STOCKS

News


నిధులు మళ్లిస్తే ఆర్‌బీఐ రేటింగ్‌ తగ్గుతుంది

Tuesday 18th December 2018
news_main1545109049.png-23020

 న్యూఢిల్లీ: ఆర్‌బీఐ వద్ద అధికంగా ఉన్న నిధులను కేంద్ర ప్రభుత్వానికి గనక బదిలీ చేస్తే అది కేంద్ర బ్యాంకు రేటింగ్‌ తగ్గడానికి దారితీస్తుందని మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐకి ప్రస్తుతం ఏఏఏ రేటింగ్‌ ఉండగా, ఇది తగ్గితే నిధుల వ్యయాల భారం పెరిగి, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందన్నారు. ఆర్‌బీఐ నుంచి అదనపు నిధుల బదలాయింపు కేంద్రానికి జరిగితే రేటింగ్‌ తగ్గడానికి దారితీస్తుందా? అని విలేకరులు ప్రశ్నించగా... ‘‘అది ఎంత మొత్తం బదలాయిస్తున్నారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఇదో అంశం కాదు. ఏదో ఒక సమయంలో మాత్రం ఇది ఓ అంశంగా మారుతుంది. ప్రభుత్వం, ఆర్‌బీఐ రెండూ కూడా చర్చల ద్వారా దీనికి ముగింపు పలకాలి. మనది ‘బీఏఏ’ దేశం. ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌. ఏదో ఒక సమయంలో అంతర్జాతీయ లావాదేవీల నిర్వహణ కోసం అధిక క్రెడిట్‌ రేటింగ్‌ అవసరపడుతుంది’’ అని రాజన్‌ చెప్పారు. ‘మీరు గవర్నర్‌గా ఉన్న సమయంలోనూ ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొన్నారా’ అన్న ప్రశ్నకు... ప్రభుత్వానికి మరింత మొత్తం చెల్లించాలన్న ఒత్తిడి ఎప్పుడూ ఉంటుందని బదులిచ్చారు. ‘‘ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్న సమయంలో నేను కూడా ఎంత మొత్తం నిధులు కలిగి ఉండాలన్న అంశంపై ఆర్‌బీకి లేఖ రాశాను. ఆర్‌బీఐ గవర్నర్‌గా వచ్చాక కమిటీ ఏర్పాటు చేయగా, లాభం మొత్తాన్ని పంపిణీ చేసేందుకు సరిపడా క్యాపిటల్‌ మన దగ్గర ఉన్నట్టు చెప్పింది. నేను గవర్నర్‌గా ఉన్న ఆ మూడు సంవత్సరాల్లో ఆర్‌బీఐ చరిత్రలోనే అత్యధిక డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది. అయితే, లాభాలకు మించి చెల్లించాలన్నది డిమాండ్‌. కానీ, లాభాలకు మించి చెల్లించరాదని మాలేగామ్‌ కమిటీ అభిప్రాయపడింది’’ అని రాజన్‌ వివరించారు. 
నోట్ల రద్దుతో ఆర్థిక వృద్ధి మందగమనం 
ప్రపంచ ఆర్థిక రంగం 2017లో వృద్ధి క్రమంలో ఉంటే, నోట్ల రద్దు (డీమోనిటైజేషన్‌) కారణంగా భారత ఆర్థిక వృద్ధి కుంటుపడిందని రాజన్‌ పేర్కొన్నారు. వృద్ధి తగ్గుముఖం పట్టిందని తిరిగి నిర్ధారించిన అధ్యయనాలను తాను చూసినట్టు చెప్పారు. దీనితోపాటు జీఎస్టీ అమలు ప్రభావం కూడా వృద్ధిపై పడినట్టు అభిప్రాయపడ్డారు. 2017-18లో మన జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. దీర్ఘకాలంలో జీఎస్టీ మంచిదేనని, స్వల్ప కాలంలో మాత్రం సమస్యలు ఉంటాయన్నారు. జీఎస్టీని మరింత మెరుగ్గా అమలు చేయాల్సిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, ఒక్కసారి అమలు చేస్తే, సమస్యలను గుర్తించి ఒక్కోటి పరిష్కరించుకుంటూ వెళ్లడం సరైనదన్నారు. తన హయాంలో నోట్ల రద్దుపై అభిప్రాయాన్ని కోరారని, ఇది చెడ్డ ఆలోచనని చెప్పినట్టు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రఘురామ్‌ రాజన్‌ 2013 నుంచి 2016 వరకు ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేశారు. You may be interested

సరికొత్త ప్లాటినా 110 @ రూ.49,197

Tuesday 18th December 2018

న్యూఢిల్లీ: బజాజ్‌ ఆటో నుంచి నూతన వెర్షన్‌ ప్లాటినా 110 సీసీ బైక్‌ సోమవారం మార్కెట్‌లో విడుదలైంది. యాంటీ-స్కిడ్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ, ట్యూబ్‌లెస్‌ టైర్లు వంటి అధునాత ఫీచర్లను కలిగిన ఈ బైక్‌ ధర రూ.49,197 (ఢిల్లీ ఎక్స్‌షోరూం)గా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. రోడ్లపై గతుకుల ఇబ్బంది అంతగా తెలియకుండా ఉండేలా అత్యాధునిక షాక్ అబ్జార్బర్స్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపింది. బైక్‌ విడుదల సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ (మోటార్ సైకిల్ బిజినెస్)

ఫిక్కీ అధ్యక్షునిగా సందీప్ సోమానీ

Tuesday 18th December 2018

న్యూఢిల్లీ: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) నూతన అధ్యక్షునిగా శానిటరీ వేర్ ఉత్పత్తి సంస్థ హెచ్‌ఎస్‌ఐఎల్‌ సీఎండీ సందీప్ సోమానీ ఎంపికయ్యారు. ఇంతకుముందు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా సేవలందించిన ఈయన సోమవారం ప్రెసిడెంట్‌ పదవికి ఎన్నికైనట్లు ఫిక్కీ ప్రకటించింది. అధ్యక్ష పదవిని చేపట్టిన తరువాత మీడియాతో మాట్లాడిన ఈయన.. ‘పరిశ్రమకు పాలసీలకి మధ్య ఏకాభిప్రాయం కుదిర్చడం ద్వారా సృజనాత్మక, అభివృద్ధికి దోహదపడే ప్రోత్సాహక

Most from this category