటును పరిశీలిస్తే ఇవి మరింత దిగొస్తాయనిపిస్తోంది. నిజానికి ఎన్‌పీఏ అంశంలో ఈ మెరుగుదల చాలదు. పీఎస్‌యూ బ్యాంకుల నిర్వహణా సామర్ధా‍్యన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. దీనికోసం మరిన్ని పాలనా సంస్కరణలు తీసుకురావడం, బలహీన పీఎస్‌బీలకు రీక్యాప్‌ సాయం అందించడం తదితర చర్యలు అవసరం’’ అని దాస్‌ చెప్పారు. ఎన్‌పీఏలను గుర్తించే ప్రక్రియతో పీఎస్‌బీల్లో రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ మెరుగుపడిందన్నారు.
క్రమశిక్షణ తెచ్చిన పీసీఏ
ఇరవై పీఎస్‌బీల్లో 11 బ్యాంకులను పీసీఏ (స్పష్టమైన దిద్దుబాటు చర్యల) పరిధిలోకి తీసుకురావడం మంచిదయిందని దాస్‌ అభిప్రాయపడ్డారు. క్రెడిట్‌ అంచనా, మార్కెట్‌ రిస్కు అంచనాలకు సంబంధించి పీసీఎ కారణంగా బ్యాంకుల్లో క్రమశిక్షణ వచ్చిందన్నారు. దివాలా చట్టం కింద చేర్చిన కేసుల్లో కొంత జాప్యం జరుగుతున్నా, ఈ చట్టం కారణంగా విత్త క్రమశిక్షణ వస్తుందన్నారు. గత నాలుగు త్రైమాసికాల్లో పీసీఏ కారణంగా 11 పీఎస్‌బీల సాల్వెన్సీ నష్టాలు 73,500 కోట్ల రూపాయల నుంచి 34,200 కోట్ల రూపాయలకు దిగివచ్చాయిని ఆర్‌బీఐ నివేదిక తెలిపింది. జీడీపీ వృద్ధి 7.1 శాతానికి పరిమితం కావడంపై స్పందిస్తూ ఈ మందగమనం అనుకున్నదానికన్నా తక్కువగా ఉందని, కాకుంటే క్రూడాయిల్‌ ధరలు తగ్గడం, స్థూల స్థిర మూలధన ఏర్పాటులో వృద్ధి కారణంగా ఎకానమీలో వృద్ధి ముందుకే సాగుతుందని దాస్‌ అంచనా వేశారు. అంతర్జాతీయ  వృద్దిని భయపెట్టిన ట్రేడ్‌వార్‌ భయాలు క్రమంగా ఉపశమిస్తున్నాయని ఆయన తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను, పెట్టుబడి నిబంధనలను కచ్ఛితంగా అమలు చేయడం వల్ల మార్కెట్లో స్థిరత్వం వస్తుందని, దీంతో ద్వైపాక్షిక వాణిజ్యం విజయవంతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎఫ్‌సీలపై డేగ కన్ను
భారీ ఆర్థిక సామ్రాజ్యాల (ఎఫ్‌సీ) విత్త స్థిరత్వంలో రిస్కును ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం ఎత్తిచూపిందని ఆర్‌బీఐ తన నివేదికలో పేర్కొంది. వీటిపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఎఫ్‌సీల్లో కచ్చితమైన రిస్కులుండేందుకు పలు అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఎఫ్‌సీల స్థితిగతులను ఐఆర్‌ఎఫ్‌- ఎఫ్‌సీ పర్యవేక్షిస్తోంది. ఐఆర్‌ఎఫ్‌ పర్యవేక్షణ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉన్నా, మరింత మెరుగుదల అవసరమని నివేదిక తెలిపింది. ఇకపై అన్ని ఎఫ్‌సీలు త్రైమాసికానికొకసారి తమ వద్ద జరిగిన ఇంటర్‌గ్రూప్‌ లావాదేవీల డేటాను సమర్పించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఎఫ్‌సీలకు క్రెడిట్‌ రేటింగ్‌ ఏజన్సీలు ఇచ్చే రేటింగ్‌ ప్రమాణాలపై సెబి తీసుకువచ్చిన మార్పులు అవసరమని తెలిపింది. ఎన్‌బీఎఫ్‌సీ రంగం రిస్కులను ఎదుర్కొనడంలో మరింత సమర్ధవంతంగా ఉండాలని, అధిక క్రెడిట్‌ వృద్దిని సమతుల్యం చేయాలని గవర్నర్‌ దాస్‌ చెప్పారు. ఈ అధిక క్రెడిట్‌గ్రోత్‌ విత్త స్థిరత్వాన్నివ్వదన్నారు. బ్యాంకులు కానీ, ఎన్‌బీఎఫ్‌సీలు కానీ సమర్ధవంతమైన రిస్కుమేనేజ్‌మెంట్‌ను పెంచుకోవాలని, ఎకానమీలో వృద్ధి అవసరాలను ఈ రెండు రంగాలే తీరుస్తాయని ఆయన చెప్పారు.



You may be interested

జీఎస్టీ తగ్గింపు ఎఫెక్ట్‌...

Tuesday 1st January 2019

న్యూఢిల్లీ: జనవరి ఒకటి నుంచి 23 వస్తుసేవలపై తగ్గించిన జీఎస్‌టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. డిసెంబర్‌ 22న జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌లో 23 రకాల వస్తు సేవలపై జీఎస్‌టీ శ్లాబులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ తగ్గింపుతో సామాన్యుడికి అవసరమైన పలు వస్తు సేవల ఖరీదు తగ్గనుంది. పన్ను తగ్గింపుతో సినిమాటికెట్లు, టీవీలు, మానిటర్లు, పవర్‌బ్యాంకులు, నిలవచేసిన కూరగాయలు ఇకపై చౌకగా లభిస్తాయి.పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి

35000 దిగువకు సెన్సెక్స్‌

Tuesday 1st January 2019

35వేల దిగువకు సెన్సెక్స్‌ 10850 కోల్పోయిన నిఫ్టీ కొత్త ఏడాది మార్కెట్‌ ఒడిదుడుల మధ్య ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. నేడు సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించినప్పటికీ.., వెనువెంటనే నష్టాల్లోకి మళ్లాయి. ముఖ్యంగా మెటల్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లలో అమ్మకాలు జరిగాయి. ఫలితంగా సెన్సెక్స్‌ సూచీ 36వేల మార్కును, నిఫ్టీ సూచీ 10,850 కీలకస్థాయిని కోల్పోయింది. ఉదయం గం.10:00లకు సెన్సెక్స్‌ సూచీ 122 పాయింట్లు కోల్పోయి 35,952 వద్ద, నిఫ్టీ సూచీ 37 పాయింట్లు

Most from this category