News


రుణాలిక బిందాస్‌

Friday 8th February 2019
news_main1549604975.png-24080

  • రెపో రేటు పావు శాతం తగ్గించిన ఆర్‌బీఐ
  • రివర్స్‌ రెపో కూడా ఇదే స్థాయిలో కోత
  • ఇకపై తటస్థ విధానానికి సెంట్రల్‌ బ్యాంకు
  • కొత్త గవర్నర్‌ దాస్‌ నేతృత్వంలో నిర్ణయాలు
  • గృహ, వాహన రుణాల వడ్డీ రేటు తగ్గే అవకాశం

ముంబై: ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ వృద్ధికే తన ప్రథమ ప్రాధాన్యం అని సంకేతమిచ్చారు. ధరలు తమ లక్ష్యానికి అనుగుణంగా స్థిరపడితే సమయానుకూలంగా వ్యవహరిస్తామంటూ అవసరానికి అనుగుణంగా భవిష్యత్తులోనూ రేట్ల కోతకు అవకాశాలు ఉంటాయని పరోక్షంగా సంకేతమిచ్చారు. ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ట స్థాయిలకు దిగి రావడం, మరోవైపు రుణాలు భారంగా మారాయని, వడ్డీ రేట్లు తగ్గించాలటూ పారిశ్రామిక రంగం, ప్రభుత్వం నుంచి వచ్చిన డిమాండ్లను మన్నించారు. బడ్జెట్‌లో తాయిలాలతో తిరిగి ద్రవ్యోల్బణానికి రెక్కలు వస్తాయన్న ఆందోళనలు ఉన్నప్పటికీ... పరిమితంగా పావు శాతం రేట్లను తగ్గించి ఉపశమనం కల్పించారు.

ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ శక్తికాంతదాస్‌ తన ఆధ్వర్యంలో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలి భేటీలో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరవ ద్వైమాసిక సమావేశం) అందరినీ ఆశ్చర్యపరుస్తూ కీలక రెపో, రివర్స్‌ రెపో రేట్లను పావు శాతం (25 బేసిస్‌ పాయింట్లు) తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెపో రేటు 6.25 శాతానికి, రివర్స్‌ రెపో 6 శాతానికి దిగొచ్చాయి. క్రమానుగత కఠిన విధానాన్ని ఇప్పటి వరకు అనుసరిస్తుండగా, దీన్ని తటస్థానికి (న్యూట్రల్‌కు) సడలించారు. ఈ నిర్ణయాలతో ఇంటి రుణాలు, ఇతర రుణాలు చౌకగా మారనున్నాయి. ఈఎంఐల భారం తగ్గనుంది. కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు రుణాల వితరణకు, ఆర్థిక ఉద్దీపనానికి ఆర్‌బీఐ నిర్ణయాలు వీలు కల్పించనున్నాయి. గతానికి భిన్నంగా... ఆర్‌బీఐ గవర్నర్‌గా వచ్చిన తర్వాత శక్తికాంతదాస్‌ వివిధ రంగాల ప్రతినిధులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి కోర్కెల గురించి తెలుసుకున్నారు. ద్రవ్యోల్బణం చాలా కనిష్ట స్థాయిల్లో ఉండడం, వృద్ధి రేటు ఆశించినంత లేకపోవడంతో కీలక రేట్లలో కోత విధించొచ్చని ఎక్కువ మంది భావించారు. కానీ, మధ్యంతర బడ్జెట్‌లో రైతులకు ప్రకటించిన ప్యాకేజీ, ఆదాయపన్ను మిననహాయింపుల వంటి ప్రోత్సాహకాలతో వినియోగం పెరిగి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆర్‌బీఐ ఎంపీసీ రేట్లను తగ్గించకపోవచ్చని, తటస్థానికి తన విధానాన్ని మార్చొచ్చన్న అభిప్రాయాలు కూడా వినిపించాయి. కానీ, బడ్జెట్‌కు ముందు వ్యక్తమైన అంచనాలను దాస్‌ నిజం చేశారు. రేట్ల కోత విధింపునకు ఆరుగురు సభ్యుల ఎంపీసీలో ఆర్‌బీఐ గవర్నర్‌ సహా నలుగురు అనుకూలంగా ఓటేశారు. తటస్థ విధానానికి మారేందుకు మాత్రం ఆరుగురు అంగీకారం తెలిపారు. 2014 జనవరి 28న కీలక రేట్ల పెంపు తర్వాత నుంచి... రేట్లు తగ్గుతూ వచ్చాయి. దీనికి విరామం పలుకుతూ 2018 జూన్‌, ఆగస్ట్‌ సమావేశాల్లో ఆర్‌బీఐ ఎంపీసీ కీలక రేట్లను పావు శాతం చొప్పున పెంచింది. ఈ మధ్య కాలంలో అంటే 2014 జవవరి నుంచి 2018 జూన్‌లోపు ఆరు సార్లు వడ్డీ రేట్లను తగ్గించడం జరిగింది.
వృద్ధి కోసమే కోత
‘‘పెట్టుబడులు ధోరణి పుంజుకుంటోంది. అయితే, ఇది ప్రధానంగా ప్రభుత్వం మౌలిక సదుపాయలపై వెచ్చిస్తున్న నిధుల వల్లే. ప్రైవేటు పెట్టుబడులను, ప్రైవేటు వినియోగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మధ్య కాలానికి ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో కొనసాగించాలన్న లక్ష్యానికి లోబడే వృద్ధికి మద్దతు ఇచ్చేందుకు రేట్ల కోత చేపట్టడం జరిగింది’’ అని ఆర్‌బీఐ ఎంపీసీ తన ప్రకటనలో పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతం అంచనాను ఎంపీసీ కొనసాగించింది.
వృద్ధికి వీలు
‘‘క్రమానుగత కఠినం నుంచి తటస్థానికి మారడం వల్ల, రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం అనుకూలంగా ఉన్నంత వరకు స్థిరమైన వృద్ధి రేటు దిశగా వీలు కల్పిస్తుంది’’
- శక్తికాంతదాస్‌, ఆర్‌బీఐ గవర్నర్‌
చౌకగా రుణాలు
‘‘ఆర్‌బీఐ రెపో రేటును 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించడం, తన విధానాన్ని తటస్థానికి మార్చడం ఆర్థిక రంగానికి బలాన్నిస్తుంది. చిన్న వ్యాపారులకు, ఇళ్ల కొనుగోలుదారులకు చౌకగా రుణాలు లభించేందుకు తోడ్పడుతుంది. ఇది ఉద్యోగ అవకాశాలకూ మరింత ఊతమిస్తుంది’’
- పీయూష్‌ గోయల్‌, కేంద్ర ఆర్థిక మంత్రి
===== హైలైట్స్‌============
- రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింపు. రివర్స్‌ రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింపు. బ్యాంకు రేటు 6.5 శాతం.
- ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటుగా పేర్కొంటారు. బ్యాంకులు నుంచి ఆర్‌బీఐ తీసుకునే రుణాలపై చెల్లించే రేటు రివర్స్‌ రెపో రేటు.
- నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)లో మార్పుల్లేవు. 4 శాతంగానే కొనసాగుతుంది.
- వడ్డీ రేట్ల తగ్గింపునకు శక్తికాంతదాస్‌ సహా నలుగురు ఎంపీసీ సభ్యులు అనుకూలంగా ఓటు. చేతన్‌ఘటే, విరాళ్‌ ఆచార్య యథాతథానికి ఓటు.
- రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాలు మార్చి త్రైమాసికానికి 2.8 శాతానికి తగ్గింపు. 2019-20 తొలి ఆరు నెలలకు ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ కాలానికి 3.2-3.4 శాతంగా అంచనా. అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికానికి అంచనా 3.9 శాతం.
- జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతంగా ఉండొచ్చు. 2019-20లో ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య 7.2-7.4 శాతంగాను, అక్టోబర్‌-డిసెంబర్‌ కాలానికి 7.5 శాతంగానూ ఉండొచ్చు.
- చమురు ధరల్లో అస్పష్టత ఉండొచ్చు. వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ వృద్ధి అవకాశాలపై ప్రభావం చూపిస్తాయి.
-  ప్రస్తుతం రూ.కోటికి పైన రూపాయి డిపాజిట్లను బల్క్‌గా పరిగణిస్తుండగా, దీన్ని రూ.2 కోట్లకు పెంపు.
- వ్యవసాయ రుణాలు, ప్రాంతీయ అసమానత, కవరేజీ విస్తృతికి ఓ అంతర్గత కమిటీ ఏర్పాటు.  
- వ్యవసాయ రంగానికి హామీల్లేని రుణాల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.1.6 లక్షలకు పెంపు.
- రూపాయి విలువలో స్థిరత్వానికి ఆఫ్‌షోర్‌ రూపీ మార్కెట్ల కోసం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు.
- కార్పొరేట్‌ డెట్‌ మార్కెట్లో పెట్టుబడుల విషయంలో ఎఫ్‌పీఐలపై ఉన్న నియంత్రణలు ఎత్తివేత.
- పేమెంట్‌ గేట్‌వే సర్వీసు ప్రొవైడర్లు, పేమెంట్‌ అగ్రిగేటర్లకు సంబంధించి త్వరలో చర్చా పత్రం విడుదల.
- కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు ఖర్చు చేసే ఆదాయాన్ని పెంచడం ద్వారా డిమాండ్‌కు ఊతమిస్తాయి.
- ఎన్‌బీఎఫ్‌సీల సమన్వయానికి త్వరలో మార్గదర్శకాలు.  
- ఆర్‌బీఐ తదుపరి ఎంపీసీ భేటీ వచ్చే ఏప్రిల్‌ 2న జరగనుంది.

2.8 శాతానికి ద్రవ్యోల్బణ అంచనాలు
ద్రవ్యోల్బణం సమీప కాలంలో మృదువుగానే ఉండొచ్చని ఆర్‌బీఐ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (2019 జనవరి-మార్చి)లో ద్రవ్యోల్బణం 2.8 శాతంగా ఉంటుందని పేర్కొంది. 2019-20లో ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు 3.2-3.4 శాతం మధ్య ఉండొచ్చని పేర్కొంది. మూడో త్రైమాసికానికి (అక్టోబర్‌ - నవంబర్‌) 3.9 శాతం అంచనాలను వ్యక్తం చేసింది. 2019లో సాధారణ వర్షాలు, పెట్రోల్‌ ధరలు తక్కువగా ఉండడం వంటి పరిణామాలను పరిగణనలోకి తీసుకున్నట్టు ఆర్‌బీఐ ఎంపీసీ తెలిపింది. ‘‘రానున్న కాలంలో పలు అంశాలు ద్రవ్యోల్బణం ఎటువైపు వెళుతుందన్నది నిర్దేశిస్తాయి. ఆహార ద్రవ్యోల్బణం ఆశ్చర్యకరంగా దిగువ స్థాయిలోనే కొనసాగుతోంది. కొన్నింటిలో డిఫ్లేషన్‌, తృణ ధాన్యాల్లో మోస్తరు స్థాయిలో ద్రవ్యోల్బణం ఉంది. కొన్ని ఆహార ఉత్పత్తుల విషయంలో దేశీయంగానూ, అంతర్జాతీయంగా అధిక సరఫరా నెలకొంది’’ అని ఆర్‌బీఐ తెలిపింది. ఆహార ఉత్పత్తుల ధరలు, చమురు ధరలు, వాణిజ్య ఘర్షణలు, ఆరోగ్యం, విద్యా ద్రవ్యోల్బణం, ఫైనాన్షియల్‌ మార్కెట్లలో అస్థిరతలు, రుతుపవనాల అంచనాలను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది.

వృద్ధి రేటు 7.4 శాతం
2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతానికి ఆర్‌బీఐ పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7.2 శాతంగా ఉంటుందని కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్‌వో) అంచనా వేసిన విషయం తెలిసిందే. ‘‘జీడీపీ వృద్ధి రేటు బ్యాంకు రుణాల వృద్ధి, మొత్తం మీద వాణిజ్య రంగాలకు నిధుల సరఫరాపై ఆధారపడి ఉంటుంది. అయితే, అంతర్జాతీయ డిమాండ్‌ తగ్గడం నిరుత్సాహకరం’’ అని ఆర్‌బీఐ ఎంపీసీ ప్రకటన పేర్కొంది.



You may be interested

టాటామోటర్స్‌ నష్టాలు రూ.26, 961కోట్లు

Friday 8th February 2019

ఇదే అత్యధిక త్రైమాసిక నష్టం వరుసగా మూడో క్వార్టర్‌లోనూ నష్టాలే కంపెనీ జోరుకు జేఎల్‌ఆర్‌ బ్రేక్‌లు న్యూఢిల్లీ: వాహన దిగ్గజం టాటా మోటార్స్‌కు ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో భారీగా నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ3లో రూ.1,215 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ3లో రూ.26,961 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) వచ్చాయని టాటా మోటార్స్‌ తెలిపింది. ఒక్క త్రైమాసికంలో ఈ స్థాయి నష్టాలు రావడం కంపెనీ చరిత్రలో ఇదే మొదటిసారి.

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 8th February 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు వరుణ్‌ బేవరీజెస్‌:- మూడు రాష్ట్రాల్లో పెప్సీకో ఫ్రాంఛైజీస్‌ అనుమతులు దక్కించుకుంది. సియట్‌ లిమిటెడ్‌:- తమిళనాడులోని హలోల్‌ ప్లాంట్‌లో బస్సు టైర్ల వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించింది. సన్‌ఫార్మా అడ్వాన్డ్స్‌ రీసెర్చ్‌:- జీఎస్టీ అండ్‌ ఎక్సైజ్‌ కమిషన్‌ నుంచి రూ.46.04 కోట్ల సేవా పన్ను చెల్లించాలని డిమాండ్‌ నోటీస్‌ను అందుకుంది. శ్రీరాం ఈపీసీ:- నీటి సరఫరా విభాగంలో నిర్మాణాలకు సంబంధించిన జార్ఖండ్‌ ప్రభుత్వం నుంచి రూ.291.6 కోట్ల విలువైన

Most from this category